Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 8

 

    రాజు మళ్ళీ వచ్చేసరికి వనజ ఫ్రెండ్స్ అంతా సినిమా ప్రోగ్రాం వేసుకొని సిద్దంగా ఉన్నారు. "డాక్టర్ గారూ, మమ్మల్ని కాస్త సినిమా హాలుకి చేర్చాలి. ప్లీజ్" అన్నది వనజ.
    "వారిని కూడా సినిమాకు రమ్మనవే" ఇంకొక అమ్మాయి సలహా ఇచ్చింది.
    "ఉండవే ముందే అలా అంటే అసలు రారు. హాలు దగ్గరి కెళ్ళాక కారు తాళాలు లాక్కుంటే సరి" వనజ అంది.
    ఆడపిల్లల మెజారిటీ అక్కడ. రాజు మౌనం వహించక తప్పలేదు. కొత్త పిక్చరు వల్ల కాబోలు జనం కోకొల్లలుగా వున్నారు. టిక్కెట్ల కోసం కుస్తీలు పడుతున్నారు. చాలామంది టిక్కెట్లు దొరక్క వెనక్కు వెళ్ళిపోతున్నారు. "టిక్కెట్లు దొరకవేమో?' అన్నది వనజ దిగులుగా.
    "ఆ భయమేమీ అక్కర్లేదు. నేను ఉన్నానుగా" రాజు అభయమిచ్చాడు.
    గేటు కీపరు తలుపు తెరిచి జనాన్ని పక్కకు నెట్టి కారుకు దోవ చేశాడు. కార్లో కూర్చుని కాఫీ త్రాగుతుండగా మరొకడు టిక్కెట్లు తెచ్చి పెట్టాడు. బాక్సు టిక్కెట్లు. బాక్సు కిద్దరు చొప్పున విడిపోయి మూడు బాక్సు లలో కూర్చున్నారు. రాజు వనజా ఒక బాక్సు. సినిమా మొదలు పెట్టారు.
     హటాత్తుగా వనజ కు సినిమా మీద ఇంటరెస్టు దిగజారిపోయింది. ఇద్దరూ మాట్లాడకుండా కూర్చున్నారు. రాజు సిగరేటు తీసి వెలిగించాడు. వనజ చటుక్కున రాజు చేతిలో సిగరెట్టు లాగి పారవేసి "సినిమా హల్లో సిగరెట్టు కాల్చకూడదు. పోలీసులు పట్టుకుంటారు తెలుసా?" అన్నది. ఆమె తీసుకున్న చనువు రాజుకు ఆశ్చర్యం కలిగించినా, శరీరం ఏదో మధురానుభూతితో పులకరించింది. "అది ఆ నేలలో కూర్చున్న వాళ్ళకు. ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి మనకు హక్కున్నది." అన్నాడు మరొక సిగరెట్ట్టు తీసి వెలిగించు కుంటూ.
    "ఔను అదీ నిజమే. భాగ్యవంతుల్ని యే చేట్టాలు ఏమీ చెయ్యలేవు."
    రాజు ఆశ్చర్యపడి, చీకట్లో ఆమె ముఖ భావాల్ని చదవటానికి ప్రయత్నిస్తూ 'అదేమిటి వనజా -- ఇవ్వాళ కొత్తగా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.
    వనజ అనాలోచితంగా తనన్న మాటలకు సిగ్గుపడుతూ "ఛఛ అది కాదు. మీరెంత భాగ్యవంతులైనా ఇలా దుబారా చెయ్యకూడదు. ఇవ్వాళ మాకోసం అప్పుడే పాతిక రూపాయలైనా ఖర్చు పెట్టారు. అక్కయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టారో ఆ దేవుడికే తెలియాలి. మేము మీకేమౌతామని?" అన్నది.
    "ఏమిటి వనజా ఈ పిచ్చి మాటలు? ఇంకా అదంతా మర్చిపోలేదా?" అన్నాడు.
    "ఎలా మర్చిపోను. మీరు మాకెంతో సహాయం చేశారు...."
    రాజు మధ్యలోనే అందుకొని "నువ్విక్కడ కొచ్చింది సినిమా చూట్టానికా నన్ను భట్రాజులా పొగడతానికా?' అన్నాడు.
    "ఏం సినిమాలే పోనిద్దురూ-- బోర్ కొడుతుంది. ఏమైనా కబుర్లు చెప్పండి."
    "ఏం చెప్పను?"
