Previous Page Next Page 
దేవదాసు పేజి 8

    "స్థిరపడటం, స్థిరపడక పోవటం అంటూ ఇక్కడేమీ జరగలేదు."
    "పత్తో, నీవు చెప్పేదేమిటో నాకేమీ అర్ధం కావడం లేదు" అన్నది మనోరమ వ్యధపడుతూ.
    "అయితే దేవదాసును అడిగి నేను నీకు వివరిస్తాను" అన్నది పార్వతి.
    "అతడు నిన్ను పెళ్ళి చేసుకుంటాడో లేదో అని అడుగుతావా?"
    "అవును, అదే అడుగుతాను." అన్నది పార్వతి తల ఊపుతూ.
    మనోరమ ఆశ్చర్యంతో "ఏం చేపుతున్నావే పత్తో, నీవు స్వయంగా అడుగుతావా?" అన్నది.
    "ఇందులో తప్పేముంది?" అన్నది.
    మనోరమ అవాక్కయి పోయింది. "ఏమంటున్నావు? స్వయంగానే?"
    "అవును, స్వయంగానే. లేకపోతే ఇంకా నా తరపున ఎవరు అడుగుతారు?"
    "నీకు సిగ్గు వేయదా?"
    "ఎందుకు సిగ్గు వేస్తుంది? నీతో చెప్పడానికి నేనేం సిగ్గుపడ్డానా?"
    "నేను స్త్రీని, నీ స్నేహితురాలిని. కాని అతడు పురుషుడు, పత్తో!"
    పార్వతి ఫక్కున నవ్వింది. "నీవు స్నేహితురలివి. నీవు ఆత్మీయురాలివి. కాని ఆయనేం పరాయివాడా? నీతో చెప్పగలిగినదాన్ని, ఆ విషయాన్నే ఆయనతో చెప్పలేనా?" అన్నది.
    మనోరమ అవాక్కయిపోయి ఆమె ముఖం వైపు చూస్తూ వుంది.
    పార్వతి నవ్వుతూ 'మనో అక్కా, నీవు ఊరకనే నుదుట సింధూరము పెట్టుకున్నావు. భర్త అని ఎవరిని అంటారో కూడా నీకు తెలియదు. ఆయన నా భర్త కాకపోయినా నా సిగ్గుకు భర్త, నా సౌభాగ్యానికి భర్త. ఆయన అలా చేయకముందే నేను చచ్చిపోనా! దీన్ని వదిలేసెయ్. చావడానికి సిద్దపడుతున్న వాళ్ళు విషం చేదుగా వుంటుందా, తియ్యగా వుంటుందా అని చూస్తారా? ఆయన దగ్గర నాకు చాటు ఏమీ లేదు" అన్నది.
    మనోరమ ఆమె ముఖం వైపే చూస్తూ వుంది. కొంచెం సేపటి తరువాత ఆయనతో ఏమంటావు? నాకు మీ పాదాల దగ్గర స్థానమివ్వమంటావా?" అని అడిగింది.
    "సరీగ్గా అదే అంటానక్కా!" అన్నది పార్వతి తల వూపుతూ.
    "ఆయన స్థానం ఇవ్వకపోతే?'
    ఈసారి పార్వతి కొంచెం సేపటిదాకా మౌనం వహించింది. తరువాత "ఆ సమయానికి నా నోట ఏ మాట వస్తుందో తెలియదు" అన్నది.
    ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మనోరమ లోలోపల ఆలోచిస్తూ వుంది__"పార్వతి సాహసం ధన్యమైనది. పార్వతి ఆత్మబలం ధన్యమైనది. నేను మాత్రం చచ్చినా ఈ మాట నా నోటితో ఎన్నడూ అనలేను."
    ఆ మాట అక్షరాలా నిజం. అందుకే పార్వతి, మనోరమతో "నుదుట సింధూరమూ, చేతులకు గాజులూ ధరించడం వ్యర్ధం" అన్నది.
                                  6
    రాత్రిపూట దాదాపు ఒంటిగంట కావస్తున్నది. అప్పుడు కూడా మసక వెన్నెల ఆకాశాన్ని అంటిపెట్టుకొనే వుంది. పార్వతి ఆపాదమస్తకము ఒంటినిండా దుప్పటి కప్పుకొని పిల్లి అడుగులు వేసుకుంటూ మెల్లగా మెట్లమీదుగా క్రిందికి దిగి వచ్చింది. కళ్ళు తెరిచి నలువైపులా చూసింది. ఎవ్వరూ మెలకువతో లేరు. ఆ తరువాత తలుపు తీసికొని నిశ్శబ్దంగా ఉన్న దారిలోకి వచ్చి నిలబడిపోయింది. పల్లెటూరి బాట కదా, పూర్తిగా స్తబ్దంగా, నిర్మానుష్యంగా వుంది. ఎవరైనా ఎదురుపడతారనే భయం కలగలేదు. ఆమె యే అవరోధమూ లేకుండా జమీందారుగారి భవంతి ఎదటికొచ్చి నిలబడింది. దేవిడీ దగ్గర వృద్ధుడైన కాపలాదారు కృష్ణసింహ్ మంచం వాల్చుకొని తులసీ రామాయణం చదువుతూ వున్నాడు. పార్వతి ప్రవేశించడం చూసి అతడు కళ్ళు వాల్చుకునే "ఎవరూ?" అని ప్రశ్నించాడు.
    "నేను" అన్నది పార్వతి.
    ఎవరో ఆడమనిషి అనుకున్నాడు కాపలా జవాను. దాసీ యేమోనని భావించి మళ్ళీ ఏమీ ప్రశ్నించలేదు. పాడుకుంటూ రామాయణం పాఠిస్తూ వున్నాడు. పార్వతి లోపలికి వెళ్ళిపోయింది. వేసవి కాలం కావడంచేత బయట వరండాలో అనేకమంది నౌకర్లు నిద్రిస్తూ వున్నారు. వాళ్ళల్లో సగం మంది గాఢ నిద్రలో వున్నారు. ఎంతోమంది సగం నిద్రబోతూ సగం మేలుకొంటూ వున్నారు. నిద్ర మగతలో ఒకడూ అరా పార్వతి వెళ్ళడము చూశారు. కాని దాసీ అనుకొని ఎవరూ అడ్డగించలేదు. పార్వతి నిర్విఘ్నంగా మెట్లమీదుగా పైనున్న గదిలోకి వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో ప్రతి గదీ, ప్రతి మూలా పార్వతికి తెలిసే వుంది. దేవదాసు గదిని గుర్తించడంలో ఆమెకేమీ అవరోధం కలగలేదు. తలుపు తెరిచే వుంది. లోపల ఒక దీపం వెలుగుతూ వుంది. పార్వతి లోపలికి వచ్చి చూసింది. దేవదాసు ప్రక్కమీద నిద్రిస్తూ వున్నాడు. తలవైపున ఆ సమయంలో కూడా పుస్తకం తెరచి పడి వుంది. దానిని బట్టి అతడు ఇంతకు ముందే నిద్రబోయినట్లుగా బోధపడుతూ వుంది. దీపం వత్తిని కొంచెం పెద్దది చేసి ఆమె నిశ్శబ్దంగా దేవదాసు పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నది. కేవలం గోడకు వ్రేలాడుతున్న గడియారం మాత్రం "టక్ టక్" అని ధ్వనిస్తూ వుంది. అది మినహా అంతా నిశ్శబ్దంగా నిద్రపోతూ వున్నారు. అంతటా నిశ్శబ్దం వ్యాపించింది. పాదాలపైన చేయి వేసి పార్వతి నెమ్మదిగా "దేవదాదా" అన్నది.
    దేవదాసు నిద్రమగతలో ఎవరో తనను పిలుస్తున్నట్లు విన్నాడు. అతడు ఆ నిద్రలోనే వుండి కళ్ళు తెరవకుండానే "ఊ" అన్నాడు.
    "దేవదాదా!"
    ఈసారి దేవదాసు కళ్ళు మూసుకునే లేచి కూర్చున్నాడు. పార్వతి ముఖానికి ముసుగులేదు. ఇంట్లో దీపం తీవ్రమైన కాంతితో వెలుగుతూ వుంది. దేవదాసు సహజంగానే గుర్తుపట్టాడు. అయినా మొదట అతడికి విశ్వాసం కలగలేదు. ఇదేమిటి పత్తో?" అని అడిగాడు.   
    దేవదాసు గడియారం వైపు చూశాడు. విస్మయం మీద విస్మయం పెరుగుతూ పోయింది__"ఇంత రాత్రిపూట."
    పార్వతి ఏమీ జవాబుచెప్పలేదు. ఆమె ముఖం వాల్చుకొని కూర్చున్నది. దేవదాసు మళ్ళీ ప్రశ్నించాడు_ "ఇంత రాత్రిపూట ఇంటి నుంచి ఒంటరిగానే వచ్చావా?"
    "అవును!" అన్నది పార్వతి.
    దేవదాసు ఉద్విగ్నుడై పోయాడు. భయ సందేహాలతో కంపించి పోయాడు. శరీరం గగుర్పొడిచింది_"ఏం? దారిలో భయం కూడా వేయలేదా?" అని అడిగాడు.
    పార్వతి తియ్యగా నవ్వింది_"నాకు భూతం భయం వుండదు గదా!
    "భూతానికి భయపడవనుకో, మనిషికి భయపడతావుగదా, ఎందుకొచ్చావు?"
    పార్వతి ఏమీ జవాబు చెప్పలేదు. "ఈ సమయంలో నాకు మనిషి భయం కూడా లేదు" అని మనసులో అనుకున్నది.
    "ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎవరూ చూడలేదా?"    "కాపలా జవాను చూశాడు."
    దేవదాసు బాగా కళ్ళు తెరచి చూశాడు. "కాపలా జవాను చూశాడా? ఇంకెవరూ?" అన్నాడు.
    వరండాలో నౌకర్లు నిద్రిస్తూ వున్నారు. బహుశా వాళ్ళల్లో ఎవరైనా చూసి వుండవచ్చు."
    దేవదాసు ప్రక్క మీద నుంచి దుమికి తలుపు తీశాడు. "ఎవరైనా గుర్తుపట్టారు కూడానా?" అన్నాడు. పార్వతి ఏమీ ఉత్కంఠతను వెల్లడించలేదు. సహజ భావంతోనే సమాధానమిచ్చింది_వాళ్ళందరికీ నేను తెలిసిన దాన్నే గదా! బహుశా ఎవరైనా గుర్తుపట్టారేమో!
    "ఏమంటున్నావు? ఇటువంటి పని ఎందుకు చేశావు పత్తో?"
    "ఇది నీవు ఎలా అర్ధం చేసుకోగలవు?" అని పార్వతి లోలోపల అనుకొన్నది. కాని పైకి ఏమీ అనలేదు. తల వంచుకొని కూర్చున్నది.
    "ఇంత రాత్రిపూట_ఛీ!ఛీ! రేపు నీవు ఎలా ముఖం చూపించగలవు?"
    "ఆ సాహసం నాలో వుంది" అన్నది పార్వతి తల వంచుకొని.
    దేవదాసు కోపించలేదు. అయితే చాలా ఉత్కంఠతో_ఛీ!....ఇంకా నీవు చిన్నపిల్లవే ననుకుంటున్నావా? ఇక్కడకు ఈ విధంగా వస్తుంటే నీకు కొంచెం కూడా సిగ్గు వేయలేదా?"
    "ఏమీ వెయ్యలేదు" అన్నది పార్వతి తల వూపుతూ.
    "రేపు సిగ్గుతో నీ తల వాలిపోదూ?"
    ఈ ప్రశ్న విని   పార్వతి తీవ్రంగానూ, జాలిగానూ దేవదాసు ముఖం వైపు కొన్ని క్షణాలపాటు చూసి నిస్సంకోచంగా అన్నది_"నీవు నా సిగ్గునంతటినీ బాగా కనిపెట్టగలవని నాకు తెలియకపోతే అప్పుడు తల వాలిపోతుంది.
    దేవదాసు విస్మయంతో, నిశ్చేష్టుడయి_"నేను! కాని నేను మాత్రం ఎలా ముఖం చూపించగలను?"
    పార్వతి అదే మాదిరిగా దృఢంగా అన్నది_"నీవా? నీకు ఏమవుతుంది దేవదాదా? కొంచెం సేపు మౌనంగా వున్న తరువాత ఆమె అన్నది_నీవు పురుషుడవు! ఈ రోజు కాకపోయినా రేపైనా నీ కళంకం విషయం అందరూ తప్పకుండా మరచిపోతారు. ఎప్పుడు, ఏ రాత్రి దృష్టవంతురాలైన పార్వతి అంతా తుచ్చమని భావించి నీ పాదధూళిలో లీనమైపోవడానికి వచ్చిందనే విషయం రెండు రోజుల తరువాత జ్ఞాపకం కూడా వుండదు."
    "ఇదేమిటి పత్తో?"
    "మరి నేనో?"
    "మరి నీవో?" అన్నాడు దేవదాసు మంత్రముగ్ధుడై.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS