Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 8

    "అమాయకుడివి  నాయనా నువ్వు. చేతిరుమాలు నీ దగ్గర ఏ అమ్మాయి అరువు తీస్కుంటుంది నాయనా?...." ప్రేమానందం నవ్వాపుకుంటూ అన్నాడు.

    "మరెందుకు గురూజీ?" అయోమంగా అడిగాడు చిట్టబ్బాయ్.

    "నువ్వు ఆడాళ్ళ చేతిరుమాలు తీస్కెళ్ళి ఆడాళ్ళ కాలేజీకి కాస్త దూరంలో కాపు వెయ్యి నాయనా, కాలేజీ వదిలిన తర్వాత అమ్మాయిలు బయటికి వస్తారు కదా. అప్పుడు నీకు నచ్చిన అమ్మాయి వెనకాల వెళ్ళి జేబు రుమాలు కింద పారేసి 'ఏవండీ....' అని ఆ అమ్మాయిని పిలవాలి నాయనా. అప్పుడు ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది 'మీ రుమాలు కింద పడిపోయింది' అని నువ్వు కింద పడేసిన రుమాలు చూపించాలి నాయనా... ఆ అమ్మాయి 'అది నా రుమాలు కాదండీ...' అంటుంది. 'హయ్యో మీదికాదా? మీదని అనుకున్నానే ఎవర్దో పాపం!... మీరు చాలా బాగున్నారా కదా.... ఇంత అందమైన రుమాలు మీదికాక ఇంకెవరిది అవుతుందిలే...' అంటూ మాటలు కలపాలి నాయనా ఆమెతోబాటు బస్సుస్టాపు దాకా వెళ్ళి ఆమెని బస్సు ఎక్కించాలి నాయనా" అన్నాడు ప్రేమానందం.

    "ఒకవేళ ఆ అమ్మాయి 'ఆ రుమాలు నాదికాదు' అని సీరియస్ గా చెప్పేసి గిరుక్కున తిరిగి రయ్యిమంటూ వెళ్ళిపోతేనో గురూజీ?..." సందేహంగా అడిగాడు చిట్టబ్బాయి.

    "అక్కడే నీ ప్రతిభ కనపరచాలి నాయనా... నేను మీ లాంటి వాళ్ళకి మార్గం చెపితే ఆ మార్గం వెంట నువ్వు నడుచుకుంటూ వెళ్తావో రిక్షాలో వెళ్తావో అది నీ యిష్టం నాయనా."

    "కానీ గురూజీ.. మార్గం నిండా ముళ్ళ పొదలుండి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటే?"

    "ముళ్ళపొదల్ని నరుక్కుంటూ బండరాళ్ళని తొలగిస్తూ మార్గం ఏర్పరచుకోవాలి నాయనా..."

    "అయితే నన్ను చేతి రుమాలుతోబాటు ఓ పెద్ద కత్తి కొనమంటారా గురూజీ?"

    "ఎందుకు నాయనా?" 

    "ముళ్ళ పొదల్ని నరకడానికి..."

    "హా! నాయనా!..." పళ్ళు బిగబట్టి అసహనంగా అన్నాడు ప్రేమానందం.

    "నీకోపట్టాన అర్థమయి చావదుగానీ ఇంటికి పద, నేను ఎక్స్ ప్లెయిన్ చేస్తాను" విసుక్కుంటూ అన్నాడు కన్నారావు.
    "ఏవండోయ్..." లోపల్నుండి ప్రేమానందం భార్య గట్టిగా అరిచింది.

    "నేనిహ వస్తా నాయనా. పిండాకూడికి హిహి... భోజనానికి పిలుస్తూన్నట్టుంది మా ఆవిడ..." లేచి నిలబడ్తూ అన్నాడు ప్రేమానందం.

                                                                       3

    ఆ మర్నాడు...

    అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది.

    వాళ్ళిద్దరూ అక్కడ ఒక పావుగంట నుండి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.

    "కాలేజీ వదిలే టైమైంది ... నువ్వు జేబు రుమాలు నీకూడా తెచ్చుకున్నావ్...

    కదూ?.... అసలే కంగారు మనిషిని" అన్నాడు కన్నారావు.

    "తెచ్చుకున్నా..." చూపులన్నీ కాలేజీమీద ఉంచి సమాధానం చెప్పాడు చిట్టబ్బాయ్.

    "సర్లేగాని ఇలా చెట్టుచాటుకి వచ్చి నిలబడు... అలా కనబడేలా నిలబడొద్దు!!" చిట్టబ్బాయి జబ్బ పట్టుకుని చెట్టుచాటుకి లాగాడు కన్నారావు.

    అక్కడి నుండి ఇద్దరూ నిశ్శబ్దంగా కాలేజీ గేటు వంక చూడసాగారు. ఆ చెట్టు దగ్గరనుండి కాలేజీ రెండు వందల అడుగుల దూరంలో ఉంది.

    అయిదు నిముషాలు నిశ్శబ్దంగా గడిచాయ్.

    ఉన్నట్టుండి చిట్టబ్బాయి 'కెవ్వు'మని అరిచాడు.

    "ఒరేయ్ కన్నా వస్తున్నారు... వస్తున్నారు..." అన్నాడు.

    "ఎవరు? యములాళ్ళా? లేకపోతే ఆ కేకలేమిటి?... కాసేపు నోర్మూసుకుని నిశ్శబ్దంగా ఉండు" కసిరాడు కన్నారావు.
    కాలేజీ గేట్లోంచి అమ్మాయిలు గుంపులు గుంపులుగా వస్తున్నారు.

    వీళ్ళిద్దరూ చెట్టుచాటు నుండి ఆ అమ్మాయిల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ నిల్చున్నారు.

    "వీళ్ళిలా గుంపులు గుంపులుగా వస్తే మనం చేతి రుమాలును ఏ అమ్మాయి వెనక వేస్తాం, ఎవర్ని పిలుస్తాం?" అన్నాడు చిట్టబ్బాయి.

    "కాస్త ఓపిక పడ్తావా?.... ఒంటరిగా వచ్చే అమ్మాయిలు కూడా ఉంటారు. చూస్తుండు" అన్నాడు కన్నారావు.
    కొన్ని క్షణాలు గడిచాయి.

    "కెవ్వ్ వ్..." సంతోషంతో మళ్ళీ గట్టిగా అరిచాడు చిట్టబ్బాయ్.

    "ఎందుకా పిచ్చికేకలు... పీక పిసుకుతా..." విసుక్కుంటూ అన్నాడు కన్నారావు.

    "ఒంటరిగా గేట్లోంచి ఓ అమ్మాయి వస్తుంది... అటు చూడు ..." అన్నాడు చిట్టబ్బాయ్ సంబరంగా.

    కానీ అప్పుడే ఆ వైపుగా వీళ్ళు నక్కిన చెట్టు ముందు నుండి వెళ్తున్న అమ్మాయిలు చిట్టబ్బాయ్ కేక విని తలలు తిప్పి చెట్టువైపు చూశారు. కనేఅ వాళ్ళిద్దరూ మెరుపులా చెట్టుచాటుకు ఆ అమ్మాయిలకి కనబడకుండా నక్కారు.

    "ఎవరోనే... మనల్ని చూసి కెవ్వుమని అరిచి ఆ చెట్టు చాటుకి నక్కారు" అంది ఒకమ్మాయి.

    "ఆడపిల్లల్ని చూసి ఈలవేసే అబ్బాయిల్ని చూశానుగానీ ఇలా పిచ్చి కేక లేసి దాక్కునేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు..." ఇంకో అమ్మాయి అంది.

    "పాపం... మెంటల్ కేసులేమో..." మరో అమ్మాయి అంది.

    అందరూ కిలకిలా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

    "విన్నావుగా? నీ పిచ్చి కేకల్తో మన పరువు తీసేస్తున్నావ్. ఆనందాన్నయినా కంట్రోల్లో పెట్టుకోవాలి!!" కోప్పడ్డాడు కన్నారావు.

    చిట్టబ్బాయ్ బుద్దిగా తలూపాడు.

    ఇందాక గేట్లోంచి ఒంటరిగా వచ్చిన అమ్మాయి ఇప్పుడు సరిగ్గా వీళ్ళు నిల్చున్న చేట్టుముందు నుండి వెళ్తూంది.

    "ఊ...పద" కన్నారావు చిట్టబ్బాయ్ వీపు మీద చెయ్యి పెట్టి తోచాడు.

    "నాకెందుకో కాళ్ళు వణుకుతున్నాయ్ రా..." అన్నాడు చిట్టబ్బాయి మెల్లగా.

    "నీ బొంద. వణక్కుండాచేతుల్తో గట్టిగా పట్టుకో..."

    "చేతుల్తో కాళ్ళని గట్టిగా పట్టుకుని ఎలా నడవాలి?..." చిరాకుగా అడిగాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు నాలుక కొరుక్కున్నాడు.

    "నిజమే కదూ?... అయినా భయమా ఎందుకూ? ఆ అమ్మాయినేమీ ముద్దుపెట్టుకోబోడం లేదుగా... ఈ చేతి రుమాలు మీదేనా అని అడుగుతావ్ అంతేగా?..." అన్నాడు కన్నారావు.

    "చెప్పడానికేం తేలిగ్గానే ఉంటుంది. నువ్వు చెయ్ చూద్దాం అప్పుడు తెలుస్తుంది..."

    "ఏదీ ... చేతిరుమాలు తే... చేసి చూపిస్తాను." చిట్టబ్బాయి చేతి రుమాలు తీసి కన్నారావుకి అందించాడు.

    "ఊ... ఇప్పుడేం చేస్తావో చెయ్. కోతలుకొయ్యడం కాదు" అన్నాడు.

    కన్నారావు చేతి రుమాలు తీస్కుని చరచరా అడుగులు ముందుకు వేశాడు.

    చిట్టబ్బాయి చెట్టుచాటునుండి నోరు తెరుచుకుని చూడసాగాడు.

    కన్నారావు ఆ అమ్మాయి వెనకాల రుమాలు పడేసి "ఏవండి... మిమ్మల్నే..." అన్నాడు.

    ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. ఫరవాలేదు.అమ్మాయి బాగుంది! అనుకున్నాడు  కన్నారావు.

    "మీ చేతి రుమాలు పడిపోయింది..."

    రోడ్డు మీది రుమాలుని చూపిస్తూ చెప్పాడు.

    "అది నాదు కాదండీ...." అంది ఆ అమ్మాయి కళ్ళు తిప్పుతూ.

    "ఓహ్... మీది కాదా?... ఇంత మంచి రుమాలు మీది కాకుండా ఎవరిదై ఉంటుందిలే అనుకున్నాను" అన్నాడు. కన్నారావు వంగి రోడ్డు మీది నుండి ఆ రుమాలుని తీస్తూ.

    "అంటే మంచివాళ్ళు మంచి రుమాళ్ళూ, చెడ్డవాళ్ళు చెడ్డ రుమాళ్ళూ ఉపయోగిస్తుంటారా?" కిలకిలా నవ్వింది ఆ అమ్మాయి.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS