Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 8


    "ఆ మిస్సింగ్ గర్ల్ గురించి ఏమన్నా తెలిసిందా జనార్ధన్?" అన్నాడు.

    "ఇంకా ఏం తెలీలేదు. కానీ, ఆ అమ్మాయి షికారుగా ఎటో వెళ్ళి ఉంటుందనుకుంటున్నారు పోలీసులు".

    "పోనీ గండిపేట...లాంటి చోట్ల చూడమని చెప్పు" అన్నాడు రాజారామ్.

    "అలాగే" అని వెళ్ళిపోయాడు జనార్ధన్.

    "రాజారామ్ గారూ"

    తలెత్తి చూశాడు ఎదురుగా రాజేశ్వరి నిలబడి వుంది మనోహరంగా నవ్వుతూ ఒక్క క్షణం ఆ నవ్వుల మీదతెరలు దించింది. "ఏమనాలో తెలియడం లేదు. కాని ఒక్క మాట అంటాను. జరిగిందాన్ని మనస్సులో పెట్టుకుని విచారించకండి. ఇవాళ కాకపోతే రేపయినా మీకు న్యాయం జరుగుతుంది." అంది.

    రాజారామ్ నవ్వుతూ ఆమెని చూశాడు. "ఓకే" అన్నాడు.

    "మీరెంత సేపూ ఆఫీసులో పనికీ, లేకపోతే ఇంటికీ అంకితమైపోవడం అంత మంచిది కాదండీ, తరచూ బయట షికార్లు చేస్తుండాలి. ఏమంటారు అంది.

    "అలాగే"

    "ఎక్కడ చూసినా రాజకీయాలుంటాయి. తప్పదు. కాని పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మలుచుకునే నేర్పు సంపాదించుకోవాలి."

    రాజారామ్ ఏదో అనబోయి అప్పుడే అక్కడికొచ్చిన ఆఫీస్ బాయ్ ని చూసి ఆగిపోయాడు. జనార్ధన్ కూడా అప్పుడే అటు వచ్చాడు.

    "ఆవిడ మీకోసం చాలాసేపు చూసి చూసి వెళ్ళిపోయిందట సార్. ఈ కవరు మాత్రం మీ కిమ్మని చెప్పింది" అంటూ బాయ్ ఓ కవర్ని రాజారామ్ చేతిలో పెట్టాడు.

    అందులోంచి ఓ ఫోటో జారిపడింది. దాన్ని చూడగానే రాజారామ్ సన్నగా ఈలవేశాడు. రాజేశ్వరి కూడా కుతూహలంగా అటు చూసింది.

    "ఎవరిది" అన్నాడు జనార్ధన్.

    "నేను చెప్పానుగా.... సుందరి అనీ. షి ఈజ్ ద మిస్సింగ్ గర్ల్!"

    ఫోటోలోని సుందరి చాలా సెక్సీగా కన్పిస్తోంది. సినిమాల్లో స్మితలాంటి డ్యాన్సర్లు వేసుకునే బిగుతు దుస్తులు ధరించింది. ఆ దుస్తులు ఆమె శరీరంలోని అంగాలను కప్పడానికి బదులు చాలా మటుకు బహిర్గతం చేస్తున్నాయి.

    ఫోటో వెనుక వేపు చూశాడు.

    "సరేకానీ, జనార్ధన్! ఎవర్నేనా మనిషిని ఈ స్టూడియోకి పంపించి ఆ అమ్మాయి బేక్ గ్రౌండ్ సంపాదించు." అని ఫోటోని అతనికిచ్చాడు రాజారామ్.

    తరువాత తన పనిలో మునిగిపోయాడు. రాజేశ్వరి అతని వేపు సానుభూతిగా ఓసారి చూసి తన సీటు కేసి వెళ్లిపోయింది. రాజారామ్ మళ్ళీ మూడున్నరవరకు తలెత్తలేదు. ఓసారి ఇంటికి ఫోన్ చేసి వంటామె లక్ష్మీకాంతంతో మాట్లాడాడు. సైకిల్తో రమణి బయటికి వెళ్ళిందని చెప్పిందామె. మళ్ళీ తన పనిలో మునిగి పోయాడు రాజారామ్.


                                                                     0    0    0

   
    రమణికి సాయంత్రాలెప్పుడూ చాలా దీర్ఘంగా కనిపిస్తాయి. ఎప్పటికి దొర్లవు నిముషాలు. ఒక్కోక్షణమూ అతిబరువుగా, భారంగా సాగుతూ ఉంటుంది. తండ్రి లేనిదీ ఇంట్లో ఉండాలంటే బలే చిరాకు అన్పిస్తుంది. కథలు చెప్పమని లక్ష్మీకాంతమ్మని వేధిస్తే, ఆవిడ ఒకటో అరో కథ చెప్పి "నాకింకా వంట పని ఉంది తల్లీ, నువ్వు సైకిల్తో కాలనీ అంతా చుట్టి రారాదూ?" అంటుంది.

    విజయనగర్ కాలనీలో వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి. ఒక్క మెయిన్ రోడ్ లో తప్ప___సందుల్లో ట్రాఫిక్ అంతగా ఉండదు. ఎంచక్కా సైకిల్ స్పీడుగా తొక్కవచ్చు....ఆపనే చేస్తోంది రమణి ఇప్పుడు.

    అలసిపోయిన రమణి ఓ చెట్టునీడని సైకిల్ ఆపి బరువుగా ఊపిరి పీల్చుకుంది. అల్లంతదూరంలో ఫాన్సీ కార్నర్ కనబడగానే 'అమ్మయ్య' అనుకుంది నెమ్మదిగా సైకిలు నడిపిస్తూ అక్కడికి వెళ్ళింది. మజాకూల్ డ్రింక్ ఇమ్మని వీరయ్య చేతిలో అయిదు రూపాయల నోటు పెట్టింది.

    వీరయ్య డ్రింక్ ఇస్తూ "రమణమ్మా నాకో చిన్న పని చేసి పెడ్తావా?" అని అడిగాడు.

    "ఓ ఎస్!" అంటూ స్ట్రాని నోట్లో పెట్టుకుంది.

    "మీ ఇంటిదగ్గరే ఉన్న సుమిత్రమ్మ ఇల్లు తెల్సుగా నీకు?"

    "ఎవరూ...ఆవిడా....నాకు కొత్తగా ఫ్రెండయిందీ...మా నాన్నతో మాట్లాడాలనీ....న్యూస్ చెప్పాలనీ అందీ... ఆవిడా?"

    "ఆఁ. ఆవిడే. మీ డాడీతో ఇవాళ మధ్యాహ్నం మాట్లాడిందిలే. ఆవిడ ఈ కవర్ని షాపులో వదిలేసి వెళ్ళి పోయింది. బహుశః మర్చిపోయుంటుందిలే. దీన్ని కాస్త ఆవిడికిచ్చేస్తావా?"

    "ఓ అదెంత పనీ?" అంది ఏడేళ్ళ రమణి ఆరిందాలా.

    డ్రింక్ తాగడం పూర్తి చేశాక ఆ కవర్ ఓ చేత్తో పట్టుకుని సైకిల్ ని నడిపిస్తూ తమ వీధి వేపు నడిచింది.

    సుమిత్ర ఉండే ఇంటి ముందు సైకిల్ని నిలబెట్టి అరుగు మీద కూర్చుంది కొత్త బూట్లు కరుస్తున్నాయి. పాదాలు ఎందుకో మండుతున్నాయి. అంచేత బూట్ లేసులు విప్పి, బూట్లని సైకిలు పక్కని పెట్టింది. సాక్స్ ని అలాగే ఉంచేసి మేడ మెట్లెక్కింది.

    సుమిత్ర ఉండే ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. తలుపు కిందనుంచి కవర్ ని లోపలికి తోసేసి వెళ్ళిపోదామా అనుకుంది. అంతలోనే మనసు మార్చుకొని గుమ్మం మీదున్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కింది.

    ఒక్క నిమిషం!.

    అంతలో తలుపు కొద్దిగా తెరుచుకుంది. "ఎవరిది?" అన్న మగగొంతు మెల్లగా విన్పించింది.

    రమణి అతనివేపు ఓసారి చూసి గది లోపలికి దృష్టి మరల్చింది.  సోఫాలో సుమిత్ర పడుకుని ఉంది. "కాని ఆవిడ ఇప్పుడెందుకు నిద్రపోతూంది చెప్మా అది నిద్రేనా లేకపోతే ఏక్షనా? తలెందుకు అలా కిందపడి ఉందో?" అనుకుంటూ రమణి మళ్ళీ తలెత్తి 'అతని' వేపు చూసింది.

    అతను తలుపు వేసేస్తున్నాడు.

    "ఏమండీ....ఆగండి!" అంది రమణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS