Previous Page Next Page 
ఆలింగనం పేజి 89


    "అందువల్ల మాకు ఎడబాటు కలిగింది...అయినా చంద్ర జ్ఞాపకాలు నన్ను అప్పుడప్పుడూ అతలాకుతలం చేస్తుంటాయి..." నేను లేచి నిలబడి "నమస్తే...మేం వెళ్ళొస్తాం" అన్నాను.

 

    ఆయన దిగ్భ్రమగా "అదేం...చెప్పమన్నారుగా..." అన్నాడు.

 

    "మాకు కావల్సిన చంద్ర మగవాడు. మీరు చెప్తున్న మీ ఫ్లాష్ లన్నీ మీ ప్రేయసీ గురించి అనుకుంట!" అంది లిల్లీ.

 

    "ష్! నెమ్మది...నెమ్మది..." గొంతు తగ్గించి భయంగా అన్నాడు.

 

    "మీ శ్రీమతి పేరు ఇంద్రాణీ... మీ అమ్మాయి పేరు గులాబీకాదుగా!" నిర్ధారించుకోడానికి అడిగాను.

 

    "కాదు. మా ఆవిడ పాతిమాబేగం, నాకు అసలు పిల్లలు లేరు" అన్నాడు.

 

    "వస్తాం లాయర్ గారూ... మీ విలువైన కాలం నష్టపరచినందుకు వెరీ వెరీ సారీ" అంది లిల్లీ.

 

    ఆయన చిరునవ్వి నవ్వి "నష్టమేం జరిగిందీ? ఏవో మధురస్మృతులు..." అన్నాడు.

 

    లిల్లీ నవ్వి "బై.." అని నా చెయ్యి పట్టుకుని బైటికి తీసుకొచ్చేసింది.

 

    చిట్టచివరి అడ్రస్ తీసి "ఇది తప్పకుండా మనకి కావల్సిన రషీద్ ఎడ్రెస్ అయి తీర్తుంది!" అంది.

 

    నేను నిర్లిప్తంగా నవ్వాను. చేతిదాకా వచ్చి పోయినట్లుగా వుంది నాకు! మళ్ళీ వేట మొదలు...ఓ పెంకుటిల్లు ముందు ఆగాం. లోపల్నుండి మిషన్ మీద బట్టలుకుడ్తున్న చప్పుడు వినిపిస్తోంది.

 

    నేను తలుపుమీద టక...టకా కొట్టాను.

 

    ఒక నలభై ఏళ్ళ స్త్రీ తలుపుతీసింది.

 

    "ఇంద్రాణి కావాలి" అంది లిల్లీ.

 

    ఆమె విస్మయంగా చూసి "ఇంద్రాణా" అంది.

 

    "అవును. ఇది రషీద్ గారి ఇల్లేగా..." అంది లిల్లీ.

 

    "అవును"

 

    ఆవిడ సమాధానానికి అది ణా మొహంలోకి ఆనందంగా చూసింది.

 

    "కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు. ముంబైలో ఎవరో స్నేహితుడు బిజినెస్ లో సాయంగా ఉండమని పిలిస్తే ఇల్లు అద్దెకిచ్చి ముంబై వెళ్ళిపోయారు" అని చావు కబురు చల్లగా చెప్పింది.

 

    నాకు అక్కడే క్రింద నీరసంగా కూలబడిపోవాలని అనిపించింది.

 

    "వాళ్ళ అడ్రసుకానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసా?" లిల్లీ అడిగింది.

 

    "తెలీదు"

 

    "మరి అద్దె ఎలా ఇస్తారూ?" అడిగింది.

 

    "వాళ్ళ దూరపు బంధువు ఒకాయనకి ఇవ్వమని చెప్పారు. ప్రతి నెలా ఆయన వచ్చి తీసుకెళ్తారు" అంది.

 

    "సరే..ఆయన అడ్రస్ తెలుసా?" అడిగింది.

 

    "ఆ... కేలండర్ మీద ఫోన్ నెంబర్ రాసాను. ఇస్తాను ఉండండి" ఆవిడ లోపలికి వెళ్ళింది.

 

    'ఆ దూరపు బంధువు ఎవరో మా పాలిట దేవుడిలా వాళ్ళ వివరాలు చెప్తే బావుండ్ను!' అనుకున్నాను.

 

    ఆవిడ కేలండర్ నిండా చీమతలకాయంత అంకెలూ, అక్షరాలు బోలెడున్నాయి.

 

    "మహమ్మద్ ఇక్బాల్ అన్న పేరు క్రిందున్న నెంబర్ చూడండి...నాకు ఎప్పుడూ ఫోన్ చెయ్యవలసిన అవసరం రాలేదు" సంజాయిషీ ఇస్తున్నట్లు అంది.

 

    నేను లిల్లీ ఆత్రంగా ఆ పేర్లన్నీ చదివాం.

 

    "దొరికింది...దొరికింది" ఏదో నిధి దొరికినట్లుగా లిల్లీ కేకలు పెట్టింది.

 

    "ఏదీ?" నేనూ అంతే ఆనందంగా అడిగాను.

 

    "ఇదిగో..." లిల్లీ గబగబా నెంబర్ నోట్ చేసుకుంటూ చూపించింది.

 

    ఆవిడ ఎగ్జెయిట్ మెంట్ ని వింతగా చూస్తూ "మీరు ఇంద్రాణి బంధువులా?" అంది.

 

    "కాదు స్నేహితులం" లిల్లీ అబద్ధమాడింది.

 

    "ఇంద్రాణీ చాలా మంచిపిల్ల. మేం బీదస్థితిలో ఉండడం గమనించి చాలా తక్కువ అద్దెకు ఈ ఇల్లు ఇచ్చింది" అంది.

 

    "సరే...వస్తాం...మీ సహాయానికి కృతజ్ఞతలు" లిల్లీ ఉర్దూలో చెప్పింది.

 

    "కాస్త షర్బత్ తాగి వెళ్ళండి" అంటూ ఆవిడ మర్యాద చేసింది.

 

    "ఒద్దు...చాలా ముఖ్యమైన పని ఉంది" అని అక్కడినుండి హడావుడిగా బయటికి వచ్చేశాం.


                                                          *  *  *


    మహమ్మద్ ఇక్బాల్ ఇంటికి ఫోన్ చేశాం.

 

    "కౌనై?" అన్న మగ గొంతు వినిపించింది.

 

    లిల్లీ ఇక్బాల్ పేరు చెప్పి కావాలంది.

 

    "ఇప్పుడే తిరుపతిలో ఏదో వ్యాపారపు పని వుందని వెళ్ళాడు" అన్నాడు.

 

    "ఇప్పుడే అంటే..." అడిగింది.

 

    "ఓ పది నిమిషాలయింది. ఆర్.టి.సి. బస్ డిపో చేరి వుంటాడు" అన్నాడాయన.

 

    "సరే! థాంక్స్" లిల్లీ ఫోన్ పెట్టేసి "ఫాలోమీ" అని పరుగులాంటి నడకతో ముందుకి వెళ్ళింది.


                                                          *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS