నడుస్తున్నాడు శశాంక... ఇప్పుడతడి మనసు నిండా ఒకటే ఆలోచన. రూప ఎక్కడ దాచబడింది... ఎలా వుంది.
* * * *
"కొట్టకు అంకుల్" భయంతో రూప వణికి పోతోంది. సిటీ మధ్యలోవున్న నిర్మలా ఎపార్ట్ మెంట్స్ లోని ఓ ప్లాటది. శశాంక చావలేదన్న కసితో జయచంద్ర రూపని మర్డర్ చేసైనా శశాంకకి ఓ ఉత్తరం రాయించ మన్నాడు... దానిపైన రూప రక్తపు మరకలుండాలి. అది చూసి శశాంక పిచ్చివాడై పోవాలి. ఆ ప్రయత్నంలో రూప చచ్చిపోయినా పర్వాలేదు.
రక్త సంబంధానికి సైతం విలువివ్వని జయచంద్ర ఎంతటి నరరూప రాక్షసుడో తెలియపరచే ఆవేశమది.
"రాయి ముందు" రూప చెంపమీద చాచి కొట్టాడు కుమార్ దాదా... రూప తల గోడకు గుద్దుకుని నుదురుపై బొప్పి కట్టింది.
"వద్దు అంకుల్... రాయడం బాగా రాదు"
"అదే... వచ్చిందే రాయ్. వెదవ సంతని _ వేలెడు లేవు" జుట్టు పట్టుకున్నాడు. దాదా గట్టిగా విదిలించే సరికి ఆ నొప్పి తల నుంచి రూప గుండె దాకా ప్రాకింది.
"గుండె నొప్పొస్తుంది. చచ్చిపోతాను"
"కొంపలేం మునగవ్. రాయ్..."
రూప అక్షరాలు రాయగలదు గాని ఉత్తరం రాసేటంత జ్ఞానం లేదు. అసలు అక్షరజ్ఞానం లేని కుమార్ దాదా రూపతో బలవంతంగా ఉత్తరం రాయించే ప్రయత్నం చేస్తున్నాడు.
కళ్ళనుంచి రాలుతున్న నీళ్ళను గౌనుతో ఒత్తుకుని రాయకపోతే చంపేట్టున్నాడని తల మాపింది- "ఏం రాయాలి" వెక్కి పడుతూంది.
చేతిలో విస్కీ బాటిల్ పట్టుకుని గుటకలు వేస్తూ డిక్టేట్ చేస్తున్నాడు.
"అంకుల్... నన్ను చంపుతారట... బాగా కొట్టారు... గుండెల మీద గుద్దాడు. అర్జెంటుగా లొంగిపో... ఈ రక్తం నా గుండెదే"
రాస్తూంది రూప_ తల పైకెత్తలేదు. ఆగితే మళ్ళీ కొడతాడన్న భయం... దుఃఖం గుండెల దాకా ప్రాకి నిన్నగాక మొన్న జరిగిన ఆపరేషన్ తో బలహీనంగా వుండి ఏ క్షణంలో అయినా చిట్లిపోయేట్టుంది.
"అయిందా" హూంకరించాడు.
భయంతో తలూపింది.
"మంచి పిల్లవి" ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఓ సూది అందుకున్నాడు... "ఇప్పుడు నీ రక్తం ఓ బొట్టు మాత్రం తీస్తానన్న మాట"
"వద్దంకుల్" బేర్ మంటూ ఏడుపు లంకించుకుంది.
వెను వెంటనే 'అమ్మ' అన్న ఆర్తనాదం. రూప చిన్ని చేతుల్లోని చూపుడు వేలు మొనలో సూది గుచ్చుకుని రక్తం ధారగా కారుతుంటే దాన్ని కాగితంపై ఒత్తాడు.
ప్రపంచంలో పసికందులపై ఇంతటి పైశాచికంగా ప్రయోగాలు చేసే రాక్షసులుంటారని తెలీని రూప ఆ సౌండ్ ప్రూఫ్ గదిలో కేకలు పెడుతుంటే దాదా అనుచరులు ఓ వినోదం చూస్తున్నట్టు శాడిస్టిక్ గా నవ్వుతున్నారు.
రూప సొమ్మసిల్లిపోయింది ఏడ్చి ఏడ్చి.
* * * *
ఉదయం ఎనిమిది గంటల వేళ_
సోఫియా చాలా అసహనంగా పచార్లు చేస్తోంది తన గదిలో.
"హోటల్ సోస్ లో విషాహారం" అన్ని పత్రికలు ప్రచురింపబడిందప్పుడే... ఉదయమే హోటల్ మేనేజర్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇక్కడ సోఫియా ఆలోచిస్తున్నది మేనేజర్ని చట్టం నుంచి రక్షించడమెలా అన్న విషయం గురించి కాదు. ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్నించి గట్టెక్కటం కూడా ఆమెకు తెలుసు."
ఉదయమే ఇండియన్ ఎయిర్ లైన్స్ ఛైర్మన్ పి.ఏ. నుంచి ఫోన్ వచ్చింది_ త్వరలో కేటరింగ్ కాంట్రాక్ట్ కాన్సిల్ కాబోతున్నట్టు. హోటల్ కున్న తిరుగులేని రెప్యుటేషన్ దారుణంగా దెబ్బతిందీ అనడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అక్కరలేదు. ఇది దీనితో ఆగిపోతుందన్న నమ్మకం లేదు. ఈ వార్త ముఖ్యమైన సర్కిల్స్ లో చర్చకు వస్తుంది. అది లక్షల రాబడిని కోల్పోయేట్టు చేస్తుంది.
అండర్ వరల్డ్ ఏక్టివిటీస్ లో ఎన్నోసార్లు దెబ్బతింది. కాని ఇంతగా ఆమె ఏనాడూ బాధపడలేదు. ఇది పబ్లిక్ ఇమేజ్ కి సంబంధించింది.
లేబరేటరీలో చెక్ చేయించాక ఆ ప్లేట్ శాంపిల్ లో 'బాటిలిజవల్' క్రిములున్నట్టు ఓ పోలీసాఫీసరు ఫోన్ చేసి చెప్పాడు రాత్రే. కేవలం ఆ ఒక్క ప్లేటులోనే కలిసిందీ అంటే అది కావాలని చేయబడిందీ అని నిరూపించగలదు.
కాని ఒకసారి ప్రజల మధ్య చర్చనీయాంశమైన ఈ విషయం ఇప్పటికే పోయిన హోటల్ ప్రశస్తిని ఏ విధంగానూ కాపాడలేదు.
హాస్పటల్ లో అడ్మిట్ చేయబడిన కస్టమర్ కోలుకుంటున్నాడని తెలిసింది. దీనికి మూల కారణాన్ని తెలుసుకుని తీరాలని ఆమె ఆలోచిస్తుండగానే ఆమె గదిలో ఫోన్ రింగ్ అయింది.
"సోఫియా హియర్"
చిన్నగా నవ్వు వినిపించింది ఆవలి వైపు నుంచి.
"ఎవర్నువ్వు?"
"వినీల"
సోఫియా ఎలర్ట్ అయింది "ఎందుకు ఫోన్ చేశావు ?"
"పేపర్లో ఇప్పుడే చదివాను నీ హోటల్ గురించి... పరామర్శిద్దామని"
