Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 9

   
    ఆమె నవ్వుకి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు కన్నారావు.

    "అంటే... మంచి అంటే ఆ మంచి కాదులెండి. మీలాంటి అందమైన రుమాల్ని ఉపయోగిస్తారు కదా అని..." కంగారుగా అన్నాడు.

    ఆమె మళ్ళీ కిలకిలా నవ్వింది.

    "నేనేంటి, రుమాలేంటి? మీరు భలే గమ్మత్తుగా మాట్లాడ్తారండీ..."

    "అవునండి... అబ్బే కాదండి... గమ్మత్తుకి కాదు... నిజంగానే అండి... అంటే మనిషి అందంగా ఉంటే రుమాలు కూడా అందంగా ఉంటుంది.... అహ అదికాదు... అసలు అందంగా ఉన్నవాళ్ళు అందమైన రుమాళ్ళు వాడ్తారేమోనని ..."

    "ఆ రుమాలు నాది కాదుగానీ... నేనొస్తానండీ..." ఆ అమ్మాయి నవ్వాపుకుంటూ అంది.

    "నన్ను బస్టాపుదాకా వచ్చి బస్సెక్కించమంటారా?..." అడిగాడు కన్నారావు.

    "మీ యిష్టం...." అంటూ ఆ అమ్మాయి అడుగులు ముందుకు వేసింది.

    కన్నారావు ఆమె వెనకాల ఫాలో అయ్యాడు. అంతదాకా చెట్టుచాటు నుండి నోరు తెరుచుకుని చూసిన చిట్టబ్బాయ్ కి కన్నారావు వెళ్ళిపోవడం చూసి కంగారుపుట్టి గట్టిగా విజిలేశాడు.

    అప్పుడే చెట్టు ముందునుండి వెళ్తున్న అమ్మాయిలు కొందరు చిట్టబ్బాయ్ ని చూసి కళ్ళు చిట్లించారు.

    "ఈ రౌడీ వెధవలకి పనీపాటా ఏమీ ఉండదు..." ఒకమ్మాయ్ విసుక్కుంటూ అంది.

    "అబ్బే... మిమ్మల్ని చూసి కాదండీ... వాడిని చూసి విజిలేశా...." కంగారు పడ్తూ అన్నాడు చిట్టబ్బాయ్. అమ్మాయిలు తనని రౌడీయో, రోమియోనో అనుకోవడం చిట్టబ్బాయ్ కి నచ్చలేదు.

    "ఊ... ఇటువంటివి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయని అనుకున్నాగానీ..." అంది ఆ అమ్మాయి తనకూడా ఉన్న మిగతా అమ్మాయిల్తో.

    తన ఉద్దేశం అదికాదని చిట్టబ్బాయ్ చెప్దామని అనుకున్నాడుగానీ అంతలోకే ఆ అమ్మాయిలు ముందుకు వెళ్ళిపోయారు.
    చిట్టబ్బాయి వేసిన విజిల్ కన్నారావు కూడా విన్నాడు.

    "హర్రే!... మర్చిపోయానండీ... నా ఫ్రెండు అక్కడ చెట్టుదగ్గర నిల్చుని ఉన్నాడు... నేనిక వస్తానండి...." అన్నాడు కన్నారావు కంగారుగా.

    "అలాగే... ఆ రుమాలు మీ ఫ్రెండుదేమో అడిగి చూడండి...." అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.
    కన్నారావు ఖంగు తిన్నాడు.

    "ఆ అమ్మాయి అలాగెందుకంది?... కొంపతీసి నేను జేబురుమాలు తీసి నేలమీద పడెయ్యడం గమనించలేదు కదా?" అనుకున్నాడు.

    మళ్ళీ వెనకనుండి గట్టిగా విజిల్ వినబడింది.

    కన్నారావు వెనక్కి తిరిగి అరిచాడు,

    "ఊర్కే అలా విజిల్లేసి చావకు, వస్తున్నా...." దగ్గరికి వచ్చిన కన్నారావు మీద చిట్టబ్బాయ్ మండిపడ్డాడు.

    "రుమాలు చూపించి మాట్లాడ్తానని అన్నవాడివి ఆ అమ్మాయి వెంటబడి పోతావేం?"

    కన్నారావు సిగ్గుపడ్డాడు.

    "ఏంటోరా చిట్టీ... ఆ అమ్మాయితో మాట్లాడ్తుంటే అదేదో గమ్మత్తుగా ఉందనుకో... ఎప్పుడూ అమ్మాయిల్తో మాట్లాడే అలవాటు లేదుకదా తమాషాగా అనిపించింది.. నువ్వు ఇక్కడున్నావన్న విషయం కూడా మర్చిపోయాననుకో...."

    ఏడ్చావ్ లే... ఆ రుమాలిలాతే..." అని కన్నారావు చేతిలోంచి రుమాలు లాక్కున్నాడు చిట్టబ్బాయ్.

    "నేనెలా పలకరించానో చూశావ్ కదా.... నువ్వు కూడా ధైర్యంగా అలానే చెయ్..." అన్నాడు కన్నారావు.

    "అదిగో... ఆ అమ్మాయి బాగుంది కదూ?... నేను ఆ అమ్మాయి మీద ప్రయోగిస్తాను..." అన్నాడు అప్పుడే అటుగా వస్తోన్న అమ్మాయిని చూపిస్తూ చిట్టబ్బాయ్.

    "అదిగో... ఆ అమ్మాయి బాగుంది కదూ?.. నేను ఆ అమ్మయి మీద ప్రయోగిస్తాను...:" అన్నాడు అప్పుడే అటుగా వస్తోన్న అమ్మాయిని చూపిస్తూ చిట్టబ్బాయ్.

    "ఊ... గో ఎహెడ్..." ప్రోత్సహిస్తూ అన్నాడు కన్నారావు.

    ఆ అమ్మాయి చెట్టుదాటి ముందుకు వెళ్ళింది.

    చిట్టబ్బాయ్ గబగబా ముందుకు అడుగులు వేశాడు.
   
    సరిగ్గా ఆ సమయంలోనే ఎక్కడి నుండి వచ్చాడో రయ్యిమని ఒక అబ్బాయి వేగంగా వచ్చి ఆ అమ్మాయి వెనకాల రుమాలు పడేసి ఆ అమ్మాయిని పిలిచి రుమాలు చూపించాడు.

    ఆ అమ్మాయేదో అంది. ఆ అబ్బాయి ఏదో అన్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఏదో అంది. ఆ అబ్బాయి కిందికి వంగి రుమాలు తీసి ఇంకేదో అన్నాడు చేతులూ తిప్పుతూ, ఆ అమ్మాయి కళ్ళు తిప్పుతూ నవ్వింది.

    ఇద్దరూ కలిసి ముందుకు కదిలారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చిట్టబ్బాయ్ కి అసలేమీ వినిపించలేదు.

    చిట్టబ్బాయ్ తెల్ల మొహం వేస్కుని వెనక్కి వచ్చాడు.

    "ప్రేమానందం మనకేకాక ఈ చేతిరుమాలు ట్రిక్కు చాలమందికి చెప్పినట్టున్నాడు" అన్నాడు కన్నారావుతో  చిట్టబ్బాయ్.

    "అలాగే అనిపిస్తుంది..." అన్నాడు కన్నారావు.

    "అదిగో... ఇంకో అమ్మాయి వస్తుంది" అన్నాడు చిట్టబ్బాయి.

    "ఆ అమ్మాయి నీకు నచ్చిందా?" సీరియస్ గా అడిగాడు కన్నారావు.

    చిట్టబ్బాయ్ ఆ అమ్మాయి వంక పరీక్షగా చూశాడు.

    "అబ్బే... అస్సలు నచ్చలేదు" అన్నాడు.

    "మరేం?... అమ్మాయి కనిపిస్తే చాలు రుమాలు పుచ్చుకుని పరుగు తీస్తావేం? నువ్వు ఇష్టపడి ప్ర్రేమించాలని అనుకున్న అమ్మాయి వెనకే వెయ్యి ఆ రుమాలు"

    ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.

    కొన్ని క్షణాల తర్వాత మరో అమ్మాయి అటువైపుగా వచ్చింది.

    "ఆ అమ్మాయి బాగానే ఉంది...." అని చిట్టబ్బాయ్ చేతిరుమాలును తీస్కుని ఆ అమ్మాయి వెనకపడ్డాడు.

    నాలుగడుగులు వేసిన తరువాత చేతిరుమాలు ఆ అమ్మాయి వెనక వేసి, "ఏవండీ..." అంటూ పిలిచాడు చిట్టబ్బాయి.
    "ఏమిటి?" అన్నట్లు చూసింది ఆ అమ్మాయి.

    "మీ చేతిరుమాలు పడిపోయింది..." కిందనుండి చేతిరుమాలు తీసి ఆమె వైపు చూస్తూ అన్నాడు.

    ఆ అమ్మాయి చటుక్కున చిట్టబ్బాయి చేతిలోంచి రుమాలు లాక్కుంది.

    "థాంక్సండీ..." అనేసి సీరియస్ గా చిట్టబ్బాయి వంక ఒక చూపు విసిరి అతను మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా చరచరా వెళ్ళిపోయింది ఆ అమ్మాయ్.

    చిట్టబ్బాయ్ తెల్లమొహం వేస్కుని వెనక్కి వచ్చాడు.

    "ఏంటి దేభ్యం మొహం వేస్కుని వచ్చావ్?" కన్నారావు అడిగాడు.

    జరిగింది చెప్పాడు చిట్టబ్బాయి.

    "రుమాలు నాదేనని తీస్కెళ్ళిపోయిందా?... మరి ఇప్పుడెలా?" అన్నాడు కన్నారావు.

    "ఎందుకైనా మంచిదని మూడు రుమాళ్ళు తెచ్చాలే."

    "మంచిపని చేశావ్... అప్పుడప్పుడు నీ బుర్రకూడా పని చేస్తుందన్న మాట! ఊ-ఊ అక్కడెందుకు నిలబడ్తావ్? ఈ చెట్టు చాటుకిరా" అన్నాడు కన్నారావు.

    ఓ రెండు నిముషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఆ దారెంట వెళ్ళారు. వాళ్ళలో ఒక్కరూ చిట్టబ్బాయి కి నచ్చలేదు.

    కొన్ని క్షణాల తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది.

    "ఆ!ఈ అమ్మాయి బాగుంది!" కన్నారావు చెవిలో అన్నాడు చిట్టబ్బాయ్.

    "ఊ! పదమరి" కన్నారావు వీపుమీద చెయ్యి పెట్టి తోస్తూ అన్నాడు.

    చిట్టబ్బాయ్ గబగబా వెళ్ళి ఆ అమ్మాయి వెనక రుమాలు పడవేసి "ఏవండీ" అని పిలిచాడు.

    ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చిట్టబ్బాయ్ వంక చూసింది.

    "మీ చేతిరుమాలు - హిహి - పడిపోయింది" అన్నాడు చిట్టబ్బాయ్.

    "ఆ చేతి రుమాలు మీదేనని, నన్ను పలకరించాలని, నాతో పరిచయం పెంచుకోవాలని మీరే దాన్ని అక్కడ పడవేశారని నాకు తెల్సు!" సూటిగా చిట్టబ్బాయ్  మొహంలోకి చూస్తూ  అంది ఆ అమ్మాయి.

    చిట్టబ్బాయ్ ఉలిక్కిపడి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS