Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 10

    "మీకెలా తెల్సు?" గుటకలు మింగుతూ అడిగాడు.

    "మీరు 'సిలిపి ఎదవ' సినిమా చూడ్లేదా?" అడిగింది ఆమె.

    "లేదు. ఎందుకండీ!"

    "ఆ సినిమా మొన్ననే రిలీజైంది. సంగంలో ఆడ్తుంది. చూడండి. దాంట్లో హీరో ఇలానే చేసి అమ్మాయిల స్నేహం సంపాదిస్తాడు!! వస్తా" చెప్పేసి చకచకా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.

    "ఆ!!-" నోరు తెరుచుకుని నడిరోడ్లో శిలాప్రతిమలా నిలబడిపోయాడు చిట్టబ్బాయ్.
                                   *           *         * 

    సాయంత్రం ఆరు దాటింది. సూర్యుడు అప్పడే అస్తమించాడు. వెలుతురు కాస్త కాస్త తగ్గుతూ మసక మసక చీకట్లు మెల్ల మెల్లగా వ్యాపిస్తున్నాయి.

    అది తార్నాకా ఏరియా, యూనివర్శిటీ క్యాంపస్ ప్రాంతం. చాల ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం.

    కానీ చిట్టబ్బాయ్, కన్నారావు మనసులేమీ ప్రశాంతంగా లేవు. చాల గందరగోళంగా, గజిబిజిగా ఉన్నాయి వాళ్ళ మనసులు.

    "కొంపతీసి నువ్వు నన్ను గట్టిగా ఏమీ కొట్టవుకదా?" చిట్టబ్బాయిని అడిగాడు కన్నారావు!

    చిట్టబ్బాయి అడ్డంగా తల ఊపాడు!

    కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. కన్నారావు, చిట్టబ్బాయి రోడ్డుకి కాస్త దూరంగా ఉన్న మైదానం దగ్గర కొండరాళ్ళవెనకాల నిలబడి రోడ్డువంక దీక్షగా చూస్తున్నారు. అప్పుడూ అప్పుడూ ఒకటి, అరా స్కూటర్లు, సిటీబస్సులు వెళ్తున్నాయి.

    సూర్యుడు అస్తమిస్తే చాలు నిర్మానుష్యమైపోయే ప్రదేశం అది. అక్కడ హత్యలు జరిగాయి! స్టూడెంట్స్ యూనియన్లలో ప్రత్యర్థి వర్గాలు కత్తులతో పొడుచుకున్నారు అక్కడ.

    "నువ్వు నటనలో పూర్తిగా మునిగిపోయి నన్ను నిజంగా కొడ్తేనో?..." కన్నారావు మళ్ళీ సందేహంగా అడిగాడు.

    "అబ్బబ్బ.. కొట్టనని చెప్పానా... ఊర్కే కొట్టినట్టు చేస్తాను..." విసుక్కుంటూ అన్నాడు చిట్టబ్బాయ్.

    "నేనేమో దెబ్బలు తగిలినట్టు కొంపలు మునిగేలా గట్టిగా అరుస్తాను" అన్నాడు కన్నారావు.

    "మరీ గట్టిగా నా గుండెలు అవిసిపోయేలా లేదా అమ్మాయిలు మూర్ఛ పోయేలా అరవకు..."

    ఇద్దరి చూపూ రోడ్డు మీద నిలిచి ఉంది.

    ఆ ముందురోజు చేతిరుమాలు సాయంతో అమ్మాయిల స్నేహం సంపాదించాలని ప్రయత్నించి, కుదరకపోవడంతో చిట్టబ్బాయ్, కన్నారావులు ఇద్దరూ ప్రేమానందం దగ్గరికి అర్జంటుగా వెళ్ళి జరిగిన సంగతి అతనికి చెప్పారు.

    "ఇంతకీ ఆ సినిమా డైరెక్టరు ఎవరు నాయనా?" అని అడిగాడు ప్రేమానందం .

    "బాతు బాలకృష్ణ అట గురూజీ!!" అన్నాడు చిట్టబ్బాయ్.

    "అద్గదీ... అలా చెప్పు!.. వాడు నా శిష్యుడే నాయనా .... వాడికీ నేనే సలహాలిచ్చి ప్రేమ పెళ్ళి జరిపించాను. ఈ చేతి రుమాలు ట్రిక్కు వాడికి కూడా చెప్పాను నాయనా... అయితే ఆ ట్రిక్కు సినిమాలో పెట్టాడన్న మాట! ఇంకేం? అమ్మాయిలందరికీ రుమాలు ట్రిక్కు రహస్యం తెలిసిపోయే ఉంటుంది ఈ పాటికి....

    "అవును గురూజీ... మేము రుమాలు వాళ్ళ వెనకాల వేసి ఏవండీ మీ రుమాలు పడిపోయింది అని వాళ్ళతో అంటే, మాకు ఈ వేషాలు తెల్సు... మీకు తెలీదేమో... కావాలంటే 'సిలిపి ఎదవ' సినిమా చూస్కోండి అని వాళ్ళే చెప్పారు గురూజీ..." అన్నాడు చిట్టబ్బాయ్.

    "ఈ రుమాలు ట్రిక్కు ఇంక పనిచెయ్యదుగానీ మరో మంచి ఉపాయం చెప్పండి గురూజీ.. పాపం మావాడి బాధ చూడలేకుండా ఉన్నాను" అన్నాడు కన్నారావు.

    ప్రేమానందం కొన్ని క్షణాలు కళ్ళు మూస్కుని ఆలోచించి మరో చిట్కా చెప్పాడు.

    అదేమిటంటే కన్నారావు ఏ అమ్మాయి వెంటైనా పడి అల్లరి పెడ్తుంటే చిట్టబ్బాయ్ సమయానికి వచ్చి కన్నారావుని తన్ని ఆ అమ్మాయిని రక్షించినట్టు నటించడం!

    "ఇది చాలా పాత్ర ట్రిక్కు కద గురూజీ?..." నీరు కారిపోతూ అన్నాడు చిట్టబ్బాయ్.

    "పాతదైనా చాల గొప్పదీ, మహత్తరమైనదీ నాయనా... ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని వినలేదా?... పోనీ మొన్న చెప్పాను ఎర్ర పంట్లాం మీదికి ఆకు పచ్చ రంగు షర్టు వేసుకోమని. అలాంటి వెరైటీ ఉపాయం ఏదైనా చెప్పమంటావా నాయనా?..." మందహాసం చేస్తూ అడిగాడు ప్రేమానందం.

    "వద్దు గురూజీ... కొత్త కొత్త ఎక్స్ పెరిమెంట్లు నా మీద చేసి నన్ను ప్రాణపాయానికి గురిచేయకండి గురూజి..." భయం భయంగా చూస్తూ అన్నాడు చిట్టబ్బాయ్.

    "కాబట్టి ఇప్పుడు నేను చెప్పినా పధ్ధతి ఉపయోగించి చూడు నాయనా మంచి ఫలితం ఉంటుంది..."

    "పిండాకూడు మింగే సమయానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటారు.. నువ్విటు వచ్చేదేమైనా ఉందా నాయనా?...
లేకపోతే ఆలశ్యం ఏమైనా ఉందా?..." గిన్నెలు కిందా మీదా ఢమఢమా పడేస్తూ లోపలి నుండి అరిచింది ప్రేమానందం భార్య.

    వెనక్కి చటుక్కున తిరిగి "ఆ...ఆ... వస్తున్నా..." అని చెప్పి వీళ్ళిద్దరివైపు తిరిగాడు ప్రేమానందం.

    "అది నాయనా సంగతి....! మీరు ఆ విధంగా చెయ్యండి..."

    చిట్టబ్బాయ్, కన్నారావులు సరేనన్నట్టు తలలు ఊగించారు.

    "మొదట ఇచ్చిన కన్సల్టేషను ఫీజు తప్ప ఇప్పటిదాకా మీరు ఏమీ ఇవ్వలేదు నాయనా..  ఓ పాతికో... పరకో... హిహి..." అంటూ నవ్వాడు ప్రేమానందం.

    చిట్టబ్బాయ్ పాతికరూపాలు తీసి ప్రేమానందం సలహా ప్రకారం వాళ్లు తార్నాక వచ్చారు.

    ఇప్పుడు కన్నారావు ఎవరైనా అమ్మాయిని పట్టుకుని అల్లరిపెడ్తే చిట్టబ్బాయ్ కన్నారావుని తన్నినట్టు నటించి ఆ అమ్మాయిని రక్షించి, ఆమె స్నేహాన్ని పొంది, ఆనక తీరుబడిగా ప్రేమించు పెళ్ళి చేసుకోవాలి!

    అదీ జరగవలసిన కార్యక్రమం.

    రోడ్డు మీద ఒంటరిగా, తమకు నచ్చిన అమ్మాయి వెళ్తుందేమోనని వాళ్ళు అక్కడ పావుగంట నుండీ ఎదురు చూస్తున్నారు.

    "ఒరేయ్.. చూశావా?... ఒంటరిగా ఒకమ్మాయి ఇటే వస్తుంది" హుషారుగా అన్నాడు  కన్నారావు.

    చిట్టబ్బాయ్ కన్నారావు చూపించిన వైపుకి చూసాడు.కాస్త దూరంలో ఒక అమ్మాయి దిక్కులు చూస్తూ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి వంక పరీక్షగా చూసాడు చిట్టబ్బాయ్.

    "అమ్మాయి బాగానే ఉందిగానీ మేకప్ చాల హెవీగా ఉందేమో!?" మెల్లగా నసుగుతూ అన్నాడు.

    "నీ బొంద!... ఇవి మీ నాయనమ్మ కాలంనాటి రోజులుకావు. మొహానికి పసుపు పెట్టుకుని తలకి బాగా నూనె పట్టించి గట్టిగా జడ వేసుకోడానికి!... ఈ రోజుల్లో మేకప్ చేసుకోని అమ్మాయిలు ఎకడైనా ఉంటారా?... అంతగా నీకు నచ్చకపోతే పెళ్ళయిన తరువాత చెప్తావ్ కాస్త మేకప్ తక్కువ చేస్కోమని... ఏమంటావ్?... వెళ్ళనా మరి??" కళ్ళు ఎగరేస్తూ అడిగాడు కన్నారావు.

    "వెళ్ళు.." గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిట్టబ్బాయ్.

    రమరావు అడుగులు ముందుకు వేసాడు.

    "జాగ్రత్త!...." వెనకనుండి హెచ్చరించాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు వడివడిగా అడుగులు వేస్తూ ఆ అమ్మాయి వెనక్కు చేరాడు.

    ఆ అమ్మాయి ముందు నడుస్తుంది....

    కన్నారావు ఆ అమ్మాయి వెనకాల నడుస్తున్నాడు. అంతవరకూ ధైర్యంగా ఉన్న కన్నారావుకి కాస్త కాస్త భయం వేయసాగింది. అరచేతుల్లో చెమట పట్టింది. కాళ్ళు కాస్త వణకసాగాయ్..
.
     అవును మరి! అతనికిగానీ, చిట్టబ్బాయ్ కి గానీ అలాంటి పనులు అలవాటు లేదుగా!!...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS