Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 9

   
    కృష్ణవేణి రావుగారి గడ్డంపట్టుకొని గుండెలు పగిలేల ఏడుస్తూంది - "నన్ను అన్యాయం చేసి పోతారా? అంటూ."

    "బాబుగారూ! మీ కుమారులు వస్తారు. వారు వచ్చేవరకైనా ఉండి అమ్మను ఆయన చేతిలో పెట్టండి!" రుద్దకంఠంతో అన్నాడు గోవిందస్వామి.

    దేవదాసి భయపడినట్లుగా మామగారి ప్రాణం పోలేదింకా. ఊపిరి సన్నగా ఆడుతుంటే మాటామంచీ లేకుండా నిశ్చలంగా పడుకొని ఉన్నారు. తూరుపురేఖలు విచ్చుకొంటూంటే ఆయనకు  కొద్దిగా తెలివి తిరిగింది. రెండు రోజులవరకు ఆశ నిరాశల మధ్య కొట్టుకున్నారు. మూడో నాటికి బ్రతుకుతారన్న భరోసా కలిగింది. కాని పక్షవాతం వచ్చి ఒక చెయ్యి. కాలు పడిపోయింది.

    ఇరుగు పొరుగున ఉన్న అమ్మలక్కలు కొందరు రావుగారిని చూచిపోవడానికి వచ్చారు. వచ్చిన వారు ఊరికేపోకుండా, "తల్లీ, ఇంత ఆపద గుండెలమీద కూర్చున్నప్పుడు పొట్టన పుట్టినవాడు దగ్గర లేకపోయాడే!" అని పరామర్శించి కృష్ణవేణి శోకం మరింత ఎక్కువ చేస్తున్నారు.

    ఈ కబురు తెలిసి సూర్యదేవులు వచ్చారు. రెండు రోజులకోసారి డాక్టరుగారు వచ్చి చూస్తున్నా ఈ పల్లెలో సరి అయిన వైద్యం జరుగదని, బావగారినిట పట్నం తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తానన్నారు.

    "వాడు యిప్పుడో అప్పుడో వస్తాడు. వాడు రానీ ఎంత విరక్తుడయినా, ఈ పరిస్థితిలో తండ్రి ఋణం తీర్చుకోని దౌర్భాగ్యుడు కాదు నా భార్గవుడు!" అభిమానం కొద్దీ అన్నదేగాని తనమాట మీద తనకే నమ్మకం లేదు కృష్ణవేణికి.

    పట్నం నుండి వచ్చిన డాక్టరును ఒకరోజంతా ఇక్కడే ఉంచేసుకొన్నారు.

    పూర్తిగా తెల్లవారలేదు. నాడు తిధి ఏమిటోగాని లేత వెన్నెల కాస్తూ ఉంది.

    గోవిందస్వామి హడావిడిగా లేచి, "ఒరే, నాగన్నా! ఎద్దులను తోలుకువచ్చి బండికట్టు" అని కేకేశాడు.
కాడి ఎద్దుల మెడలమీద ఆన్చుతూనే గోవిందస్వామి ఎక్కి కూర్చున్నాడు బండిలో.

    బండికి కట్టిన మైసూరు ఎద్దులు మెడల్లోని మువ్వలు గలగలమంటూంటే స్టేషన్ కు హుషారుగా పరుగుతీశాయి. మెయిల్లో రాబోతున్న భార్గవరామ్ ను తీసుకురావడానికి.

    లక్ష్మీవారమని దేవదాసి అభ్యంగన స్నానంచేసింది. ధవళ వస్త్రాలు ధరించింది. చక్కగా కళ్ళకు కాటుకతీర్చి నుదుట తిలకం దిద్ది, జారుగా జడ అల్లుకొంది. తోటలోకి వెళ్ళి ఆకులతో ఒకేఒక్క గులాబీ పువ్వు కోసుకొని భార్గవరామ్ గది చేరింది.

    భార్గవరామ్ ఫోటోమీద నిన్న పెట్టిన పువ్వు వాడిపోయింది. అది తీసివేసి కొత్తపువ్వు అలంకరించింది. కొద్దిగా ముందుకు వంగిటేబిల్ మీద మోచేతులాన్చి అరచేతుల్లో ముఖం ఆనించి, ఫోటోలో ఉన్న మూర్తికి ప్రాణంపోసి ఆ ముఖంలోకి తదేకంగా తన్మయంగా చూడసాగింది ఆమె. అతడి కళ్ళు చిత్రంగా కదులుతున్నాయి. అతడి పెదవులు తమాషాగా నవ్వుతున్నాయి. ఒత్తయిన అతడి ఉంగరాల జుట్టు అందంగా చలిస్తూంది.

    ఎంతోసేపు ఆమెను ఆ సుమధుర స్వప్న సీమలో విహరించనీయలేదు మేడముందాగిన బండి చప్పుడు. ఎద్దులమువ్వల సవ్వడి వింటూనే దేవదాసి గుండె జల్లుమంది. భావప్రపంచం తృటికాలంలో అదృశ్యమైపోయి కదలక, మెదలక ఉన్న బావగారి ఫోటో కనిపించింది ఎదుట!

    "బావ పైకి వస్తాడేమో!" దేవదాసి తత్తరపాటుతో దిగబోయింది.

    "ఓయ్! ఈ పువ్వు తీసుకోవోయ్. బావగారు వచ్చి చూస్తే అమ్మాయిగారి ఆరాధన అర్ధమైపోవాలనా?"
    మనసు హెచ్చరిక చేసింది. గబగబా వెనక్కి వచ్చి పువ్వుతీసి జడలో తురుముకొనినది. గబగబా మేడ దిగిపోయింది. ఒక ఛాయ పెంచుకొని నల్లని ఫుల్ సూటులోబండి నుండి ఆవరణలో దిగిన అబ్బాయిగారిని చూచిన నౌకర్లు, ఆప్తులు గుండెలనిండా గాలితీసుకొని వదిలారు. యజమాని రోగగ్రస్తులైనప్పటి నుండి వారి మనస్సులూ కలతగానే ఉన్నాయి. ఆ బరువు మోయడానికి బాధ్యత గలవాడు. ముఖ్యుడూ దిగాడు!

    ఎవరూ నవ్వుతూ పలకరించలేదు, భార్గవరామ్ లోనికి వస్తూంటే, అందుకు అది సమయంకాదు, బాబూ మీరు, లేనప్పుడు అయ్యగారికి ఎంత ఆపద సంభవించిందనుకొన్నారు?" అన్నట్లు అందరూ విచారంగా దారినుండి ప్రక్కకు తొలగి నిల్చొన్నారు.

    బండిలో దారి పొడవునా, గోవిందస్వామిరావుగారు గుర్రంమీదనుండి క్రిందపడిన దగ్గరనుండి ఇప్పటివరకూ జరిగినదంతా సవిస్తరంగా తెలిపాడు భార్గవరామ్ కు.

    గది ముందు బూట్లచప్పుడు వింటూనే రావుగారి మంచం దగ్గర కూర్చున్న కృష్ణవేణి కిటికీ దగ్గరికి లేచిపోయి ముఖం కొంగులో దాచుకొంది.

    తను వెళ్ళినప్పుడు పరిపూర్ణ ఆరోగ్యంతో కలకలలాడుతూ తిరుగుతూన్న తండ్రిని రోగగ్రస్తుడై, పూర్తిగా కృశించి, ముఖంలో ప్రేతకళపడి, మంచంలో చూడడంతో ఆ నిర్మోహి మనస్సెందుకో కొంచెం చలించింది! కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి, మూడేళ్ళనాడు తల్లినుండి సెలవు తీసుకోబోతే 'అమ్మా నాన్నలకు నీళ్ళు వదిలి వెళ్ళు, తండ్రీ,' అంటూ, తల్లి శోకతప్తహృదయంనుండి వెలువడిన మాట కూడా అతడిని ఇలాగే చలింపజేశాయి - ఆ తరువాత ఆ ఏడుపూ, తన ఏడుపూ మాయా, భ్రాంతి అనుకొన్నా!

    మంచం దగ్గర స్టూల్ మీద కూర్చొని తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు భార్గవరామ్. ఆప్యాయంగా నిమురుతూ, జాలిగా ప్రశ్నించాడు; "ఎలా ఉంది, నాన్నా ఆయాసంగా ఉంటుందా?"

    కృష్ణవేణి బండ అని నామకరణం చేసిన ఈ కొడుకు ఇంతటి ఆప్యాయత ఎప్పుడూ ఎరుగని ఆ వృద్ధ తండ్రి శుష్కనేత్రాలు ఆనందంతో చెమర్చాయి.

    "ఆయాసమా? ఆయాసంగా ఉండదూ. మరి?" అన్నాడు హీనస్వరంతో.

    తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూంది. ఇంత బరువైన వాతావరణాన్ని అతడీనాడే ఎదుర్కొంటున్నాడు. మనసులో కలత బయల్దేరింది. మరి కొద్దిసేపు మౌనంగా కూర్చొని మెల్లిగాలేచి వెళ్ళిపోయాడు తన గదికి, భార్గవరామ్.

    కృష్ణవేణి దుఃఖం కట్టలు త్రెంచుకొంది ఎండి బీటలు వారిన ధరణి వర్షాగమనానికై తపించినట్లుగా పుత్రాగమనానికై ఆ తల్లి హృదయము శోకంతో తపిస్తూన్నది. నల్లని మేఘమైతే క్రమ్ముకొని వచ్చింది కాని, ఒక్క చినుకు కూడా ఆ మండే గుండెలమీద చల్లగా చిలకరించకుండానే కదలిపోయింది. కన్నీరు మున్నీరుగా కన్నతల్లి ఏడుస్తూంటే దగ్గరికి వచ్చి - ఎందుకమ్మా, ఏడుస్తావు? భయమెందుకు? నాన్నగారిని మంచి డాక్టర్ల దగ్గరికి త్రిప్పి నయంచేయించనా? నేనుండగా నీకు దిగులెందుకు? అని ఒక చల్లని ఓదార్పు? భగవాన్, నేనేం పాపం చేసుకొన్నాను?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS