"కావేరి పాషన్ గా వుంటుంది. అలా వుండాలనుకోవటం తప్పు కాదుగా అమ్మా! కొంతమందికి కొన్ని అలవాట్లు వుంటాయి కొంతమందికి బద్దకంతో ఎడ్డిమడ్డిగా వుంటారు. మరికొందరు ఎంతో శుభ్రంగా వుంటారు. అలా శుభ్రంగా అందంగా వుండాలనుకోవటం కావేరి తప్పుకాదుగా అమ్మా? పుస్తకాలు పట్టుకుని నడుస్తుంటే అటుయిటు ఊగినట్లు అనిపించుతుందిగాని!"
"అంటే? నేనన్న మాటలు తప్పు అని ఆ కావేరీని సమర్ధించుకుని వస్తున్నావన్నమాట! కనీసం నేను ఎప్పుడయినా కావేరీని చేసుకుంటేనేగాని వీలులేదని అన్నానా?"
"లేదమ్మా!"
"మరెందుకలా అన్నావు మీ అత్తయ్య మామయ్యతో!"
"కావేరీని చేసుకోవాలని నాకే అనిపించింది. ఎంతో అందమయినది తెలివయినదేను. అన్నయ్య ఎటూ ఉద్యోగం చేస్తూ పట్నంలోనే వుంటాడు. నేను ఒక్కడిని యిక్కడ? మామయ్య అండలేకపోతే వంటరిగా ఎలా లాక్కురాగలను? అందునా మన పల్లెటూర్లు వెనుకటి లాగా లేవు. రాజకీయాలలో ముఠాతగాదాలు చోటుచేసుకుని అండలేనివాడిని అణగత్రొక్కుతుంది!"
ఆలస్యం చేసే తను చెప్పగలిగేమాట తెలీచెప్పలేదేమోనని గబగబా అనేశాడు. తల్లి ఇచ్చే సమాధానం ఏమిటోనని ఎదురుచూడలేకపోయాడు భయంతో! అనేటప్పుడు అల్న్తాడు గాని తీరా అన్న తరువతః తల్లి ఏమన్నా చివాట్లు వేస్తుందేమోనని వణికిపోతాడు వినాయకరావు. ఇప్పుడు అలాగే జరిగింది. మనిషిని చూస్తే ఏమీ తెలియదని అమాయకూడుగా వుంటాడు....మనసులో యిన్ని ఆలోచనలు; భవిష్యత్తుని గురించిన నిర్ణయాలు తీసుకున్న కొడుకుని చూసి ఆశ్చర్యపడింది కామాక్షమ్మ. అసలు కొడుకు ఎప్పుడూ యింతగా మాట్లాడి ఎరుగడు తన ముందు!...తన కంటే ఎక్కువగా ఎదిగిపోయాడనుకుంది కొడుకుని చూసి-
"నాకు కావేరీ అంటే ఎంతో యిష్టం అమ్మా!....ఆస్థులు అంతస్థులు లెక్కవేసుకోకు!....అన్నయ్య చదువుకుంటానంటే నువ్వు కాదనగలిగావా??....అలాగే నేను కావేరీని చేసుకుంటానంటే కూడా నువ్వు కాదనకూడదమ్మా!....కావేరీని తప్ప నేను యింకెవ్వరినీ చేసుకోను!....చేసుకుని సుఖపడలేను కూడాను!" గబగబా అనేసి చెయ్యి కడుక్కునిలేచి బైటికి వెళ్ళిపోయాడు వినాయకరావు తల్లి ముందు వుండలేక! వివర్ణమయిన ఆమె ముఖం చూడలేకనూ!
ఈసారి పూర్తిగా అవాక్కయి పోయింది కామాక్షమ్మ!...వాడన్నదీ నిజమే!....శంకరం తన మాట విన్నాడా? చదువుకుంటానని పేచీపెట్టాడు.....పట్నం వెళ్ళి కూర్చుని డబ్బు పంపమని ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాసేవాడు...అలా తన చదువుకి కనుక డబ్బు పంపకపోతే తనకి వచ్చే ఆస్థిలో వాటా యిచ్చేస్తే అమ్ముకుని చదువుతానని చేటభారతమంత ఉత్తరం వ్రాసేవాడు!...వున్న యిద్దరి కొడుకులనూ పెట్టుకుని భర్తపోయిన తరువాత ఎంత గుట్టుకు లాక్కువచ్చింది.....ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి! తన అన్న పరంధామయ్య కూడా ఎంతో సహాయం చేశాడు ....యివ్వాళ తన అన్న నీ కొడుకునీ కాదనుకుని తను చేయగలిగింది ఏముంటుంది? అంతా పట్టు పట్టబట్టేకదా పెద్దకొడుకు ఆస్తి పంపకాల వరకూ వచ్చాడు??....మగవాడి కళ్ళకి ఆడది ఎంత ఫాషన్ గా కనిపించితే అంతగా వ్యామోహపడతాడు! ఎంత అందమయినదయితే అంత కావాలనుకుంటాడు...తన కొడుకు కావేరీని కావాలనుకోవటంలో అది వాడి తప్పుకాదు! వాడి వయస్సుచేసే అల్లరిలో నిర్ణయించుకున్నది....కానయితే తన అన్న కట్నంగా ఏమీ తాను ఆశించినంతగా ఎక్కువ యిచ్చుకోలేడు!....పార్వతి పెళ్ళికి తొందరపడి మంచి సంబంధమని ఖాయం చేసుకుని లగ్నం పెట్టుకుని వచ్చాడు. తీరా వచ్చిన తరువాత డబ్బు సమకూర్చుకునేటందుకు ఎంతో యాతనపడ్డాడు....వున్న ధాన్యం అంతా అమ్మేశాడు. అప్పు దొరికినంత చేశాడు. అదీ చాలకపోతే తన దగ్గరకు వచ్చి అన్నాడు!
"నువ్వే ఆదుకోవాలి చెల్లెమ్మా!"
తాను యిస్తే తిరిగి రెండు మూడేళ్ళ వరకూ తీర్చలేదు తన అన్న! పోనీ ఏదో ఒక సాకుచెప్పి తప్పించుకుందామంటే ఆడపిల్ల పెళ్ళి! ముహూర్తం యింకా నాలుగు రోజులే వుంది....ఈ లగ్నం తప్పితే ఆడపిల్లకి యింక పెళ్ళికాదు!....పెళ్ళి ఎందుకు తప్పింది? అని కాకుల్లాగా పొడుస్తారు యిరుగు పొరుగు!....ఆరళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకోనూవచ్చును పార్వతి!....తాను మేనత్తయి కూడా ఆదుకోకపోతే లోకం తనను వెలివేసినట్టు చేస్తుంది. ఎంతయినా అన్నగారు! తన మేనకోడలూను!....అనుకుని అప్పుడు తాను యిచ్చింది ఆరువేలు!....అప్పుడు ఆ డబ్బుతో పెళ్ళిచేసి పార్వతిని అత్తవారింటికి పంపాడు తన అన్నగారు! యిచ్చిన ఆరువేలలో యిన్ని సంవత్సరాలకి యింకా తనకే రెండు వేలు బాకీ వున్నాడు. తను అడగలేక పోయింది...ఎలా అడుగుతుంది? రెండు సంవత్సరాల నుంచి వంట సరిగ్గా చేతికిరాక వ్యవసాయంలో నష్టంవస్తే!....
ఇపుడు కావేరీని చేసుకున్నా తనకి బాధ్యతలు పెరుగుతాయి గాని తగ్గవు! అందులో ఒకే ఊరిలోని వాళ్ళం!...అస్తమానూ పుట్టింటికి వెళ్ళి కూర్చుంటుంది....ఆ సినిమాకు వెళ్దాం! ఈ సినిమాకు వెళ్దామని వినాయకాన్ని కూడా వెంటవేసుకుని బయలుదేరుతుంది. దానికసలే సినిమా పిచ్చి! తన కొడుకు నోట్లో నాలిక లేనివాడు! వాడు ఎంత కష్టపడి వ్యవసాయంచేసి సంపాదించినా దీని ఫానన్సుకి సినిమాలకీ సరిపోతుందేమో??....
కామాక్షమ్మ ఆలోచనలు పరిపరివిధాల పరుగెడుతున్నవి. ఎటూ తేల్చుకోలేకపోతున్నది!....ఏ విధమయిన నిర్ణయం తీసుకోలేక పోయింది...
"కావేరీని యిప్పటినుంచే అదుపులో వుంచితే ఎలా వుంటుంది??" అని కూడా అనుకుంది.
ఎలా? అ యింటికి ఈ యింటికి దూరమయ్యే!....ఎక్కువగా యిక్కడికి రానేరాదు!....వచ్చినా నాలుగైదు ఘడియలుకూడా ఎక్కువ సేపు వుండదు!...అయినా తల్లిదండ్రులు శ్రద్దతీసుకుని ఆడపిల్లని అదుపులో వుంచుకోవాలిగాని యిలా సినిమా! సినిమా" అని అడుగగానే తీసుకువెళ్ళాలా??....ఈ సారి తనని రమ్మని కబురు చేసినపుడు రానని చెప్పాలి!...అప్పుదయినా వెళ్ళటం మానివేస్తారేమో చూడాలి!....ఈ సెలవలకి శంకరంవస్తే వాడితో కూడా మాట్లాడి ముందు వాడి పెళ్ళిచేసి ఆ తరువాత వినాయకం పెళ్ళి కూడా చేసేస్తే తన బాధ్యత తగ్గిపోతుంది. తను నిశ్చింతగా వుండటం కంటే కావలసినది ఏమున్నది??....
"కావేరీని చేసుకుంటానమ్మా!..."
అని నోరువిప్పి చెప్పిన వాడిమాట కాదనటం ఎలా? యిప్పుడింత నిండుగాను, ఎలాంటిలోటు లేకుండాను, పదివేలు వెనుక వేసుకో గలిగామంటే యిందంతా తన చిన్నకొడుకు కష్టపడటం వలననే కదా?....అలాంటివాడు నోరువిప్పి అడిగితే కాదనగాలదా??.....ఎలా కాదనగలిగేది? కట్నము ఇవ్వలేకపోయినా తన అన్న!....తన మేనకోడలు! ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే కావేరీకి కూడా సినిమాపిచ్చి ఫాషన్ ల పిచ్చీ పోతుంది!....అని తననుతాను సమర్ధించుకుని ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది కామాక్షమ్మ. యింత తర్క వితర్కం తనలోతానే చేసుకుని!...
4
ఉదయంలేచి పేపర్ పూర్తిగా చదివిన తరువాత కావేరికి నెప్పి తగ్గిందో లేదో? తెలుసుకునేటందుకు మేనమామ గారింటికి వెళ్ళాడు వినాయకరావు.
అప్పటికే స్కూలుకి వెళ్ళేటందుకు తయారవుతున్న కావేరి వినాయకరావు వచ్చింది చూడలేదు.
పమిట జారిపోకుండా జాకెట్టుకి పమిటని కలిపి భుజంమీద పిన్నీసు పెట్టింది....స్నో తీసి ముఖానికి వ్రాసింది...ఆ తరువాత పౌడర్ వ్రాసింది ఒక్క ముఖానికే కాదు: చెవులకి; మెడమీద; కంఠం క్రింద కూడా వ్రాసింది. మిగిలింది పమిటికి తుడిచినట్టు రాసింది. ఆరురకాలు వున్న బొట్టు సీసాలను తిప్పితిప్పి చూసి ఓణీ రంగుకి సరిపడిన రంగుబొట్టు పెట్టుకున్నది తల రేగిందేమోనని దువ్వెనతో పైపైనే దువ్వుకుని వెనుదిరిగి పుస్తకాలు తీసుకుంటూ వుండగా వినాయకరావుని చూసి ముందు ఆశ్చర్యపోయి అంతలోనే నవ్వుని తెచ్చుకుని అంది-
