మీనాక్షి పసివాడిని వొళ్ళోకి తీసుకుని అన్నా చెల్లెళ్ళ సంభాషణ జగ్రట్టాగా వింటోంది. అనవసరంగా తను మధ్యలో జోక్యం చేసుకో దలుచుకోలేదు.
గోవింద చెప్పమన్నట్లు చూసింది అన్న వైపు.
'చటర్జీ రాకకి మేము ఆమోదించాలంటే అందుకేదో కారణం వుండి వుంటుందని నువ్వూ గ్రహించావు. ఆ సంగతి నేనూ తెలుసుకున్నాను. విష్ణుమూర్తి పోయిన కొత్తలోనే చటర్జీ నిన్ను 'చేసుకోవడం లో తనకి యెటు వంటి అభ్యంతరం లేదని నాతొ అన్నాడు. చదువుకున్నవాడు వృద్ది లోకి వచ్చినవాడు . నీ బ్రతుకు చీకట్లలోనే ముగిసిపోవడం అతను వొప్పుకోవడం లేదు. జరిగింది కలగా మరిచిపోవడం అంత తేలిక కాదని నాకు తెలుసున్నా నేను చేయగల్గేది యేమీ లేదు. పసివాడు చటర్జీ కి మాలిమి అయాడు. నీకోసం అతడు పసి పిల్లాడిని చేరదీశాడనే నింద నేను వేయలేను.'
'మనకు కావలసిన వాడు. పైగా మన కులంలో వాడు. నువ్వు చెప్పు యిప్పుడు. స్త్రీ పునర్వివాహం చేసుకోవడం లో తప్పు లేదని నేనంటాను. అందుకు నువ్వు ఏమంటావు?"
గోవింద నిశ్శబ్దంగా యేడుస్తోంది. ఐహిక సుఖాలకి ప్రాధాన్యతని యివ్వడం కాదు యిక్కడ. ఒక ఆలంబన లెని తీగ నుజ్జు గుజ్జు కాకుండా ఆధారం కావాలి. అన్నా వదినలూ ఈ ప్రపంచంలో బాబూ తప్ప మరెవరూ లేరు. యెన్నో యేళ్ళు పెద్ద అయిన అన్న కన్నా తనకి తెలియదీ ప్రపంచం సంగతి . విష్ణుమూర్తిని మరిచిపోయి చటర్జీ తో కాలం గడపడం దుర్లభమే అయినా మరో వ్యక్తీ రక్షణ లో గల సాంత్వనం యింకేక్కడా దొరకదని గోవింద అంతరంగానికి తెలుసు. 'పాత చీర చిరిగిపోతే కొత్త చీర కట్టుకోవడం లా వుండదూ.' అంతర్గతంగా యెవరో అంటున్నారు.
విశ్వనాధం చెల్లెలి సమాధానం కోసం యెదురు చూస్తున్నాడు. సన్నజాజి పందిరి క్రింద తిన్నె మీద కూర్చుని.
గంటా రెండు గంటలూ గడిచేక చటర్జీ తలుపు తట్టడం తో గోవింద గుబులుగా అన్న వైపు చూస్తూ "నీ యిష్టం అన్నయ్యా' అంది లోపలికి వెళ్ళిపోతూ.
విషయం విని దీక్షితులు మరోసారి తన ప్రతాపాన్ని చూపించిందుకు హైదరాబాదు వచ్చాడు. పెళ్ళి పందిట్లో లెక్కకి వున్నారు పెళ్ళి వారు. చటర్జీ తల్లితండ్రులు రాజమండ్రి నుంచి రాలేక పోతున్నందుకు బాధపడుతూ వుత్తరం వ్రాశారు. ముఖ్యంగా అతని తండ్రి అస్వస్థతగా వున్నాడు అ సమయంలో. దీక్షితులు పెట్టబోయే పెడబొబ్బులకి విశ్వనాధం కొద్దిగా భయపడ్డాడు. చటర్జీ అతన్ని మర్యాదగానే సాగనంపి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అందరి కన్నా యెక్కువగా ఆనందించింది రాధిక మాత్రమే. విశ్వనాధం , మీనాక్షి తమ బిడ్డ బాగోగుల కోసం తాపత్రయ పడ్డారు. స్వార్ధం సంగతి యెలా వున్నా చటర్జీ బుద్దిమంతుడు అందుకే యిద్దరూ ఆత్మ తృప్తి పొందారు.
పెళ్లి మాములుగా అతి సాధారణంగా నిరాడంబరంగా ఒక్కరోజులో జరిగిపోయింది. రాధిక అన్నతో నెమ్మదిగా అంది - 'నువ్వీ పెళ్లి చేసుకుంటున్నావని నీ నోటి ద్వారా విన్నప్పుడు నేను చాలా గర్వపడ్డా అన్నయ్యా. నీ మనసు యింత మంచి పనికి పురి కోల్పబడిందంటే ఆ ఆనందం పూర్తిగా నేనే అనుభవించాను. పెళ్లి చేసుకున్నావు. బాగానే వుంది. నువ్వెప్పుడు ఆవిడ పట్ల ఏదో త్యాగం చేసినట్లు మాత్రం ప్రవర్తించకు. ఆపిల్ల బుణగ్రస్తురాలీలా, దాసాను దాసురాలిగా మెలిగేందుకు అవకాశం యివ్వకు.'
'నీకు నేను విపులీకరించి చెప్పనక్కర్లేదునుకో. చిన్న దాన్నయినా యెన్నో కేసులు చూశాను. యింటికి పిలిపించి కన్యకి గర్బస్రావం చేయమన్న వాళ్ళని కూడా నేను యెరుగుదును. చాటుమాటుగా జరిగే తంతుకన్నా విధి లిఖితాన్ని తప్పించుకోలేని యిలాంటి ఆభాగినుల పట్ల కనికరం చూపడం మానవత్వం అనిపించుకోకుండా పోదు. ఆవిడకి గతం గుర్తుకు రాకుండా చూడడం భర్తగా నీ ధర్మం.
రాధిక భర్తతో వెళ్లిపోతూ అన్న చేతిని గౌరవంగా సున్నితంగా నొక్కి వదిలేసింది. గోవిందని పూజ్యభావంతో చదువుకున్న సంస్కారంతో చేరదీసి పలకరించింది. విశ్వనాధం, మీనాక్షి పెట్టిన పట్టు చీరని తృప్తిగా కట్టుకుని నమస్కరించి సెలవు తీసుకుంటూ శ్రీకాంత్ ని తనివి తీరా ముద్దాడింది.
మీనాక్షి మొదటి రాత్రి గోవిందని గదిలోకి పంపుతూ శ్రీకాంత్ ని తన దగ్గరే పడుకోబెట్టు కుంటానంది. శ్రీకాంత్ కి కొత్తా పాతా లేవు ఆ యింట్లో. గోవింద మాట్లాడకుండా వూరుకుంది.
గదిలోకి వచ్చిన చటర్జీ దృష్టి మంచం మీద పడింది. గోవింద కిటికీ లోంచి నల్లని ఆకాశంలోకి మిణుకు మిణుకుమని ఆశా జ్యోతుల్లా వెలిగే నక్షత్రాల వైపు చూస్తోంది. వున్నట్లుండి కళ్లల్లో నీళ్ళు చెంపల మీద రాలిపడ్డాయి. చటర్జీ గోవింద కన్నీటిని తుడుస్తూ 'నీకిది రెండవ రాత్రి అని నేను గుర్తు చేయ దల్చుకోలేదు. నువ్వు అనవసరంగా బాధపడవద్దు. శ్రీకాంత్ ని తీసుకురా. వాడు మన బిడ్డ.' అన్నాడు.
గోవింద కళ్ళలో వేయి మెర్క్యురీ లైట్లు ఒక్కసారి వెలిగిన కాంతి కనిపించింది. నేలమీదికి జారిపోయి అతని పాదాల మీద చేతుల్ని అన్చించి నిశ్శబ్దంగా. ఐదు నిమిషాల గడిచేక శ్రీకాంత్ ని తీసుకు రమ్మని గోవిందని పంపాడు అతను.
నిద్రలో లేచిన వాడు చటర్జీని చూసి చేతులు చాచి ఒక్క వురుకు వురికాడు అతని మీదకి. గోవింద నిలుచునే వుంటే అతను మంచం పక్కన చోటు యిచ్చాడు కూర్చోమని. శ్రీకాంత్ అతని గుండెల మీద ఆదుకుని అలిసి పోయాక అక్కడే నిద్రపోయాడు. గోవింద అతని వైపు కృతజ్ఞతగా చూసింది. కుడిచేతిని చాపి అతను గోవింద ని కౌగిలి లోకి తీసుకున్నాడు.
