Previous Page Next Page 

    రాజారామ్ మెదడులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. విజయవాడలో అప్పారావు మనస్సు గాయపడడానికి తనేం చేశాడో ఎంతకూ గుర్తు రాలేదు...అయినా అప్పారావు మనసులో ఏముందో అతనికి అర్ధమయింది. 'ఆంధ్రా టైమ్స్' నుంచీ గౌరవంగా తప్పుకోవాలి. రాజీనామా ఉత్తరం నేరుగా డైరెక్టర్ విరించికి పంపాలి....అదే తక్షణ కర్తవ్యం__అనుకుంటూ "సరే అప్పారావ్ అలాగే కాని" అన్నాడు రాజారామ్.

    రాజారామ్ తిన్నగా డెస్క్ రూంలోకి వెళ్ళాడు. ఒక టైప్ రైటర్ దగ్గర కూర్చుని ఓ తెల్ల కాగితాన్ని మెషిన్లోకి ఇన్ సర్ట్ చేశాడు. జాగ్రత్తగా రాజీనామా ఉత్తరం తయారుచేశాడు. తరువాత దానిమీద సంతకం చేసి ఆఫీస్ బాయ్ ని పిలిచాడు.

    "ఈ కాగితం డైరెక్టర్ గారికియ్యి" అన్నాక లేచాడు.

    అతనికి ఎందుకోగాని ఆ క్షణంలో రాజేశ్వరి జ్ఞాపకం వచ్చింది. ఆమె కళ్ళలోకి ఆరాధనాభావం మనస్సులో తళుక్కుమంది. గబ గబ ఆమె సీతువేపు నడిచాడు. రాజారామ్ ని చూస్తూనే ఆమె కుర్చీలోంచి లేచి నిలబడింది.

    "ఈ వార్త ముందుగా మీకే చెప్పాలనిపించింది..." అన్నాడు.

    "అంటే__కొంపతీసి రిజైన్ చేశారా?"

    "అవును" అన్నట్టు తలూపాడు.

    "డెస్క్ రూం లో ఏం జరిగిందో అంతా చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. నేనూ విన్నాన్లెండి. కాని మీరు తొందర పడ్డారేమో..." అంటూ ఆగింది.

    "అదేం కాదు, ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు, అందుకే ఆ పని చేశాను."

    రాజేశ్వరి సూటిగా అతని కళ్ళలోకి చూసింది. 'అంటే అప్పారావుగారికి కావలసింది మీ రాజీనామా! ఆయనకేం కావాలో అది కాస్తా మీరు చేసేశారు." అంది.

    "అదేం కాదు. ఇలాంటి పరిస్థితులతో నేను రాజీ పడలేను. అది నా స్వభావానికి విరుద్దం." అన్నాడు.

    "కానీ, రాజారామ్ గారూ ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం పిచ్చెత్తినట్లు అవుతోంది. మీరు వెళ్ళిపోతే అప్పారావు ఇష్టారాజ్యంగా తయారౌతుంది ఆంధ్రా టైమ్స్! నాకు అప్పారావుగారి సంగతి బాగా తెలుసు. ఆయన విజయవాడలో పనిచేసేటప్పుడు...."అంటూ ఆగింది రాజేశ్వరి.

    ఊఁ , చెప్పండి, ఆగిపోయారేం?"

    "విజయవాడలో ఉన్నప్పుడు డైరెక్టర్ విరించిగారూ, ఆయనా చేసిన ఘనకార్యాలూ, రాసలీలలెన్నో ఉన్నాయి. అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు కదా? మీకవన్నీ తెలియదా?"

    "నేనూ, నా పని తప్ప...మరి దేని మీద నా దృష్టి ఉండేది కాదు."

    "ఇప్పుడు కూడా అంతేగా! ఏమైనా మీరు కొంచెం మారాలండీ..." అంటూ రాజేశ్వరి తియ్యగా నవ్వింది.

    "ప్రయత్నం చేస్తాను. ఎంచేతో నాకు లైఫ్ బోరుకొడ్తోంది" అన్నాడు రాజారామ్ బలవంతాన నవ్వుతూ.

    "మీరు ప్రయత్నం చెయ్యాలి కాని___జీవితంలో ఏ క్షణమూ మిమ్మల్ని బోరు కొట్టదు. మన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది..."

    "చేతల్లో కూడా"

    "అవును మరి" అంటూ రాజేశ్వరి మరోసారి మనోహరంగా నవ్వింది.

    రాజారామ్ మనస్సు తేలిక పడినట్టయింది. గుండె మీదున్న బరువు ఎవరో తీసిపారేసినట్టనిపించింది.
 
    "థాంక్యూ....రాజేశ్వరిగారూ!"

    "ఎందుకు?"

    "మనసులోని బరువును తీసినందుకు."

    "ఓహ్....అందుకా? సరేకాని ఆ 'గారూ' అన్నమాట ఎందుకు చెప్పండి?"

    "ఎందుకా?మీమీద నాకున్న గౌరవాన్ని ప్రకటించడానికి!"

    "మీ గౌరవం నాకొద్దు. ఆమాట వాడడం మానేసి అభిమానం ఎంత ఉందో చూపించండి చాలు!" అంది దగ్గరగా వస్తూ.

    "అలాగే లెండి"

    "అదిగో మళ్లీ..."

    "సరే సరే!" అంటూ రాజారామ్ మళ్లీ డెస్క్ వేపు వెళ్ళాడు. నైట్ షిఫ్ట్ ఇన్చార్జ్ అప్పుడే వచ్చి తన టేబిలు మీది కాగితాలను చూసుకుంటున్నాడు.

    "అబ్రహాం...నేనిప్పుడే రాజీనామా చేశాను."

    "నిజమా సార్?"

    "నిజమే...నాకు నువ్వోపని చేసి పెట్టాలి అబ్రహాం!"

    "చెప్పండి సార్" అంటూ లేచి నిల్చున్నాడు.

    "మరేం లేదు. సుందరి అని మిస్సింగ్ గర్ల్ అయిటమ్ మన జనార్ధన్ నీకు చెప్తాడు. ఫస్ట్ పేజీ బాక్స్ అయిటమ్ గా కాకపోయినా, పేపర్లో ఎక్కడో ఒక చోట ఆ అయిటమ్ వచ్చేలా చూడు!"

    "అలాగే సార్"

    "థాంక్యూ- వెళ్తాను" అంటూ రాజారామ్ మెట్లు దిగాడు.

    'ఆంధ్రా టైమ్స్' ఆఫీసు వదిలి బయటకు వస్తుంటే రాజారామ్ మనస్సు ఒక్కసారి బరువెక్కినట్టయింది.

    'ఆంధ్రా టైమ్స్'లో చేరిఉన తరువాత తను జర్నలిజం లోతుపాతులు తెలుసుకున్నాడు. అక్షరాలచేత గారడీ చేయించడం, మాటల పొందికతో వజ్రాయుధం రూపొందించటం ఇదంతా ఇక్కడే నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ళ అనుభవం మరి...ఒక్కసారిగా హఠాత్తుగా ఆ 'బంధం' లేదనుకుంటే మనసదోలా అయింది.

    తిన్నగా ఇంటి ముందు స్కూటర్ ఆపాడు. ఇంట్లోకి వెళ్ళకుండా సుమిత్ర ఉండే మేడవేపు అడుగులు వేశాడు. అంతలోనే మనసు మార్చుకుని వెనక్కి నడిచాడు.

    "డాడీ!" అన్న పిలుపు విని అటు చూశాడు. రమణి ఉత్సాహంగా సైకిలు తొక్కుతూ వస్తోంది.

    "ఏంటి డాడీ....త్వరగా వచ్చేశావే!"

    "అవునమ్మా...రోజు ఇక ఇలాగే వచ్చేస్తాను."

    "థాంక్యూ నాన్నా....థాంక్యూ"

    "సరేగానీ ఏం చేస్తున్నావు?"

    "సైకిల్తో కాలనీ అంతా తిరిగేస్తున్నా!"
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS