ఆవిడ రాణిని కౌగిలించుకుని బావురుమంది. ఆ హృదయ విదారక దృశ్యానికి శంభులింగం కళ్ళు వర్షించాయి.
నేను మెల్లిగా అక్కడినుండి జారుకుని చంచల్రావు ఇంటికి వెళ్ళాను.
జరిగినదంతా వాడికి చెప్పి "ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను ఉతికి ఆరేస్తారు... ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను.తెల్లారింతర్వాత టు లెట్ బోర్డులు వెతుక్కుంటూ తిరగడం తప్పదు.ఈసారి కుక్కలున్న వాళ్ళింట్లో చస్తే అద్దెకు దిగను" అన్నాను వాడితో.
"సర్లేవోయ్!... అలాగే" అని భుజంతట్టి లోపలికి తీసుకువెళ్ళాడు చంచల్రావు.
* * *
గమనిక: నా స్నేహేతుల్లో కుక్కల్ని పెంచేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ కథ వాళ్ళెవర్ని ఉద్దేశించి వ్రాసింది కాదు. కేవలం సరదాకోసం వ్రాశాను. అయితే ఈ కథ వ్రాయాలనే ఆలోచన నాకు కలగజేసినవారు మాత్రం లేకపోలేదు. ఆయన మా బాబాయ్ అప్పారావుగారు.
నేనూ-యాక్సిడెంటూ
రోజూలాగానే ఆఫీసు కెళ్దామని బస్ స్టాండుకొచ్చాను. అక్కడి దృశ్యం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందం వేసింది.
ఎందుకంటే బస్ స్టాండులో అస్సలు జనం లేరు. రోజూ జనాన్ని తోసుకుని బస్సు ఎక్కాల్సి వచ్చేది.
నేను బస్ స్టాండులో నించున్నాను. అయిదు... పది.... పదిహేను నిమిషాలైంది. ఒక్క బస్సు కూడా రాలేదు.
అప్పుడు గమనించాను.....
జనం రోడ్లమీంచి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు అనుమానం వచ్చింది. రోడ్డుమీద వెళ్ళే ఒకతన్ని ఆపి అడిగాను.
అర్టీసీ స్ట్రయికు కదా ఈ వేళ అన్నాడు.
నేను పనిచేసే ఆఫీసు చాలా దూరం. బస్సులు లేవు.... అంతదూరం నడిచి వెళ్ళడం కష్టం. అందుకని ఆటోని పిలిచాను.
వాడు "మనిషికి అయిదు రూపాయలివ్వాలి" అన్నాడు.
"నేను ఒక్కడినేకదా?... మనిషికి అయుదు రూపాయలంటావేం...." అన్నాను.
"అర్రె...గదేంమాట...గిప్పుడు ఒక్కడివే ఉన్నావ్. జర్ర సేపైతే వేరోళ్ళు రారా.... ఆళ్ళన్ బీ ఎక్కించుకుంటా...."అన్నాడు వాడు రుసరుస చూస్తూ.
అంటే నాతోబాటు మరో ఇద్దరర్ని ఎక్కించుకుంటావన్నమాట....ముగ్గురికి మూడైదులు పదిహేను రూపాయలా?... మీటరేస్తే నాల్రూపాయలే కదయ్యా అవుతుంది" అన్నాను గుండెలమీద చెయ్యేస్కుంటూ.
"అర్రె ఇస్కీ గట్ల గుండెలమీద చెయ్యేసుడేంది... గట్లపరేషానౌతే నువ్వేం ఆటో ఎక్కుతావ్ సాబ్!" అన్నాడు.
ఇంకా ఏమైనా మాట్లాడితే నా పరువు తీస్తాడని ఆటో ఎక్కి కూర్చున్నా. వాడు మాత్రం మిగతా రెండు బేరాలు తగిలేదాకా కదల్లేదు. మిగతా యిద్దరూ దొరకడానికి పదిహేను నిమిషాలు పట్టింది. అప్పుడు కదిలింది ఆటో.
ఆఫీసుకు వెళ్ళేటప్పటికి బాగా ఆలస్యం అయిపోయింది. మా ఆఫీసరు నాకు బాగా చివాట్లు పెట్టాడు.
ఆర్.టి.సి వాళ్ల స్ట్రయికు వారం రోజులు జరిగింది. కండక్టర్లు టిక్కెట్టు కొట్టకుండా డబ్బులు తిన్నా ఏమనకూడదు, చెకింగులు చెయ్యకూడదని స్ట్రయికు.చివరికి కండక్టర్లే గెలిచారు.
ఈ వారంరోజులు ఆఫీసుకు వెళ్ళడానికి చాలా బాధలు పడ్డాను. డబ్బులు ఖర్చు పెట్టడమేకాక ఆటోవాళ్ళతో నానా రకాలుగా బాధలు పడాల్సి వచ్చింది. బస్సులున్నా అంతే. అవి టైంకి రావు. వచ్చినా బస్ స్టాపులో ఆగవు."ఇన్ని బాధలు పడేకంటే ఏ స్కూటరో మోటార్ సైకిలో కొనుక్కోరాదూ?" అంటూ నా స్నేహితుడు చంచల్రావు సలహా ఇచ్చాడు.
"నీ సలహా బాగుంది గానీ మరి డబ్బుల్లో?" అన్నాను.
"ఆఫీసులో లోనుపెట్టు...."
వాడి సలహా నచ్చింది.

మా ఆఫీసులో స్టాఫ్ కి ఒకేరకం లోన్ ఇస్తారు. అది పర్సనల్ లోన్. దాన్ని పెళ్ళి చేసుకోడానికిగానీ, మీద ఆధారపడినవాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికిగానీ, అంటే చెల్లెళ్లు, కూతుళ్ళ పెళ్ళిళ్ళు అన్నమాట. దానికే ఇస్తారు.
ఆలోచన రాగానే దాన్ని ఆచరణలో పెట్టేశాను. లోను అప్లికేషను ఫారం పూర్తిచేసి శాంక్షన్ చేసినట్టు సంతకం పెట్టించుకోడానికని మా ఆఫీసరు గదిలోకి వెళ్ళాను. అప్లికేషన్ని ఆయన ముందుంచాను.
"ఏంటిది?" అన్నాడాయన కళ్ళెగరేస్తూ.
నేను చెప్పాను.
"వాహ్హాట్!!... ఈమధ్యనే కదా నువ్వొక మ్యారేజీలోన్ పెట్టావ్?" అన్నాడు. "ఆ మ్యారేజీలోన్ మా చుట్టాలాయన ఎవరికో డబ్బు అవసరం అయి నన్ను సర్దమంటే పెట్టానండీ..."
మరి పోయిన సంవత్సరంకూడా ఒక మ్యారేజీలోన్ పెట్టినట్టున్నావ్?"
