5
గోవింద ని చటర్జీ కంటికి రెప్పలా పువ్వు మాదిరిగా చూస్తున్నాడు. గోవింద ఆతని సమక్షం లో జరిగిన గతాన్ని పూర్తిగా కాకపోయినా యించుమించు మరిచిపోయేది. అతని యెదుట కంట తడి పెట్టి అతన్ని బాధపెట్టి తను బాధపడేది కాదు. యిప్పుడు గోవింద కాపురంలో యిల్లు నిండి పోతూ యిద్దరు మగపిల్లలు, ఒంటి నిండా నగలు, ఈ పల్లె టూరికి మారాక స్వయంగా వ్యవసాయం చూసుకుంటుంటే మరో ఐదేకరాలు కొనగల్గే ఆర్ధిక స్తోమతు ఏర్పడింది. చటర్జీకి. అతను యింటికి వచ్చింది మొదలు పిల్ల లిద్దరితోటి , భార్య తోటే పెరట్లో హాయిగా కాలాన్ని దొర్లిస్తున్నాడు రాధిక మరో నాలుగు రోజులు వుండి వెళ్ళిపోయింది. విశ్వనాధం, మీనాక్షి వుత్తరాల్లో పలకరిస్తూనే వున్నారు. జీవితం యెప్పుడూ కాలకూట విషంలా వుండదని అమృత ప్రాయంలా వుంటుందని గోవింద గుర్తించగల్గింది.
చటర్జీ భార్యని పిలిచి అన్నాడు 'చాలు యిన్నాళ్ళు యిక్కడ వున్నాం. పిల్లలకి చదువు సంధ్యలు మంచివి అబ్బాలంటే మనం సిటిలో వుండాలి. తప్పనిసరిగా కాన్వెంటు చాడువులైతే క్రమశిక్షణ లో లోపం వుండదు. హైదరాబాదు లో వుండి వుండి నాకు బోర్ కొట్టింది. మనం కలకత్తా వెడదామా లేక మద్రాసు వెడదామా.'
గోవింద అతనికి తాంబూలం అందిస్తూ ఆలోచించ సాగింది. ఈ రెండు ప్రదేశాలూ కూడా తనకి కొత్తే. కొత్త వూళ్ళో కొత్త మనుష్యుల మధ్య గతాన్ని తోడుకోవలసిన అవసరం లేదు. హైదరాబాదు వెళ్ళి నట్లయితే విష్ణుమూర్తికి స్నేహితులు చటర్జీ కి కూడా స్నేహితులే కనుక వాళ్ళు వచ్చి వెడుతుండడం ముక్కుపచ్చలారని పసివాడి మనసులో యేదైనా వుహల్ని రేపడం సంసారం కలుషితం అవడం జరగవచ్చును. కన్నతండ్రి అంటే శ్రీకాంత్ కి చటర్జీ తప్ప మరోకరనే వుహా దేనికి కల్పించడం?
'హైదరాబాదు తప్ప మీ యిష్టం' అతను పదిరోజుల్లో సామాను సర్దేసి కలకత్తా బయలుదేరాడు. యిప్పుడు సోమెంద్రనాద్ భార్యతో సహా అక్కడే బేలేఘాట్ వుంటున్నాడు.
భర్త తోటీ మనవల తోటీ వచ్చిన కొడుకుని చూసి వృద్ద దంపతులు కొండంత సంతోషపడి పోయారు. ఐదేళ్ళ శ్రీకాంత్ నీ మూడేళ్ళ ఉమేష్ ని కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు. తను ప్రాక్టీసు పెట్టి వూపిరి పీల్చుకున్నాడు. గోవిందని కంటి పాపలా చూసుకున్నారు అత్త మామలు. అందంగా, సుకుమారంగా , సన్నజాజి మొగ్గలా వున్న కోడలి పట్ల కొడుకు చేసిన త్యాగానికి యిద్దరూ మనసులోనే ఆశీర్వదించారు.
శ్రీకాంత్ కి ఉమేష్ కి రంగులో, మాటలో, అవయవాల కూర్పు లో యెక్కడా పోలికలు లేవు. చటర్జీ చామన చాయలో వుంటాడు. ఉమేష్ వుంగరాల జుట్టుతో చిలిపిగా చిందులాడే కళ్ళతో మోటు పెదవులతో రంగు తక్కువగా తండ్రి లాగే వుంటాడు.

బేలేఘాటా వచ్చిన కొద్ది కాలానికే చటర్జీ కి తండ్రి యెంతో మందిని పరిచయం చేశాడు. తండ్రి స్నేహితుడు విద్యుత్ బాధురి కొడుకు ఉపెంద్రుడు కూడా లాయరు గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు వుపేంద్రుడు సాయంకాలం పూట భార్యతో సహా సోమెంద్రనాద్ యింటి కి వచ్చి 'టీ' త్రాగి వెడుతుండే వాడు. ఆ అలవాటు అతనికి తండ్రి హయాం నుంచి సంక్రమించింది. యిప్పుడు యింత కాలానికి సోమేంద్రునాధుడి యిల్లు పిల్లా పాపలతో కళకళ లాడుతుంటే తప్పని సరిగా వుపెంద్రుడి కాళ్ళు సాయంత్రం ఆరుగంటల కి దూరంగా గుడిలో శంఖారావం వినిపించగానే సోమేంద్రనాద్ యింటి వైపు దారి తీస్తాయి. గోవింద కి యిప్పుడు ఆ యింటి అలవాట్లూ పద్దతులూ కరతలామకాలయ్యాయి. సోమేంద్రనాద్ ఆదివారం వస్తే స్పెషల్ గా భార్య చేత తనకి యిష్టం అయిన చేపల కూర చేయించుకుతింటాడు. ఆరోజు గోవింద మరో గదిలో పిల్లలకీ, తనకీ ప్రత్యేకం వండుకుంటుంది. భర్తా, అత్తా మామల అలవాట్ల ని ఆమె యెప్పుడూ అసహ్యించుకోదు. అలాగే వాళ్ళు కూడా కోడల్ని మనవల్నీ నిర్భందించరు.
శ్రీకాంత్ తల్లి పక్కనే పీట మీద కూర్చుని యిల్లు యెగిరి పోయే;ఆ యేడుస్తున్నాడు. గోవింద చాలా వోపికగా ఎంతో సహనంతో కొడుకుని వూరడించేందుకు ప్రయత్నం చేసి విఫలురాలైంది. అన్న యేడవడం ప్రారంభించగానే తమ్ముడు శృతి తప్పకుండా అన్న రాగంలో స్వరాన్ని కలిపి గోవింద కర్నేంద్రియాల్ని వీనులవిందు చేస్తున్నారు. రెండు గదుల అవతల అనీమా చటర్జీ మనవల యేడుపు విని ఖంగారుగా వచ్చేసింది. వెనకే చటర్జీ , సోమేంద్రనాద్ యిద్దరూ వచ్చారు. తాతగారు, నాయనమ్మా, తండ్రి గుమ్మం లో అడుగు పెట్టగానే శ్రీకాంత్ తారాస్థాయిని అందుకున్నాడు. గోవింద బిక్క మొహం వేసుకుని పీట మీద కూర్చుండి పోయింది.
సోమేంద్రనాద్ వచ్చి మనవడిని రెండు చేతుల్లోకి తీసుకుని కారణం అడిగాడు. అనీమా ఉమేష్ ని వూరడించసాగింది. యేడుపు ఆపమని చటర్జీ అనగానే అన్న దమ్ములిద్దరూ టక్కున నోరు మూసుకున్నారు.
చటర్జీ అడిగాడు 'యెందుకోయ్ యేడుపు?' అని.
శ్రీకాంత్ బితుకు బితుకుగా చూస్తూ "మీలంతా అక్కల తింటూ ...నేనూ తమ్ములూ యిద్దలమే యిక్కలున్నాం ' అన్నాడు.
సోమేంద్రనాద్ బోసి నవ్వుతో విరగబడి నవ్వాడు.
'మా నాన్న బంగారు కద. తాతగారికి పళ్ళు లేవు కదమ్మా, అందుకాయనకి నానమ్మ చప్పిడి అన్నం పెడుతోంది. మీరూ వస్తే మీకూ అదే పెడుతుంది.'
'రోజూ మనందలం కూచుంటాం . యివాల నేనూ వత్తాను అక్కలికి ' శ్రీకాంత్ చిన్నారి బుర్రలో యేకాంతం భయంకరంగా అనిపించినట్లుంది.
యిద్దరే అమ్మ వడ్డిస్తుంటే కూర్చుని తినేందుకు గోల చేయడం ప్రారంభించారు.
గోవింద యేమీ మాట్లాడలేదు. చటర్జీ యిద్దర్నీ తను తింటున్న గదిలోకి తీసుకువెడతానన్నాడు. సోమేంద్రుడు వొప్పుకోలేదు. 'ఒద్దు యీ అలవాట్లు తీరి కూర్చుని మనం నేర్పడం దేనికి? సొసైటీ పెరిగి పెద్దయాక ఉగ్గుపాలూ యెలాగూ పోస్తుంది. ఫార్మాలిటీస్ తో ప్రారంభించి అలవాట్ల తో అంతం ఆయె ఈ దురలవాట్లకి నేను ఒప్పుకోను.'
అయన ఖచ్చితంగా ఖండిస్తుంటే యెదురు చెప్పగలిగే సాహాసం లేదు ఆ యింట యెవరికీ. అయన వైపు దీర్ఘంగా చూడసాగాడు చటర్జీ. సోమేంద్రనాద్ పిల్లలిద్దర్నీ చెరో పీట మీద కూర్చోబెట్టి తను మధ్యలో కూర్చుని 'నాకూ వడ్డించు గోవిందా.' అన్నాడు. శ్రీకాంత్ వుత్సాహంగా చప్పట్లు చరవగానే వుమేష్ బ్రహ్మానందభరితుడైన వాడిలా తండ్రి వైపూ, తాతగారి వైపూ చూసి కిలకిలా నవ్వాడు.
శ్రీకాంత్ చేసిన అట్టహాసం ఆ యింట మరి సోమెంద్రుడికి ప్రత్యేకమైన భోజనం అంటూ లేకపోయింది. పిల్లల్ని సంతోష పెట్టేందుకు అతను చిన్నప్పటి అలవాటును పూర్తిగా మానుకున్నాడు. గోవింద నొచ్చుకుంటూ అత్తగారితో అన్నది: 'కుర్ర వెధవలు మారాం చేశారని మామగారు పూర్తిగా యీ వంటలు తింటున్నారు. ఆదివారం పూట ఆయన్ని యెక్కడికైనా తీసుకు వెళ్ళమని చెబుతాను అత్తయ్యా!'
పక్క గదిలో గీత చదువుతున్న అతను కోడలి మాటలు విని అక్కడి నుంచే 'చూడమ్మా గోవిందా జిహ్వ చెప్పిన మాట విని యెంతో నష్టపోయాను. యిప్పుడు శ్రీకాంత్ చిన్నవాడైనా తాతకి పాఠాలు నేర్పాడు. జిహ్వ మాట నువ్వెందుకు వింటావు నీ మాట అది వినాలి గాని అన్నాడు. జ్ఞానోదయం ఆలశ్యంగా అయినా అసలంటూ అయింది.' అన్నాడు.
గోవింద పని చూస్తుంటూ శ్రీకాంత్ ని తలుచుకుని ముసిముసిగా నవ్వుకుంది.
ఉపేంద్ర బార్య క్రిష్టియన్. అతను తల్లి తండ్రుల్ని యెదిరించి పెళ్లి చేసుకున్నాడు. తండ్రి నిష్టా గరిష్టుడు కావడంతో కొడుకు మొహం చూశాడు కాడు. తల్లి పోయినా శ్రద్డ్డ కర్మలు జేష్టుడైనా అనర్హుడని అతనిచేత చేయించలేదు. కుల పెద్దల కన్నా అతడే కొడుకు చేసిన అపరాధానికి శిక్ష విధిస్తూ తన యింటి ద్వారాలు మూసుకున్నాడు. సోమేంద్రుడు ప్రగతి మధ్య మనిషి - యెంత నలిగి పోతున్నదీ విడమరచి చెప్పి -- యేకాకిగా పుట్టెడు బలగం వున్నా మిగిలిపోయి కన్ను మూసే సమయంలో 'నా' అనేవారు లేనంత నికృష్ణ పు చావు మరొకటి లేదనగానే చాలాకాలం అలోచించి చివరికి కొడుకు మాత్రం తనని చూసిందుకు వచ్చేందుకు వొప్పుకున్నాడు. ఉపెంద్రుడి భార్య మతాని కన్నా మనసుకి మనుగడ కీ ప్రాధాన్యత నిచ్చే వుత్తమ ఇల్లాలు. కట్టూ, బొట్టూ సాంప్రదాయం వుపెంద్రుడి కోసం మార్చుకుని అతని కోసమే వూపిరి పీల్చుకునే గృహిణి.
ఉపెంద్రుడికి యేడాది పసిపిల్ల కూడా వుంది. 'కృష్ణ మోహినిని శ్రీకాంత్ కి యిస్తానోయ్ ' అంటుంటాడు అతను రోజుకోసారి అయినా. చటర్జీ నవ్వుతుంటే ఉమేష్ ఆ పిల్లతో ఆడుతుండగా చూసి ఉపెంద్రుడు అభిప్రాయం మార్చుకున్నవాడిలా 'నో, నో ఉమేష్ నలుపైనా ఫరవాలేదు. వాడికి యిస్తాను. కోడలు నలుపైతే కులమంతా నలుపౌతుందని సామెత. అల్లుడు నలుపైతే శ్యామవర్ణపు పిల్లలు పుట్టి నీ యింట చేరుతారు కానీ నీకేమిటి బెంగ.' అంటాడు.
చటర్జీ పుస్తకంలో కి దృష్టిని తిప్పి దేనికీ సమాధానం యివ్వడు. ఉపేంద్ర నాద్ ఆ వేళ సాయంకాలం రోజూ కన్నా పెందల కాడే వచ్చాడు. మనోమోహిని యింట్లో అత్తా కోడళ్ళ మధ్య కబుర్ల లో పడిపోయింది.
చటర్జీ వైపు చూసి "నీతో వో మాట అంటాను. ఏమీ అనుకోవు కద,' అన్నాడు ఉపేంద్ర నాద్.
బుర్ర పైకెత్తి కళ్ళతోనే 'ఏవిటి?" అన్నట్లు ప్రశ్న వేశాడు చటర్జీ.
'మరేవీ లేదు. ఈ మధ్య పని మీద హైదరాబాదు నుంచి వో స్నేహితుడు వచ్చాడు. అతను నీ విషయం చెప్పాడు. నిజంగానా చటర్జీ?"
చటర్జీ మొహం లో ఆ నిమిషం లో అనేక మార్పులు వచ్చాయి. అతను కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకుంటున్నట్లు అభినయం చేశాడు.