* * * *
నెలా రెండు నెలలు గడిచేక చటర్జీ హైదరాబాదు నుంచే మకాం యెత్తేశాడు. అతనికి ఈ వుద్యోగం మీద బ్రతుకుతేనే రోజు గడుస్తుందన్న చింత లేదు. విశ్వనాధం తో అన్నాడు. 'తెలిసిన వూళ్ళో తప్పుచేయక పోయిన తప్పు చేశాం అని బ్రతుకుని వెళ్ళ బుచ్చడం నాకు బాగుండదు బావగారూ. హాయిగా ప్రశాంతంగా మారు మూల పల్లెటూర్లో వుండే సుఖం యీ పట్నాల్లో వుండదు. నాన్నగారిచ్చిన భూముల్ని దగ్గరుండి స్వయంగా చూసుకుంటాను. నాలుగైదేళ్ళకి మళ్లీ వస్తాం యిటు వైపు.'
విశ్వనాధం 'యెక్కడికి వెడుతున్నారని ?' అడగలేదు.
మీనాక్షి అతన్ని చనువుగా పిలవడం యేడెనిమిది నెలల్లో నేర్చుకుంది. 'చూడు తమ్ముడూ గోవింద మా కళ్ళ యెదుట వుంటుందని అనుకున్నాం. యేడాది కోసారైనా వచ్చి మాకు చూపించు.' ఆవిడ మాటలకి దుఃఖ పు తెరలు అడ్డం వచ్చాయి. పసివాడు యిప్పుడు వీధిలో ఆగిన కారు యెక్కి అద్దం లోంచి మేనమామకి అత్తకి 'టా ! టా' చెప్పుతూ చప్పట్లు కొట్టి యెగిరి గంతులు వేసేంత పెద్దవాడయ్యాడు.
వానపల్లి తూర్పు గోదావరి జిల్లాలో చిన్న కుగ్రామం. ఆవూరు పంట కాలవ లతో, పచ్చని పైరు పొలాలతో కనుల పండువుగా , చూడ ముచ్చటగా ప్రకృతి పవిత్ర భారతికి పట్టిన నీరాజనం లా వుంటుంది. ఆ గ్రామం లోనే చటర్జీ కి తండ్రి రాసి యిచ్చిన సుక్షేత్రమైన పాతిక ఎకరాల భూమి వుంది. అదిగాక స్వంత యిల్లు కన్నతండ్రి కట్టి యిచ్చాడు. వానపల్లి చేరుకున్నాక గోవింద చుట్టూ కలియ జూసింది. యిదివరకు పేరు వినడమే తప్ప చూసి యెరుగదు. భర్త దూరంగా అలోచించి చేసిన పనికి తృప్తి పడ్డది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా రోజుల్ని గడిపేయ దలుచు కున్నారు యిద్దరూ.
మావగారు కూడా ఆ జిల్లాలోనే వుండడం గోవిందని భయపెట్టింది. చటర్జీ అభయహస్తం యిచ్చాడు. 'అతను గానీ, అతని తాలూకు వాళ్ళు గానీ వస్తే, వచ్చినా గొడవలే మైనా చేస్తే మన రైతు జనం వూరుకోరు. అయినా నిన్ను వదిలి నేను యెక్కడికైనా వెడితే కదా నీకా సమస్య. నువ్వు నిశ్చింతగా వుండు గోవిందా. లోకం భీరువుల్ని అణగద్రోక్కుతుందే కానీ ధైర్యవంతుల్ని యేమీ చేయలేదు. సమాజం అంటే యేమీ లేదు. వట్టి భోగస్. మేకపోతు గంబీర్యం లాంటిది సంఘం చేసే ఆర్బాటం . మనం యెదురు తిరగడం ప్రారంభిస్తే, అది తోక ముడుచు కుంటుంది.'
గోవింద నిశ్చింతగా వూపిరి పీల్చుకుంది. వానపల్లి వచ్చాక రెండు నెలలకి భార్యని తీసుకుని చటర్జీ తల్లి తండ్రులు దగ్గరికి వెళ్ళాడు. అతని తల్లి మనసులో కించపడి వుంటుందని ముఖ కవళికల్ని బట్టి చటర్జీ గ్రహించాడు. తండ్రి మాత్రం యేమీ అనలేదు.
