అంత నమ్మకం నామీద!
ఆదివారం అమ్మ లేని ఓపిక తెచ్చుకుని హడావుడి మొదలుపెట్టింది.
నన్ను తలంటుపోసుకోమని, చెవులకి రాళ్ళబుట్టలు పెట్టుకోమనీ, పట్టుచీర కట్టుకోమనీ పదిసార్లు చెప్పింది.
నాన్నగారు పంచాంగం ముందు పెట్టుకుని కూర్చుని వర్జ్యం ఎన్ని గంటలకో చూస్తున్నారు. తాతయ్య ఉంటే ఆ బాధ్యత ఆయన తీసుకునేవారు!
నన్ను కర్నూలు పంపినట్లయితే వాళ్ళు చెప్పినట్లు వింటాననే ఒడంబడిక ఉండడం వల్ల నేను అమ్మ చెప్పినట్లు తయారయ్యాను.
అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దొచ్చాను. గంధం రంగుకి ఎర్రని అంచు! గంధపురంగు నా శరీరంలో కలిసిపోతూ పాలమీగడలా ఉంది పట్టుచీర! స్త్రీ అందం అంతా ఆమె కళ్ళల్లో దాచి పెట్టాడేమో ఆ భగవంతుడు! ఏడ్చినా, నవ్వినా, సిగ్గుపడినా, మధురూహల్లో తేలిపోయినా...ఆ భావాలన్నీ మోసేవి ఆ కళ్ళే! స్త్రీని పురుషుడినించి వేరు చేసేవీ ఈ సిగ్గూ, కన్నీళ్ళే!
మనసులో భావాలు బయల్పడగానే కళ్ళు దోషుల్లా క్రిందికి వాలిపోతాయి. ఆ కళ్ళల్లో వెతికి చూడగలిగితే సప్తవర్ణాల ఇంద్రధనుస్సులు కనిపిస్తాయి!
కురిసే మేఘాల్లోంచి వెండిలా మెరిసే ఎండకి గొడుగై అంతలో మాయమౌతాయి. 'కలలు కనే కళ్ళు... వలపు లోగిళ్ళు... వలచిన వాడికి చలి నెగళ్ళు! నేను ఎవరికోసం దాస్తున్నాను ఈ అందం?
కానుకగా నా అంతట నేను అంజలి ఘటించి అందించేలోపే నాలోని ఈ భావుకత్వం సున్నితత్వం కొల్లగొట్టి నన్నో మట్టిబొమ్మని చేసే హక్కు ఈ మగజాతికి ఎవరిచ్చారు?
ఎందుకో ఏడుపొచ్చింది.
కొత్త తాటాకు చాపలా మనసు ముడుచుకుపోతోంది. ముక్కూ మొహం తెలీని ఓ కొత్తవ్యక్తి ముందు కూర్చుని, అతను బాస్ లా ప్రశ్నిస్తుంటే నేను తల వంచుకుని ఆ ప్రశ్నలకి జవాబులివ్వాలా?
సిగ్గు పరదాల మాటు నుండి అతన్ని చూడాలా?
ఏది సిగ్గు? అది బలవంతంగా బాల్యంలోనే తరిమి వెయ్యబడింది. డేవిడ్ సార్...సుబ్బలక్ష్మి తండ్రి... గుళ్ళో క్యూలో ముసలాడు...ఎన్నెన్నో రూపాల్లో పురుషుడు అత్తిపత్తాకుని పరీక్షించినట్లు తడిమి, రేకులు చిదిమి వేరునుండి వేరుచేసి దాని సహజమైన గుణాన్ని నాశనం చేశాడు! ఆముక్తా... నువ్వు గోదాదేవి భగవంతుడికి సమర్పించిన మాలాలాంటి దానివి! ఎన్నిసార్లు ముట్టుకోబడ్డావో తాకిచూస్తేనేకాని ఏ అందాన్నీ ఆస్వాదించలేని మనిషికి భయపడి సృష్టిలో మనోహరమైనవన్నీ అందనంత ఎత్తుకి ఎగిరిపోయాయి.
కానీ అపురూపమైన వాటిలో ఒకటైన స్త్రీ మాత్రం అతనికి అందుబాటులో ఉంది. అందకపోతే సృష్టిలేదు! అందితే ఆమెకే ఉనికిలేకుండా చేయాలనుకుంటున్నాడు. లేడి అనే ఆహారం ఉన్నంతకాలం సింహం జీవిస్తుంది. అందమైన లేడికళ్ళు... సింహంలో ఆకలినే రెచ్చగొడ్తాయి. ఇది సృష్టి సహజం.
"ఆముక్తా... పెళ్ళివారొచ్చేశారు!" పెద్దక్క ఆయాసపడుతూ వచ్చి, నన్ను ఈ లోకంలోకి తెచ్చింది.
అమ్మ వచ్చి నన్ను కింద నుండి మీద దాకా చూసి "పూలు పెట్టుకోలేదే?" అంటూ పూలచెండు జడలో పెట్టింది. ఆ తర్వాత తృప్తిగా తలాడించి "పుత్తడి బొమ్మలా ఉన్నావు, ఎవరికి కన్ను తిప్పుకోబుద్ధికాదు!" అంది.
అదే నా బాధా అనుకున్నాను!
ముందు గదిలో వున్న చెక్క సోఫాలో ఒక పెద్దాయనా, పెద్దావిడా, ఒక అబ్బాయీ కూర్చుని ఉన్నారు.
ఎదురుగా ఉన్న కుర్చీల్లో బావా, నాన్నా, ఇంకో నడివయసాయనా కూర్చున్నారు. వాళ్ళపక్క నున్న స్టూల్ మీద అమ్మ నన్ను కూర్చోబెట్టింది.
జడ ముందుకు పడి మరువం వాసన ఘాటుగా వస్తోంది. నేను తల ఎత్తి సూటిగా ఎదురుగా ఉన్న యువకుడికేసి చూశాను.
నా కళ్ళల్లో తత్తరపాటుకానీ, సిగ్గుగానీ లేవు! సందీప్...సిద్దార్థ... చైతన్య...మాధవ్... విక్రం...ఇప్పుడు...
"అబ్బాయి పేరు శ్యాంసుందర్" మధ్యవర్తి చెప్పాడు.
శ్యాంసుందర్ ని చూస్తే ఇప్పుడు నాకు కొత్తగా ఏం భావాలు కలుగుతాయి?
పెళ్ళికొడుకు తల్లి నా చదువు, హైట్, అభిరుచుల గురించి రకరకాల ప్రశ్నలు వేసింది.
పెళ్ళికొడుకు తండ్రి లోపాయికారీగా పెరుగుతున్న ధరలగురించీ, రాజకీయాల గురించీ మాట్లాడాడు.
"నువ్వూ ఏమైనా అడుగు బాబూ!" పెళ్ళికొడుకుని మధ్యవర్తి ప్రోత్సాహించాడు.
శ్యాంసుందర్ గొంతు సర్దుకుని "మీకు సాహిత్యం పట్ల ఆసక్తి ఉందా?" అడిగాడు.
"ఉంది" ఆబ్జెక్టివ్ టైప్ లా చెప్పాను.
అతను తృప్తిపడినట్లు కనిపించాడు.
"మా వాడు కవిత్వం రాస్తాడు. రేడియోలో డ్రామాలు కూడా రాశాడు" అతని తండ్రి చెప్పాడు.
"నా బోయ్ ఫ్రెండ్స్ లో ఇంతవరకూ రచయితలు ఎవరూ లేరు. వెరైటీగానే ఉందనిపించింది.
"మీ ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకునేదేదైనా ఉంటే అలా లోపలికి వెళ్ళండి!" అన్నారు నాన్న!
"నాకేం లేదు!" ఠక్కున చెప్పాను. ఎవరికో కాబోయే భర్తతో నేనేం మాట్లాడతానూ? నా మనసంతా చంద్ర ఆచూకీ గురించి రషీద్ రాసే జాబుమీద ఉంది!
అతను మాత్రం "నేను మీతో ఒంటరిగా రెండు నిమిషాలు మాట్లాడవచ్చా?" అనడిగాడు.
