Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 9

 

    "మనవాడు వచ్చినట్టుంది. ఏమన్నా చెప్పాడా, నీతో?" అన్నాడు గోపాల్రావు, రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ భార్యతో.
    "ఓసారి , రెండు సార్లు అడిగాను -- వాసూ, సీటుకి అప్లై చేస్తావా? అని, మామయ్య రానీ, అత్తయ్యా , చెపుతాను అన్నాడు" అంది లక్ష్మీ.
    "వాసూ!" పిలిచాడు వరండా లోకి వస్తూ గోపాల్రావు.
    వస్తూనే "ఒప్పుకున్నారు మామయ్యా, ఫీజులు కడతానని" అన్నాడు నెమ్మదిగా.
    "రా, ఏమిటి భోగట్టాలు? వెంటనే తిరిగోచ్చావే!" అంటూ వాసు చెయ్యి తన చేతిలోకి తీసుకుని తన గదికి నడిచాడు గోపాల్రావు.
    "ఆ ఒప్పుకున్నాడా? ముందు ఇంట్లోంచి వెళుతుంటే గప్ చిప్ గా ఊరుకున్నాడు గదా/ చెప్పు, నువ్వు ఏమని అడిగావ్?" చిన్నగా నవ్వుతూ అడిగాడు గోపాల్రావ్ , తను పడుకుని తన పక్కలో కూర్చోమని వాసుకి చోటు చూపిస్తూ.
    కొన్ని క్షణాల మౌనం తరవాత, "ఏంరా, మాట్లాడవు?' అన్నాడు గోపాల్రావు అదే నవ్వుతో.
    "నీతో కొంచెం మాట్లాడవలసి ఉంది, మామయ్యా" అన్నాడు లక్ష్మి వైపు ఒక్కసారి చూసి తల వాల్చి.
    వెళ్ళమన్నట్టుగా భార్యకు సంజ్ఞా చేశాడు గోపాల్రావు.
    ఆమె ఏదో పని ఉన్నట్టు అవతలి గదిలోకి వెళ్ళిపోయింది.
    "ఊ, ఇప్పుడు చెప్పు" అన్నాడు గోపాల్రావు వాసు మొహంలోకి ఆత్రుతగా చూస్తూ.
    "మా నాన్న.... మా నాన్న.... అంటే నువ్వు అడ్రసిచ్చావు కదూ?... వెళ్ళాను" అన్నాడు వాసు. చిన్నగా గొంతు కంపించింది.
    కనుబొమలు చిట్లించి, "ఏమిటి నువ్వంటున్నది? మీ నాన్న దగ్గరికి వెళ్ళవా? నిజం!' అని నమ్మలేనట్టు సంభ్రమంగా లేచి కూర్చుంటూ అన్నాడు గోపాల్రావు.
    'అవును, మామయ్యా ఆయనే చదివిస్తానన్నారు. నాకు డబ్బు కూడా ఇచ్చారు."
    "నిన్నెలా కొడుకని పోల్చాడు? ఛ... వట్టిది . అబద్దం!" నవ్వేశాడు గోపాల్రావు.
    "నిజం. కావలిస్తే ఇదిగో, నీకీ లేటరిమ్మాన్నారు, చూడు! నేనే చెప్పాను మీ కొడుకునని" అంటూ ఆతని చేతిలో కాగితం పెట్టాడు వాసు    
    అత్రతగా గబగబా చదివి, "ఊ, చెప్పు . అత్తయ్య కి తెలిసినా ప్రమాదం లేదులే. అతని ఉద్దేశ్యమేమిటో! పోనీ, అలాగే కానీ! ఊ ఇప్పుడు చెప్పు! ఎలా వెళ్ళావ్? నీకూ అతనికి మధ్య సంభాషణలు ఎలా జరిగింది?" అని కుతూహలంగా వాసు భుజాలు కుదిపి సంతోషంగా నవ్వుతూ అడిగాడు గోపాల్రావు.
    వాసు చెప్పిన ప్రతి మాట ఆసక్తిగా విన్న గోపాల్రావు - 'నువ్వురా మా అక్కయ్య కి కొడుకు వంటేనూ! వెరీ గుడ్... శభాష్! పని కోస్తావురా, వాసూ! ప్రపంచం లో బ్రతికేయ్యగలవు" అని ఉత్సాహంగా, సంతోషంగా నవ్వేస్తూ, "పోయి పడుకో. రేపు ప్రిన్సిపాల్ గారి దగ్గిరికి వెళదాం" అన్నాడు.
    "ఎవరికీ తెలియనివ్వకు , మామయ్యా" అన్నాడు లేచి నిలుచుంటూ వాసు.
    "అత్తయ్య ఒక్కదానికీ చెప్పాలి. లేకపోతె కొన్ని చిక్కులు ఉన్నాయి. వీలు చూసుకుని మీ నాన్న వోసారి కలుస్తాను. లక్ష్మీ!' పిలిచాడు భార్యను.
    అన్నీ వివరంగా విని ఉత్తరం చదివిన లక్ష్మీ, "అబ్బాయి గట్టివాడే!" అంది కళ్ళు పెద్ద చేసి చూస్తూ. గుండెల పై చెయ్యి ఉంచుకుని నవ్వుకుంటూ.

                         *    *    *    *
    కాలేజీ నుంచి వచ్చిన వాసుని , "మీ నాన్నకి ఉత్తరం వ్రాశావా?' అని అడిగాడు గోపాలరావు.
    "ఎలా వ్రాయాలి?" సిగ్గుపడుతున్నట్టు అన్నాడు వాసు.
    "శభాష్! మీ నాన్నకి తగ్గ కొడుకువిరా నువ్వు! నాన్న దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోవడం తెలిసింది, ఉత్తరం వ్రాయడం తెలియదు! వ్రాయి, కాలేజీ లో చేరానని. నే వ్రాస్తాలే కాని నువ్వూ వ్రాయాలి." హెచ్చరించాడు గోపాల్రావు.
    'అలాగే, మామయ్యా! అనుకుంటూనే వ్రాయలేక పోతున్నాను" అన్నాడు వాసు.

                         *    *    *    *
    తాను వారం రోజులై ఎదురు చూస్తున్న ఉత్తరం వచ్చేసరికి, అత్రతగా కవరు విప్పాడు ప్రసాదరావు.
    "పూజ్యులైన ప్రసాదరావుగారికి,
    నమస్కారములు. నేను ఇక్కడికి క్షేమంగా చేరినాను. వివరాలు మామయ్యకు చెప్పాను. మామయ్య సమ్మతించాడు. వీలైనంత త్వరలో మిమ్మల్ని కలుస్తానని వ్రాయమన్నాడు. నేను కాలేజీ లో రెండు రోజుల క్రితం జాయినయినాను. మామయ్య మీకు జాబు వ్రాసి ఉంటాడు. ఈ దిగువ అడ్రసు కు మీరు నాకు ఉత్తరాలు వ్రాయవచ్చును.

                                                                                             ఇట్లు,
                                                                                            -- వాసు."
    నిర్లిప్తంగా మరొక్కసారి చదివి బరువుగా నిట్టూర్చాడు ప్రసాదరావు.

                             *    *    *    *
    "లౌ లెటర్స్ వస్తున్నాయిరోయ్ మనవాడికి. వీడు కాలేజీ లో జాయినయిన రోజే అనుకున్నాం కదురా -- వీడి ఫేస్ కట్టూ , బింకం చూసి మనవాడికి హీరో లక్షణా లున్నాయని . ఒరేయ్! ఒక్కసారి.... రెండే రెండు వర్డ్స్ ....ఆ రైటింగెలా ఉందొ...." చుట్టూ సహాధ్యాయుల గల్లంతు. గోల. చేతిలో ఉత్తరం లాగేయ్యడమే తరువాయి.
    "మా పెద్ద మామయ్య కాలేజీ అడ్రసు కి వ్రాస్తాడు. చిన్న మామ్మయ్య కీ, పెద్ద మామ్మయ్య కి పడదు. అందుకని కాలేజీ అడ్రసు కి లేటర్సు నాకు వస్తాయి. అందరూ ఒక్కసారి చూడండి, కాగితం వైపు మగవాడి రైటింగు!' చాటినట్టు అందరి మధ్యా నిలుచుని లెటరు కాగితం ఎగరవేస్తూ అన్నాడు వాసు.
    "కొందరు ,మగవాళ్ళు ఆడవాళ్ళ లా, కొందరు అమ్మాయిలూ అచ్చం మగవారి లా వ్రాయగలరటా!" కీచు గొంతు అరిచింది.
    'ప్లీజ్....బ్రదర్స్.... ఈ వేళకి వదిలెయ్యండి. ఈసారి వచ్చిన లెటర్సన్నీ మీరే ముందు చదివి నా కిద్దురు గాని. టాటా! బైబై!" అవలీలగా అందర్నీ తప్పించుకుని వెళ్ళిపోయాడు వాసు.
    "ప్రియాతి ప్రియమైన వాసుకి,
    నీ అదృష్ట హీనుడైన తండ్రి ఆశీర్వదించి వ్రాయునది , బాబూ! నీ ఉత్తరం నా కెలాంటి సంతోషానిస్తుందో , నా హృదయం లో ఎలాటి సంచలనం రేగుతుందో అని ఎదురు చూసిన నేను నీ ఉత్తరం చదివాక సిగ్గుపడ్డాను బాబూ! నన్ను తండ్రిగా సంబోధించలేక పోతున్న నా కొడుకు పట్ల నా అపరాధ లేమున్నాయో అని వెతికాను, నా గత జీవిత పుటలు. బలీయమైన విధి మనల్ని లా దూరం చేసిందని సమర్దించుకుని , అసహాయతతో తృప్తి పొందాను.
    నువ్వు పుట్టాక నేనేదో విజయం సాధించినట్టు పొంగిపోయాను. నేనే మహా  అదృష్ట వంతుణ్ణి అని విర్ర వీగాను. 'నాన్నా' అనే నీ తియ్యని పిలుపు వినకుండానే నీకు దూరమయ్యాను. నీ లేత హృదయంలో విష బీజాలు నాటడం నా కర్తవ్యమ్ కాదు. మీ అమ్మా మంచిదే. అందరం మంచివారమే అనుకుందాం. అందుకనే ఇన్నాళ్ళయిన నువ్వూ నేనూ ఇలా అన్నా కలిశాం.
    అవసరమైన బుక్సన్నీ కొన్నావా? డబ్బెమైనా కావలసి ఉంటె వ్రాయి. ఇబ్బంది పడకు. అందరి క్షేమంతో జవాబు వ్రాయి. నీ జాబు కెదురుచూస్తూ ఉంటాను.
                                                                                              ఇట్లు,
                                                                                        ౦౦ వి. ప్రసాదరావు."
    చదివి ఉత్తరం మడిచి భద్రంగా దాచి వెంటనే జవాబు వ్రాశాడు వాసు.

                                           *    *    *    *
    అత్రతగా కవరు విప్పి చదివిన ప్రసాదరావు హృదయం ఉప్పొంగిపోయింది. తృప్తిగా, హాయిగా నిండుగా, ఊపిరి పీల్చి, పెదవుల పై హాసరేఖలు విరుస్తుంటే , తియ్యని మమతలు మనస్సులో అల్లుకుపోగా, కనులు చెమ్మ గిల్లుతుంటే మరొక్కసారి ఇలా చదువుకున్నాడు ప్రసాదరావు.
    "పూజ్యూలైన నాన్నగారికి.
    మీ కుమారుడు వాసుదేవరావు నమస్కరించి వ్రాయునది. మేమంతా ఇక్కడ క్షేమం. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను.
    ఇదివరలో నేను వ్రాసిన ఉత్తరానికి మీ మనస్సు నోచ్చుకుందని గ్రహించాను. మీకు ఏలా ఉత్తరం వ్రాయాలో తెలియకా, అలవాటు లేకా అలా వ్రాసి నందుకు క్షమించ ప్రార్ధన. పుట్టినదాదిగా పితృప్రేమ ఎటువంటిదో ఎరగని నేను దురదృష్టవంతుణ్ణి-- కాదనగలరా? ఇప్పుడా ప్రేమ లభించింది నాకు. నాకింక కావలసినవీ, తీరనివీ ఏముంటాయి? నాకేదో గర్వంగా, ధైర్యంగా ఉంది, నాన్నా! ఒకరి క్రింద వగచి బ్రతకవలసిన వాణ్ణనుకునే నాకు ఇటుపైన అలాటి అవసరం లేదు. తల్లిదండ్రులు ఉన్న బిడ్డ బ్రతుకుతున్నట్లే నేనూ ఇటు పైన బ్రతకగలను. ఎలా చెప్పాలో నాకు తెలియదు. నాకేదో ధైర్యంగా ఉంది, నాన్నా!
    మీరిచ్చిన డబ్బు మామ్మయ్య కిచ్చాను. ఫీజు గట్టి కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఇంకా డబ్బుంది. మిగతావి కూడా తీసుకుంటాను. ఇప్పుడు డబ్బేమీ అవసరం లేదు.
    మీ క్షేమం జవాబు వ్రాయండి. తప్పులున్న మన్నించ ప్రార్ధన.

                                                                                              ఇట్లు,
                                                                                  -- మీ కుమారుడు వాసు."
    
                           *    *    *    *
    "కాఫీ!' టక్కున గ్లాసు టేబులు మీద పెట్టి వాసు వైపు చూసింది పద్మజ.
    ఇప్పటి వరకూ తనతో మాట కలిపి మాట్లాడని పద్మజ. కంగారుగా గ్లాసు తీసుకుంటూ, "అత్తయ్య...." అన్నాడు ఆ పిల్ల కళ్ళతో ముడిపడ్డ తన కనులు పక్కకి తిప్పి చూస్తూ.
    'అత్తయ్య కి ....జ్వరం...."
    "జ్వరమా?' వెళుతున్న పద్మజ వైపు ఒక క్షణం చూసి తానూ ఆమె వెనక నడిచాడు.
    "అత్తయ్యా!' ఆప్యాయత నింపుకున్న పిలుపు.
    వత్తిగిలి కళ్ళు చేతులతో నలుపుకుంటూ , "నువ్వా! కాఫీ తాగావా?" అని ప్రశ్నించింది లక్ష్మీ.
    "ఆ, ఎలా ఉందత్తయ్యా? జ్వరమా?' అదే కంఠస్వరం.
    "కొద్దిగా... ఫర్వాలేదులే.....రేపటికి తగ్గిపోతుంది.' చిన్నగా నవ్వింది.
    "చిన్నపిల్ల తానెం చేస్తుంది వంట? నే చేస్తాను. ఆ అమ్మాయిని పిలు నీదగ్గర ఉంటుంది." తడబడే గొంతుతో అన్నాడు వాసు.
    "పదమూడేళ్ళ ఆడపిల్ల చిన్నదా? వంట చెయ్యలేదూ! ఫర్వాలేదు . తనకి వంట చెయ్యటం వచ్చు." నవ్వింది లక్ష్మీ.
    క్షణం మౌనం తరవాత నెమ్మదిగా, " మీ అమ్మగారికి ఉత్తరం వ్రాశావా కాలేజీ లో జాయినయినట్టు?" అని అడిగింది.
    "వ్రాశానత్తయ్యా! మామయ్యా వ్రాశాడు. ఇంకా జవాబు రాలేదు కదూ?"
    "ఈవేళో రేపో వస్తుంది లే!" నీరసంగా కళ్ళు మూసుకుంది లక్ష్మీ.

                           *    *    *    *
    స్టౌ మీది పాలు పొంగ బోతుంటే హడావుడి గా పరికిణీ కుచ్చేళ్ళు దగ్గరగా పట్టుకుని దింప బోతున్న పద్మజ, బలంగా భుజం పట్టి వెనక్కి లాగబడడం తో తెల్లబోయి వెనుదిరిగి చూసింది.
    "అదేం పని?' వాసు ప్రశ్న.
    "మరి, మరి...." అతని మొహంలోకి చూసి సిగ్గుగా తల వాల్చేసింది.
    "మరి, మరి ...నీ మొహం! లే, స్టౌ ఆరిపోయింది." పాల గిన్నె దించి మళ్ళీ స్టౌ వెలిగించి, "వంట ఏం చేద్దామనుకుంటున్నావ్?' అని చిన్నగా నవ్వి అడిగాడు.
    "ఏం ? నువ్వు చేస్తావా?" తనూ నవ్వబోయింది పద్మజ.
"అవును"
    "ఓహ్....అయితే ఆ బంగాళదుంప కూర చేసి, కొబ్బరి పచ్చడి , చారూ చెయ్. తరవాత భోజనాల టైం లో వడియాలు వెచుదువు గాని" అంటూనే వంట ఇంట్లోంచి వెళ్ళిపోతున్న పద్మజ వైపు తెల్లబోయి చూస్తూ , "హాయ్, బాబోయ్! ఇన్ని ఐటమ్సే!" అన్నాడు వాసు.
    "ఐ.ఎ.ఎస్. చదివే కన్నా తేలికే!" కిలకిలా నవ్వు. గుమ్మం దాటబోతూ వెనుతిరిగి నిలుచుని నవ్వుతున్న పద్మజ వైపు ఉదాసీనంగా చూశాడు వాసు. క్షణం లో అసహనంగా "పద్మజా!" అన్నాడు కందిన మొహంతో.
    "మరి మగవాళ్ళు వంట పొయ్యి దగ్గిరి కెందుకు రావాలి? లే, నేనేదో వంట చేస్తాను" అంటూ స్టౌ మీద నీళ్ళ గిన్నె పెట్టింది పద్మజ.
    "మగవాళ్ళు వంటపని దగ్గరకు రాకూడదనే రూల్సు లేవు కాని....నేనూ సాయం చేస్తే తొందరగా వంటయిపోతుంది. నాకేదన్నా చెప్పు" అన్నాడు వాసు.
    పచ్చడి చేస్తూన్న వాసు వైపు చూసి పకపకా నవ్వాడు గోపాల్రావు.
    "నవ్వుతున్నావ్? ఈవేళ వంట ఎలా వుందో రుచి చూస్తావుగా? అప్పుడు చెప్పు" అంటూ తానూ నవ్వాడు వాసు.
    తాను జ్వరం తో ఉన్న రెండు రోజులూ ఇంట్లో ఆడపిల్లలా అన్ని పనులూ సవరించే వాసుని చూసి ఆప్యాయంగా "ఎంత మంచి కుర్రాడు!' అనుకుంది లక్ష్మీ. 'చాలా మంచి వాడు' అనుకుంది పద్మజ. 'బ్రతక నేర్చిన వాడు' అనుకున్నాడు గోపాల్రావు. "ఇంట్లో అందరి కన్నా నువ్వే మంచివాడివి. నాకే పెరుగు వేశావ్ అన్నంలో" పొగుడుతూ సంతోషించాడు గోపాల్రావు కొడుకు శ్రీను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS