'నాకూ వచ్చిందో బంజరు. నేనూ రాజకీయ బాధితుడి కిందే లెక్క! నేనూ, వెంకత్రామయ్యా ఒకటే ప్రభుత్వం దృష్టి లో.' మాధవరావు కు నవ్వు వచ్చింది. తనకు కాంగ్రేసు అంటే ఏమిటో జైలుకు వెళ్ళిన రోజుల్లో ఏమీ తెలియదు. అసలు జైలుకు వెళ్ళడం అంటేనే తెలియదు. ఆరోజుల్లో పెద్దాపురం హైస్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు తను. కాకినాడ లో మీటింగులూ, జండాలతో ఊరేగింపు లూ అవుతున్నా యంటే వెళ్ళాడు. "ఆంగ్లేయులు మనదేశం వదిలి పోవాలి" అని అరుచుకుంటూ, జండాలు పుచ్చుకుని అంతా ఊరేగుతుంటే, తనో రోడ్డు పక్కన నించుని అంతా వింతగా చూస్తున్నాడు. ఇంతలో ఆ వీధిలోకి అటు నుంచీ, ఇటు నుంచీ రెండు పోలీసు లారీలు వచ్చాయి. లారీలు రావడం ఏమిటి అందులో నుంచి పోలీసులు దిగి ఊరేగింపు వాళ్ళను కొట్టడం ఏమిటి? అంతా ఒక్క క్షణం లో జరిగిపోయింది. భయపడి తను పరుగెత్తబోయాడు.
ఆ తొక్కిసలాట లో పారిపోతూ పారిపోతూ ఓ కాంగ్రేసు కుర్రవాడు, తన చేతిలో ఓ జండా పెట్టేసి మరీ పారిపోయాడు, తన చేతిలో తాచు పామును ఇంకొకళ్ళ చేతిలో పెట్టి "హమ్మయ్య' అని పారిపోతున్నవాడిలా పోతున్న ఆ కుర్రవాడి కేసి గుడ్లప్పగించి చూసి వెంటనే తన చేతిలో ఉన్న జండా కేసి చూసుకొని, ఏం జరిగిందో అర్ధం చేసుకొనే లోపుగానే నెత్తి మీద ఓ బలమైన దెబ్బ తగలడం తను స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. కళ్ళు తెరిచి చూసేసరికి , తనో ఆస్పత్రి లో ఉన్నాడు. తన చేతిలో జండా ఉండటం మూలాన -- పోలీసు వచ్చి నెత్తి మీద లాఠీతో కొట్టాడనీ దానితో స్పృహ తప్పి పడిపోయాడనీ, అయినా జండా వదలకుండా గుప్పిటతో గట్టిగా పట్టుకొని ఉండడం మూలాన, పోలీసు ఇంకా నాలుగైదు దెబ్బలు కొట్టాడని, అయినా అలాగే తను గుప్పిడి బిగించి ఉండి పోవడంతో ఉజ్జ్వలమైన దేశభక్తుడుగా, ప్రముఖుడైన సత్యాగ్రాహిగా పోలీసు శాఖ నిర్ణయించి తన మీద ప్రత్యేకంగా బలమైన కేసు పెట్టిందనీ తర్వాత తెలిసింది.
ఊరంతా అట్టుడికి పోయింది. పేపర్ల లో 'బాలవీరుడు మాధవరావు" అని పతాక శీర్షికలు! విచారణ జరిగే సమయంలో తనను చూడడం కోసం వందల కొద్ది ప్రజలు! తనకంతా చిత్రం గానూ ఆశ్చర్యంగా నూ ఉండేది, అంతా తనను పొగుడుతుంటే.
"నేరం తీవ్రమైనదే అయినా, పసివాడు కదా అని దయతలచి , ఆరు నెలలే , అదైనా పిల్లల జైలు లో ఖైదు విధిస్తున్నాను" అని ఆంగ్లేయుడైన ఆ జడ్జి తీర్పు చదివి నప్పుడు "బాలవీరుడు మాధవరావు -- జిందాబాద్ " అంటూ చూడడానికి వచ్చిన వారందరూ కోర్టు అదిరిపోయేలా ఒక్క అరుపు అరిచారు.
పైకి ఏడవడానికి ధైర్యం లేక లోపల్లోపలే ఏడుస్తూ, శిక్షా కాలం అంతా పూర్తి చేసి జైలు లోంచి బయటకు వచ్చేటప్పటికి ప్రజలంతా ఘనమైన స్వాగతం ఇచ్చి, ఊరేగించారు తనను. దానితో తను కాంగ్రేసు వాదిగా బలవంతంగా స్థిరపడి పోయాడు. ఇలా కొన్నాళ్ళు తనకు ఇష్టం లేకపోయినా ఆ ముతక బట్టలు కట్టుకొని, తనకే విశ్వాసం లేని -- 'స్వరాజ్యం , ప్రజాస్వామ్యం , సమానత్వం' లాటి మాటలు వల్లే వేస్తూ తిరిగాడు. స్వరాజ్యం వచ్చి కాంగ్రేసు వారు పదవి లోకి వచ్చాక అందరితో పాటు తనకూ ఇచ్చారు అయిదేకరాలు 'ఇదిగో నువ్వు చేసిన త్యాగానికి మూల్యం తీసుకో" అని.
కొన్నాళ్ళు ఇలా జరిగాక, ఎన్నాళ్ళు ఆత్మవంచన జగద్వంచన అని కాంగ్రేసు లోంచి బయటకు వచ్చేశాడు తను. వచ్చేశాడు కనుకనే శుభ్రంగా సిల్కు లాల్చీలూ, అవీ బాహాటంగా వేసుకొని తిరిగి సుఖిస్తున్నాడు. లేకపోతె లోకం కోసం, బయట తిరిగినంత సేపూ ఆ ఖద్దరు ముతక గుడ్డలు కట్టుకొని అఘోరించవలసి వచ్చేది.
ఇలా ఆలోచిస్తున్న మాధవరావు కు ఏంతో మంది కాంగ్రేసు మిత్రులు జ్ఞప్తి కి వచ్చారు. తను నయం. ఇంకా ఒకమారు జైలుకెనా వెళ్ళాడు ఇష్టం ఉండో, ఇష్టం లేకో. పాపం వాళ్ళు అదీ వెళ్ళలేదు. తనలాగే ఎన్ని మాట్లో ఒక్కరే ఉన్నప్పుడు, కాంగ్రేసు మీద కారాలూ, మిరియాలూ నూరారు. ఎమ్.ఎల్.ఎ కీ నాటికీ టిక్కెట్టు దొరకనప్పుడు కాంగ్రేసు సంస్తలోంఛి వచ్చేస్తాం అని బెదిరించారు కూడా. కొంచెం ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు కనుక, బెదిరించడం మాత్రమే చేశారు. తనలాగ వచ్చేయ్యలేదు. అందుకే ఇప్పుడు హాయిగా అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు.
ఇలా ఆలోచిస్తున్న మాధవరావు "డాడీ , డాడీ" అన్న జ్యోతి కేకలు విని అటు తిరిగి "ఏం తల్లీ!" అన్నాడు.
"చూడు డాడీ, మమ్మీ ఏమైనా సరే ట్రాన్సిస్టర్ కొనడానికి వీలులేదు అంటోంది" అని ఫిర్యాదు చేసింది జ్యోతి.
పైపు వెలిగించుకుంటూ "ట్రానిస్టరా!" అన్నాడు.
జ్యోతి రెండు జడలలోనూ ఓ జడ ముందుకు వేసుకుని చివాళ్ళ అల్లుకుంటూ "అవును డాడీ మన రేడియో కొని నాలుగేళ్ళు దాటిపోయింది. పైగా పాత మోడలు. కర్ర పెట్టె లాగ ఎక్కడికి కదపడానికి వీలులేదు. ఓ ప్రయాణం లో పట్టుకు వెళ్ళాలన్నా, ఓ పిక్ నిక్ కు ఎంచక్కా భుజానికి తగిలించుకుని వెళ్ళాలన్నా ట్రాన్సిస్టర్ ఉండాలి." అంది.
మధవరావు "ఓ అలాగే తప్పకుండా. నేనీ మాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెస్తా" అన్నాడు.
"మరి టేరిలిన్ లో మంచి చీరలు తెస్తానన్నావు కదా!"
'అవీ తెస్తాను."
"మంచి చాయలు చూసి తేవాలి. లేకపోతె నేనసలు కట్టుకొను" అని సోఫాలో కూచుంది.
"నేను జాగ్రత్తగా చూసి తెస్తాగా?' అని జ్యోతిని సముదాయించాడు మాధవరావు.
రామదాసు పుల్లేటి కుర్రు నుంచి వచ్చాడు. అతన్ని చూసి అడిగాడు మాధవరావు. "రారా వెళ్ళిన పని ఏమయింది? కాయా, పండా?"
"ఉండు . అలా కంగారు పడితే ఎలా? సావకాశంగా చెప్పనీ."
"ఇంతకీ వాళ్ళ స్థితి గతులేలాంటివి? మన కనుకూలమైన సంబంధమేనా?"
"ఆహా! పుల్లేటి కుర్రు లో వీళ్ళది మోతుబరి కుటుంబమే. ఇరవై ఎకరాల కొబ్బరి తోట, ఏడెనిమిదేకరాల మాగాణి ఉన్నాయి. ఓ పెద్ద మండువా లోగిలి. ఆస్తి పాస్తుల్లో నీక్కొంచెం లోక్కే అయినా పలుకుబడి, గౌరవం , మర్యాద లలో మాత్రం ఏం తీసిపోరు."
"అస్తికేం లే. మన అమ్మాయి పేరనే ఉంది కావలసినంత. వాళ్లు ఎంతమంది అన్నదమ్ములు , ఏమిటి కధ?"
"అసలు అచ్యుతరామయ్య , వెంకట్రామయ్య అని వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు . అచ్యుత రామయ్య కి ముగ్గురు పిల్లలు. విశాలాక్షి , ముకుందం, ఆనందం. "

"మరి వెంకట్రామయ్యకో?"
'అక్కడే నాకూ అనుమానం వచ్చింది. ఇంట్లో వెంకట్రామయ్య భార్య ఉన్నట్లు లేదు. అతని పిల్లలూ కనిపించలేదు. పుట్టింటి కెళ్ళిందేమో అని చూదాయగా ఒకటి రెండు ప్రశ్న లడిగాను. వాళ్ళేదో నసిగేశారు కాని, తిన్నగా సమాధానం చెప్పలేదు."
"పోన్లే . ఏ ఇంట్లో ఉండే ఇబ్బందులు అ ఇంట్లో ఉంటాయి. అయన కసలు పెళ్ళే కాలేదేమో."
"ఏమో . అవునా? ఈ విశాలాక్షి కి భర్తా , ముకుందానికి భార్య పోయారు. పాపం, విశాలాక్షి కి ముప్పై అయిదు నిండా లేవు. ఎంత ఉత్తమ ఇల్లాలని! అంత కష్టాన్ని దిగమింగుకుని, నిప్పుని చెంగు కి కట్టుకొని నిశ్చలంగా మసులుతున్న మనిషిలా కనిపించింది. ఆవిడ కో అమ్మాయుంది. పదిహేను పదహారేళ్ళు ఉంటాయి. ఇంకపోతే, ముకుందానికి పిల్లలు లేరు. విశాలాక్షీ ముకుందాల తర్వాత ఆనందం . అతనే పెళ్ళి కొడుకు. బి.ఎ పాస్ అయ్యాడు. కుర్రాడు చాలా బుద్ది మంతుడు. కాని వయస్సు మాత్రం ఇరవై మూడు, ఇరవై నాలుగుంటుంది."
"ఆ! దానికేం లే. మన అమ్మాయి కి మాత్రం లేవూ పద్దెనిమిదేళ్ళు?" అంటూ జ్యోతి కేసి చూశాడు. జ్యోతి కప్పటికి అర్ధం అయింది. ఇదేదో తన పెళ్లికి సంబంధించిన సంగతే అని. సోఫాలో నుంచి లేవబోయింది.
"కూచో , అమ్మా. నువ్వు కూడా విను. వినవలసిందే." అని చెప్పి మాధవరావు రామదాసు వేపు తిరిగి "అయితే ఆ అక్కగారి కూతురుంది కదా? ఆ పిల్లని చేసుకోడా?" అన్నాడు.
"ఆ అభిప్రాయం వాళ్లకేం ఉన్నట్లు లేదు. పైగా ఆ అమ్మాయి అంటే వాళ్ళందరి కి ఎంత ముద్దో!"
'అవునులే. తండ్రి పోయి, చిన్నప్పటి నుంచీ వాళ్ళ దగ్గరే ఉందేమో, ఆ అమ్మాయిని చేసుకోవడం అంటే, కొంచెం ఎబ్బెట్టు గా ఉంటుంది. ఊ చెప్పు."
"మన సంగతి సందర్భాలూ , మంచి మర్యాదలూ అన్నీ చెప్పి, పిల్లని చూసుకోడానికి రమ్మని చెప్పా."
"ఏమన్నారు?"
"నేను మొదట్లో నాతోటే రమ్మన్నాను. వాళ్ళు కుదరదన్నారు. పది రోజులు పోయాక వస్తా మన్నారు."
"అలా కాదు ఈ వైశాఖ మాసం పొతే, మళ్ళీ శ్రావణ మాసం దాకా ముహూర్తాలు లేవని చెప్పక పోయావా?"
"చెప్పలేదు మరీ? 'మీరేమైనా ఒకటి రెండు రోజుల్లోనే రావాలి. మీ ఉభయులకీ నచ్చితే ఈ వైశాఖ మాసం లోనే ముహూర్తం పెట్టేయవచ్చు" అన్నా."
"ఏమన్నారు?"
"అప్పుడేం మాట్లాడలేదు వాళ్ళు. మధ్యాహ్నం నేను భోం చేసి...."
"కొంపతీసి వాళ్ళింట్లో చెయ్యలేదు కదా? కటికితే అతకదంటారు."
"ఆ! సింగినాదం పోనిద్దూ. నువ్వూ ఈ శాస్త్రాలన్నీ నమ్ముతావా?"
"మాములుగా నమ్మకపోయినా, ఇది సొంత విషయం కాదుటోయ్ ?" అంటూ మాధవరావు పకపకా నవ్వాడు.
"అవున్లే. అయినా వాళ్ళింట్లో నేను భోజనం చెయ్యలేదు లే. చుట్టాలింట్లో ఏర్పాటు చేశారు. భోజనం అయాక , నేను పక్క గదిలో నడుం వాల్చాను. వాళ్ళంతా హల్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. మొత్తం మీద వాళ్ళ మాటలని బట్టి తేలిందేమిటంటే , వాళ్ళూ పిల్లాడికి వైశాఖ మాసం లో చేసెయ్యాలనుకుంటున్నారు. అందువల్ల రెండు మూడు రోజుల్లో వచ్చి పిల్లని చూసుకోడానికి నిశ్చయించుకున్నారు. కాని...."
మాధవరావు ప్రశ్నార్ధకంగా రామదాసు వేపు చూశాడు.
"పెళ్లి కొడుక్కి ఎల్లుండి హైదరాబాద్ లో ఇంటర్య్వూ ఉందిట. ఏదో ఉద్యోగానికి అప్లై చేశాడట లే. ఇంకో మూడు నాలుగు రోజుల్లో నాగపూర్ లో ఏదో పరీక్ష ఉందట. అదీ ఉద్యోగానికి సంబంధించిందే. హైదరాబాద్ నుంచి అలా వెళ్లతాడుట. దానాదీనా తెల్చిందేమీటంటే తను పెళ్లి చూపులకు రావడం పడదు అని."
"అలా అయితే ఎలా?"
"ఉండు చెప్పనీ. "నేను రావడం పడదు. నువ్వూ , అన్నయ్యా వెళ్లి పిల్లని చూసిరండి" అన్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ అన్నయ్య ముకుందం ఏమో పూరీ జగన్నాధం వెళ్ళాలట. అక్కడేదో మీటింగులున్నాయట..."
'అబ్బాయ్ , ఇదంతా చూస్తుంటే వాళ్లకి మన సంబంధం ఇష్టం లేనట్టు ఉంది. అందుకే ఈ వంకలన్నీను."
"అబ్బెబ్బే. అలా అనకు. వాళ్ళ కున్న ఇబ్బందులవి. సరే, విశాలాక్షి తల చెడిన మనిషి కదా? అందువల్ల వెంకట్రామయ్య గారు ఒక్కరే వచ్చి పిల్లని చూడ్డానికి నిర్ణయం చేశారు."
"అదేమిటి? ఆయనకి నచ్చితే రేపొద్దున్న పిల్లాడికి నచ్చద్దూ?"
"ఈ మాట వెంకట్రామయ్య గారే అన్నారు-- "చేసుకోనేవాడివి నువ్వు, నువ్వు చూసుకోవడం ముఖ్యం పిల్లని" అని. "అదేమిటి బాబయ్యా, నువ్వు పిల్లను చూసి, ఈ పిల్ల బాగుంది చేసుకోరా అంటే, నేను కాదంటానా? నువ్వేం పరాయి వాడివా? నా శ్రేయస్సు కోరేవాడివి. నాకు తగిన పిల్ల ఎవరో నాకంటే నీకే బాగా తెలుసు. నువ్వవెం పెట్టుకోకు. బాబయ్యా. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నేను చూడనక్కర్లేదు. నాకంటే పెద్దలు మీకు నచ్చడమే నాకు ముఖ్యం" అన్నాడు ఆనందం."
"చిత్రంగా వుందే! ఈరోజుల్లో అలాంటి కుర్రాళ్లు ఉండటం అరుదు. పెద్ద వాళ్ళ మాట ఎలా వున్నా, పిల్లాడి ని పిల్లా, పిల్లని పిల్లాడూ చూసుకుని ఒకళ్ళ కొకళ్ళు నచ్చుబాటు కావాలి. అది ముఖ్యం నవీన పద్దతిలో" అంటూ మాధవరావు జ్యోతి కేసి చూశాడు. జ్యోతి కూడా ఆశ్చర్యం గానే వింటూ ఉంది ఈ సంగతి.
"అతనికి బాబయ్యంటే అంత గురి. అందుకే అలా ఒప్పుకున్నాడు."
"అయితే మొత్తం మీద వెంకట్రామయ్య గారు ఒక్కరే వస్తారన్న మాట?"
"ఆ! ఎల్లుండి సాయంత్రం."
"సాయంత్రమా? నాకు ఎల్లుండి సాయంత్రం తుని లో మీటింగు ఉందే? వాళ్ళు జీపు కూడా పంపిస్తామన్నారు."
"ఎంతసేపు? పెళ్లిచూపు లవగానే నువ్వు జీపు ఎక్కి వెళ్లిపోవచ్చు. నేనుంటాగా ఆయన్ని పంపించేదాకా?"
"అవును కానీ, అబ్బాయి అయితే పిల్లని చూడక్కరలేదు అన్నాడు. బాగానే ఉంది. మరి అమ్మాయి సంగతేమిటి? అమ్మాయి అతన్ని చూడక్కర లేదూ మరి?" ఈ ప్రశ్న జ్యోతికి ఎంతో సమంజసంగా అనిపించింది.
"ఈ మాట అబ్బాయ్ అన్నాడు. నేను నిద్ర నుంచి లేచాక వెంకట్రామయ్య ఒక్కరే వస్తారని తేల్చి, 'నాకు పిల్లని చూడాలని పట్టింపు లేకపోయినా, వాళ్లకు ఉండచ్చు. అందువల్ల పట్టుకేళ్ళండి' అని ఆనందం ఈ ఫోటో ఇచ్చాడు.'
ఎన్.సి.సి లో డ్రెస్ లో ఆనందం తీయించుకున్న ఫోటో చూసి , మాధవరావు తల ఊపాడు. తర్వాత ఆ ఫోటో జ్యోతికి ఇచ్చాడు. గంబీరంగా ఉన్న ఆనందం ఫోటో కేసి తదేక దృష్టి తో చూస్తున్న జ్యోతి తో "నచ్చాడా?" అన్నాడు. మాధవరావు. "ఫో-- డాడీ!" అంటూ ఫోటో రెండు చేతులలోనూ దాచుకుంటూ లోపలికి పరుగెట్టింది జ్యోతి.
