Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 9

 

    
                                        6
    విశాఖ పట్నానికి నలభై మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉన్నది. పేరుకు పల్లెటూరైనా బస్తీలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. మంచి హోటళ్ళు, పెద్ద పెద్ద షాపులూ, హైస్కూలు. అ ఊర్లో కల్లా అందమైన కొత్త మేడ. ఆ ఊరి మోతుబరి రైతు సుబ్బరాజు గారిది. రాజు అక్కగారైన కమలమ్మ నిచ్చింది ఆయనకే. ఆస్థి పాస్తుల్లో రాధ తండ్రి సత్యనారాయణ గారితో సరితూగగల సంసారం వారిది. వారిద్దరికీ ఏకైక సంతానం పద్మ! చాలా అందమైన పిల్ల. పైగా మేనరికం. అందువల్ల చిన్నతనం నుంచీ పద్మను రాజు కిచ్చి పెళ్ళి చేద్దామను కొనే వాళ్ళు బంధువులందరూ. రాజుకీ, పద్మకీ కూడా ఇష్టమే. ఇక వున్న అడ్డు అంతా రాజు చదువే. కాబట్టి అతని చదువు పూర్తయ్యే వరకూ ఆగాలని నిశ్చయామైపోయింది.
    రాజు అప్పుడప్పుడు సెలవుల్లో వచ్చి అక్కగారింట్లో సరదాగా గడిపి పోవటం అలవాటు. ఆరోజు రాజు బావ వస్తున్నాడని తెలియగానే పద్మకు ఒక్క చోట కాలు నిలువలేదు. ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడి వక్కడ సర్దింది. బావ కోసం మేడ మీద గది శుభ్రం చేయించి అవసరమైన సామాన్లన్నీ అందులో అమర్చింది. తన ఏర్పాట్లు తనకే నచ్చక మళ్ళీ మళ్ళీ సర్ధసాగింది. బావ సరిగ్గా ఏ టైముకు వస్తాడో తెలియదు. అమ్మ నడిగి తెలుసుకొందామనుకుంటే సిగ్గు. కమలమ్మ కూతురి అవస్థ నంతా గమనించి కూడా మనస్సులో నవ్వుకొని చూడనట్లు నటించసాగింది. అందువల్ల పద్మ మాటిమాటికీ వాకిట్లో కి వచ్చి తొంగి చూస్తూ బావ రాక కోసం నిరీక్షించ సాగింది.
    సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం లో పంతులమ్మ తన స్నేహ సౌశీల్యంతోనూ, వనజ తన వాక్చాతుర్యం , రూప విశిష్టలతోనూ రాజును కదలకుండా బంధించి వేసి ఆశక్తుడ్ని చేసి వేస్తూన్నారు. పంతులమ్మ మరీ బలవంతం చేస్తుంది. హాస్పిటల్ నుంచి వచ్చినప్పత్నుంచీ ఆమెకు రాజంటే అపరిమితమైన ప్రేమాదరాలు ఏర్పడ్డాయి.
    "అదేం కుదరదు. ఇవ్వాళ ఆదివారం. అందరం కలిసి పిక్నిక్ వెళ్ళవలసిందే." వనజ చిన్న పిల్లలా మారాం చేస్తోంది.
    "అవును. వెళ్ళాల్సిందే. ఇవ్వాళన్న స్పిరిట్ మరొక రోజు వస్తుందో రాదో ఎవరికి తెలుసు? మీరేం అభ్యంతరం చెప్పకండి" పంతులమ్మ బ్రతిమాలింది.
    "నిజమే నాకు రావాలనేఉంది. కాని ఇవ్వాళ అక్కడకు వస్తానని వాళ్ళకు ముందే టెలిగ్రాం ఇచ్చాను. ఇప్పుడెలా?" రాజు వాదన అప్పటికే బలహీనమై పోయింది.
    "రావటం లేదని మళ్ళా టెలిగ్రాం ఇస్తే పోలా?" బాటు అల్లుకొంటున్న ప్రకాశం మధ్యలో అందుకొన్నాడు.
    "ఐతే వద్దులెండి. అంత కొంప ముంచుకు  పొయ్యే పనేమీ కాదుగా. పోనీ అంత అర్జంటైతే చెప్పండి. మేము బలవంతం చెయ్యం" వనజ అన్నది. ఆమె మాటల్లోని మొరటు తనం కన్నా మనసులోని ఆత్మీయతా భావమే అతణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. వనజ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అబద్దమైనా చెప్పాలి లేదా నిజం చెప్పి ఆమె పరిహసాలకైనా గురి కావాలి. నిజం చెప్తే బహుశా ఇక బలవంతం చెయ్యదేమో గాని అంతమంది ఎదుట కాబోయే శ్రీమతిని చూట్టానికి వెళ్తున్నానని చెప్పలేకపోయాడు. చివరకు "సరే కానివ్వండి." అన్నాడు.
    "స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అంటే అలా వుండాలి" ప్రకాశం చప్పట్లు కొట్టాడు.
    "మా అప్పలరాజు కి ఫోన్ చేస్తాను. మనకు టిఫినూ, అదీ రెడీ చేసి ఉంచుతాడు." అన్నాడు రాజు.
    వనజ నవ్వుతూ "ఒక్కరోజు కూడా మీ అప్పల్రాజు చేతి వంట తినకుండా ఉండలేరా ఏమిటి? ఇంతమంది ఆడవాళ్ళం ఇక్కడుండగా అదేం కుదరదు వంటంతా ఇక్కడే చేస్తాం. తినటం వరకే మీ పని. అసలు ఎక్కడి కెళ్ళటమో ముందు అది తేల్చుకోండి" అన్నది.
    "ఆనందరావు చాలా రోజుల్న్యుంచి లైటు హౌస్ కెళ్దామంటున్నాడు. అక్కడ అతని స్నేహితులున్నారట. ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు" పంతులమ్మ అన్నది.
    భీమ్లీ సముద్రతీరం చాలా అందంగా ఉంటుందని విన్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతె అక్కడి కెల్టాం" రాజు ప్రపోజ్ చేశాడు.
    "ఓ. అలాగే" అన్నది వనజ ఉత్సాహంగా.
    కాని ఆనందరావు తన అయిష్టం తెలియజేస్తూ అన్నాడు "భీమ్లీ అంత అందంగా ఉంటుందని మీకెవరు చెప్పారో గాని అంతా అబద్దమే. తాటాకు గుడిసేలూ, చేపల వాసనా తప్ప అక్కడ మరేమీ లేదు. అదీగాక ఈ టిఫినూ కారియరూ వాటితో బస్సులో అక్కడి కెళ్ళటం చాలా కష్టం."
    "డాక్టరు గారి కారున్నదిగా!' వనజ అన్నది.
    "కారుంటే ఉండచ్చు. కాని అక్కడ చూసేందు కేమీ లేదంటున్నాను." అన్నాడు ఆనందరావు కఠినంగా.
    "ఏమి ఎందుకు లేదు? అక్కడికే వెళ్దాం పక్కా!'
    ఎవరూ మాట్లాడలేదు. అనాలోచితంగా భీమ్లీ ప్రపోజ్ చేశానే అనిరాజు లోలోపల బాధపడుతున్నాడు! ఆనందరావు కు లైట్ హౌస్ కే వెళ్ళాలన్న పట్టుదలేమీ లేదు గాని, వనజ రాజు పక్షం వహించటమే అతనికి కోపం తెచ్చింది. అంతలో ప్రకాశం కలుగ జేసుకుని "పోనీ సింహాచలం వెళ్తే? కాస్త పుణ్యమైనా వస్తుందిగా?" అన్నాడు.
    "పోరా వెధవా. మధ్యలో నీ గొడవేమిటి?" వనజ కసురుకుంది.
    పంతులమ్మ ఎటూ చెప్పలేక సతమతమై పోతుంది. వనజ మాత్రం తానెన్నడూ కలలో కూడా చూడని భీమ్లీ సముద్ర తీరాన్ని అతిశయోక్తులతో వర్ణించి చెప్తూ పంతులమ్మ ఓటు సంపాదించటానికి ప్రయత్నించ సాగింది. ఆనందరావు ముఖం మాడ్చుకుని నిర్లక్ష్య వైఖరి వహించాడు.
    చివరికి వనజ పట్టుదల వల్ల భీమ్లీ వెళ్ళటమే నిశ్చయమైంది.

                           *    *    *    *
    అందరూ తిరిగి తిరిగి అలసిపోయి, ట్రావెలర్స్ బంగళా లో తలా ఒక మూల "ఉస్సురంటూ కూలబడ్డారు. పిక్నిక్ వచ్చామన్న ఉత్సాహం ఎవరిలోనూ లేదు. వనజ ప్రవర్తనే అందుక్కారణం. కావాలనే రాజును పూసుకు తిరిగి ఆనందరావు మనస్సు నొప్పించింది. పంతులమ్మకు కూడా చెల్లెలి వైఖరి నచ్చలేదు. అందుచేత మూతి ముడుచుకుని ఓ మూల కూర్చుంది. తమ మధ్య వాతావరణం లో కలిగిన మార్పుని గ్రహించాడు. కాని వనజ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అతనికి అర్ధం కాలేదు. కొంపదీసి ఆ అమ్మాయి తనని ప్రేమించటం లేదు కదా? ఏది ఏమైనా ఆరోజు వనజ తన మీద చూపించిన అపేక్ష. అభిమానమూ హద్దు మీరిందనే విషయం  సుస్పష్టమైంది అందుకు లోలోపల సంతోషం గానే ఉన్నా మిగతావాళ్ళు ఏమనుకుంటారోననే భయమూ ఒక మూల కలిగింది. హాలిడే స్పిరిట్ ఎప్పుడో ఆరిపోయింది. బరువెక్కి పోయిన ఆ వాతావరణం లోంచి బయట పడటానికి "రేడియేటర్లో నీళ్ళున్నాయో లేదో చూసి వస్తాన" నే నెపంతో అక్కణ్ణించి మెల్లగా జారుకున్నాడు.
    బోనేట్ ఎత్తి, కాసేపు అదీ ఇదీ సరిచేసినట్టు నటించి, బంగళాకు వెళ్ళి ఒక పెద్ద రాతి కింద నీడలో కూర్చున్నాడు. పడమటి దిక్కున కొండ మీద నరసింహస్వామి దేవాలయం అస్తమించ బోతున్న సూర్యుణ్ణి మరుగు పరుస్తోంది. ఆలయం వెనక నుంచి నారింజ పండు రంగు కాంతి ఆకాశమంతా వ్యాపించింది పక్కగా అతని ఉత్సాహం లాగే. శిధిలమై పోతున్న, డచ్చి వారి లైటు హౌస్ వంక చూస్తూ కూర్చున్నాడు చాలా కాలం గడిచిపోయింది. ఎంతో సేపటికి గాని మరొక వ్యక్తీ వచ్చి తన ప్రక్కనే నిలబడినట్లు గ్రహించ లేకపోయాడు. వనజను చూసిన వెంటనే ఆడపిల్ల లాగ సిగ్గుపడి పోయాడు.
    "క్షమించండి. మీ ఆలోచనకు భంగం కలిగించి నట్లున్నాను."
    "అబ్బే అదేమీ లేదు" అన్నాడు రాజు.
    వనజ రాజు కెదురుగా మెత్తని గడ్డి మీద కూర్చుంటూ "ఏమిటో అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" అన్నది.
    రాజు అబద్దమాడటాని కూడా వ్యవధి లేక పోయింది. అనాలోచితంగా అనేశాడు "నిన్ను గురించే ఆలోచిస్తున్నాను" అని.
    
    వనజ ప్రపుల్ల వదనంతో అతని కళ్ళల్లో కి చూస్తూ "నిజంగానా?" అన్నది.
    "ఔను , ఇవ్వాళ ఆనందరావు ను ఎందుకు అంతగా అవమాన పర్చావో అర్ధం కావటం లేదు. పాపం, అతను ఎంత బాధపడుతున్నాడో తెలుసా?"
    ఆశించని ప్రశ్నకు ఆమె ఉత్సాహమంతా జారిపోయింది. వెంటనే సమాధానం దొరకలేదు. కాని చప్పున సమాధాన మివ్వవలసిన అవసరాన్ని మాత్రం గుర్తించింది. "అది నా యిష్టం, అందుకు మీరు బాధపడవలసిన అవసర మేముంది?" అన్నది నిష్టూర స్వరంతో.
    రాజు కొంచెం తొట్రుపడి "ఔను, అదీ నిజమే. కాని.... పంతులమ్మ గారు....ఇదంతా నావల్ల నేనని మరో విధంగా అనుకొంటుందేమో అన్నాడు.
    "అక్కయ్య ఏమన్నా అనుకొంటుందని భయపడుతున్నారా మీరు?"
    "లేదు. కాని-- ఆనందరావు నీకు కాబోయే భర్త కదా--"
    వనజ తన ముఖంలో అసహ్య భావాన్ని వ్యక్త పరుస్తూ 'ఛీ ఛీ, మీరంతా అలా అనుకొంటూన్నారేమో గాని, అది జరగటం అసంభవం. యే ఆడదైనా అతన్ని ప్రేమిస్తుందంటే -- అది దాని ఖర్మ!" అన్నది.
    రాజు మౌనం వహించాడు. కాసేపు మనసులో తర్జనభర్జనలు కావించుకొన్న తర్వాత "వనజా నువ్వు మరొకర్ని ఎవరినైనా ప్రేమిస్తున్నావా?" అన్నాడు.
    వనజ వెంటనే తల దించేసుకున్నది. చాలాసేపటి వరకూ సమాధానమేమీ చెప్పలేదు. రాజు అనుచితమైన ప్రశ్న అడిగానే అని మనసులో బాధపడసాగాడు. చివరకు వనజ మెల్లగా తలెత్తి మార్దవంగా అతని చేతిని స్పృశిస్తూ "ఔను" అన్నది.
    రాజు హృదయం పులకాంకితమైపోయింది. రాగోద్వేగంతో ఎవరి నోటంటా మాటలు రాలేదు. కాని సంభాషణ అంతటితో పూర్తీ కాలేదు. కలుసుకున్న ఇరువురి చేతులూ కావ్యాలల్లు కొంటున్నాయి. అంతలో దూరం నుంచి ప్రకాశం పిలుపు వినిపించింది. "డాక్టర్ గారూ "అంటూ. రాజు ఆ సుందర స్వప్నం లోంచి మేలుకుంటూ "వెళ్దామా" అన్నాడు.
    వనజ తలూపింది.
    "ఎక్కడున్నారు మీరు. పెద్దక్క ఇంటికి వెళ్ళాలని తొందర పడుతోంది ప్రకాశం మాటలు చెట్ల చాటు నుంచి వినిపించాయి.
    చూస్తుండగానే సూర్యుడస్తమించాడు.
    
                                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS