"దేవదాస్, ఇంకా మేల్కొనే వున్నావా యేం?"
దేవదాసు లోపలనుంచి "మేల్కొనే వున్నాను. నీవు ఈ రోజు ఈ సమయంలో ఎలా తిరిగొచ్చావు?" అన్నాడు.
"చున్నీలాల్ కొంచెం నవ్వుతూ "అవును, ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటి తరువాత మళ్ళీ తిరిగి వచ్చి_"దేవదాస్, ఓసారి తలుపు తీయగలవా?" అన్నాడు.
"ఎందుకు తీయను?
"నీ దగ్గర పొగాకు యేర్పాటు వుందా?"
"అవును, వుంది" అని చెప్పి దేవదాసు తలుపు తెరిచాడు.
చున్నీలాల్ పొగాకు నింపుకుంటూ "దేవదాస్, ఇప్పటిదాకా ఎందుకు మేల్కొని వుంటావ్?" అన్నాడు.
"ఏం? రోజూ నిద్ర వస్తుందా?"
"రావడం లేదా?" అని కొంచెం పరిహాసంగా "నీ లాంటి మంచి కుర్రవాడు అర్దరాత్రి ముఖం ఎప్పుడూ చూచి వుండడూ అని ఈనాటి వరకూ అనుకుంటూ వుండేవాణ్ని. కాని ఈ రోజు ఓ కొత్త బోధ లభ్యమయింది" అన్నాడు.
దేవదాసు ఏమీ అనలేదు. చున్నీలాల్ పొగ త్రాగుతూ "నీవు ఈ సారి ఇక్కడకు వచ్చినప్పటినుంచీ నీ ఆరోగ్యం బాగా వుండటం లేదు. నీకు వున్న దుఃఖం ఏమిటి?" అన్నాడు.
దేవదాసు అన్యమనస్కుడై వున్నాడు. ఆయన ఏమీ జవాబివ్వలేదు.
"ఆరోగ్యం బాగాలేదా?"
దేవదాసు హఠాత్తుగా ప్రక్కమీది నుంచి లేచి కూర్చున్నాడు. వాక్యులంగా అతడి ముఖంవైపు చూసి.... "సరే చున్నీబాబూ, నీ హృదయములో ఏ విషయంలోనూ దుఃఖం లేదా?" అన్నాడు.
"చున్నీలాల్ నవ్వి "ఏమీ లేదు" అన్నాడు.
"నీ జీవితంలో ఎన్నడూ దుఃఖం అనేది కలగలేదా?"
"ఈ విషయం ఎందుకు అడుగుతున్నావు?"
"నాకు వినాలనే అభిలాష వుంది."
"అలా అయితే ఎప్పుడైనా మరో రోజు విను."
"సరే చున్నీ, నీవు రాత్రంతా ఎక్కడుంటావు?" అడిగాడు దేవదాసు.
"తెలుసు కాని బాగా తెలియదు."
చున్నీలాల్ ముఖం ఉత్సాహంతో వెలిగిపోయింది. ఈ ఆలోచనల్లో మరేమైనా వున్నా లేకపోయినా ఒక మూల సిగ్గు అనేది దాగివుంది. దీర్ఘకాలపు అభ్యాసం వల్ల ఆ కొంచెం కూడా తొలగిపోయింది. కుతూహలంగా కళ్ళు మూసుకుని "దేవదాస్ ఒకవేళ బాగా తెలుసుకో దలచుకుంటే సరీగా నాలాగే తయారు కావలసి వస్తుంది. రేపు నా వెంట వస్తావా?" అన్నాడు.
దేవదాసు కొంచెం సేపు ఆలోచించి "అక్కడ బాగా మనస్సుకు వినోదం లభిస్తుందని విన్నాను. ఇది నిజమేనా?" అన్నాడు.
"అక్షరాలా నిజం!"
"అలా అయితే నన్ను ఓసారి తీసుకొని వెళ్ళు. నేను కూడా వస్తాను!"
రెండవరోజు సాయంత్రం చున్నీలాల్ దేవదాసు గదిలోకి వచ్చి చూశాడు. ఆయన పెట్టే బేడా అన్నీ సర్దుకొని కట్టగట్టుకొంటున్నాడు. ఆశ్చర్యపోయి "ఏం రావడం లేదా?" అన్నాడు.
దేవదాసు ఏ వైపుకూ చూడకుండా "అవును, వస్తాను" అన్నాడు.
"అయితే ఇదంతా ఏమిటీ?"
"అదే, వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను" అన్నాడు.
చున్నీలాల్ కొంచెం నవ్వి ఆలోచించాడు. "మంచి యేర్పాటే! ఏమిటి ఇల్లు వాకిలీ అంతా తెచ్చి అక్కడ పెడతావా?" అన్నాడు.
"అయితే ఎవరి దగ్గర వదిలిపెట్టి వచ్చేది?"
చున్నీలాల్ కేమీ అర్ధం కాలేదు. "నేను నా వస్తువులు ఎవరి దగ్గర వదిలి పెడుతున్నాను? అన్నీ ఈ వసతి భవనంలోనే పడి వుంటున్నాయి" అన్నాడు.
దేవదాసు హఠాత్తుగా తెలివి తెచ్చుకొని కళ్ళు పైకెత్తాడు. సిగ్గుపడి "చున్నీ బాబూ, ఈ రోజు నేను ఇంటికి వెళుతున్నాను" అన్నాడు.
"ఇదేమిటి? ఎందుకు? ఎప్పుడొస్తావు?"
"ఇక నేను తిరిగి రాను" అన్నాడు దేవదాసు తల వూపుతూ.
విస్తుబోయి చున్నీలాల్ అతడి ముఖం వైపే చూస్తూ వున్నాడు.
"ఈ డబ్బు తీసుకో! నేను ఎవరికైనా, ఏమైనా ఇవ్వవలసి వుంటే అవన్నీ ఇచ్చేసెయ్. ఏమయినా మిగిలితే పనివాళ్ళకు పంచిపెట్టు. ఇహ నేను మళ్ళీ ఎన్నడూ కలకత్తాకు తిరిగి రాను" అన్నాడు దేవదాసు.
"కలకత్తాకు రావడం వలన నాకు చాలా ఖర్చయింది" అని దేవదాసు లోలోపల అనుకుంటూ వున్నాడు.
ఈనాడు అతని దృష్టి యౌవనపు పొగమంచు తెరను కప్పుకొని వున్న అంధకారపు పొరను చీల్చుకొని పోగలిగింది. అదే, ఆ ప్రచండమైన, ప్రబలమైన, కిశోరావస్థలో వున్న, అయాచితంగా వచ్చిన ఆ రత్నం కాళ్ళ క్రింద నలగద్రొక్క బడిన ఆ రత్నం కలకత్తా మహానగర మంతటితో పోల్చిచూస్తే చాలా గొప్పదిగానూ, చాల విలువైనదిగానూ కన్పిస్తూ వుంది. చున్నీలాల్ ముఖం వైపు చూసి అన్నాడు_"చున్నీ! విద్య, బుద్ధి, జ్ఞానం, బోధ, వికాసం మొదలైనవన్నీ సుఖం కోసమే వున్నాయి. నీవు కోరిన పద్ధతిలో చూడు, తమ సౌఖ్యాన్ని పెంచుకొనడానికి తప్ప వీటన్నిటి ప్రయోజనం మరేమైనా వుందంటావా? ఏమీలేదు."
చున్నీలాల్ మధ్యలోనే మాట నాపి "అయితే నీవు చదువు మానేస్తావా?" అన్నాడు.
"అవును, చదువుకొనడం వలన నాకు నష్టం కలిగింది. ఇన్ని రోజుల నుంచి, ఇంత ధనం ఖర్చుపెట్టి, ఇంతే నేర్చుకొనగలగననే విషయం నేను ముందుగానే తెలుసుకొనగలిగి వున్నట్లయితే ఎన్నడూ ఈ కలకత్తా మొహం చూసేవాణ్ని కాదు."
"దేవదాస్, నీకేమయ్యింది? ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు?"
దేవదాసు కూర్చొని ఆలోచిస్తూ వున్నాడు. కొంచెం సేపటి తరువాత "ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా కలుసుకోవడం సంభవిస్తే అప్పుడు అన్ని విషయాలూ చెప్పేస్తాను" అన్నాడు.
అప్పుడు దాదాపు రాత్రి తొమ్మిది గంటలవుతూ వుంది. వసతి భవనంలోని విద్యార్ధులూ, చున్నీలాల్ అందరూ అత్యంత విస్మయంతో చూశారు. దేవదాసు తన సామానంతా బండిమీద వేసుకుని వసతి భవనం వదిలిపెట్టి శాశ్వతంగానే వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళి పోయిన తరువాత చున్నీలాల్ క్రోధంతో వసతి భవనంలోని ఇతర విద్యార్ధులతో_"ఇటువంటి రంగు వేసుకొన్న జంబుకాల్లాంటి వ్యక్తులను ఏ విధంగానూ గుర్తించలేము" అన్నాడు.
8
తెలివి గలిగినటువంటి, దూరపు చూపు కలిగినటువంటి వ్యక్తుల విధానము అప్పటికప్పుడు ఏ విషయం మీదనైనా తమ దృడమైన అభిప్రాయాన్ని వ్యక్త పరిచేదిగా వుండదు. ఒకే పక్షాన్ని తీసుకొని విచారించరు. ఒకే పక్షాన్ని తీసికొని తమ నిశ్చయాన్ని స్థిరపరచుకోరు. రెండు పక్షాలనూ తీసికొని తులనాత్మక దృష్టితో పరీక్షిస్తారు. అప్పుడు ఏదయినా తమ గంభీరమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సరీగా ఇందుకు విరుద్ధంగా మరో శ్రేణికి చెందిన వ్యక్తులు వుంటారు. వీరికి ఏ విషయం మీదా ప్రత్యేకంగా ఆలోచించే ధైర్యం వుండదు. వీరు హఠాత్తుగా తమ అభిప్రాయాన్ని అది మంచిది కానివ్వండి లేక చెడ్డది కానివ్వండి స్థిరపరచుకొంటారు. ఏ విషయంలోనూ లోతుకు వెళ్ళి విచారించే శ్రమను వాళ్ళు స్వీకరించరు. కేవలం విశ్వాసం ఆధారంగానే నడుస్తారు. వీళ్ళు ప్రపంచంలో ఏ కార్యాన్నీ చేయలేరని కాదు. అవసరం వస్తే అప్పుడప్పుడు వీళ్లు ఇతరుల కన్నా ఎక్కువ కార్యాలనే చేస్తారు. భగవంతుని దయ వుంటే వీళ్ళు అభివృద్ధి మార్గంలో సర్వోన్నతమయిన శిఖరం మీద ఎక్కువగానే కన్పిస్తూ వుంటారు. లేకపోతే మాత్రం లోతైన పతనపు లోయలో జీవితాంతం పడివుంటారు. లేవలేరు, కూర్చోలేరు, వెలుగు వైపు చూడలేరు, నిశ్చలంగా నిర్జీవులుగా, జలగండాల మాదిరిగా పడి వుంటారు. దేవదాసు కూడా యీ శ్రేణికి చెందిన మనిషే. మరుసటి రోజు ఉదయం ఆయన ఇంటికి చేరాడు. తల్లి ఆశ్చర్యంగా 'దేవా! కాలేజీకి సెలవలిచ్చారా?" అని అడిగింది.
దేవదాసు "అవును" అని చెప్పి అన్యమనస్కుడై వెళ్ళిపోయాడు. తండ్రి అడిగినా కూడా ఇటువంటి అర్ధం లేని జవాబే చెప్పి తప్పించుకున్నాడు. ఆయనకు సరీగా అర్ధంగాక గృహిణిని అడిగాడు. గృహిణి తన బుద్ధికి పదును పెట్టి "ఎండలు తగ్గలేదట, అంచేత మళ్ళీ సెలవలిచ్చారు" అని చెప్పింది.
రెండు రోజులు దేవదాసు చాలా చురుకుగా గడిపేశాడు. అతడి కోర్కె నెరవేరడం లేదు. పార్వతిని ఒంటరిగా
కలుసుకొనడానికి ఎక్కడా తటస్థ పడటం లేదు. రెండు రోజుల తరువాత పార్వతి తల్లి దేవదాసును ఎదురుగా చూసి "ఎటూ ఇక్కడకు రానే వచ్చావు, పార్వతి పెళ్ళి అయ్యేదాకా వుండు" అన్నది.
దేవదాసు "మంచిది, అలాగే" అన్నాడు.
మధ్యాహ్నం పూట పార్వతి రోజూ ఆనకట్ట దగ్గర నీళ్ళు తీసుకొని రావడానికి వెళుతూ వుంటుంది. ఇత్తడి బిందెను చంకన బెట్టుకుని యీ పుత్తడిబొమ్మ యీ రోజు కూడా రేవు దగ్గరకు వచ్చింది. చూసింది. అక్కడికి దగ్గరలోనే ఒక రేగు చెట్టుచాటున కూర్చొని దేవదాసు నీటిలోకి గాలం విసిరాడు. ఒకసారి ఆమె మనసులో తిరిగి పోదామనిపించింది. మరోసారి మౌనంగా నీళ్ళు ముంచుకు పోదామనిపించింది. అయితే తొందరలో ఆమె ఏదీ స్థిరపరచుకోలేకపోయింది. బిందె రేవు దగ్గర పెడుతున్న సమయంలో సహజంగానే కొంచెం చప్పుడు వినిపించింది. దానితో దేవదాసు దృష్టి అటువైపుకు మళ్ళింది. అతడు పార్వతిని చూసి సైగతో పిలిచి "పత్తో! మాట వినిపో" అన్నాడు.
