"సుమిత్రగారు నిద్రపోతున్నారా? ఈ కవరు ఇద్దామని వచ్చాను."
"నా కియ్యి. నేను తరువాత ఆవిడి కిస్తాను." అంటూ కవరుతీసుకున్నాడు. వెంటనే భళ్ళున తలుపు మూసేశాడతను.
అమాయకంగా మేడ మెట్లు దిగింది రమణి. కిందికి దిగాక మళ్ళీ బూట్లు వేసుకుని సైకిలెక్కింది. అయితే, ఆ మేడమీది గదిలోని ఓ రెండు కళ్ళు మాత్రం__ఏడేళ్ళ రమణిని పులి కళ్ళలా కోపంతో చూశాయి. నిప్పులు కక్కుతూ చూశాయి. కానీ ఇవేమీ తెలీని ఆ చిన్నపిల్ల మాత్రం తన దారిని తను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఇందాక తను మాట్లాడింది ఓ హంతకుడితోనన్న విషయం ఆమెకి తెలీదు. అతనెవరో కూడా ఆమెకి తెలీదు.
కాని ఆ హంతకుడికి మాత్రం రమణి ఎవరో, ఎక్కడ ఉంటుందో బాగా తెలుసు. ఆమెని చేజిక్కించుకోవాలంటే ఆ కాలనీ లోని ఏ ఇంటికి వెళ్ళాలో బాగా తెలుసు.
2
సరిగ్గా సాయంకాలం నాలుగు గంటలకల్లా 'ఆంధ్రా టైమ్స్ ఆఫీసులో తనపరిస్థితి ఏమిటో రాజారామ్ కు అర్ధమైపోయింది.
నాలుగు గంటలు కావడానికి ఇంకా కొద్ది నిముషాలు ఉందనగా...కొత్తగా ఎడిటరైన అప్పారావు న్యూస్ డెస్క్ లోకి వచ్చాడు. ఎడా పెడా కంగ్రాచ్యులేషన్స్ అందుకుంటూ ఠీవిగా ఓ కుర్చీలో కూర్చున్నాడు.
"రాజారామ్ గారూ, మీ సుందరి అడ్రస్ తెలిసింది." అంటూ చేతిలో ఉన్న టెలిఫోన్ రిసీవర్ని క్రేడిల్ మీద పెట్టాడు జనార్ధన్.
"చెప్పుమరీ...." అన్నాడు రాజారామ్ కుతూహలంగా.
"అడ్రసంటే మరేం కాదు. ఇప్పుడెక్కడ ఉందో తెలీదు కానీ, గత శనివారం వరకూ ఎక్కడా ఉండేదో తెలిసింది..."
"సరే- అదయినా ఫర్వాలేదు."
"శ్రీ కృష్ణా మాసేజ్ పార్లర్ లో పని చేసేదిట సుందరి."
రాజారామ్ సాలోచనగా టేబిలు మీదున్న సుందరి ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు.
"సుందరి కథ ఫస్ట్ పేజీ బాక్స్ అయిటమ్ గా మారేలా ఉంది సార్....ఎంచేతంటే...." అంటూ ఆగిపోయాడు జనార్ధన్.
'బాక్స్ అయిటమ్ అంటున్నావ్ __ఏమిటది జనార్ధన్? అంటూ లేచాడు అప్పారావు. రాజారామ్ వెనగ్గా నిలబడ్డాడు. అతని కళ్ళు తీక్షణంగా రాజారామ్ చేతిలో ఉన్న ఫోటోని చూస్తున్నాయి.
"సుమిత్ర అనే అమ్మాయి నాతో ఇవాళ మాట్లాడింది. కజిన్ సిస్టరెవరో ఇక్కడ ఉంటే చూడ్డానికి విజయవాడ నుంచి వచ్చింది కాని ఇంతవరకూ ఆ అమ్మాయి యెక్కడ ఉందో తెలీలేదు. ఇదంతా జరిగి అప్పుడే మూడురోజులయింది." అన్నాడు రాజారామ్ పూర్వాపరాలు చెప్తున్నట్టు.
"కాని. అమ్మాయి భలేగా ఉంది కదు సార్?" అన్నాడు జనార్ధన్ తన ధోరణిలో.
"ఓ మైగాడ్?" అన్నాడు అప్పారావు. కొత్తగా ఎడిటరైన అప్పారావు కంఠంలో హఠాత్తుగా ఆవేశం చోటు చేసుకుంది.
"మరీ ఇంత అమాయకత్వం అయితే ఎలాగయ్యా రాజారామ్? ఏది మిస్సింగ్ కేసో, ఏది పబ్లిసిటీ స్టంటో ఆ మాత్రం తెలీకపోతే ఎలా? నేను ఎడిటర్ గా ఉన్నంత కాలం ఇలాంటి పబ్లిసిటీ స్టంటులకి ఆంధ్రాటైమ్స్ లో చోటుండదు." అన్నాడు సీరియస్ గా.
"అదికాదు అప్పారావ్, ఆ అమ్మాయి మిస్సయినట్లు పోలీసు రికార్డుల్లో కూడా ఉంది" అన్నాడు రాజారామ్ సర్ది చెప్తున్నట్టు.
"ఎందుకుండదూ? బ్రహ్మాండంగా ఉంటుంది, మొహం చూడరాదూ...ఎలాంటి చౌకబారు మనిషో అర్ధం కావట్లేదూ? ఆంధ్రా టైమ్స్ లో తన ఫోటో పడడానికి ఎన్నాళ్ళ నుంచో తపస్సు చేస్తూ ఉంది ఉంటుంది. పైగా ఆ కృష్ణా మాసేజ్ పార్లర్ ప్రొప్రయిటర్ కృష్ణారావు సంగతి నీకు తెలీదు. వాడి గురించి పేపర్లో పడడానికి నానాపాట్లూ పడతాడు. మరీ యింత అమాయకత్వమైతే ఎలాగోయ్ రాజారామ్???"
అంటూ సుందరి ఫోటోని అందుకున్నాడు అప్పారావు. మొహం ఎర్రగా కందగడ్డలా అయిపోయింది. తీక్షణంగా చూస్తూ జాగ్రత్తగా ఆ ఫోటోని చైనా చిన్న ముక్కలుగా చింపివేశాడు. ఫోటో ముక్కల్నీ, తళతళ మెరుస్తున్న అప్పారావు వేలి ఉంగరాన్నీ తదేకంగా చూశాడు రాజారామ్.
చేతిలోని ముక్కల్ని కిందపడేసి రాజారామ్ వేపు చూశాడు అప్పారావు.
"రాజారామ్ నీతో కాస్త మాట్లాడాలి. నా గదికి ఒకసారి వస్తావా?" అనేసి చకచక నడుచుకుంటూ వెళ్ళాడు.
జనార్ధన్ ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అప్పుడే ఏదో పని మీద అక్కడికి వచ్చిన ఇద్దరూ ఫ్రూఫ్ రీడర్లూ కొయ్య బొమ్మల్లా నిలబడిపోయారు. పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకోవడానికి రాజారామ్ అతి కష్టంమీద ప్రయత్నించాడు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని, నిగ్రహంతో అప్పారావు గదివేపు వెళ్ళాడు.
"ఇదిగో చూడు రాజారామ్....ఇవేళ మొదటిరోజు కనక నేను కాస్త 'జంపీ' గా ఉన్నాను. మరేం అనుకోకు!" అన్నాడు అప్పారావు ప్రాధేయపడ్తునట్టు.
"నీ బోడి టెక్నిక్ నీ దగ్గర్నే ఉంచుకో! అసలు విషయం చెప్పు" అన్నాడు రాజారామ్.
"టెక్నిక్ ఏమిటి?"
"అదే పబ్లిగ్గా ఇన్సల్ట్ చెయ్యడం ప్రయివేటుగా 'సారీ' అనడం!- ఇదో టెక్నిక్!!"
"సారీ! నిను ఇన్సల్ట్ చెయ్యాలని కాదు. అది నా ఉద్దేశ్యం కాదు. కృష్ణారావు సంగతి నాకు బాగా తెలుసు."
"కావచ్చు. కాని నేను ఇక్కడ అసిస్టెంట్ ఎడిటర్ని. ఇన్చార్జి సిటీ ఎడిటర్ని కూడా. లోకల్ న్యూస్ నా డిపార్ట్ మెంటు. ఏది వెయ్యాలో కూడదో నిర్ణయించేది నేను." అన్నాడు రాజారామ్-ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ.
"అవును నిజమే, కాని ఇది విజయవాడ కాదు. విజయవాడలో నన్నెలా ట్రీట్ చేశావో నేనింకా మరిచిపోలేదు. ఇప్పుడు నేను నీ 'కింద' పని చెయ్యడంలేదు. నువ్వే నా 'కింద' పని చేస్తున్నావు. అండర్ స్టాండ్!?"
