గదికి ఆవలి వేపు నుంచి ఎవరో పరుగెత్తుకొస్తున్న సూచనగా బూట్ల చప్పుడు వినిపించింది.
సర్కార్ ని లోపలికి యీడ్చేసిన శశాంక రెప్పపాటులో ద్వారం గడియపెట్టి, లేస్తున్న సర్కార్ గుండెలపై ఎగిరి కూర్చున్నాడు. "చెప్పు రూప ఎక్కడ"
"ఏ రూప" సర్కార్ విస్మయాన్ని ప్రకటిస్తున్నాడు. బయట తలుపు కొడుతున్నారు. కొద్దిగా తల తిప్పి శశాంక వెనక్కి చూసిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు సర్కార్. వేగంగా పక్కకు దొర్లాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా శశాంక తల గోడకి గుద్దుకోవడంతో బాటు నేలపైపడ్డ స్టెన్ గన్ ని సర్కార్ అందుకుని కాల్చేవాడు.
కాని సర్కార్ కి తెలీదు శశాంక కేవలం గొప్ప షూటర్ మాత్రమే గాక 'షోట్ కాయ్' కరాటేలో కూడా నిష్ణాతుడని... బంతిలా పైకి లేచిన శశాంక 'ఇయాన్ చౌదాన్' టెక్నిక్ తో ఒకేసారి పిడికిలిని కాలినీ ఉపయోగించి అటు స్టెన్ గన్ని దూరంగా నెట్టడంతోపాటు సర్కార్ ఇక లేవకుండా కంఠంపై తన్నాడు.
ఒక సన్నని మూలుగుతో సర్కార్ వెన్నెముక విరిగినంత బాధతో గోడకి జారిగిలబడిపోయాడు.
స్టెన్ గన్ ని అందుకున్న శశాంకకి అర్థమైంది. ఏ క్షణంలో అయినా ద్వారం బద్దలై ప్రత్యర్థులు లోపలికి దూసుకొచ్చేట్టున్నారని...
"వినీలా" రొప్పుతూ అన్నాడు శశాంక. "నేను బేలెన్స్ తప్పలేదు. తప్పి ఉంటే ఇక్కడ నీ కళ్ళముందే సర్కార్ ని చంపేవాడ్ని. ఇప్పుడు వదిలిపెడుతున్నది నీకూ ఓ అవకాశం ఇవ్వాలని. ఒకనాడు నన్ను కోరిన నువ్వు పరోక్షంగా నా భార్య మరణానికి కారణమయ్యావు. ఇప్పుడు నా గురించి నీకున్న అపోహలతో ఓ పసికందు ప్రాణాలు పోయే స్థితి కల్పించకు. నిన్ను కాస్త తల్లి మనసుతో ఆలోచించమని ప్రాధేయపడుతున్నది నాలాంటి ఓ అనాధ గురించి మాత్రమే"
వెళ్ళిపోయాడు శశాంక ఇందాక వచ్చిన కిటికీలో నుంచే.
వినీల అలవోకగా అద్దంలోకి చూసింది. ఆమె చెంపపై గాయమైన శశాంక చేతి రక్తం అంటుకుని ఉంది. తను మొన్న కోరిన ప్రేమకి అతడీనాడు రాసిన రక్తపు చేవ్రాలులా.
అప్పుడు ద్వారం తెరిచింది__
సరిగ్గా ఇదే సమయంలో గోడదూకి పరుగెడుతున్న శశాంకకి ఓ వ్యక్తి ఎదురుకావడంతో బాటు "జయచంద్రని చంపేసారా బాబూ" అంటూ ఉత్సుకతగా అడిగాడు.
టక్కున ఆగిపోయాడు శశాంక.
ఎదురు నిలబడ్డ వ్యక్తి బాగా తాగి ఉన్నట్టున్నాడు. "రోజుల తరబడి ఎదురు చూస్తున్నానయ్యా వాడి చావు ఊరేగింపుకి వెనక కాటిదాకా వెళ్ళాలని. ఏదీ మొన్న పోయాడనుకుంటే బ్రతికి పోయాడుగా."
ఆ నిశ్శబ్ద నీరవ నిశీధిలో చాలా చిత్రమైన వ్యక్తిని కలుసుకున్నట్టు అనిపించిన శశాంక "జయచంద్ర నీకు తెలుసా" అన్నాడు.
"ఇద్దరం ఒకనాడు తోడు దొంగలమే బాబూ... వాడెంత దుర్మార్గుడూ అంటే కన్నకూతుర్ని ఓ విస్కీ బాటిల్ కోసం అమ్మేశాడు. ఆ బాటిల్ విస్కీతో పెరగడం మొదలు పెట్టిన వాడు నా మూలంగా వాడి కథ ప్రపంచానికి గాని, ఇప్పుడున్న చిన్న కూతురుకి గాని తెలియకూడదని నన్ను తెలివిగా జైలుకి పంపించాడు పధ్నాలుగేళ్ళు. ఈ లోగా నా పెళ్ళాం పిల్లలూ పోయారు. అందుకే బాబూ. ఈ మధ్యనే జైలు నుంచి బయటకొచ్చిన నేను వాడి చావు కళ్ళ చూడాలని అదీ నేను పోయేముందు జరిగితే బాగుణ్ణని రోజులు లెక్క పెడుతూ బ్రతుకుతున్నాను."
ఒక అద్భుతమైన ఆసరా దొరికినట్టయింది శశాంకకి. అంతకు మించి జయచంద్రపై అనూహ్యమైన ఏవగింపూ కలిగింది.
"ఇంకా వివరాలు చెప్పగలవా"
"ఇప్పటికిది చాలు బాబూ" నిషాగా తూలుతూ నడిచి వెళ్ళిపోతుంటే తనతో రమ్మన్నాడు శశాంక అతన్ని వారించి.
ఎందుకో అర్థం కాలేదు అంతసేపూ శశాంకతో మాట్లాడిన ఆ వ్యక్తికి. ఆ వృద్దుడెవరో కాదు వీరయ్య.
"నువ్వు బయట కనిపిస్తే వాడు ప్రాణాలు తీయిస్తాడు తాతా. కనీసం వాడి చావు చూసేదాకా అయినా నువ్వు భద్రంగా ఉండాలి. అంత వరకూ నీకు కావలసినదంతా నేను ఏర్పాటు చేస్తాను."
వీరయ్యతో బాటు అర్థరాత్రి వేళ శరణాలయానికి వచ్చిన శశాంకని చూసిన అన్నపూర్ణ ముందు అప్రతిభురాలైంది కాని పెదవి విప్పి అడగలేక పోయింది.
అన్నపూర్ణ జాకీలు చూస్తుండగానే ఫోన్ డయల్ చేశాడు. మూడు నిముషాల తర్వాత అందుకున్నారెవరో.
"హల్లో"
గుర్తుపట్టాడు అది సర్కార్ గొంతని. "మీ బాస్ కావాలి"
"నువ్వెవరు"
"శశాంక"
"నిద్రపోతున్నారు"
"ఇక నిద్రవుండదులే బే... ముందు ఫోనివ్వు"
"కుదరదు"
"అలానేం. అయితే చెప్పు ఆయన స్నేహితుడు ఇప్పటివాడు కాదులే రెండు దశాబ్దాల క్రిందటి మిత్రుడు. వీరయ్య నాదగ్గరున్నాడని, రేపుదయమే ఆయన పెద్ద కూతురు..." అతడి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు జయచంద్ర లైన్ లోకి వచ్చాడు.
"వీ... వీరయ్య... ఎవరు" జయచంద్ర గొంతులో తొట్రుపాటు స్పష్టంగా వినిపించింది.
"ఎవరో రేపు వినీలకి చెబుతాను జయచంద్రా_ ఈలోగా ఓ పని చెయ్యి. రూపకేం ప్రమాదం జరక్కుండా నాకు అప్పచెప్పు. లేకపోతే పోయిన నీ పెద్దకూతురు మాట అటుంచి ఉన్న కూతురు నిన్ను అసహ్యించుకునే స్థితేర్పడుతుంది."