    "ఏదో ఒకటి చెప్పండి. మీ చదువు - కాలేజీ సంగతులు. పోనీ ఇంటి దగ్గర మీ వాళ్ళ సంగతులు చెప్పండి"
    "చెప్పటానికి అంతగా ఏమీ లేవు. నా పుట్టుక తోనే మా అమ్మ చనిపోయింది. నాన్న వున్నారు. కాని -- అదుగో ఆ హీరో తండ్రి లాగా -- ఏమీ పట్టించుకోరు. ఎప్పుడూ ఎలక్షన్లు, పార్టీలు లేకపోతె అసెంబ్లీ  నాక్కావాల్సిన డబ్బు మాత్రం పంపిస్తారు. చక్కగా చదువు కోమంటారు. ఇంటి దగ్గర పొలం పన్లు చూట్టానికికి పాలేర్లు ఉన్నారు. వాళ్ళందర్నీ అజమాయిషీ చేస్తూ మా రంగమ్మ పిన్ని ఉంటుంది...."

              
    "పిన్ని అంటే --? మీ నాన్నగారు రెండో పెళ్ళి చేసుకోన్నారా?"
    కాదు రంగమ్మ పిన్ని అసలు మాకేమీ కాదు. ఎవరూ దిక్కు లేకపోతె మా తాతగారు చేరతీశారు. అప్పట్నుంచీ మా యింట్లోనే ఉంటుంది. అమ్మ చనిపోవటం తో నన్నూ, మా అక్కయ్యనూ కూడా ఆమె చేతుల మీదగానే పెంచి పెద్ద చేసింది. మేమంటే ఆమె కున్న ప్రేమా, మా కుటుంబమంటే ఉన్న విశ్వాసం వల్లా మాకెంతో అప్తురాలై పోయింది. నాకు తల్లంటే రంగమ్మ పిన్నె గుర్తొస్తుంది. ఇప్పుడామె లేకపోతె మా ఇంట్లో ఒక్క క్షణం కూడా గడవదు."
    "మీ నాన్నగారికి మీరు, మీ అక్కగారు ఇద్దరేనా పిల్లలు?"
    ఔను. ఇద్దరమే. నేను కన్ను తెరవగానే మా అమ్మ కన్ను మూసింది. అక్కయ్య కూడా వయసులో చిన్నదైనా నన్ను చాలా ప్రేమగా పెద్దవాణ్ణి చేసింది. ఇప్పటికీ నేనంటే ప్రాణాలు విడుస్తుంది. అమాయకురాలు, ప్రేమమయి. ఎప్పుడూ ఇతరుల సుఖమే గాని తన సుఖం చూసుకోదు."
    రాజు కావాలనే ఈ విషయాలన్నీ వనజతో చెప్తున్నాడు. ఐనప్పటికీ చిన్నతనం లో తమను చేరదీసిన కుటుంబం అదేనని వనజకు తట్టనే లేదు. అప్పటికి ఆమె చిన్నపిల్ల. పంతులమ్మ అప్పుడప్పుడు చెప్పే మాటల వల్ల . చిన్నతనం లో తామొక పరాయి ఇంట్లో తలదాచుకొన్నట్లు తెలుసు కాని మిగతా వివరాలేమీ తెలియవు. అందువల్లే పంతులమ్మ సత్యనారాయణ గారి యెడల ప్రదర్శించే భక్తీ విశ్వాసాల్లో పాలు పంచుకోలేకపోతూ వుంటుంది. ఇవ్వాళ రాజు నోటంట అంతా విన్నాక కూడా గ్రహించలేక పోయింది. చాలాసేపు రాజు అక్కగార్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. లోలోపల ఆమెను జన అక్కతో పోల్చుకో సాగింది. ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. స్వార్ధ త్యాగం లోనూ, ప్రేమాదరాల్లోనూ అపరిచితమైన ఆమె యెడల అనిర్వచనీయమైన ఆత్మీయతా భావమేదో కలిగింది. ఆమెను గురించి మరికొంత తెలుసుకోవాలనిపించింది.
    "మీ అక్కగార్ని గురించి ఇంకా చెప్పండి."
    "ఆమె నా తోబుట్టువో, కన్నతల్లో అప్పుడప్పుడు నేనే తేల్చుకోలేక పోతూ వుంటాను. అంత మంచి వారికీ దేవుడెప్పుడూ లోపం చెయ్యడని అంటారు. ఆ మాట నిజమే. అక్కయ్యది చక్కని సంసారం. అంతులేని ఆస్తి, ధర్మరాజు లాంటి సాధు పురుడు మా బావ. ఒక్కతే కూతురు. అక్కయ్య ఎంత అమాయకురాలంటే నాకు కట్నంగా ఇవ్వటానికి ఇప్పటి నుంచే భూములు కొంటుంది." అన్నాడు. అని వెంటనే నాలుక కోరుకున్నాడు. రాజు ఊహించినట్టు గానే వనజ పరాచికం మొదలెట్టింది. "మీ అక్కగారికో బంగారు బొమ్మ. ఆ బొమ్మను పెళ్ళాడే బంగారు రాజు మీరూ నన్నమాట. అంతేనా?"
రాజు నవ్వి "ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను. ఈ కోర్సు అయ్యేవరకూ ఆగమని అక్కయ్య కు రాశాను. నాన్నగారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు" అన్నాడు.
    స్త్రీ సహజమైన కుతూహలాన్ని ఆపుకోలేక వనజ అన్నది. "ఎప్పుడైతెం పెళ్ళి చేసుకోవటం నిశ్చయమే కదా? అందంగా వుంటుందా?"
    రాజు చీకటిలోనే తల ఊపాడు.
    "తల ఊపితే కాదు. నోటితో చెప్పాలి."
    ఆమె మంకు పట్టు రాజుకి నవ్వు తెప్పించింది. "అందంగానే ఉంటుంది.' అన్నాడు.
    "అలా అంటే మాకేలా తెలుస్తుంది? Describe in detail the external features of..........."
    "అబ్బబ్బ చంపెస్తున్నావే. చెప్తాను" అంటూ మేనకోడలు పద్మను గురించి చెప్పసాగాడు.
    "చదువుకొంటుందా?"    
    "ఆ వంటింట్లో ఐ.పి.యస్."
    వనజ కు ఆ రాత్రి చాలాసేపటి వరకూ నిద్ర పట్టలేదు. ఇంట్లో అందరూ నిద్ర పోయాక, ప్రశాంతమైన ఆ రాత్రి వేళ . ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని అలాగే పడుకొన్నది. నిన్న మధ్యాహ్నం ఆనందరావు అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. "మనుషుల మీద నమ్మక మెందుకు లేదు నీకు?" అని అడిగాడు. అప్పుడా ప్రశ్నకు వనజ సమాధాన మివ్వలేక పోయింది. దానికి కారణం ఆమె వద్ద జవాబు సిద్దంగా లేక కాదు. జవాబు ఉన్నది. రెడ్డితో ఆమె కున్న సంబంధమే దానికి జవాబు. కాని అది ఇతరులకు చెప్పటమెలా?
    కాబోయే భర్త చదువుకున్నవాడూ, అందగాడూ, ఆస్తి పరుడూ గుణ వంతుడుగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకోటం లో వింతేమీ లేదు. ఈ కాలంలో వేలకు వేలు కట్నం ఇచ్చి కొనుక్కోవాలన్నా అటువంటి వాళ్ళు దొరకటం లేదు. ఇక కట్నం ఇవ్వలేని యువతులకు పెళ్ళి కావటమే బ్రహ్మ ప్రళయం గా ఉంది! అలాంటి వాళ్ళు తమ భర్తలను తామే వెతుక్కోవాలి. వలలు పన్ని బంధించి తెచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఆ దుర్లభ్యుల కోసం ఎన్ని అవస్థలు పడాలో ఎటువంటి అత్యాచారాలకు గురి కావాలో వనజ అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నది.
    లిల్లీ గ్రేవ్ అని వనజ కో స్నేహితురాలుండేది. హైస్కూలు చదువుల వరకూ కలిసి చదువుకొని తర్వాత విడిపోయారు. వనజ కాలేజీలో చేరింది. లిల్లీ గ్రేస్ నర్సు ట్రైనింగు లో చేరింది. ఆ స్నేహం పురస్కరించుకొని తరచూ లిల్లీని చూడటానికి కె.జి హాస్పిటల్ కు వెళ్తుండేది. లిల్లీ ఫిమేల్ సర్జికల్ వార్డు లో ఉన్నప్పుడు రెడ్డి కూడా అదే వార్డుకు క్లినిక్ కు వస్తుండేవాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ పరిచయమైంది. అప్పుడా పరిచయం తన అదృష్టమనే భావించింది. మనసా వాచా అతన్ని నిష్కల్మషంగా ప్రేమించి తనను తాను అర్పించి వేసుకొంది. రెడ్డి ధనవంతుడు. తమ స్థితికి మించినవాడు. అందువల్ల పంతులమ్మ తమ సంబంధాన్ని అంగీకరించదని తెలుసు. అక్కకు జీవితంలో ఉన్నతమైన ఆశలేవీ లేవు. ఆనందరావు లాంటి వాడు -- తమ స్థితికి సరి పోయే వ్యక్తీ ఎవరో ఒకరు దొరికితే చాలని భావిస్తోంది. అందువల్ల రెడ్డితో తన స్నేహాన్ని వనజ పంతులమ్మ కు తెలియనివ్వ లేదు. కాని వనజ క్షేమాన్ని కాంక్షించే లిల్లీ గ్రేస్ మాత్రం చాలాసార్లు హెచ్చరించింది. జాగ్రత్త వనజా, జీవితంతో ఆటలాడు తున్నావ్ ,. స్త్రీ జీవితం అరిటాకు లాంటిది. కాలు జారావో మరి నిష్కృతి ఉండదు అని. కాని అప్పుడు వనజ కామాటలు తలకెక్కలేదు. యౌవనోద్రేకంలో పడి విచక్షణా జ్ఞానం కోల్పోయింది.
    ఐతే కొద్ది కాలంలోనే తానేటువంటి ఊబిలో కాలిడిందో తెలుసుకో గలిగింది. కాని ప్రయోజన మేముంది? అప్పటికే అంతా మించి పోయింది. నిస్సంకోచంగా నమ్మి తన సర్వస్వమూ ఎవరికైతే అర్పించి వేసుకున్నదో, ఆ వ్యక్తీ వివాహితుడని తెలిసినపుడు, వనజ మనసు వికలమైపోయింది. పురుషులంటే ఏహ్యభావం . మనుషుల మీద అపనమ్మకం. నిరాశ. నిస్పృహ స్త్రీ కేదైతే ముఖ్యమో -- ఒకసారి పోగొట్టుకున్న తర్వాత దేన్నైతే తిరిగి సంపాదించు కోలేదో -- ఆ శీలాన్ని తానేప్పుడో కోల్పోయింది. ఇక ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. అబల. నిస్సహాయురాలు. కాల ప్రవాహంలో దొరికిన ఊతనేదో చేజిక్కించుకొని అలా తేలి పోవలసిందే గాని ఎదురీది పోరాడే శక్తి లేదు. అటువంటి అయోమయ పరిస్థితిలో ఆశా జ్యోతిలా అమాయకుడైన రాజు ఆమె కంటబడ్డాడు.
    లల్లీ గ్రేస్ ఒకసారి మాటల సందర్భంలో అన్న వాక్యాలు వనజకు మాటిమాటికి గుర్తుస్తుండేవి. "మగాళ్ళ ను ప్రలోభ పెడుతూ మన అవసరాలు తీరేవరకూ మన చుట్టూ తిప్పుకోవాల్సిందే కాని వాళ్ళ ప్రలోభం లో మనం పడ్డామంటే మాత్రం సర్వనశానమే.' ఆ మాటల్లోని నగ్నసత్యం వనజు ఇప్పుడు అర్ధమైంది.
    ఇవ్వాళ మరొక సరికొత్త అనుభవం రుచి చూసింది. ధనం తెచ్చిపెట్టే దర్జా దొరకవను కున్న సినిమా టిక్కెట్లు కారులోకి వచ్చాయి.ఆడపిల్లల్ని చూసి వెకిలి వేషాలు వేసే గేటు కీపరు సగౌరవంగా పక్కకు తప్పుకొని, సీట్లు చూపించి మరీ వెళ్ళాడు. హోటల్లో సర్వర్లు ఎంతో ప్రత్యెక శ్రద్ధ తీసుకొని సర్వు చేశారు. ఇదంతా తాము కారులో రాబట్టేగా? మామూలుగా వస్తే ఇన్ని గౌరవ మర్యాదలు జరిగేవేనా? ఆలోచించిన కొద్దీ గ్లాని తో అలసట చెంది వున్న ఆమె మనసు సంభవా సంభవాలను సృష్టి సహజ మైన హెచ్చు తగ్గులనూ గురించలేనంత బండబారి పెడదోవ పట్టసాగింది. తనూ ఒక భాగ్యవంతుల ఇంటి కోడలైతే  ఎంత దర్జాగా ఉంటుందో? కోరినన్ని నగలూ, కారూ బీరువాల నిండా చీరెలూ, నౌకర్లూ చాకర్లూ-- ఓహ్  చిన్నప్పట్నించీ బీదరికంలో సతమతమవుతున్న వనజ కు ఆ భావనే స్కాచ్ విస్కీలా తలకెక్కింది. ఏవేవో ఆలోచిస్తూ , ఎన్నో పధకాలు వేస్తూ చివరి కేప్పుడో తెల్ల వారు జాముకు నిద్ర పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS