"మీ నాన్న నీ ఉత్తరాలకి జవాబు వ్రాశాడా?" అడిగాడు గోపాల్రావు.
అవును, ప్రసాదరావు దగ్గిర నుంచి ఉత్తరం వచ్చి నాలుగు రోజులైంది. తానింకా జవాబివ్వలేదు. ఏదో మరిచిపోయింది గుర్తు వచ్చినట్టు, తనేదో పొరపాటు చేసునట్టు బాధపడుతూ , "అ వచ్చింది మామయ్యా! మామూలు యోగక్షేమాలే!" అన్నాడు వాసు.
"మా అమ్మ వ్రాసిందా?"
"ఇంటి అడ్రసు కే రావాలి. కాలేజీ అడ్రెసు కి అమ్మ వ్రాయదే?"
"ఓ! ఒహవేళ అమ్మ ఉత్తరం వ్రాయడం ఆలస్య మైనా నువ్వు వ్రాస్తూ ఉండు. నాన్న గొడవలో పడి అమ్మని మరిచిపోకు. " హాస్యంగా నవ్వాడు గోపాల్రావు.
"నాన్న నిన్నోసారి ఆయన్ని కలియమని చెప్పమన్నాడు మమ్మయ్యా! ఉత్తరంలో వ్రాశారు కూడా."
"ఇంకేం వ్రాశాడు?' ఉత్సుకతతో అడిగాడు గోపాల్రావు.
'ఆయనకి తెలియవు గా మనింటి సంగతులు? ఎవరేక్కడున్నారు ఎంతమంది పిల్లలు? అనే ప్రశ్నలు ఉత్తరం నిండా."
'ఆన్సర్లు వ్రాసేయ్! జవాబు వ్రాశావా?' నవ్వాడు గోపాల్రావు.
"లేదింకా. వ్రాస్తా నీవేళ."
"నాలుగు రోజుల్లో వీలు చూసుకుని వెళతాను. అలా వ్రాయి." అన్నాడు గోపాల్రావు.
* * * *
మరురోజు తాను క్షేమంగా చదువుకుంటున్నాననీ, అత్తయ్యా, మామ్మయ్యా తనని బాగా చూస్తున్నారనీ, తన గురించి ఏ విధమైన బెంగ పెట్టుకోవద్దనీ మధుమతి కి వ్రాసి, ప్రసాదరావు వ్రాసిన ఉత్తరం మరొక సారి చదువుకున్నాడు.
ఈసారి ఉత్తరంలో మీ అమ్మమ్మ బాగున్నారా? అని వ్రాసి, కుటుంబ విషయాలు, మీ మామయ్యల కేందరు పిల్లలు? రాజశేఖరం పిల్ల లేమి చదువు తున్నారు? అతనేక్కడున్నాడు? అంటూ అందర్నీ అడిగి మధుమతి ప్రసక్తే లేనందుకు వాసు మనస్సు కలుక్కుమంది. అన్ని సంగతులూ వివరంగా జవాబు వ్రాస్తూ, "నాన్నా, తెంచుకున్న బంధాన్ని ముడి పెడుతున్నానులా ఉంది నేను! మీ మధ్య నేను లేకుంటే అమ్మా, మీరూ ప్రశాంతంగా బ్రతికేవారేమో! అనిపిస్తుంది నాకు. నేను క్షేమం . అమ్మకి కూడా ఈవేళ ఉత్తరం వ్రాస్తున్నాను. మీ మాట ప్రకారం మామయ్యకు మినహా ఎవ్వరికీ మీ విషయం తెలియపరచను. నాలుగైదు రోజుల్లో మామ్మయ్య మీ ఊరు వస్తానని వ్రాయమన్నాడు.' అని , వ్రాసి పోస్టు చేశాడు వాసు.
* * * *
అకౌంట్లు చూసుకుంటున్న ప్రసాదరావు "ప్రసాదరావు గారు ఉన్నారండీ?" అన్న గొంతు వినీ తలఎత్తి చూసి, సంభ్రమంగా "రా, గోపాలం నువ్వా!" అన్నాడు లేచి నిలుచుని అతని కెదురుగా వెళుతూ.
సంతోషం, విషాదం, ఇంకేదేదో ఇద్దరి వదనాల్లో గబగబా రంగులు మారిపోయాయి. రెండు క్షణాలు స్నేహపూర్వకంగా చెయ్యి మున్డుకుం చాపాడు గోపాల్రావు. ఆ చెయ్యి టక్కున తన చేత్తో గట్టిగా నొక్కి పెట్టుకుని, "రా, ఇంటికి పోదాం" అంటూ నడిపించాడు ప్రసాదరావు. ఇద్దరి హృదయాలు బరువుగా ఉన్నాయి. ఎవరేం మాట్లాడాలో, ఎవరు ముందు మాట్లాడాలో అని ఇద్దరూ సతమతమవుతున్నారు."
తాళం పెట్టిన ఇంటి ముందు నిలుచున్న గోపాల్రావు -- "ఆమె ఇంట్లో లేదా?' అని అప్రయత్నంగా ప్రశ్నించాడు.
"ఎవరూ?" అని వెంటనే పకపకా నవ్వి "ఆమె లేదు, ఎవరూ లేరు. భయపడకు" అంటూ తాళం తీసి లోపలికి వెళ్ళి, "రా , కూర్చో" అన్నాడు కుర్చీ చూపిస్తూ ప్రసాదరావు.
కుశల ప్రశ్నలూ, ఉచిత మర్యాదలూ అయిన తరువాత, "ఒక్క గంటలో మళ్ళీ వస్తాను. నాకు తెలిసినాయన ఒకరు కనిపించి పిలిచారు.... మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయిన రోజు నాకు బాగా గుర్తు. అంత క్రితం ఏం జరిగిందో.....నేనా ఊళ్ళో లేనుగా? మన వాళ్ళు అనుకునే కొన్ని మాటలు మాత్రం విన్నాను... కారణం ఇదని ఇప్పటివరకూ నాకు తెలియదు.... మళ్ళీ మాట్లాడుకుందాం, రేపు ఉదయం వెళతాను....' అంటూ లేచి నిలుచున్నాడు గోపాల్రావు....
* * * *
తానింటి దగ్గిరి నుంచి వచ్చేసిన రోజు ప్రసాదరావు హృదయం కదిలిపోయింది. 'ఆరోజు బాగా గుర్తట. ఎందుకు ఉండదూ! .... కలిసిన మనస్సులు ముక్కలయిన రోజు. రక్త బంధాన్ని వివాహ బంధాన్ని రద్దు చేసి నన్ను దూరంగా తోసినరోజు . విధి కసిగా తనను వెక్కిరించి నవ్విన రోజు , తోడు వదిలి , ఒంటరిగా చీకట్లో తోవ వెదుక్కుంటూ బికారిగా పయనించిన రోజు.... అర్ధం లేని అనుమానాలతో తనని 'వక్ర మార్గంలో నడిపించి, తన పతనానికి కారణ భూతురాలయిన భార్య కన్నీళ్ళు తనకి వీడ్కోలిచ్చాయి. కసిగా, బరువుగా, బాధగా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఆనాటి స్మృతులు అతని గుండెల్ని పిండుతున్నాయి.
* * * *
వీధి వరండాలో బోనులో పులిలా అసహనంగా ఆగ్రహంగా , విసురుగా చేతులు కట్టుకు పచార్లు చేస్తున్నారు తహసీల్దారు వెంకట్రామయ్య . సాయంత్రపు నీరెండ వరండా లో పడుతుంది వెచ్చని వెన్నెలలా. నడవ తలుపు చేరవేసి, ఉంది వార వంపుగా. వాకిట్లోంచి వరండా ఎక్కే మెట్ల మీద రెండు గొనె సంచులు నిండుగా నిలుచున్నాయి. ఇంకా వాకిట్లో విప్పి కట్టిన మంచం, ట్రంకు పెట్టె లూ, చిన్న బీరువా , "ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నారు కాబో"లని వచ్చే పోయే జనం రోడ్డు మీంచి పోతూ అనుకున్నారు.
"అగు....." ఆ గద్దింపు విన్న ప్రసాదరావు మెట్ల దగ్గరే టక్కున ఆగి, వెంకట్రామయ్య గారి వైపు చూసి, చలించి, తల వంచి చేతులు కట్టి నిలుచున్నాడు.
నడవ తలుపులు తెరుచుకున్నాయి. జానికమ్మ, రాజశేఖరం, గోపాలం , వరసగా వరండాలోకి వచ్చారు. అందరి వదనాల్లో ఒకటే భావం, కోపం, అసహ్యం , బాధ."
"నలుగురూ చేరి నవ్వకముందే నాలుగూ చెప్పి పోమ్మనండి. నా కూతురింక ఆ బాధలు పడలేదు. మొగుడూ వద్దు, మొద్దూ వద్దు. చెప్పండి , మరి మనకి మొహం చూపించవద్దని." జీరబోతున్న గొంతుతో అంది జానికమ్మ.....
"ఆప్రాచ్యపు వెధవ ! అపాత్రదానం చేశాం....పెళ్ళే చెయ్యలేదనుకుంటాం , చచ్చాడను కుంటాం." అతని పెదవులు వణికాయి. కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. మరికాస్త విసురుగా పచార్లు చేశారు వెంకట్రామయ్య.
అయిదు నెలల పసివాణ్ణి ఎత్తుకుని వీధి వైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తుంది, కొన్ని నెలల గృహ చిద్రాల మూలంగాశుష్కించి పోయిన మధుమతి. ఆమె వైపు టక్కున చూసిన అతని హృదయం ద్రవించి పోయిందేమో!
"నిన్న వ్రాసిన కాగితం వాడికి పారెయ్. పోతాడు. నీ శని విరగడై పోతుంది." అరిచినట్టన్నారు దుఖం పొర్లుతున్న గొంతుతో వెంకట్రామయ్య. ఆ క్షణంలో నలుగురూ ఈ 'రభస' చూస్తున్నరనే బిడియం, తానూ చేస్తున్నా ఈ కార్యక్రమం తాకుకూ పర్యవసానం ఏమిటి? అనే వివేకం! అన్నిటిని చంపిందా పితృహృదయం.
"ఏమిటా కాగితం?' నిదానంగా అడిగాడు ప్రసాదరావు.
"విడాకులు....నీకూ నా కూతురికి ఈవేళ నుంచీ సంబంధం లేదు. నువ్వా ముండని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, నా ....ఇంట్లోంచి పో." ఎర్రబడ్డ కళ్ళలోంచి వెచ్చటి కన్నీళ్ళు వణికే పెదవుల మీద జారాయి.
"నేను కోరలేదు- సమ్మతించను." అంతే నెమ్మదిగా అన్నాడు ప్రసాదరావు.
"నువ్వు కాదోయ్-- అదే కావాలని ఇచ్చి పారేసింది. ఫో.... నీ ఉద్యోగం పీకించేస్తాను.... నిన్ను-- నిన్నూ.... తహసీల్ద్జారు వెంకట్రామయ్య మంచినే చూశావిన్నాళ్ళ వరకూ....ఇటు పైని ఆ వెంకట్రామయ్య గుండెల్లో ఉన్న ఇంకో రకం మనిషిని చూస్తావు!' కసిగా , వెర్రిగా నవ్వాడు వెంకట్రామయ్య.
(1).jpg)
"ఏం చేసినా ఫర్వాలేదు." మొండిగా నవ్వాడు ప్రసాదరావు.
"పారెయ్ వె ఆ కాగితం , మధూ! తీసుకురా!" అదే ఆవేశపు గొంతు.
రెండు చేతులతో మొహం కప్పుకుని గొల్లున ఏడ్చింది జానికమ్మ.
"ఛ, ఛ! అదేమిటమ్మా!" వారించాడు రాజశేఖరం .
వరండాలో కి వచ్చి ఓ కాగితం ప్రసాదరావు వైపు విసిరింది మధుమతి. రోషంగా, నిర్లక్ష్యంగా వెంటనే వెనుదిరిగి వెళుతూ నడవ గుమ్మం లో నిలుచుని ప్రసాదరావు వై పొక్క క్షణం చూసి, చంక లో ఉన్న పసివాణ్ణి గుండెల కదుముకుని భోరున ఏడ్చింది మధుమతి.
నెమ్మదిగా వంగి ప్రసాదరావు చేతిలో ఆ కాగితం తీసుకుంటుంటే శివమెత్తినట్టు ఊగిపోయారు వేబ్కత్రామయ్య. "ఆ కాగితం పట్టుకు నా ఇంట్లోంచి పోతున్నావు కదూ? ఫో ఫో! కాని.... నా కూతురు ఉసురు....అబ్బా! గుండెలు మండిపోతున్నాయి. తల బద్దలై పోతుంది." పిడికిలితో నుదురు గట్టిగా కొట్టుకుని, గుండెల పై బలంగా చరుచుకున్నారు.
గబగబా నాలుగు మెట్లూ ఎక్కి వరండా లోకి వచ్చి వెంకట్రామయ్య రెండు చేతులూ తన చేతులతో పట్టుకుని, "వద్దు, బాధపడకండి. పోను.... ఎక్కడికీ. వెళ్ళను." అని కంపన స్వరంతో అన్నాడు ప్రసాదరావు.
"ఇంకా నా ఇంట్లో ఉండి నిప్పు రాజేస్తావా? ఫో.... ఫో! నా ఇంట్లోంచి....నా కూతురు జీవితం లోంచి...." ఆయాసపడి పోతున్నారు వెంకట్రామయ్య . మౌనంగా రోదిస్తున్నారు జానికమ్మా, మధుమతి . ప్రేక్షకులై చూస్తున్నారు రాజశేఖరం, గోపాల్రావు.
"హు! ఎలా పోతాను? మీ ఇంట్లోంచి పోగాలనేమో! తరమగలరు. కాని మీ మనస్సు లోంచి పోతానా? మధు జీవితంలోంచి నేను..." అని నవ్వి, "ఆమెకు కనుమరుగవగలను కాని, జీవించి ఉన్నంత కాలం ఎలా మరిచిపోతాం? అసంభవం. మా ఇద్దరి మధ్యా.... మా ప్రేమకూ, వివాహబంధానికి చిహ్నంగా బాబు ఉన్నాడు." అంటూ పరపరా చించాడా కాగితం ప్రసాదరావు. అతని కనుకొలకుల్లో నీరు నిలిచింది.
బరువుగా నాలుగడుగులు ముందుకు నడిచి, మధుమతి చేతిలో ఉన్న పసివాణ్ణి తన చేతిల్లోకి తీసుకుని మృదువుగా హృదయానికి హత్తుకుంటూ, గట్టిగా రెండు కళ్ళూ మూసుకున్నాడు ప్రసాదరావు.
"ఇచ్చేయ్, వాణ్ణి కూడా ఇచ్చేయ్. వాడి బాధ నీ కెందుకు?"
"నాన్నా.?..... భోరుమని ఏడ్చింది మధుమతి.
"నీ నుంచి బాబుని వేరు చేసేటంత క్రూరుడినా, మధూ! ఇంద తీసుకో. బాబు నీ దగ్గరే ఉంటాడు." ప్రసాదరావు కళ్ళు వర్షిస్తున్నాయి నిర్విరామంగా, ఆ పసివాణ్ణి రెండు చేతులతో పైకెత్తి నీటి తెరల లోంచి అదే ఆఖరి చూపులా చూసి ఆ బాబు బుగ్గలు రెండూ గట్టిగా ముద్దు పెట్టుకుని మధుమతి కిచ్చాడు.
ఎన్నాళ్ళో అయి దూరమైనా కొడుకు తిరిగి వచ్చినట్లు గుండెల కదుముకుందా బాబుని మధుమతి.
"ఇచ్చేయ్యేవె! ఇచ్చేయ్." వెంకట్రామయ్య గర్జన.
భయం భయంగా వెంకట్రామయ్య గారి వైపు చూస్తుంది మధుమతి.
