"నా కళంకం సంగతి అడుగుతున్నావా? లేదు, నాకు కళంకం అంటదు. నీ దగ్గరకు నేను రహస్యంగా వచ్చాను. ఈ మాట అని నన్ను నిందిస్తే ఆ నింద నాకు తగలదు.
"ఇదేమిటి పత్తో, ఏడుస్తున్నావా?"
"దేవదాదా! నదిలో ఇంత నీరు నిండి వుంది. ఇంత నీటిలో కూడా నా కళంకాన్ని కడుగుకోలేనా?"
అమాంతంగా దేవదాసు పార్వతి చేతులు రెండూ పట్టుకొని 'పార్వతీ!' అన్నాడు.
పార్వతి దేవదాసు పాదాలమీద తల పెట్టుకొని గద్గద కంఠంతో "ఇక్కడే నాకు కొంచెం స్థానం ఇవ్వు దేవదాదా!" అన్నది.
తరువాత ఇద్దరూ మౌనం వహించారు. దేవదాసు పాదాల మీదుగా ప్రవహించే అనేక అశ్రుకణాలు తెల్లగా వున్న ఆ శయ్యను తడుపుతూ వున్నాయి.
చాలా సేపటి తరువాత దేవదాసు పార్వతి ముఖాన్ని పైకి లేవనెత్తి "పత్తో! నేను తప్ప నీకు మరో ఉపాయం లేదా?" అన్నాడు.
పార్వతి ఇంకేమీ అనలేదు. అదే విధంగా అతడి పాదాల మీద తల వుంచుకొని పడి వుంది. ఆ స్తబ్దతలో కేవలం దీర్ఘమైన నిశ్వాసాలు మాత్రం విడుస్తూ వుంది. 'టన్ టన్' అంటూ గడియారం రెండు గంటలు కొట్టింది. "పత్తో!" అన్నాడు దేవదాసు.
"ఏమిటి" అన్నది పార్వతి రుద్ధ కంఠంతో.
"అమ్మా, నాన్నా బొత్తిగా అంగీకరించడం లేదు_ఈ సంగతి విన్నావా?"
పార్వతి తల ఊపుతూ 'విన్నాను' అన్నది. తరువాత ఇరువురూ మౌనం వహించారు. చాలా సేపటి తరువాత దేవదాసు దీర్ఘమైన నిట్టూర్పు విడిచి 'అయితే మరీ?....' అన్నాడు.
నీళ్ళల్లో మునిగినందు వలన మనిషి ఏ విధంగానైతే నేలను పట్టుకోగలడో, ఇక దాన్ని ఏ విధంగానూ వదలదలచుకోడో సరీగా అదే విధంగా పార్వతి అప్రయత్నంగానే దేవదాసు పాదాలు రెండూ పట్టుకొని వుంది. అతడి ముఖం వైపు చూసి "నేను ఏమీ తెలుసుకోదలచలేదు దేవదాదా!" అన్నది.
"పత్తో! తల్లి దండ్రులను అవమానించుదామా?"
దోషం ఏముందీ?"
"అప్పుడు నీవు ఎక్కడ ఉంటావు?"
"నీ పాదాల దగ్గర!" అన్నది పార్వతి ఏడుస్తూ.
తరువాత ఇద్దరూ స్తబ్దులై కూర్చున్నారు. గడయారంలో నాలుగు గంటలవుతూ వుంది. అది గ్రీష్మకాలపు రాత్రి. త్వరగా తెల్లవారుతుందని తెలుసుకొని దేవదాసు పార్వతి చేయి పట్టుకొని "పద! మీ ఇంటికి పంపించి వస్తాను" అన్నాడు.
"నా వెంట వస్తావా?"
"హాని యేముంది? అవమానం కలిగితే అప్పుడేదయినా ఉపాయమైనా లభిస్తుందేమో!"
"అయితే పద!"
ఇరువురూ నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయారు.
7
మరుసటి రోజు తండ్రికీ దేవదాసుకూ మధ్య కొంచెం సేపు సంభాషణ జరిగింది. "నీవు మొదటినుంచీ నన్ను వేధిస్తూనే వస్తున్నావు. నేను యీ ప్రపంచంలో ఎన్ని రోజులు బ్రతికి వుంటానో అన్ని రోజులు ఈ విధంగానే వేధిస్తూ ఉంటావు. నీ నోటినుంచి ఇటువంటి మాట రావడంలో ఆశ్చర్యమేమీలేదు" అన్నాడు తండ్రి.
దేవదాసు మౌనంగా తల వంచుకొని కూర్చొని వున్నాడు.
"నాకు దీనితో ఏమీ సంబంధం లేదు. మీ అమ్మతో సంప్రదించి ఇష్టం వచ్చినట్లు చేసుకో" అన్నాడు తండ్రి.
ఈ మాట విని దేవదాసు తల్లి "అరె, నాకు యీ గతికూడా వ్రాసి పెట్టి వుందన్న మాట!" అన్నది.
అదే రోజు దేవదాసు పెట్టె, బేడా సర్దుకొని కలకత్తా వెళ్ళి పోయాడు. పార్వతి ఉదాసీనురాలై నీరసంగా నవ్వి మౌనం వహించింది. గతరాత్రి జరిగిన విషయం ఆమె యెవరితోనూ చెప్పలేదు. ప్రొద్దెక్కిన తరువాత మనోరమ వచ్చి కూర్చున్నది. "పత్తో! దేవదాసు వెళ్ళిపోయాడని విన్నాను?" అన్నది.
"అవును."
"అయితే నీవు ఏమి ఉపాయం ఆలోచించావు? అన్నది. ఉపాయం సంగతి ఆమెకే తెలియదు, ఇక ఇతరులతో ఏమి చెప్పగలదు? ఇప్పటికి అనేక రోజుల నుంచి ఆమె వరసగా అదే విషయం ఆలోచిస్తూ వున్నది. ఆశ యెంతో, నిరాశ యెంతో ఏ విధంగానూ ఆమె స్థిరపరచుకోలేక పోయింది. ఎప్పుడయితే మనిషి ఇటువంటి దుఃఖపు సమయంలో ఆశ_నిరాశల అంచులు చూడకపోతే అతడి దుర్భర హృదయం అమితమయిన భయంతో ఆశ అంచునే పట్టుకుంటుంది. దేనిలోనయితే ఆ వ్యక్తికి శుభం వుంటుందో ఆ విషయాన్నే ఆశిస్తూ వుంటాడు. ఇష్టంతోగానీ, అయిష్టంతో గానే అటువైపే నిత్యం ఆసక్తితో చూస్తూ వుంటాడు. పార్వతికి యీ స్థితిలో నిన్నరాత్రి జరిగిన సంఘటన కారణంగా నిశ్చితంగా ఆమె మనోరధం విఫలం కాదనే పూర్తిగా ఆశ వున్నది. విఫలమయినప్పుడు ఆమె గతి ఏమవుతుందో అది ఆమె ఆలోచనకు అతీతమయిన విషయం. అంచేతనే దేవదాసు తిరిగి వస్తాడని ఆమె భావిస్తుంది. మళ్ళీ నన్ను పిలిచి "పత్తో! నిన్ను నా శక్తి వున్నంత వరకూ యితరుల చేతిలోనికి పోనివ్వను" అని చెపుతాడనుకున్నది. అయితే రెండురోజుల తరువాత పార్వతి యీ దిగువ ఉదాహరించిన ఉత్తరం అందుకున్నది.
"పార్వతీ, ఇప్పటికి రెండు రోజుల నుంచి నీ విషయాలే నిరంతరం ఆలోచిస్తున్నాను. నీతో నా పెళ్ళి జరగడం అమ్మకూ, నాన్నకూ ఎవరికీ యిష్టంలేదు. నిన్ను సుఖ పెట్టడం కోసం వాళ్ళకు అమితమయిన వేదనను కలిగించవలసి వస్తుంది. అది నాకు సాధ్యం కాదు. అంచేత వాళ్ళకు విరుద్ధంగా యీ పని ఎలా చేయగలను? బహుశా ఇక ముందు నీకు ఉత్తరం వ్రాయలేను. అంచేత యీ ఉత్తరంలో అన్ని విషయాలూ స్పష్టంగా వ్రాస్తున్నాను. నీ వంశం హీనమైనదనీ, కన్యను అమ్ముకొనేదనీ, కన్యను కొనుక్కొనేదనీ అటువంటి వంశం వాళ్ళ ఇంటి పిల్లను అమ్మ ఏ విధంగానూ తన ఇంటికి కోడలుగా తెచ్చుకొనడానికి ఇష్టపడటం లేదు. పైగా మా ఇంటి ప్రక్కనే మీ యిల్లు వుండటం కూడా వాళ్ళ ఉద్దేశ్యం ప్రకారం మంచిది కాదు. ఇక నాన్నగారి విషయమంటావా, అదంతా నీకు తెలిసే వుంది. ఆనాటి రాత్రి సంభవించిన విషయం తలపుకొస్తుంటే నాకు చాలా దుఃఖం కలుగుతూ వుంది. నీవంటి ఆత్మాభిమానం కలిగినటువంటి బాలిక ఎంత వ్యధ అనుభవిస్తే ఆ పని చేసి వుంటుందో నాకు బాగా తెలుసు.
మరో విషయం వుంది. నిన్ను నేను ఎప్పుడైనా ప్రేమించానా అనే విషయం నా మదిలో మెదలడం లేదు. ఇప్పుడు కూడా నీకోసం నా హృదయంలో అపరిమితమైన దుఃఖం ఏమీలేదు. కేవలం నీవు నాకోసం కష్టాలు అనుభవిస్తున్నావనే నాకు దుఃఖంగా వుంది. నన్ను మరచి పోవడానికి ప్రయత్నించు. అలా మరచిపోవడంలో నీవు సఫలత పొందగలవని నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను.
__దేవదాసు"
దేవదాసు ఉత్తరం లెటర్ బాక్స్ లో వేయనంతవరకూ కేవలం ఒకే విషయం ఆలోచిస్తూ వున్నాడు. కాని ఉత్తరం పోస్ట్ చేసిన తరువాత రెండో విషయం ఆలోచిస్తూ వున్నాడు. చేతిలోని రాయి విసిరేసి రెప్ప వాల్చకుండా అటువైపే చూస్తూ వున్నాడు. ఏదో అనిష్టం కలుగుతుందనే భయం అతడి మనసులో నెమ్మదిగా పెరిగిపోతూ వుంది. యీ విసిరినరాయి పోయి ఆమె తలకు ఎలా తగులుతుందా అని ఆలోచిస్తున్నాడు. ఏం, తీవ్రంగా తగులుతుందా? ప్రాణాలతో బ్రతుకుతుంది గదా....? ఆ రాత్రి నా పాదాలమీద తల పెట్టుకుని ఆమె ఎంతగానో యేడ్చింది. పోస్ట్ ఆఫీస్ నుండి మెస్ కు తిరిగి వచ్చేటప్పుడు దారిలో అడుగడుగుకూ దేవదాసు మనసులో యీ భావమే చెలరేగుతూ వుంది. యీ చేసిన పని బాగాలేదా? అన్నిటి కన్నా, గొప్ప విషయం ఏమిటంటే పార్వతిలో ఏమీ దోషం లేనప్పుడు తల్లిదండ్రులు ఎందుకు నిషేధిస్తున్నారు? అని ఆలోచిస్తున్నాడు.వయసు పెరగడంతో పాటు కలకత్తా నివాసం ద్వారా అతడు ఒక విషయం నేర్చుకున్నాడు. అదేమిటంటే కేవలం జనానికి చూపించడం కోసం కుల గౌరవం మీద, మరో క్షుద్రమైన ఉద్దేశ్యం మీద ఆధారపడి వ్యర్ధంగా ఒక నిండు ప్రాణాన్ని నాశనం చేయడం ఉచితమైన పనికాదు. ఒకవేళ పార్వతి తన హృదయ జ్వాలలను శాంతింపచేసుకోవడం కోసం ఏ ప్రవాహంలోనైనా మునిగి ప్రాణాలు తీసుకుంటే ఆ విశ్వేశ్వరుని పాదంలో ఈ మహాపాతకం ఓ నల్లని మచ్చగా నిలిచిపోదా?
మెస్ లోకి వచ్చి దేవదాసు తన మంచంమీద పడివున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక మెస్ లో వుంటున్నాడు. అనేక రోజుల క్రిందటే మేనమామ ఇల్లు వదిలేశాడు....అక్కడ ఆయనకు కొన్ని అసౌకర్యాలు వుంటున్నాయి. ఇక్కడ దేవదాసు వుంటున్న గదికి ప్రక్కగదిలో చున్నీలాల్ అనే యువకుడు ఇప్పటికి తొమ్మిది సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు. ఆయనగారి దీర్ఘకాలపు ఈ కలకత్తా నివాసం బి.ఏ. పరీక్ష ప్యాస్ కావడం కోసం. కాని ఇప్పటికీ మనోరధం సఫలం కాలేదు. ఈ మాటే అంటూ అతడు ఇప్పుడుకూడా ఇక్కడే వుంటున్నాడు. చున్నీలాల్ తన నిత్యకృత్య మైన సాయంకాలపు షికారు కోసం బయటికి బయలుదేరాడు. ఇతరులు కూడా ఇంకా రాలేదు. నౌకరు దీపం వెలిగించి వెళ్ళిపోయాడు. దేవదాసు తలుపు వేసుకుని నిద్రపోయాడు.
ఒక్కొక్కరే వస్తూ క్రమంగా అంతా తిరిగి వచ్చారు. భోజనం చేసేటప్పుడు దేవదాసును పిలిచారు. కాని ఆయన లేవలేదు. చున్నీలాల్ ఏ రోజు కూడా రాత్రిపూట వసతి భవనానికి తిరిగి రాలేదు. అలాగే ఈ రోజు కూడా తిరిగి రాలేదు.
రాత్రి ఒంటిగంట అయింది. వసతి భవనంలో దేవదాసు తప్ప ఎవరూ మేల్కొని వుండరు. చున్నీలాల్ వసతి భవనానికి తిరిగి వచ్చి దేవదాసు గది ముందు నిలబడి చూశాడు. తలుపు వేసేవుంది. కాని దీపం మాత్రం వెలుగుతూ వుంది. పిలిచాడు__
