Previous Page Next Page 
ఆలింగనం పేజి 90


    బస్ డిపో చేరగానే ఎంక్వయిరీలో తిరుపతి బస్సు గురించి వాకబు చేశాను.

 

    "ఇంకో పదినిమిషాల్లో హైద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్ వస్తుంది దాంట్లో వెళ్ళవచ్చు" అంది క్లర్క్.

 

    "ఆయన్ని ఎలా పడ్డుకోడం? బస్ ఎక్కి అరుస్తావా?" బాధగా అన్నాను.

 

    "టైం ఎంతయింది మేడం?" అడిగాడు పక్కన ఉన్న వ్యక్తి.

 

    "తొమ్మిదింపావు" విసుగ్గా చెప్పింది లిల్లీ.

 

    "ఓపని చేద్దాం!" అంది అంతలోనే ఉషారుగా.

 

    'ఏవిటీ?" అన్నాను.

 

    "ఎనౌన్స్ మెంట్ ఇప్పిద్దాం" అని ఉత్సాహంగా లాంజ్ లోని ఎంక్వైరీ క్లర్క్ వైపు నడిచింది.

 

    "ఇందాకా మీరు అడిగినప్పుడు తిరుపతి బస్సుకి ఎంత టైం ఉంది అని చెప్పింది?" టైం అడిగిన వ్యక్తి ప్రశ్నించాడు.

 

    "పది నిమిషాలు అంది" అన్నాను.

 

    "అయితే టీ తాగి వస్తాను. ఈ బ్రీఫ్ కేస్ కాస్త చూడమ్మా!" అని అతడు నా సమ్మతికోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు.

 

    నేను అతన్ని విసుక్కుంటూ అక్కడే నిలబడ్డాను.

 

    లిల్లీ క్లర్క్ తో మాట్లాడ్తోంది.

 

    ఆవిడ ఒప్పుకుంటుందో లేదో? అసలు ఇదంతా ఏవిటీ? తల వెంట్రుకని చుట్టి కొండని లాగడమా?

 

    ఇంతలో కాస్త బొంగురుగావున్న గొంతుతో ఎనౌన్స్ మెంట్ వినిపించింది.

 

    "తిరుపతి వెళ్ళే ప్రయాణీకుల్లో మహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి ఉంటే వెంటనే ఎంక్వయిరీ ఆఫీసు దగ్గరికి రావలసింది కోరుతున్నాం"

 

    నా మనసు స్థిమితపడింది. ఏ వ్యక్తి కదులుతున్నా అటే వెళ్తున్నాడేమోనని నా ఆశ!

 

    ఎనౌన్స్ మెంట్ మళ్ళీ వినపడింది.

 

    ఎవరూ రాలేదు! బస్ మాత్రం వచ్చింది.

 

    లిల్లీ తూనీగలాగా బస్ వైపు కదిలింది, అది బస్ లో అందర్నీ అడుగుతుందని నాకు తెలుసు.

 

    ఏ జన్మలో పుణ్యమో ఇలాంటి స్నేహితురాలు! ఏం ఇచ్చి రుణం తీర్చుకోను?

 

    "బస్ వచ్చేసిందా? షుక్రియా...బేటీ..." బ్రీఫ్ కేస్ తీసుకుని వేగంగా కదుల్తూ అన్నాడు ఇందాకటి వ్యక్తి.

 

    లిల్లీ నిరుత్సాహంగా బస్ దిగింది. అతను లోపలికి ఎక్కగానే కండక్టర్ డోర్ మూసి "రైట్" చెప్పాడు.

 

    అప్పుడు వెలిగింది నా మెదడులో బల్బు!

 

    "లిల్లీ..అతనేమో కనుక్కో! ఇందాకా ఎనౌన్స్ మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడలేడు" అని అరిచాను.

 

    లిల్లీ తలుపుమీద దబదబా బాది కండక్టర్ తలుపు తెరవగానే "ఇప్పుడు బస్ ఎక్కిన వ్యక్తి మాకు కావాలి" అంది. కండక్టర్ అతన్ని పిలిచాడు.

 

    ఆయన తెల్లబోతూ వచ్చి "ఏవైంది?" అని అడిగాడు.

 

    లిల్లీ గుక్క తిప్పుకోకుండా "మీకు ముంబైలో ఉన్న రషీద్, ఇంద్రాణిల అడ్రెసు తెలిస్తే చెప్పండి. మీకోసమే వెదుకుతున్నాం" అంది.

 

    అతను ఆశ్చర్యంగా "ఎందుకూ? మీరు వాళ్ళకి ఏమౌతారు?" అని అడిగాడు.

 

    డ్రైవర్ బస్ స్టార్ట్ చెయ్యబోతున్నట్లుగా హారన్ మోగించాడు.

 

    "ఇంద్రాణి మా బంధువుల అమ్మాయి. ఆమెకు చాలా ఆస్తి కలిసొచ్చింది. ఆ విషయం చెప్దామనీ..." వెనకాలనుండి నేను అందించాను.

 

    "అలాగా!" ఆయన కళ్ళల్లో ఆనందం.

 

    "చెప్పండి!" అన్నాను.

 

    ఆయన పాకెట్ లోంచి చిన్న డైరీ తీసి అందులో చూసి అడ్రెస్ చెప్తుంటే నోట్ చేసుకున్నాం.

 

    "ఫోన్ నెంబర్ లేదా?" అడిగింది లిల్లీ.

 

    "ఉందేమో...నాకు తెలీదు" అన్నాడు.

 

    "థాంక్యూ..." చెప్పి డోర్ వేసేసింది లిల్లీ.

 

    బస్ బయల్దేరిపోయింది.


                                   *  *  *


    "కొండని తవ్వి ఎలుకని పట్టినట్లయింది." కార్లో వెనక్కి జార్లగిలబడి కూర్చుంటూ అన్నాను.

 

    "ముందుకే వెళ్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు లక్ష్యం చేరుకుంటాం. నిరుత్సాహ పడకు!" డ్రైవ్ చేస్తూ అంది లిల్లీ.

 

    "లిల్లీ...నీ రుణం మాత్రం తీర్చుకోలేనే!" అన్నాను.

 

    "అదేంటీ? నా పెళ్ళికి పెద్దగా నిలబడ్తానన్నావుగా! మనసు మార్చుకున్నావా?" నవ్వుతూ అడిగింది.

 

    "ఛ! నీ పెళ్ళి కన్నా ఆనందకరమైన రోజు నాకు ఇంకోటి ఉండదు" అన్నాను.

 

    "ఆ అడ్రెస్ లో ఉన్న రషీద్ కి ఇమ్మిడియెట్ గా నన్ను కాంటాక్ట్ చెయ్యమని ఉత్తరం రాస్తాను. ఓ వారంలోగా మనం చంద్రని పట్టుకొంటాం... ఆ తర్వాత...మా ఆముక్త పెళ్ళికూతురాయెనే...పీ...పీ...పీ...పిపిపి.." అని నన్ను హుషారు చెయ్యడానికి రాగం తీసింది.

 

    మనసులోని ఆశాభంగాన్ని ఆవలకితోసి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు చిందించాను.  


                                  *  *  *


    అమ్మా నాన్నా మాత్రం నేను అన్నమాట ప్రకారం శనివారం సాయంత్రానికల్లా రావడంపట్ల తమ సంతోషం ప్రకటించారు. రాననే అనుకున్నారట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS