Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 8

 

    కూతురు సిగ్గుపడుతూ చెప్పిన ప్రతి మాటా ఆసక్తిగా విన్న జానికమ్మ , "ఏమండీ , చూశారా అల్లుడూ ..." అంటూ వెంకట్రామయ్య చెవిలో వేసింది.
    అయన గుబురు మీసాలు కదిలేలా నవ్వుతూ, "నే చెప్పలే? బుద్ది కి బృహస్పతి లాటి వాడని" అన్నారు.
    "అలాగే కాని, అతని కేం తెలుసు పాపం! పెళ్ళి ఏర్పాట్లు అతని తరపునా మనమే చెయ్యాలి. ఎవరన్నా దూరపు బంధువులన్నా ఉన్నారేమో అని అడిగి చూశాను అల్లుణ్ణి . పాపం , ఎవ్వరూ ఉన్నట్టు తనకు తెలియదట.
    'అలానా! అమ్మాయిని తీసుకెళ్ళి ఆ బంగారం కూడా అతనికి, దానికి ఇష్టమైన వస్తువులు పురమాయిస్తే ఆ రోజుకల్లా తయారవుతాయి."
    "ఇంకా నెల పైన ఉంది. అన్నీ ఏర్పాట్లు కాస్త ఘనంగా చెయ్యండి. ఒక్కగాని ఒక్క పిల్ల. అతనికి మాత్రం ఎవరు ఉన్నారు? గోల్డ్ చెయిన్ , వాచ్ కొనండి. మొన్ననే మేజిస్ట్రేట్ గారి అల్లుడి కిచ్చారు పండక్కి. చాలా బాగుంది. తెల్ల ఒంటి వాడా-- దానిమ్మ గింజ లాటి యెర్ర రాయి ఉంగరం ఒహటి, మామూలు ఉంగరం ఒకటీ చేయిస్తే సరి." ఇలా ఇద్దరి మధ్యా నగలూ, బట్టలూ-- ఇంకా శుభలేఖలూ ...ఇలా చాలా సేపు సంభాషణ జరిగిందారోజు.
    
                          *    *    *    *
    "ఏమండీ!" మీది పంటితో కింది పెదవి నొక్కు కుంటూ , సంకోచంగా, బిడియంగా ప్రసాదరావు వైపు చూస్తూ నిలుచుంది మధుమతి.
    
                                 
    
    ఆ ఇంట్లో సర్వ స్వతంత్ర్యం ప్రసాదరావు కి.
    వెంకట్రామయ్య గారికి తలలో నాలుక. జానికమ్మ కు అభిమాన పుత్రుడుగా, మధుమతి కి అనుకూలుడైన భర్తగా, రాజూ, గోపీ లకి మంచి ఆప్తుడుగా స్నేహితుడుగా అందరి అభిమానాలూ చూరగొన్నాడు ప్రసాదరావు.
    ఏ వ్యవహరమైన , ఏ చిన్న విషయమైనా "మా అల్లుణ్ణి కూడా సంప్రదించి చెబుతాను" అనేవారు వెంకట్రామయ్య.
    మూడు పువ్వులూ ఆరు కాయలూ, నవ్వులూ జేరింతలతో ఆదర్శ కుటుంబంగా , అందరూ మెచ్చుకుంటుంటే అయిదు సంవత్సరాలు దొర్లాయి వేగంగా.
    రాజశేఖరం ఉద్యోగస్తుడయ్యాడు గోపీ చదువు పూర్తీ అయింది. జానికమ్మ కు మాత్రం చిన్న బెంగ. ఏమిటంటే కూతురు కడుపు పండలేదేమా? అని. జాతకాలు చూపించారు. మొక్కులు మొక్కించారు. డాక్టర్ల కి చూపించారు. ఎలా అయితేనేం? ఇరుగుపొరుగు లు గుసగుస లాడుతున్నారు తహసీల్దారుగారి అమ్మాయి నెల తప్పిందని.

                          *    *    *    *
    ప్రసాదరావు తల తువ్వాలుతో తుడిచి, తువ్వాలు అరవేస్తూ, "ఏమిటి చెయ్యమన్నా రీ వేళ? అమ్మ అడగమంది" అంది మధుమతి.
    అద్దం ఎదర నిలుచుని తల దువ్వుకుంటూ , "నా పుట్టిన రోజు మీ అమ్మ గారికి గుర్తు ఉండి పోయేంత కాలం ఇల్లరికం ఉన్నానన్న మాట. మధూ, ఈవేళటికీ సరిగ్గా ముప్పై నిండిపోయాయి. ముసలి వాణ్ణయి పోతున్నాను" అన్నాడు చిలిపిగా ఆమె కళ్ళలోకి చూసి నవ్వుతూ.
    "ముప్పై ఏళ్ళకి ముసలి వారా? నా కిరవై మూడే! నిండలేదు. బాబోయ్! అప్పుడే మీరు ముసలి వారై పొతే....తాతతో కాపురమా?" అల్లరిగా నవ్వింది మధుమతి.
    "కరెక్టే ....నేను తాతను కావాలంటే ముందు నువ్వు అమ్మవు కావద్దూ..... అదే తొందరగా! మధూ! నాకు తీపి మిఠాయిలు వద్దు" కాని తియ్యగా నాన్నా అని పిలిచే బాబు కావాలి. ఇస్తావు కదూ!" ఆమె వదనం తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రసాదరావు.
    "అబ్బ! ఏమిటండీ! మీకూ హస్యమైంది. అతని నుంచి నాలుగడుగులు వెనక్కి నడిచి సిగ్గుగా తల వాల్చింది మధుమతి.
    "మీకూ హాస్యమంటే? ఇంకెవరు హాస్యం చేస్తున్నారు మధు?"
    "అందరికీ అదే హాస్యం. అన్నం సరిగా తినమని' అంటుంది అమ్మ.... మేడమీదికి అడుగడుగునా ఎక్క వద్దంటున్నారు నాన్న. రాజు, గోపీ అల్లుడు అందంగా ఉండాలంటారు. పనిమనిషి మంచి కో కేట్టాలంటుంది. అందరూ ఒకటే ఉడికింపు!" సిగ్గుతో ఆమె మొహం కందింది. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి.
    "అమ్మ దొంగా! అందరికీ తెలిసిన విషయం నా దగ్గర దాచావన్న మాట!" ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు ప్రసాదరావు సంతోషంతో.
    "పొండి. అందుకే మీకు చేప్పకూడదనుకున్నాను" అతని నుండి దూరంగా నడిచిన మధుమతి "కోపం అభినయించింది.

                          *    *    *    *
    దూరాన చర్చి గంట టంగ్. టంగ్ అని రెండు సార్లు మ్రోగింది. నిద్రరాక తెరలు తెరలుగా కదిలిపోయిన గత చరిత్ర పునారావలోకనం లో , అలసిన ప్రసాదరావు దీర్ఘంగా నిట్టూర్చి, నిద్రపోతున్న వాసు తల నిమిరి, మృదువుగా పెదవులతో అతన్ని ఫాలాన్ని స్పృశించాడు. ఒక్కసారి కదిలి మళ్ళీ నిద్రపోయాడు వాసు.

                            *    *    *    *
    ఉదయం కాఫీ, టిఫినూ బలవంతాన తినిపించాడు వాసుకి ప్రసాదరావు.
    ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్న ప్రసాదరావు "మరి నేను వెళతానండి" అన్న వాసు మాటకి ఉలిక్కిపడి , "ఇలా కూర్చో. నీతో ఓ సంగతి చెప్పాలి" అన్నాడు.
    మౌనంగా తల వాల్చీ కూర్చున్నాడు వాసు.
    ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా తేలిగ్గా నిట్టూర్చి, "నేను నీ తండ్రి నని, నీకు ఆశ్రయమిచ్చిన అందరి కంటే ఎక్కువ వాడిననీ నా దగ్గరకు వెతుక్కుంటూ వచ్చావు. నా కంతకన్నా అదృష్ట మేముంది, చెప్పు! చాలా సంతోషంగా ఉంది. నీకోసమేమన్నా చేస్తాను. కాని...." అంటూ వాసు వైపు చూశాడు ప్రసాదరావు.
    "చెప్పండి సార్! నన్ను చదివించడమే కుదరదంటారా?' అలిసిపోయి విసిగిన అతని కదే తట్టింది కాబోలు.
    తెల్లబోయి వాసు వైపు పరిశీలనగా చూసిన ప్రసాదరావు తల్లిదండ్రుల దగ్గర గారంగా పెరిగే పిల్లల కన్నా మరొకరి ప్రాపకం లో కష్టాల్లో , దారిధ్యంతో పెరిగే పిల్లలు వయస్సు ను మించి మనస్సు ఎదిగి పోతుంటుందేమో అనుకుంటూ, "అదికాదు, బాబూ! ఎందుకు చదివించనూ! చదివిస్తాను. వారందరి లా నేనెలా కాదనగల నిప్పుడు? అయినా నువ్వు కాక ఎవరున్నారు? కాని...." అంటూ ఆగిపోయిన ప్రసాదరావు వైపు ఆత్రుతగా చూశాడు వాసు.
    ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు మౌనం ;లో దొర్లాయి. "నువ్విలా వవ్చినట్టు , నేను నిన్ను చదివిస్తున్నట్టూ ఎవరికీ తెలియకూడదు. అలా తెలియడం నా కెంత మాత్రం ఇష్టం కాదు." ఆ గొంతు గంబీరంగా దృడంగా ధ్వనించింది.
    "అదెలా!?" నివ్వెర పోయాడు వాసు.
    "గోపాలానికి ఒక్కడికి మాత్రమే చెప్పు. అతన్నీ ఎవరికీ చెప్పవద్దను. నే లెటరు వ్రాస్తాలే. నువ్వెప్పుడూ , ఎలాటి సమయం లోనూ అసలు నే నున్నాననీ , నేను భరిస్తున్నాననీ మీ వాళ్ళేవరికీ తెలియనివ్వనని మాట ఇయ్యి." చెయ్యి ముందుకి చాచాడు ప్రసాదరావు. అతని గొంతులో గంభీర్యం సడలలేదు.
    భయంగా, బెదురుతూ , ఏమో అయిపోతున్నట్టతని వైపు అర్ధం కానట్టు చూశాడు వాసు.
    మరి కొన్ని క్షణాలు బరువుగా దొర్లాయి.
    "నువ్వలా మాటివ్వాలి. ఇవ్వనినాడు నేను చదివించ లేను. తెగిన దారం ముడి పదాలనీ, దిగిన గుమ్మం ఎక్కాలనీ నే నీ జీవితంలో కోరను..... కాని నువ్వు కలెక్టరవై ....." అతని పళ్ళు కరకరలాడాయి.
    వాసు వదనం త్వరత్వరగా మారే భావాలతో ఎర్రగా కంది ఉబ్బింది. ప్రసాదరావు చెయ్యి తన రెండు చేతులతో పట్టుకుంటూ, 'అలాగే, మీ అనుమతి పొందనిదే ఎవ్వరికీ తెలియనివ్వను, చెప్పను. నన్ను చదివించండి." అన్నాడు. గుండెల్లో దాగిన లావా ప్రవహించింది. ... వెక్కివెక్కి ఏడుస్తున్న వాసుని గుండె కదుముకుంటూ , 'ఛ ఛ! ఏదీ, నా వైపు చూడు" అని ఒదార్చబోయిన ప్రసాదరావు హృదయం కదిలి కనులు చెమ్మగిలి కంఠం రుద్దమయింది. టపటపా రెండు కన్నీటి బొట్లు వాసు తలపై రాలాయి.
    కొన్ని క్షణాలలాగే ఉండిపోయారా తండ్రి కొడుకులు-- ఒకర్ని ఒకరు మరి విడిచి ఉండలేమన్నట్లు.
    "లే, బాబూ! వాసూ , చూడు . మొహం కడిగేసుకో. ట్రెయిన్ కి టైమయి పోతుంది. చిన్న మామయ్య గారి ఊళ్ళో నే సీటుకి అఫై చెయ్యి. నేను డబ్బిస్తాను. మరేం లేదు. అలా తెలిస్తే గిట్టని వాళ్ళుంటారు . చూడు, నీ చదువు పూర్తీ కానివ్వరు. అందుకని, మన వాళ్ళంతా బాగున్నారు కదూ?' అన్నాడు ప్రసాదరావు అనునయంగా.
    ఏవేవో అడిగి తెలుసుకోవాలనే ఆత్రత నిద్దరూ అణుచుకున్నారు.
    త్వరత్వరగా ప్రయాణమయ్యాడు వాసు. అతన్ని స్టేషను వరకూ అనుసరించడానికి అన్నట్టు ప్రసాదరావు ప్రయాణమయ్యాడు.
    "వాసూ, ఈ డబ్బు జాగ్రత్త పెట్టు. ఈ ఉత్తరం మామయ్య కియ్యి. పద, స్టేషను కొస్తాను." అన్నాడు ప్రసాదరావు.
    డబ్బు తీసుకుంటుంటే వాసు చెయ్యి వణికింది చిన్నగా. మూడు వంద రూపాయల కాగితాలు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "ఇంత డబ్బు అవసరమంటారా?' అన్నాడు.
    "ఫీజు, బుక్సు కొనాలిగా? ఉంచు. మామయ్య అడ్రసు వ్రాయి" అంటూ కాగితం ఇచ్చాడు ప్రసాదరావు.
    "మీ కరెక్టు అడ్రెసు ఇదే కదూ?' అంటూ గోపాలరావు అడ్రసు వ్రాసి ఇచ్చాడు వాసు.
    "ఆ మామయ్య ఇచ్చిన అడ్రసు సరైనదే. వెళ్ళిన తరవాత వివరాలు వ్రాయి." అన్నాడు ప్రసాదరావు.
    స్టేషను వరకూ ఇద్దరూ మౌనంగా నడిచారు.
    టికెట్, కొంత చిల్లరా, పది రూపాయల చిల్లర కాగితాలూ వాసు జేబులో పెడుతూ "జాగ్రత్త. అనవసరంగా అట్టే ఆలోచించకు. చదువు మాత్రమే నీకు కావలసింది. మిగతా విషయాలు అనవసరం. డబ్బు అవసరమైతే వ్రాస్తూ ఉండు. టైం వచ్చినప్పుడు నా గురించి చెప్పుకుంటాను. నేనే నీకు.... నా ఉనికి  చిన్న మామయ్య మినహా ఎవరికీ తెలియనివ్వకు" అని మరొక్కసారి హెచ్చరించాడు ప్రసాదరావు.
    ట్రెయిన్ కదులుతుంటే వాసు చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కి వదిలేస్తూ, "సెలవులు వచ్చాక వస్తావు కదూ?' అన్నాడు అర్ద్త్ర స్వరంతో.
    'అలాగే నండి." ఆ గొంతులో కృతజ్ఞత.

                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS