Previous Page Next Page 
కౌసల్య పేజి 8

 

    ఇది జరిగిన వారం రోజులకు ఆనందం పేపరు లో ఎడ్వర్ టైజుమెంటు వెంకట్రామయ్య కు చూపించి "బి.ఎ. పాస్  అయిన వాళ్లకి పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలు వేశారు బాబయ్యా. దరఖాస్తు పెట్టుతున్నా" అన్నాడు.
    "ఛ. పోలీసు ఇన్ స్పెక్టరా?' అని అంతలోనే సర్దుకొని "అవునులే స్వతంత్ర భారత దేశంలో అయితే ఆ ఉద్యోగం తప్పు లేదు. పూర్వం అంతా అసహ్యించుకొనేవారు సబ్ ఇన్ స్పెక్ట్రరంటే " అన్నాడు వెంకట్రామయ్య.
    "ఏం?"
    "ఏముంది? ఆ ఉద్యోగం లో చేరిన ప్రతి వాడూ కాంగ్రేసు సత్యాగ్రహుల మీద లాఠీ ప్రయోగం చెయ్యవలసివచ్చేది. 'పరాయి ప్రభుత్వం బానిసలై దేశీయుడైన నీ సోదరుడ్నే హింసిస్తున్నావు' అంటూ అంతా ఈసడించుకొనేవారు. అలా ఈసిడించుకోవడం న్యాయం కాదనుకో. తన ధర్మం తను చేసేవాడు."
    "ఏమైనా మంచి క్రమశిక్షణ ఏర్పడుతుంది బాబయ్యా, ఈ ఉద్యోగం వల్ల."
    "సక్రమంగా ప్రవర్తిస్తే అ మాట నిజమే! నాకు అప్పుడప్పుడు ఇంగ్లండు నుంచి ఉత్తరం వ్రాస్తూ ఉంటాడు, విల్సన్ అని--"
    "అవునవును . ఐ.జి. చేసి రిటైర్ అయ్యాడూ...."
    "ఆ! అతనే. 1941 లో నేను వ్యష్టి సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్లినప్పుడు జైలు సూపరింటెండెంటుగా ఉండేవాడు. జైల్లో ఉన్న ఆ అయిదారు నెలలూ అతనితో మంచి స్నేహం అయింది. విడుదల అయాక నెలకోసారయినా వచ్చి, నా యోగక్షేమాలు తెలుసుకుంటుండేవాడు."
    'అతనే కదూ మళ్ళీ డి.ఎస్.పి . అయి 1942 ఆగస్టు అల్లరుల్లో నిన్ను అరెస్టు చేసింది?"
    "ఆ! ఆ రోజు అతను చూపిన ఔదార్యాన్ని ఎప్పటికీ మరిచి పోలేను. నియమ నిబంధనాలన్నీ సడలించి, ఎంతో ఉదారంగా, మానవీయతతో ప్రవర్తించాడు. అంత మంది సబ్ ఇన్ స్పెక్టర్లు ఉండగా తనే అరెస్టు చెయ్యడానికి ఈ వూరు వచ్చాడు! 'పగలల్లా ,మీటింగు లూ, తిరగడం -- బాగా శ్రమ పడి ఉన్నాను. కొంచెం సేపు రెస్టు తీసుకోనియ్యండి. తర్వాత అరెస్టు చేద్దురు గాని" అన్నా. కొంచెం సేపు ఏమిటి? తెల్లవారిం దాకా తీసుకోండి. మళ్ళీ ఎన్నాళ్ల కి విడుదల అవుతారో! మీ భార్య తోటీ, కావలసిన వాళ్ళ తోటి కబుర్లు చెప్పుకుని సంతోషంగా ఈ రాత్రి గడపండి" అని అనుమతి ఇచ్చి, నా గదికి బయట పడక కుర్చీ లో తను కూర్చున్నాడు రాత్రి తెల్లవార్లూ , బందోబస్తు తో.
    "తెల్లవారితే నిన్ను అరెస్టు చేస్తానన్నాడు గదా? ఆ రాత్రి నీకు నిద్దర పట్టిందా బాబయ్యా?'
    "అదేమిటిరా? అలా అయితే పని చెయ్య గలిగమా? డప్పుల సుబ్బారావు అని పేరు విన్నావేమో. అతనూ డి.ఎస్.పి చేశాడు. అతనంటే లోకానికంతకీ హడలు. మా సత్యాగ్రహులకి మాత్రం ఎంత నిర్లక్ష్యమో అతనంటే...."
    ఆనందరావు ఆసక్తితో ఆ విషయాలన్నీ వింటూ కూర్చున్నాడు.
    "అప్లై చెయ్యి. మంచిదే!" అన్నాడు వెంకట్రామయ్య. ఇంతలో జానకి పరిగెత్తు కుంటూ వచ్చింది దేవాలయం నుంచి చక్రపొంగలి ఆకూ ఓ చేత్తో పులిహోర ఆకూ ఇంకో చేత్తో పట్టుకుని.
    "పొద్దుటే ఎక్కడి నుంచి, అమ్మా" అన్నాడు వెంకట్రామయ్య.
    "ఇంకెక్కడి నుంచి? అదిగో కనిపిస్తోందిగా రెండు చేతుల్లోనూ ప్రసాదం? ధనుర్మాసం ఆరంభమైంది మొదలు రోజూ కేశవస్వామి ఆలయంలో గంట కొట్టే టప్పటికి మన జానకి అక్కడ తయారు ప్రసాదాల కోసం." నవ్వుతూ ఆనందం జానకి కేసి చూశాడు.
    జానకి "ఫో . నీకేం?" అని పెంకె గా ఓ మాటు తల విసిరి వెళ్ళిపోయింది లోపలికి. వెంకట్రామయ్య నవ్వుకున్నాడు.
    గుమ్మం ముందు అందంగా పెట్టిన రకరకాల ముగ్గులు, వాటి మధ్య ముచ్చటగా ఉంచిన గొబ్బిళ్ళు, గొబ్బిళ్ళ అందాన్ని ద్విగుణీకృతము చేస్తున్న బంతి పువ్వులూ, బంతి పువ్వులతో కలిసి గొబ్బిళ్ళ నలంకరించిన పసుపు కుంకుమలూ-- ఇవన్నీ కలిసి వాకిట్లో వినూత్న సౌందర్యాలను విరజిమ్ము తుంటే వెంకట్రామయ్య వాటి కేసే చూస్తూ కొంతసేపు ఉండిపోయాడు.
    బాబయ్య నిశ్శబ్దం గా ఉండడం చూసి ఆనందం లోపలికి వెళ్ళిపోయాడు. విశాలాక్షి మజ్జిగ చిలికి వెన్న ఇంకా పడక పొతే, కుండలో కొంచెం నీళ్ళు పోసి, మూత పెట్టి వీధి వరండా లోకి వచ్చింది. హాల్లోకి వెళ్ళే గుమ్మం లో తలుపు వెనకాల నిలబడి "బాబయ్యా, ఈ పూట ఏం వండమంటావు?' అంది.
    "నన్ను అడిగేది ఏమిటమ్మా? ఏదో ఒకటి వండు" అన్నాడు గొబ్బిళ్ళ మీంచి దృష్టి మరల్చకుండానే వెంకట్రామయ్య.
    "శాస్త్రి గారింట్లో గుమ్మడి కాయ కొట్టు కున్నారట -- చెక్క పంపించారు. పులుసు పెట్టనా లేకపోతె కూర వండనా?' అంటుండగానే పెరట్లోంచి జానకి గబగబా వచ్చి "కూరే వండాలి. సేనగపప్పూ, గుమ్మడి కాయా వేసి చాలా రోజులయింది" అంది.
    "పోనీ అలా చెయ్యమ్మా" అన్నాడు వెంకట్రామయ్య. జానకి విజయ గర్వంతో విశాలాక్షి వంక చూసింది. విశాలాక్షి నవ్వుతూ "ఇవాళ నీ గొబ్బిళ్ళకి కూర నైవేద్యం పెట్టుకుంటా వేమిటే?' అంది.
    "అన్నట్టు --- అమ్మా, గొబ్బిళ్ళ కు ఇవాళ  వైవేధ్యమే పెట్టలేదు. పూజ చేస్తుంటేనే కేశవస్వామి ఆలయంలో గంటలు కొట్టారు."
    "వెంటనే పరిగెత్తావు , పూజ ఆపుచేసి, పులిహోర కోసం!"
    జానకి చిన్న బుచ్చుకుంది.
    "మించిపోయిందేమీ లేదు. ఇప్పుడు పెట్టు -- పోనీ" అన్నాడు వెంకట్రామయ్య. జానకి ప్రశ్నార్ధకం గా విశాలాక్షి కేసి చూసింది. "సరే కానియ్యి " అంది విశాలాక్షి.
    ఐదు నిమిషాల్లో వడపప్పూ, పానకం చేసి తీసుకు వచ్చింది జానకి. "పిచ్చిపిల్లా, అదేం ప్రసాదమే. నే తెస్తానుండు." అంటూ లోపలికి వెళ్లి, అరిటి పళ్ళ కావులోంచి బాగా మగ్గిన పళ్ళో డజను ఒక పళ్ళెం లోనూ, కొబ్బరి కాయ ముక్కలూ బెల్లం కలిపి ఇంకో పళ్ళెం లోనూ తీసుకువచ్చింది విశాలాక్షి. ఇన్ని ప్రసాదాలు కనిపించేసరికి ఆ వీధిలో ఉన్న అయిదారుగురు కన్నె పిల్లలూ అక్కడికి చేరారు.
    'అప్పుడే నైవేద్యం పెట్టేయకండి. కాసేపు గొబ్బి తట్టండి" అన్నాడు వెంకట్రామయ్య.
    "బాగా ఎండేక్కి పోయింది. ఇప్పుడేమిటి గొబ్బి తట్టడం?' అంది అందులో ఓ పిల్ల. "ఫరవాలేదు " అన్నారు తక్కిన వాళ్ళు.
    "గొబ్బీ సుబ్బమ్మ -- సుబ్బిడి నియ్యవే
    చామంతి పువ్వంటి -- చెల్లెల్లియ్యవే
    తామర పువ్వుంటి -- తమ్ముడ్నియ్యావే
    బంతీ పువ్వంటి -- బావ నియ్యావే
    మొగలి రేకంటి ..........."
    ఆఖరి చరణం పూర్తీ చెయ్యకుండా అంతా పరికిణి చేరుగులు నోటి కడ్డం పెట్టుకుని నవ్వుకున్నారు.
    "నవ్వుతారేమర్రా -- పూర్తిగా పాడకుండాను" అన్నాడు వెంకట్రామయ్య ఏమీ ఎరగనట్టు.
    "ఫో, తాతయ్యా" అని జానకి ప్రసాదాలన్నీ అందరికీ పంచి కాళీ పళ్ళేలు లోపలికి పట్టుకొని వెళ్ళిపోయింది. పిల్లలు కూడా వెళ్ళిపోయారు. వెంకట్రామయ్య కళ్ళ నీళ్ళు నింపుకొని "ఇంకా చిన్నతనం పోలేదు. దీని కప్పుడే పెళ్ళేమిటి?' అన్నాడు.
    "పెళ్ళయితే సరి. ఎక్కడి చిన్నతనం అక్కడే పోతుంది." విశాలాక్షి మాటలు విని వెంకట్రామయ్య తెల్లబోయాడు. 'కన్నతల్లె కదా తను? పరాయి దానిలా మాట్లాడుతుందేమిటి?' ఆడవాళ్ళ విచిత్ర ప్రవర్తనకు వెంకట్రామయ్య కు ఆశ్చర్యం వేసింది. కొన్ని కొట్ట వచ్చినట్టుండే సత్యాలనూ, విడ్డూరంగా కనిపించే విపరీతాలనూ కుండ బద్దలు కొట్టినట్టూ చెబుతారు ఆడవాళ్ళు. అక్కడ తల్లి అయేది, పిల్ల అయేది మమతలేవీ అడ్డురావు.
    "పోనీలేద్దూ . దానికిప్పుడు పెళ్లి కేం తొందరోచ్చింది/ ఎలాగా కాలేజీ లో చేర్పిద్దాం అనుకుంటున్నాంగా?"
    "అవుననుకో . కాలేజీ లో చేర్పించినా , కలిసొస్తే ఏదైనా సంబంధం చేసెయ్యచ్చుగదా?"
    'అలా ఈ రోజుల్లో ఏం కలిసొస్తాయమ్మా, నీ వెర్రి కాని?"
    "లేకపోతె ఓ పని చెయ్యచ్చు.ఆనందాని కో శుభ్రమైన సంబంధం చూసి ఆ కట్నం బాపతు ఏమైనే వస్తే , అది పెట్టి జానకి పెళ్ళి చేసెయ్యవచ్చు."
    "అదెలాగ? మనకి కట్నాలు పుచ్చుకొనే ఆనవాయితీ లేదు కదా?"
    "మన చాదస్తాలు మరీను. పుచ్చుకునేటప్పుడు ఆనవాయితీ లేదంటే మాత్రం, ఇచ్చేటప్పుడు తప్పుతుందా?" అంటూ విశాలాక్షి వంటింట్లో కి వెళ్ళిపోయింది.
    ఎంతసేపు ఆలోచించినా కట్నం తీసుకోవడం లో ఉన్న న్యాయం ఏమిటో వెంకట్రామయ్య కు బోధపడలేదు. ఈడూ, జోడూ కుదిరిన లక్ష్మి లాంటి పిల్లని ఇంటికి తెచ్చుకోడానికి బదులు, కట్నం, కట్నం అంటూ డబ్బు పై ఉన్న కాంక్షను సిగ్గు లేకుండా ఎలా చూపించుకుంటారో ప్రజలు? పవిత్రమైన దాంపత్య బంధాన్నీ, సుందరమైన జీవిత సూత్రాన్నీ కట్నం ఎంత కలుషితం చేస్తూ ఉందొ ఊహించేటప్పటికి , వెంకట్రామయ్య కు ఈ లోకం మీద అంతులేని అసహ్యం వేసింది.

                                      5
    పెద్దా పురం లో ఉన్న ఒకరిద్దరు పెద్ద గృహస్తులలోనూ మాధవరావు ఒకడు. డబ్బుతో పాటు మంచితనం, మంచితనం తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన పలుకుబడీ కూడా ఉన్నాయేమో , శాసన సభకు ఏ పార్టీకి చెందని అభ్యర్ధి గా పోటీ చేసి, విజయం సాధించాడు. తను నమ్మిన దాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే స్వభావమేమో అతనిది , అది తెలిసిన వారెవరూ అతన్ని తప్పుగా అర్ధం చేసుకోరు. తనకు నచ్చినదాన్ని ఆకాశం లోకి ఎంత ఎత్తుతాడో, మంచిది కాదు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తాడు. అందుకే అసెంబ్లీ లో అతన్ని ప్రతి ప్రక్షానికి చెందినవ్యక్తీ గా ప్రభుత్వ పక్షమూ, ప్రభుత్వం వైపు మనిషిగా ప్రతి పక్షమూ అనుకుంటుంటాయి.
    భార్య కాపురానికి వచ్చిన పది పదిహేనేళ్ళ దాకా సంతానం కలగక పోవడంతో , మద్రాసు అనాధ శరణాలయం లో తనకు అందంగా కనిపించిన అయిదేళ్ళ అమ్మాయి జ్యోతిని తీసుకు వచ్చి పెంచుకున్నాడు మాధవరావు. అయిదో ఏటే మాధవరావు ఇంటికి వచ్చిందేమో , జ్యోతి వాళ్ళలో బాగా హత్తుకుపోయి సుగుణ, మాధవరావులనే తల్లి తండ్రులుగా ఊహించుకుంటూ పెరిగింది. జ్యోతి వచ్చిన పదేళ్ళ కు తనకు సంతానం కలిగే చిహ్నాలు కనిపించడంతో , మాధవరావు దూరం అలోచించి తన ఆస్తిలో మూడవ వంతు జ్యోతి పేర అన్ని హక్కుల తోటీ వ్రాసేశాడు. తనకు పుట్టిన శేఖర్ నూ, తన దత్త పుత్రిక జ్యోతి నీ రెండు కళ్ళుగా చూసుకుంటున్నాడు మాధవరావు.
    కాకినాడ కాలేజీ లో చేర్పించిన దగ్గర నుంచీ జ్యోతి కి పెళ్ళి సంబంధాలు చూడడం మొదలెట్టాడు మాధవరావు. ఈ విషయంలో తనకు సహాయంగా తన బాల్య మిత్రుడు రామదాసు ను నియమించు కున్నాడు. వరాఅన్వేషణలో మాధవరావు కు సాయం చెయ్యడానికి రామదాసు వెంటనే ఒప్పుకున్నాడు. ఏమంటే, ఆ వంకన నాలుగూళ్ళూ తిరుగుతుంటే, తన కూతురు అన్న పూర్ణ కు కూడా ఏదైనా అనుకూలమైన సంబంధం వెతక వచ్చునని. అందానికి అందమూ, చదువు కు చదువూ , సంపాదకు సంపదా అన్నీ ఉన్న జ్యోతి కే సంబంధం కుదరడం గగనం అవుతుంటే అన్నపూర్ణ పెళ్ళి తను ఎలా చెయ్యగలడో అర్ధం కావటం లేదు రామదాసు కు. తనకా, డబ్బు లేదు. పోనీ అమ్మాయి ఏమైనా అందమైనదా అంటే, అదీ కాదు. కట్నమూ లేక, అందమూ లేకపోతె , పిల్ల నెవరు చేసుకుంటారు?
    మాధవరావో రోజున రామదాసును పిలిచి "ఆ వెంకట్రామయ్య గారి సంగతేమైనా తెలిసిందా?' అని అడిగాడు.
    "ఏ వెంకట్రామయ్య గారు?"
    "అదే -- సర్పవరం లో గవర్నమెంటు నాకిచ్చిన బంజరు పక్కనే అతనికో అయిదేకరాలిచ్చిందీ...."
    "ఓ అతనా ? వాళ్ళది కొనసీమట. అతని అన్న గారి కొడుకు లిద్దరున్నారురట. పెద్దతనికి కళత్రం పోయింది. అప్పటి నుంచీ పెళ్ళి చేసుకోలేదుట."
    "అందేందుకులే మనకి? చిన్నవాడి సంగతేమిటి?"
    "బి.ఎ. పాస్ అయాడు."
    "వయస్స్ మాత్రం ఉంటుంది?"
    "ఆ వివరాలేవీ ఇంకా తెలియలేదు."
    "పోనీ ఓ మాటు ఆవూరు వెళ్ళి రాకూడదూ? కుర్రాడే మాత్రం బుద్దిమంతుడైనా , మన హోదాకు సరిపడిన స్థితి గతులుంటే మన జ్యోతిని చూసుకోడానికి రమ్మని పిలువు. ఊళ్ళో వాకబు చెయ్యి కుర్రాడి ప్రవర్తన, వాళ్ళ ఆస్తి పాస్తులు  వగైరా."
    ఈ విధంగా రామదాసును పుల్లేటి కుర్రు పంపించిన తర్వాత ఒక రోజున అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు మాధవరావు. "వెంకట్రామయ్యకే కనక పదవి మీద ఆశ ఉంటే , ఈపాటి కే మినిస్టరో అయేవాడు" అని ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్.ఎల్. ఎ. లు అనుకుంటుండగా విన్నాడు. తను హైస్కూల్లో చదువుకొనే రోజుల్లు బులుసు సాంబమూర్తి గారితో కలిసి తిరిగేవాడి వెంకట్రామయ్య. త్యాగమూ, సేవా నిరతీ, దేశభక్తీ ఈ మూడే లక్ష్యాలుగా సాగిన ఆ మహాసమర యజ్ఞం లో తమ సుఖాలనూ, ఆనందాలనూ , నిండు జీవితాలనూ ఆహుతి చేసుకొన్న మహామహుల్లో వెంకట్రామయ్య ఒకడు. తన భవిష్యత్తు అంతా నాశనం చేసుకొన్న వెంకట్రామయ్య కు ఇవాళ మిగిలిందేమిటి? అయిదెకరాల బంజరు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS