Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 8


    "ఏమిటో భ్రాంతి!" ఏపేజీ త్రిప్పినా అంతులేని నిరాశా, విపరీతమైన వైరాగ్యాన్నీ నింపివేశాడు భార్గవరామ్.

    ఎందుకో దేవదాసి మనస్సంతా బరువెక్కింది. డైరీలు అల్మరాలో పడేసి టేబిల్ ముందుకు వచ్చి నిల్చిందామె. భార్గవరామ్ ఫోటోలోకి చూస్తూ ఉదాసీనంగానూ, గంభీరంగానూ ఉన్న అతడి చూపులు "ఓ సౌందర్యపు ప్రోవా! నువ్వూ ఒకనాడు ఆ గులాబీసుందరిలా ప్రకృతి థర్మంలో నీ యౌవన సౌందర్యాలు పోగొట్టుకుని నశించిపోతావులే!" అన్నట్లు అనిపించింది.

    ఉలిక్కిపడింది దేవదాసి నిలువుటద్దంలో చూచుకొనే తన ప్రతిబింబాన్ని క్షణకాలం కన్నుల్లో నిలుపుకొని చూచింది సరసిజ సౌందర్యాన్నే ధిక్కరించేట్లున్న తన ముఖబింబం, కోమలంగా ఉండే హస్తాలు, మృదువైన పాదాలు, సుకుమారమైన లతలా ఊగిపోయే తనువు - తనకే ముచ్చట గొలిపే ఈ ఆకృతి ఒకనాడు మట్టిలో కలిసేదేనా?

    "ఓ మిధ్యావాదీ, ఒక ఆర్తనాదం వెలువడింది ఆమె హృదయపు లోతులనుండి.

    "క్షణం తరువాత ఏమైనా అవనీ, ఉన్న క్షణంలేదని అనుకోవడం భ్రాంతి కాదా?

    జీవితం మూడుదినాల ముచ్చటనే కానీ ఆ మూడు దినాలు ఆనందపు మధువులు నింపుకొని నవ్వుతూ మృత్యువును కౌగలించు.

    ఈ వైరాగ్యపు విషాన్ని నింపుకొని ఆ మూడుక్షణాలు ఏడుస్తూ చావడంలో పొందేదేమిటి?

    తరతరాలుగా వస్తూన్న మన భారతీయ ఆధ్యాత్మికతత్వం సర్వం మిధ్య అని చెప్పేదే అయితే అది తొందరగా నశించి పోవలసిందే.

    మానవుడికి సుఖమివ్వలేని ఏ మతబోధ అయినా ప్రపంచంలో స్థిరత్వాన్ని సాధించుకొనలేదు."

    "ఓ ఆశావాదీ! నిరంతరం నీ కంటియెదుట జీవన్మరణాలను దర్శిస్తూనే ఆశాపాశంలో బంధింపబడడంలో నీకు ఆనందమేమిటి?" ఫోటోలో భార్గవరామ్, గంభీరమూర్తి వెక్కిరింపుగా నవ్వినట్లనిపించింది. గతుక్కుమంది దేవదాసి.

    నేను సత్యంనుండి పారిపోచూస్తున్నానా?

    అలజడి చెందిన మానసంతోటే నాడు మేడదిగింది దేవదాసి.

    రోజూ పగటివేళల్లో తీరిక చిక్కించుకొని భార్గవరామ్ గదిలో గడుపుతూంది దేవదాసి.అల్మరాలోని పుస్తకాలు తీసుకొని తిరగవేస్తూ పడుకొనేది చిరిచాపమీద. ఆ పుస్తకాలలో బావనేర్చుకొన్న పాఠాలేమిటో గ్రహించాలని ఆమె ఉద్దేశ్యం.

    ఈ మూడు నాలుగు రోజుల్లో వచ్చివేస్తున్నట్లు భార్గవరామ్ నుండి ఉత్తరం వచ్చింది ఎందుకోగాని దేవదాసిని సిగ్గు, భయం, ఆనందం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎవరో ఒక నూతన వ్యక్తిని చూడబోతున్నట్టుగా ఆమె మనసు ఉద్వేగపడింది.

    ఆ రోజు హఠాత్తుగా అర్థరాత్రి నిద్రనుండి మెలుకువ కలిగింది దేవదాసికి. ఇల్లు అందరి ఏడుపులతో నిండివుంది. అత్తగారి ఏడ్పులు వినబడి అదురుతున్న గుండెలతో మామగారి గదిలోకి పరిగెత్తింది దేవదాసి. నౌకర్లందరూ మంచంచుట్టూ నిలబడి నోట్లో గుడ్డలు కుక్కుకొని ఏడుస్తున్నారు. కుళ్ళి కుళ్ళి గోవిందస్వామికూడా రావుగారికి సుస్తీ చేసినప్పటి నుండి ఇప్పుడే పడుకొంటున్నాడు. ఆయన కంటతడిపెట్టాడు. ఎనిమిది రోజులనుండి జ్వరమైతే వస్తూందికాని కానియింత హఠాత్తుగా పరిస్థితి ఇలా విషమిస్తుందని అనుకోలేదెవరూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS