స్నానం, భోజనం అయ్యాయి భార్గవరామ్ విశ్రాంతిగా తన గదిలో పడుకొన్నాడు. మనిషి మనోదౌర్భల్యానికి చిహ్నమైన దుఃఖాన్ని జయించడానికి అతడు తలక్రిందులవుతున్నాడు. వచ్చినప్పటినుండి 'కర్మఫలం. ఆయనకాజబ్బు రావలసి ఉండి వచ్చింది నయమయ్యేదయితే అవుతుంది. లేకుంటేలేదు. నేనెందుకు నా మనసునింతగా బాధించుకొంటున్నాను?' అనుకొన్నాడు.
మనసు కొద్దిగా కుదుట బడ్డాక గదివిడిచి, పిట్టగోడ మీద వెళ్ళి కూర్చున్నాడు, తోటలోకి చూస్తూ.
భాస్కరుడు అస్తమిస్తున్నాడు. నీరెండ చెట్లమీద అందంగా పరుచుకొంది. పిచ్చుకలు కలకలరొద చేస్తున్నాయి చెట్ల నీడల్లో చేరి పందిళ్ళమీద మల్లీ మాలతలు విచ్చుకొంటున్నాయి.
తోటమాలి తోటకు నీళ్ళు పడుతున్నాడు. మల్లి మాలతుల సౌరభాలతో పాటు నేల తడిసిన కమ్మని వాసన కూడా చల్లగాలిలో సాగి వస్తూంది.
భాస్కరుని బంగారు కిరణాలతో పోటీపడుతూ ధవళ వస్త్రదారిణీ అయిన ఒక యువతి పావురాలు ఎగురవేసి హాయిగా, ఆనందంగా ఆడుకొంటూ భార్గవరామ్ కంటబడింది హఠాత్తుగా.
దేవదాసిని గురించి అతడికింకా తెలియదు. ఆమె వచ్చి యిక్కడున్న సంగతి ఎవరూ అతడికి చెప్పలేదు. సిగ్గువల్లో మరెందువల్లో భార్గవరామ్ కంట పడలేదు దేవదాసి. పది పదకొండేళ్ళ వయస్సులో చూచిన దేవదాసిని ఈ యవ్వనసుందరిలో అతడు ఊహించనైనా ఊహించలేడు!
ఆమె ఆకృతిలోనూ, అలంకరణలోనూ, అమాయకంగా ఆడుకుంటున్న ఆటలోనూ వ్యక్తమౌతూన్న ఏదో స్వచ్ఛత భార్గవరామ్ ను ముగ్ధుత్వానికి లోనుజేసింది కొద్దిక్షణాలు.
ఆమె ఎవరో తెలియక కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం అంతగా కలుగలేదతనికి చీకటిపడుతూంటే లేచి లోపలికి వెళ్ళిపోయాడు.
నౌకరు లాంతరు వెలిగించుకు వచ్చిగదిలో పెట్టివెళ్లిపోతుంటే అప్రయత్నంగా అడిగాడు భార్గవరామ్! "మన ఇంటికి ఎవరైనా బంధువులొచ్చారా, రాఘవుడూ?"
"బంధువులా? ఎవరూ రాలేదు బాబూ! మన దేవతమ్మగారే వచ్చి శాన్నాళ్ళయింది..... ఎందుకు బాబూ, అడుగుతున్నారు!"
"తోటలో ఒకామె కనబడితే అడిగానులే!"
"దేవతమ్మగారే! అయివుంటుంది."
'భార్గవరామ్ నవ్వి' దేవతను నేను చూడనట్లు చెబుతావేంరా? ఆ పిల్ల కాదులే. నేను చూచినామె పెద్దది! అన్నాడు.
వాడూ నవ్వాడు "మన దేవతమ్మగారిని తమరింకా చూడలేదేమో, బాబూ! శానా పెరిగిపోయిందండీ!"
"ఊ హూఁ?"
భవన ప్రాంగణంలో సూర్యదేవులు గుర్రందిగుతూనే నౌకరొకడు పరుగుపరుగున వచ్చి గుర్రం కళ్ళాలు పట్టుకొన్నాడు. తీసుకుపోయి శాలలో కట్టివేయడానికి.
"మా అల్లుడు వచ్చాడు రా?" అడిగారు సూర్యదేవులు,
"నిన్న ప్రొద్దున్నే వచ్చారు, బాబూ!" సంభ్రమంగా చెప్పాడు నౌకరు.
సరాసరి బావగారి గదిలోకి వచ్చి వేశారు సూర్యదేవులు. బావగారి ఆరోగ్య పరిస్థితి విచారించక. కృష్ణవేణిని అడిగారు!" భార్గవుడేమంటున్నాడక్కా? బావను పట్నం తీసుకుపోయే ఏర్పాట్లు ఏమైనా చేయాలంటున్నాడా?
తల్లిదండ్రుల మీద శ్రద్దా మమకారాలు లేని కొడుకును గురించి ఆమేం చెప్పగలదు! ఆ అభిమానవతి తన దౌర్భాగ్యాన్ని ఏవిధంగా వెళ్ళబోసుకోగలదు? గంభీరంగానూ, మౌనంగానూ ఉండిపోయింది కృష్ణవేణి.
అనుభవజ్ఞుడైన తమ్ముడుమాత్రం పరిస్థితి చూచాయగా గ్రహించగలిగాడు. 'భార్గవుడు మేడమీదే ఉన్నాడా. అక్కా?,
"ఉఁ మరెక్కడ ఉంటాడు? గదిలోనో, ఆ పిట్టగోడల దగ్గరో ఉంటాడు. లేకపోతే తోటలో ఏ చెట్లక్రిందనో బుద్ధావతారం దాల్చి దర్శనమిస్తాడు మరెక్కడ కనబడుతాడు?" ఉదాసీనంగా అన్నది కృష్ణవేణి.
"మనవాణ్ణి పలుకరించి వస్తాను" అని పైకి వెళ్ళారు సూర్యదేవులు.
"బాగున్నారా, మామయ్యా?" చిరునవ్వుతో ప్రశ్నించాడు భార్గవరామ్.
ఆఁఆఁ నీసంగతేమిటోయ్? ఫారిస్ విశేషాలేమిటి?
"కూర్చోండి, మామయ్యా" మర్యాదగా మంచం మీదికి ఆహ్వానించి "ఏముంది? సుఖస్వప్నాలు యధార్థం చేసుకోడానికి మనిషిచేసే జీవనయాత్ర ఇంచుమించు అంతటా ఒకటే!" అన్నాడు.
