Previous Page Next Page 
కౌసల్య పేజి 10

 

                                      6
    వర్షా శుభ్ర స్నాత పారిజాత పుష్పంలాగ , తెల్లవారుతుండగానే తలారా స్నానం చేసి, తెల్లని పట్టు బట్ట కట్టుకుని దేవుడి మందిరం ముందు కూచుంది కౌసల్య. ఏళ్ల తరబడి తన గుండెలను దహించి వేస్టున్న మంట లాగ, ఎర్రని కుంకుమ రేఖ నుదుట పెట్టుకుంది. ఏకాగ్రతా, నిశ్చలత్వమూ ముఖానికో వింత కాంతిని ఇస్తూ ఉంటె అరమోడ్పు కన్నులతో మౌనంగా అంబాష్టకం చదువుతుంది.
    తదేక ధ్యానంతో అమ్మవారిని పూజిస్తున్న కౌసల్య ను చూసి, దేవుడి గది గుమ్మం దగ్గరే ఆగిపోయింది వంటమనిషి శేషమ్మ. నోటిలో మాట నోటిలోనే ఉండిపోయింది. కౌసల్య ను ఆ స్థితిలో పలకరించడం ఎంత ప్రమాదకరమో శేషమ్మ కు అనుభవం వల్ల తెలుసు. ఒక్కర్తే కూచుని ఆలోచించుకొంటున్నప్పుడూ , ఏకాగ్రతతో దైవధ్యానం చేస్తున్నప్పుడూ ఎవరైనా తనను పలకరిస్తే కౌసల్య వాళ్ళను క్షమించదు.
    కౌసల్య కోసం హల్లో గుమస్తా వేచి ఉండి పచార్లు చేస్తున్నాడు. పని అంతా పూర్తీ చేసుకుని అమ్మగారు పూజ నుంచి లేస్తే, చెప్పి వెళదామని పనిమనిషి పెరట్లో నిలబడి ఉంది. దేవుడి మందిరం ముందు కూచున్న కౌసల్య ను పలకరించే ధైర్యం లేక వెనక్కు వచ్చి, హల్లో గుమస్తాను పలకరించి తిరిగి పెరట్లో కి వెళ్ళింది శేషమ్మ.
    "అమ్మగారు పూజ లో నుంచి లేచారా అండీ" అంది పనిమనిషి.
    "ఇంకా లేదు. ఈపాటికి పూజ పూర్తీ కావాల్సిందే మరి" అని చెప్పింది శేషమ్మ.
    "మరేం లేదండి. నిన్న రాత్రి కూడా కూడు వండ లేదండి పిల్లలకి."
    "ఏం? మీ అయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదా?"
    "వాడోస్తాడా? ఎంత పట్టుదల వాడికి? నా తప్పు లేకపోయినా , నేనే వెళ్లి వాడి కాళ్ళ మీద పడి ఏడవాలి. అలా ఏడవగా ఏడవగా కాసేపటికి వాడి మనస్సు కరిగితే వస్తాడు."
    "అసలింతకీ గొడవఏమిటి?"
    "ఏముంది? వడ్ల గింజలో బియ్యపు గింజ. మన ఇద్దరి పాటూ కలిసినా ముప్పై- రూపాయలు లేవు కదా, ఇందులో పది రూపాయలేట్టి మీ చెల్లికి చీరెడితే ఎలాగ? అన్నా. ఇంక చూసుకోండి. హత్తేరి , నా చెల్లికి చీరేడతానంటే ఏడుస్తావా? అంటూ రెచ్చిపోయాడు. నేనెంత చెప్పినా వినడే. చివరికి తింటూ తింటున్న అన్నం గిన్నె కూడా నెట్టేసి, నేనెంత మొత్తుకుంటూన్నా వినకుండా వెళ్ళిపోయాడు" అంటూ కళ్ళు ఒత్తుకుంది.
    అదే సమయంలో కౌసల్య పూజ పూర్తీ చేసి, అమ్మవారి నిర్మాల్యం శిరస్సున ధరించి, ఇంత క్రితం ఉన్న బొట్టు మీదే అమ్మవారి కుంకం పెట్టుకుని పెరటి వేపు వస్తుంది.
    "ఏడవకేడవకు . మగవాళ్ళ పద్ధతంతా అంతే. ఆడవాళ్ళం మనమే సరిపెట్టుకోవాలి" అంది శేషమ్మ.
    "సరిపెట్టుకోవడం అంటున్నారు. ఎవరి సంగతి పిన్నిగారూ?' అంది అక్కడికి వస్తూ కౌసల్య. ఒక్కమాటుగా శేషమ్మ ఉలిక్కిపడి, అంతలోనే తేరుకుని "అబ్బే, మన పనిమనిషి సంగతి" అంది.
    "ఏం వచ్చింది?"
    "నిన్నటి నుంచి ఇంట్లో భోజనాలు లేవుట."
    "ఏం, డబ్బు లేదా? మనం ఏ నెల కానెల ఇచ్చేస్తున్నాంగా?"
    "మీరు ఇవ్వడం లో లోపం ఏమీ లేదండీ. ఆ మాట అనడానికి నాకు నోరెలా వస్తుంది?' అంది పనిమనిషి.
    "జీతం అయిపోయిందా? మరి మీ అయన ఏమీ సంపాదించడం లేదా?" అంది కౌసల్య.
    "వాడే తిన్నగా ఉంటె ఇంక సంసారానికి లోటేందుకండి?" అంది పనిమనిషి, కౌసల్య ప్రశ్నార్ధకంగా ఓ మారు పనిమనిషి కేసి, ఇంకో మారు వంటమనిషి కేసీ చూసింది.
    "రోజూ ఏదో ఓ కబ్జా. లేనిపోని కయ్యాళీ పెట్టుకొని వెళ్లి పోతా డింట్లోంచి . మళ్లా నేను వెళ్లి బతిమాలి వినకపోతే ఏడిచి, కాళ్ళట్టుకుని తీసుకు రావాలి. నా తప్పేం లేకపోయినా సరే, నేనే బతిమాలాలి. వాడికేం వాడు మగరాజు, భర్తా!"
    "పట్టుదలలన్న మాట! ఊ! పిన్నిగారూ,దానికో శేరు బియ్యం కొంగులో పోసి పంపించండి. పిల్లలకి కాచి పోసుకుంటుంది." అంటూ హల్లోకి వెళ్ళిపోయింది కౌసల్య తనలో తలఎత్తిన కలవలపాటును పైకి కనిపించనీయకుండా . హాల్లోకి వెళ్తున్న కౌసల్య చెవిలో పడ్డాయి పనిమనిషి మాటలు" అమ్మగారు కనికరం ఉంచి ఇస్తున్నారు గాని, వాడింటి కోస్తేనే నేనీ నూకలీవాళ కాచుకు తాగేది. లేకపోతె వాడి జీవానికి పడి నేను ఈ పూట కూడా పస్తే." కౌసల్య కళ్ళు చెమర్చాయి.
    "ఏం, గుమస్తా గారూ, కమీషనరు గారు ఏమన్నారు" అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది అది మరిచి పోవడం కోసం.
    "ఇంటి పన్ను తగ్గించడం కుదరదుట."
    "ఎందుకని?"
    "ఇంతక్రితం మనం ఇచ్చే పన్ను మేజరు పంచాయుతీ ఉన్నప్పుడు వేసినదట. మునిసిపాలిటీ అయింది కనుక, మనమీ ఎక్కువ పన్ను భరించవలసిందేనట."
    "మునిసిపాలిటీ వల్ల మనకి పెరిగిన సౌకర్యాలేమిటి? మురికి కాలవలు, దోమలు, దుమ్ము రోడ్లేగా? పన్ను పెంచడం లోనూ మరీ విపరీతంగా పెంచారని చెప్పారా?"
    "ఆహా. పదీ పాతికా హెచ్చించడం సబబు కాని, మరీ మూడు రెట్లు పెంచడం న్యాయం కాదన్నానండి."
    "ఏమన్నారు అలా అంటే?"
    "ఏమైనా సరే వేసిన పన్ను తగ్గించేది లేదుట. అవసరం అయితే కోర్టుకి వెళ్ళమన్నారు."
    "అయితే సరే . కోర్టు కే వెళదాం. మన ప్లీడరు గారితో సంప్రదించండి. అవసరం అయితే ఇంకో నాలుగు వందలు ఖర్చు అయినా సరే ఈ మునిసిపాలిటీ సంగతేమిటో కనుక్కోవాలి."
    "ఇప్పుడే వెళ్ళమంటారా?"
    "వెళ్ళండి. ఆలస్యం ఎందుకు?" అని గుమస్తాను పంపించేసి, "పిన్నిగారూ, అబ్బాయి ఎక్కడి కెళ్లాడు?' అంది కౌసల్య. శేషమ్మ మసిచేయ్యి చీర కొంగున తుడుచుకుంటూ వచ్చి "ఏమోనమ్మా. ప్రొద్దుట కాఫీ తాగి వెళ్లాడు. ఎక్కడి కెళ్లాడో ఏమో" అంది.
    "మీతో ఏం చెప్పలేదా?"
    "ఇప్పటికి నెల్లాళ్ళ నుంచి చెబుతున్నాడు తనకు టేబిల్ మీద అన్నం వడ్డించమని. వంటింట్లో ఆ మసి లో , పొగలో నేల మీద ఆ పీట వేసుక్కూచుని తానింక తినలేడట. 'ఈ పూట టేబిల్ మీల్సు పెడితేనే ఇంట్లో భోం చేసేది' అని కేకవేస్తూ వెళ్ళిపోయాడు."
    కౌసల్య కు తిలక్ ప్రవర్తన ఆశ్చర్యంగాఅనిపించింది. హోటళ్ళ లోనూ, హాస్టలు లోను లాగ ఇంట్లో కూడా కుర్చీ, టేబిలూ వేసుకుని భోజనం చెయ్యడం ఏం బాగుంటుంది? ఇదేం సరదా? అలా తినడం లో వీలు మాత్రం ఏముంది? టేబిల్ మీద ఉన్న అన్నం ఎలాగ తీసుకుని తినడం? చేతులు పీకవూ? కౌసల్య కు నవ్వు వచ్చింది తన ఆలోచనకు. వాడేదో టేబిల్ మీల్సు కావాలన్నాడు  ఒప్పుకుంటే ఒప్పుకోవడం, లేకపోతె లేదు. దీనికింత ఆలోచన ఎందుకు? అయినా ఒప్పుకుంటే మాత్రం, ఇందులో వచ్చే నష్టం ఏముంది? తను మరీ ప్రతి చిన్న విషయం లోనూ వాడిని అదుపులో పెట్టడం మంచిది కాదు. పెద్దవాడవుతున్నాడు,. పూర్వం లాగ చిన్న పిల్లాడెం కాదు వాడు. చెవి మెలిపెట్టి రెండు కొట్టడానికి. తన బావగారు అచ్యుతరామయ్యగారు అంటూ ఉండేవారు -- 'జ్ఞానం వచ్చిన మగపిల్లాడి ఇష్టం కూడా ఇంట్లో కొంత చెల్లుబడి అవుతూ ఉండాలి' అని. ఈ ఆలోచనతో గొలుసు కట్టులాంటి జ్ఞాపకాలు మరెన్నో రాసాగాయి కౌసల్య కు.
    "పోనీ వాడికీ పూట నుంచీ టేబిల్ మీల్సు పెట్టండి." అని శేషమ్మ ను పంపించేసి, పడక కుర్చీలో నడుం వాల్చింది.
    పనిమనిషి మొగుడి కో పట్టుదల, కమీషనర్ కో పట్టుదల, తిలక్ కు ఇంకో పట్టుదల. ఉత్తముడైన వ్యక్తిగా తిలక్ ను తీర్చి దిద్దాలని తనకో పట్టుదల. చూడగా చూడగా ఈ లోకంలో విజయాలకూ, వినశాలకూ కూడా ఈ పట్టుదలే ముఖ్య మైన కారణంగా కనిపిస్తుంది.
    కాని కొన్ని చోట్ల ఈ పట్టుదల ఉండడం ఎంత అవసరమో, మరి కొన్ని సందర్భాల్లో పట్టు సడలించి సర్దుకు పోవడం కూడా అంతే అవసరం. పట్టుదల వల్ల కొన్ని కార్యాలు సాధిస్తే, ఆ పట్టు సడలించడం వల్ల కొన్ని అనర్ధాలను అపు చేయవచ్చు. సర్దుకుపోవడం అనేది కూడా ఎప్పుడూ కుదరదు. తను గాడంగా నమ్మిన ఆదర్శాలు కాని, తానెంతో విలువగా చూచుకుంటున్న ఆత్మ గౌరవం కాని వదులుకోవలసి వచ్చినప్పుడు సర్దుకు పోవడం అనేది కుదరదు. వచ్చేది అనర్ధం అని తెలుసి కూడా, ఆత్మగౌరవం కోసం అభిమానం ఉన్న వ్యక్తీ సర్దుకుపోడానికి ఒప్పుకోడు.
    తన స్థితి సరిగ్గా అలాగే అయింది. ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించి పెళ్లి చేసుకొన్న తన భర్త తనను గడ్డి పోచకంటే హీనంగా  చూచి వెళ్ళిపోయారు దేశ సేవ కోసం. పునస్సందానం అయిన మర్నాడు తను అనురాగ విపంచిక మేళవించి , అనందానుభూతిలో తన్మయీభావ స్థితిలో ఉండగా దేశ సేవ, దేశ సేవ అంటూ వెళ్లి పోయారు. ఎంత కఠిన హృదయులనైనా కరిగించ గలిగే కన్నీళ్లు ఆ అహంకారి ముందు ఎందుకూ పనికి రాలేదు.
    పట్టుదలతో అయన వెళ్లి పోవడాన్ని తన అసమర్ధత క్రింద పరిగణించి అంతా తనను నవ్వులతోనూ, చూపులతోను అవమానిస్తుంటే సహించి ఊరుకొంది అయన జైలు నుంచి వచ్చేదాకా, ఆ అయిదారు నెలలూ.
    తండ్రి ఎంత వారిస్తున్నా వినకుండా , అయన జైలు నుంచి విడుదల ఆయె రోజున తను కూడా వెళ్ళింది కాకినాడ. దూరం నుంచే తనను చూసి నవ్వారు. ఆయనకు ఎన్ని దండలు వేశారో, ఎన్ని సన్మానాలు చేశారో ఆరోజున లెక్కే లేదు.
    "నేను సాయంత్రానికి వస్తాను పుల్లేటి కుర్రు . మీరు ముందు వెళ్ళం"డని అన్నగారినీ, అన్నగారి అల్లుడి నీ ముందు పంపించి వేసి సాయంత్రం తనను తీసుకొని బయలుదేరారు.
    సూర్యాస్తమయం అవుతుండగా కోటిపల్లి రేవు చేరారు. గోదావరి నావలో దాటుతుండగా అన్నారు. "ఇదిగో! ఈ ఆనందం కోసమే అన్నయ్య నూ, వాళ్ళనూ ముందు పంపించేశాను" అని. తనకు సిగ్గు వేసింది. "ఉండు ఉండు చూడనీ. ఆ ఎర్రని సూర్యాని కన్నా, నీ బుగ్గలే ఎక్కువ ఎర్రగా ఉన్నాయి" అన్నారు. తనకేదో దివ్య లోకాల్లో తేలిపోతున్నట్లనిపించింది. లోతుగా నిశ్చలంగా ఉన్న గోదావరీ జలాల పై ఎర్రని సూర్య కాంతులు పడి , కెంపులు పరిచినట్లు ఎంతో మనోహరంగా ఉంది చుట్టూ నీరు. ఉండుండి ఆ ఎర్రని కెంపు ల్లోంచి , ఓ తెల్లని చేప మెరుపు మెరిసినట్లు కనిపించి మాయమవుతుంది. నిశ్చలంగా వెళుతున్న తమ నావ తన వెనకాల ఓ అందమైన నీటి జాలును సృష్టిస్తుంది. ఆయనతో చేస్తున్న నిశ్శబ్ద గంబీరమైన ఆ నౌకా విహారం తనకు లోకాతీతమైన దివ్యాను భూతి నిచ్చింది.
    'ఈ ఆనందాన్నిలా శాశ్వతం చెయ్యి, భగవంతుడా' అని మనస్సులో నమస్కారం చేసుకుంది తను.
    ఆకాశం మీద తీతవు పిట్ట అరిచింది. తనకు చాలా భయం వేసింది. గుండె ఆగినంత పని అయింది. ఆయనకు దగ్గరగా జరిగి "ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళకండెం" అంది. కెంపు ల్లాంటి నీళ్ళు దోసిట్లో కి తీసుకుని, అవి ఇంద్ర నీలాలుగా మారడాన్ని వింతగా చూస్తూ "అలాగే" అన్నారు. గోదావరి సలిలాలు చేత్తో తీసుకొని అయన ప్రమాణం చెసినట్లనిపించింది ఆ సమయంలో తనకు.
    పుల్లేటి కుర్రు లో ఆయనతో గడిపిన ఆ ఆరు నెలలూ , జీవితం లో మరుపు రాని మధుర కాలం. ప్రతిరోజూ ఒక ఆనంద స్వప్నం. ప్రతి క్షణం దివ్యానుభవ పరీమళం. ఒక్క క్షణం కూడా తనను వదిలి ఉండేవారు కాదు అయన. ఇంట్లో ఏదేనా పని చేసుకుంటూ ఓ అరగంట కనక ఆయనకు కనిపించక పొతే "కౌసల్యా, కౌసల్యా" అంటూ ఒకటే కేకలు. తీరా వెళ్లి చూస్తె ఏమీ ఉండేది కాదు. మధ్యాహ్నం సమయంలో దేశ పరిస్థితులూ, కాంగ్రేసు చరిత్రా ముచ్చటిస్తూ ఉండేవారు.
    అయన చెప్పే కొత్త సంగతులేవో వింటూ ఓ రోజున అడిగింది తను. "మీకేలాగేనా బాల గంగాధర తిలక్ , గోపాల కృష్ణ గోఖలే అంటే బాగా ఇష్టం అనుకుంటా. రోజు మొత్తం లో ఒక్క మాటేనా వాళ్ళ గురించి ప్రస్తావించకుండా ఉండరు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS