ఓ దుడ్డు కర్ర తీసుకుని వాటివెంట బడ్డాను. ఈ మూలనుండి తరిమితే ఆ మూలకి చేరి దెబ్బలాడుతున్నాయ్. ఆ మూలనుండి తరిమితే ఈ మూలకి చేరి దెబ్బలాడు తున్నాయ్.
ఒక అరగంటపాటు నాకు చెమటలు కార్పించి గానీ వదల్లేదు అవి.
రాణీ నా వైపు చూసి "గుర్ ర్..." అంది కోపంగా.
అప్పుడు సమయం నాలుగు గంటలైంది. నాకు తెలియకుండానే చాలాసేపు నిద్రపోయాను. కాస్త కాఫీ పెట్టుకుని త్రాగాను. యింటివాళ్ళు రావడానికి దాదాపు మరో రెండు గంటల టైంఉంది.అంతదాకా ఏం చెయ్యాలి?
మొక్కలకి కాస్సేపు నీళ్ళుపట్టి కాలక్షేపం చేద్దామని అనిపించింది.
కొళాయికి రబ్బరు గొట్టం తగిలించి ఓ అయిది నిమిషాలపాటు మొక్కలకి నీళ్ళు పట్టానోలేదో లోపలనుండి "కుయ్...కుయ్..." మని రాణి గొంతూ "బొయ్ బొయ్" మని మరో కుక్క గొంతూ వినిపించాయి.
కొంపలు మునిగేదేగో లోపల జదుగుతున్నట్లు అనిపించింది.ట్యూబు అవతల పారేసి లోపలికి పరుగెత్తాను.
రాణి హాల్లో లేదు...మంచం క్రిందా సోఫాక్రిందా చూశాను. ఉహు, లేదు డ్రాయింగు రూములో, వంటగదిలో, స్టోరు రూములో, బెడ్ రూములో కూడా లేదు.
ఇహ మిగిలింది నాగదే. ఒక్క పరుగున అక్కడికి వెళ్ళిన నాకు అక్కడి దృశ్యం చూసి ఒళ్ళు గగుర్పొడిచింది.
ఇందాక దెబ్బలాడుకున్న డజను కుక్కల్లో ఉన్న నల్లమచ్చలకుక్కా. రాణి నా మంచంమీద ప్రేమించుకుంటున్నాయ్. రాణి సంతోషంగా కుయ్ కుయ్ మంటుంది.
పుట్టిన దగ్గర్నుండి నాకు అంత కోపం ఎన్నడూ రాలేదు. బయట ఉన్న దుడ్డుకర్ర తెచ్చి రాణి ప్రియుడి నడ్డిమీద ఒక్కటేశాను, అది "కుయ్యో...మొర్రో" అంటూ బయటికి పరుగుతీసింది.
రాణి కొన్ని క్షణాలు త్రీవంగా నన్ను చూసింది. తరువాత మెల్లిగా తన పళ్ళు బయట పెట్టి "ఈ... గుర్ ర్" అంది.
హఠాత్తుగా నాకాలిని గట్టిగా కొరికేసి నేను కెవ్వుమని అరిచేలోగా బయటికి బాణంలా వెళ్ళి కాంపౌండ్ వాల్ దూకి తన ప్రియుడు మా యింటి ఓనర్ల అల్లుడూ అయిన నల్లమచ్చల కుక్కని వెతుక్కుంటూ పారిపోయింది.
నా గుండెల్లో రాయి పడింది.
వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేసరికి రాణి యింట్లో ఉండాలి. లేకపోతే ఉదయంనుండీ పడ్డ శ్రమంతా పోయి మాటలు పడాల్సి వస్తుంది.

ఇంటికి తాళంవేసి, ఆ వీథి ఈ వీథి తిరిగాను, ఎక్కడా రాణిజాడ కనబడ లేదు.
అంతసేపూ నే
ను కంగారులో గమనించ లేదు. నా కాలి పిక్కనుండి రక్తం కారుతోంది. రాణిపళ్ళు బాగా లోతుగా దిగాయి. లబ్బున నెత్తి కొట్టుకుంటూ డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అతను నిర్దాక్షిణ్యంగా బొడ్డుచుట్టూ ఇంజక్షన్లు గుచేశాడు - దూదేకుల సాయిబు పరుపు కుట్టినట్లు.అక్కడనుండి ఇంటికివచ్చి దిగులుగా కూర్చున్నాను.
ఇంతలో వెంకుమాంబా శంభులింగం వచ్చేశారు.
"రాణీ" అంటూ వీథిలోంచి పిలిచాడు శంభులింగం మొహంనాకించు కోవడానికి.
"ఏదయ్యా...రాణి ఏదీ?" అని నన్ను అడిగాడు.
నేను చొక్కా ఎత్తి నా పొట్ట చూపించాను.
"రాణి ఏదంటే పొట్ట చూపిస్తావేం?... కొంపతీసి రాణిని పొట్టన పెట్టుకున్నావా యేం?"
"మీ అల్లుడుగారితో బాటు రాణి ఎక్కడికో వెళ్ళిందండీ..." అన్నాను నీళ్ళు నములుతూ.
"అల్లుడేమిటి?" వెంకుమాంబ నోరు తెరిచింది.
నేను జరిగినదంతా చెప్పాను.
ఆవిడ లబ్బున మొత్తుకుంది.
నిన్ను నమ్మి రాణిని నీ చేతుల్లోపెడ్తే ఇలా చేస్తావా?" అంటూ మండిపడ్డాడు శంభులింగం.
ఇంతలో పక్కింటి వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్పాడు "ఆంటీ! మీ రాణిని మున్సిపాలిటీ వాళ్ల కుక్కల బండిలో వేసుకుని వెళ్ళిపోతున్నారు."
వెంకుమాంబ శృతి పెంచేసింది. శంభులింగం వీధిలోకి పరుగెత్తాడు.ఒక అరగంట తరువాత రాణిని చంకలో ఎత్తుకుని వచ్చేశాడు.
"వాడితో నానా రకాలుగా మాటలుపడి వాదించి, డబ్బులు వదల గొట్టుకుని దీనిని తీసుకువచ్చాను" అన్నాడు.
