Previous Page Next Page 
తప్పు పేజి 10

 

    'నీకు యిష్టం లేకపోతె చెప్పద్దు లే చటర్జీ. యిందులో తప్పేం వుంది. యెవరి యిష్టం వాళ్ళది. ఒకరి యిష్టానికి మరొకళ్లు సృష్టి కర్తలు కాలేరు కద. నేను మొదట్లో నే ఈ సంగతి విన్నాను. అయినా అంత వెయిట్ యివ్వలేదు. శ్రీకాంత్ కీ ఉమేష్ కీ కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది తేడా.... పాపం ఆవిడ ,' వుపేంద్ర నాద్ పరిహాసం చేయాలనే వుద్దేశ్యంతో అనలేదు. అతనికి మానవసహజం అయిన కుతూహలం కలిగి యాదాలాపంగా అడిగాడు. చటర్జీ దేనికీ సమాధానం యివ్వక పొతే చటుక్కున లేచి నిలుచుని చటర్జీ రెండు చేతులూ తన చేతిలోకి తీసుకుని "సారీ భయ్యా. యింకేప్పుడూ ఈ వూసు ఎత్తను. వాటే వండ్రఫుల్ ఫూల్ యామై, యింత చదివి....ఛ...చాలా పొరబాటు చేశాను, నన్ను మనస్పూర్తిగా క్షమించు.' అన్నాడు నొచ్చుకుంటూ.
    చటర్జీ తేలికగా నవ్వేసి అతని భుజం మీద స్నేహ పూర్వకంగా చేయి వేసి 'నెవర్ మైండ్, నువ్వడిగావు . నేను చెప్పలేదు. లేట్ యిట్ బి పాస్ట్ యీజు పాస్ట్. క్షమార్పణ కోరుకోవడం బాగులేదు వుపెంద్రా. నువ్వు కాబట్టి సూటిగా అడిగావు. చాటుగా అనుకునే వారికన్నా నీలా సూటిగా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా యిష్టం ,' అన్నాడు.
    పిల్లని తీసుకుని భార్యా భర్తలు యిద్దరూ వెళ్ళిపోయారు. పెళ్లి అయిన యింత కాలానికి అతని మనసు యివాళే ఒక్కసారి చివుక్కు మంది. గోవింద టీ కప్పుతో ప్రత్యక్షం కాగానే అతను అన్నీ విషయాలూ మరిచి పోయాడు.
    రాధిక చాలాకాలం తరవాత అన్నా వదినల్ని చూసేందుకు వస్తున్నట్లు టెలిగ్రాం యిచ్చింది. అతను చెల్లెల్ని తీసుకు వచ్చేందుకు బయలుదేరుతుంటే పిల్లలిద్దరూ కూడా వెంట బడ్డారు.
    రాధిక టాక్సీ దిగగానే గోవింద అంత వరకూ గుమ్మంలో ఎదురు చూస్తూనే నిలుచుంది.
    రాధిక టాక్సీ దిగుతూనే గోవింద ని ఆప్యాయంగా కౌగలించుకుంది. పిన్నీ బాబాయిలకి నమస్కరించి, రాధిక వెనుక నంద గోపాల్ చేతిలో ముద్దబంతి పువ్వులా రబ్బరు బొమ్మలా ముద్దులు మూటగట్టే పాప గోవిందని చూడగానే ఆరిందాలా పలకరిస్తున్నట్లు బుగ్గలు అర అంగుళం లోతుకు పోయేలా నవ్వి రెండు చేతులూ చాపిన గోవింద మీదికి ఒక్కసారి వురికింది.
    నందగోపాల్ భార్యకి కను సైగ చేశాడు. టాక్సీ లో సామాను యింట్లో పెట్టె ప్రయత్నంలో మునిగిపోయాడు చటర్జీ.
    కాఫీ ఫలహారాలు అయాక యింకా పిల్లని ఎత్తుకునే వున్న గోవింద ని చూసి రాధిక తృప్తిగా నవ్వుతూ '' అయితే కోడల్ని యిప్పటి నుంచే మంచి చేసుకుంటూన్నావన్న మాట. మా అన్నయ్య దడుసుకున్నాడు వదినా. దాన్ని కన్నెత్తి అయినా చూడలేదు.' అన్నది చటర్జీ క్రీగంట చూసి నవ్వుతూ 'నీకు తెలుసు పాపం. నా పిల్లల్నికూడా నేనంత కేర్ చేయలేదు. దీన్ని యింత క్రితం నేను యేరుగున్నట్టు ప్లైన్ దిగగానే నామీదికి వురికింది. అప్పుడు నువ్వు చూసి కూడా మాట్లాడలేదు. నువ్వే మీ వదిన్ని యిప్పుడు మస్కా కొడుతూ నా మీద దేనికీ నింద వేస్తావు.' అన్నాడు.
    పాప పేరు గంగ. నందగోపాల్ కి యమున అన్నా గంగ అన్నా అభిమానం.  తనకంటూ పిల్లలు పుడితే నదుల పేర్లు పెడతాననేవాడు. చటర్జీ వేళాకోళం ఆడుతూ 'మగపిల్లలందరికీ పర్వతాల పేర్లు పెడతావేమిటోయ్ అని అంటే 'యస్ ఆఫ్ కోర్స్. అనేవాడు బావ మరిదితో శృతి కలుపుతూ.
    'మొత్తానికి గంగని కన్నావు చెల్లాయ్. పొతే హిమవంతుడు, వింధ్య, సాత్పూరా ' చటర్జీ మాటలు పూర్తీ కాక మునుపే నందగోపాల్ 'స్టాప్' అన్నాడు.
    రాధికకి మొదటి నుంచీ శ్రీకాంత్ మీద యెనలేని ఆపేక్షానురాగాలు వున్నాయి. ఉమేష్ ని ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసినా తండ్రి లేని శ్రీకాంత్ పట్ల హృదయంలో గుంభనంగా జాలి ప్రవేశించి నానాటికి యెదిగి వట వృక్షం లా ఊడలతో సహా విజ్రుంబించి ఆ క్షణం లో చచ్చిపోయిన విష్ణుమూర్తి జ్ఞాపకం రాగా శ్రీకాంత్ ని యెలాగైనా తన అల్లుడిగా చేసుకోవాలనే దృడ నిశ్చయానికి వచ్చేది. తీరా పిల్లలు లేని కారణంగా వెలితిగా వున్న మనసుని మభ్యపెట్ట లేక పోయేది.
    కాలం కలిసిరాగానే రాధిక కోరికని భగవంతుడు గమనించినట్లు గంగ పుట్టింది.  రాధిక రావడంతో యింట్లో కావలసినంత సందడి. సాయంత్రం పూట ఉపేంద్రుడు వచ్చి బాతాఖానీ కొట్టి వెడుతుండేవాడు. మాటల సందర్భం లో అతను ఉమేష్ తన అల్లుడు అని చెబుతుంటే రాధిక ఉత్సాహంగా 'చాలా సంతోషం బావగారూ మా అన్నయ్య పిల్లలకి పుడుతూనే బంగారం లాంటి భార్యలు దొరికారు' అన్నది. చటర్జీ విని విననట్లు వూరుకునే వాడు.
    గంగని యిద్దరి మధ్యా కూర్చోబెట్టుకుని ఆడిస్తారు పిల్లలిద్దరూ. పిల్ల 'వూ ' అనక ముందే పరిగెత్తుకు వెళ్ళి మేనత్త ని పిలుచుకు వస్తారు. వృద్దులిద్దరూ పసివాళ్ళలో పసివాళ్ళయి పోయి కోడలు భోజనానికి పిలిచే వరకూ అట పాటలతో కాలక్షేపం చేస్తారు.
    రాధిక పదిహేను రోజులుండి ప్రయాణం కట్టింది. గోవింద తల్లికీ, పిల్లకీ నంద గోపాల్ కి ఖరీదైన బట్టలు పెట్టింది. రాధిక మగ పిల్లలిద్దరికీ బట్టలు పెట్టి పిన్నీ బాబాయి లకి కూడా పెట్టి వూరుకుంది.
    రాధిక వెళ్ళిపోయాక పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. ఇంట్లో గంగ లేదు యిప్పుడు ఆదుకునేందుకు. స్కూలు నుంచి రాగానే యధాలాపంగా 'అత్తా' అని కేకేయడం అలావాటై పోయింది వాళ్ళకి. తీరా జవాబు రాకపోయేసరికి యేడుస్తూ పుస్తకాలని చిందర వందరగా విసిరి కొట్టేవారు. సోమేంద్రనాద్ వచ్చి యిద్దరికీ వూరుకో బెట్టి టిఫిన్ కాఫీలు ముగించాక సాయంత్రం చౌరస్తా వైపు షికారుగా నడిపించుకు వెళ్ళేవాడు. మార్గ మధ్యలో ఉపెంద్రుడి యిల్లు రాగానే అన్నదమ్ములిద్దరూ తాతగారి కన్నా ముందు పరిగెత్తు కుంటూ వెళ్ళి ఆ యింట్లో దూరి పోయేవారు. అంతటితో చౌరస్తా షికారు ముగిసి పోయేది. చీకటి పడేవరకూ కృష్ణ మోహిని తో ఆడుకునేవారు. ఆయన 'చేతి గడియారం చూసుకుంటూ 'నాన్న కేకలు వేస్తాడు. రేపటి నుంచీ తీసుకు రాను. యింటికి వెళ్దాం' అని కేక వేయగానే బిక్క మొహల్తో అడుగులో అడుగు వేసుకుంటూ అయన వెనకే గృహోన్ముఖులాయెవారు.
    పిల్లల ఆటపాటలతో , చదువు సంధ్యలతో , భర్త ఆఫీసు వ్యవహారాలతో అత్తా మామల అనురాగంతో గోవింద కి కాలాన్ని గమనించేందుకు కూడా వ్యవధి లేదు. పిల్లలిద్దరూ చురకత్తుల్లా పోటీపడుతూ అయేటి కాయేడు స్కూల్లో ఫస్టు మార్కులతో పాసౌతున్నారు . ప్రోగెస్ చూసిన చటర్జీ కళ్ళల్లో వెలుగురేఖలు ఆక్రమించు కునేవి. గోవింద వైపు చూసి గర్వంగా 'నా పిల్లలు,' అనేవాడు.
    గోవింద అప్పుడు కూడా అతని వైపు కృతజ్ఞతభావంతో చూసేది. ఆ చూపులు చటర్జీ భరించ లేడు. తనని ఆకాశం అంచులకి నిలబెట్టి భూదేవిలోకి కూరుకుపూతూ ప్రార్ధించే గోవింద దృష్టి ని అతను చాలా మటుకు తప్పించు కుంటాడు. పట్టు పడినప్పుడు 'ఒద్దు గోవిందా! నువ్వలా చూడకు. యిందులో నా గోప్పయేమీ లేదు. నేనేం చేశానని నన్ను అరాదిస్తావు అంతగా.' అంటాడు.
    గోవింద వినమృరాలై సమాధానం యిస్తుంది. 'సంఘం లో నా బిడ్డకి స్థానం యిచ్చారు. నన్నాదుకున్నారు. చీకటిలోనే జీవితం సమసి పోకుండా వెలుగు రేఖల్ని నా గుండెల్లో నింపారు. యింతకన్నా యింకేం చేయాలి? మీపట్ల నేను విదేయురాల్ని. ఆ భావం నన్ను వూరట పరుస్తుంది.' అంటుంది.
    చటర్జీ కాళ్ళ గట్టున కూర్చుని నిశ్చలంగా కళ్ళు మూసుకుని ప్రార్ధించి తన మనసులో భక్తీ భారాన్నీ, కృతజ్ఞతనీ తెలుపుకుంటుంది. సాధారణంగా అతను గాడ నిద్రలో వుండగానే మధ్య రాత్రి గోవింద లేచి కూర్చునేది. ఒకసారి అతను చూసి విస్తుపోయాడు. ఆ విధంగా గోవింద నిత్యమూ చేస్తుందని తరువాత తరువాత తెలుసుకున్నాడు. అతనికి తెలిసిపోయాక గోవింద యిప్పుడు నిద్రపోయే ముందే నమస్కరిస్తుంది.

                              *    *    *    *
    కాలప్రవాహం లో పన్నెండు సుదీర్ఘ సంవత్సరాలు యేక బిగిలో కలిసిపోయాయి. లోకంలో అనేక మార్పులు వచ్చాయి. పన్నెండు పదమూడు సంవత్సరాల అనంతరం యిప్పుడు అవరోధం ఏర్పడ్డది. చటర్జీ, గోవింద లు పెద్ద వాళ్ళయ్యారు. వృద్దులైన చటర్జీ తల్లి తండ్రులూ , పెంచిన వాళ్ళు కూడా కాల గర్భం లో బూడిదై కలిసిపోయారు. చటర్జీ ప్రాక్టీసు తో చాలా పైకి వచ్చాడు. యిప్పుడతను కలకత్తా లో మేడ కొన్నాడు. కారు కూడా వున్నది అతనికి. 'పిల్లలిద్దరి తరువాత గోవిందకి రెండు సార్లు గర్భస్రావం అయింది. మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడు. విశ్వనాధం రిటైరై అమలాపురం లో మరో యిల్లు కొనుక్కుని భార్యతో వుంటున్నాడు. తనే యిప్పుడు చెల్లెల్ని చూసేందుకు కలకత్తా భార్యతో సహా వస్తుంటాడు. మీనాక్షి వొంటి నిండా నగలతో లక్ష్మీ దేవి వలె కళకళలాడుతోంది. ఆవిడ వచ్చినప్పుడల్లా పిల్లలకీ, చటర్జీ కి విలువైన బట్టలూ, గోవింద కీ బంగారం నగ యేవైనా చేయించి తీసుకు వస్తుంది.
    పిల్లలు మెట్రిక్ లేషన్ పాసై కాలేజీ లో చేరారు. పెద్దవాడు కాలేజీ లో చేరిన రెండేళ్ళ కి చిన్నవాడు చేరాడు. చటర్జీ గోవింద తో అన్నాడు. పిల్లలు ఫస్టున పాసయ్యారు. పెద్ద వాడిని యింజనీరింగ్ చదివిస్తాను. ఏమంటావు.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS