"చూడమ్మా వాణి...యిదిగో యివి బీరువా తాళాలు. ఆ లాకర్ లో డబ్బువుంటుంది. యింటి ఖర్చుకు కావాలంటే వాడాలి. బంట్రోతు చేత యింటికి ఏమేం కావాలో వంటాయనని అడిగి తెప్పించు-సీతమ్మ పూజగది చూపిస్తుంది. నేను మంచానపడిన దగ్గరనించి దేముడికి ధూప దీప నైవేద్యాలే కరవయ్యాయి. ఉదయం కాస్త స్నానం చేశాక దేముడికీ దీపం వెలిగించు-ఏదో పెద్దదాన్ని చాదస్తం అనుకో, కానీ, కాబోయే యింటి కోడలివి- ఆ పని మరెవరికి చెప్పలేను గదా."
ఉదయం లేచి కాఫీ తాగుతూండగా అనసూయమ్మ దగ్గర కూర్చోపెట్టుకుని వాణి యింటి విషయాలన్నీ అడిగింది వాణి అణుకువగా అన్నీ చెప్పింది.
"యింతవుంది మాకు-కాని ఏం లాభం? యీ యింట్లో....నేనీమూల యిలా వంటరిగా పడుంటాను-వాడెప్పుడూ నెలకి ఇరవైరోజులు తిరుగుతూ వుంటాడు- మాట్లాడేందుకన్నా మనిషి లేక నేను పడే అవస్థ నీకు తెలియదు. పసిపాపలు పారాడని యిల్లు. ఏం యిల్లు-నీవు వచ్చావు అప్పుడే యింటికి కాస్త కళ వచ్చింది" అనసూయమ్మ వ్యధగా అంది.
"ఆవిడకి....మీ కోడలికి పిల్లలు కలగలేదా...." వాణి అతి మొహమాటపడి అడగలేక అడిగినట్లు అడిగింది- "ఆవిడ పేరు ఏమిటి?" కుతూహలం ఆపుకోలేక అడిగింది. ఆ ప్రసక్తి యిష్టంలేని దానిలా అనసూయమ్మ మొహం ముడుచుకుంది. "లేదు-పద్మావతికి పిల్లలు పుట్టలేదు-అందుకే-ఒరే నాయనా వంశం అంతరించి పోతుందిరా అంటూ బాధపడ్డాను- ఏదో యీనాటికి వాడికి మనసు మళ్ళింది" అంది అనసూయమ్మ నిట్టూర్చి.
"ఆవిడపోయి ఎన్నాళ్ళయింది" వాణి మరింత కుతూహలంగా అడిగింది. అనసూయమ్మ, సీతమ్మ మొహాలు చూసుకున్నారు- అనసూయమ్మ యిబ్బందిగా కదిలి.
"ఐదేళ్ళు" అంది ముభావంగా.
"ఏదన్నా జబ్బు చేసిందా?" వాణి అలా ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతూంటే అనసూయమ్మ మొహం ముడుచుకుని నుదురు చిట్లించింది ఆ ప్రసక్తి యిష్టంలేనిదానిలా సీతమ్మ కల్పించుకుని "పదండమ్మగారూ-స్నానం అదీ చేద్దురు గాని-వంటాయనకి ఏం చెయ్యాలో చెబుదురుగాని రండి" అంటూ బయటికి తీసికెళ్ళిపోయింది.
ఆ పెద్దయింటిని చూస్తూ ఆశ్చర్యచకితురాలై పోయింది- యించుమించు మూడొంతుల యిల్లంతా వాడుక లేకుండా మూతపడి పాడుపడినట్లుంది- కిందభాగం అంతా అసలు- అన్ని తలుపులు మూసివుండి తలుపులు తెరిచేసరికి దుమ్ము- ధూళి, బూజులతో నిండివుంది.
"సీతమ్మా - యిల్లంతా యింత పెద్దదేకాని యిలా వుందేమిటి? ఎవరూ ఎప్పుడూ తుడవరా?"
సీతమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది- "తుడిస్తేమాత్రం ఎవరుండాలి యింత పెద్ద యింట్లో యిల్లంతా తాళంపెట్టి వుంచితే పాడుపడక ఏం చేస్తుంది."
"అందుకే మరి రోజూ తుడిపించాలి-పనివాళ్ళు చాలా మందే వున్నారు. ఏం చేస్తున్నారు అసలెవరెవరున్నారు కాస్త చెప్పు యింట్లో" అంది వాణి. అప్పుడే యింటి పెత్తనం స్వీకరించి తమ మీద అధార్టి చెలాయిస్తున్నదనిపించి సీతమ్మ కాస్త మొహం గంటు పెట్టుకుని- "నేనున్నాను. నాకు పెద్దమ్మగారి పనితోనే సరిపోతుంది- వంటయన వంట చేస్తాడు- గౌరమ్మ అంట్లు తోముతుంది- రాఘవులు పైపని చూస్తాడు- వీరన్న మాలి-యింకా డ్రైవరున్నాడు- ఎవరిపని వారికుంటుంది" సీతమ్మ నిర్లక్ష్యంగా అంది.
"అంతా యింట్లోనే వుంటారా?" యింతమంది వున్న యిల్లు యిలా వుందనుకుంటూ ఆశ్చర్యపడింది- "యిక్కడే భోంచేస్తారా?"
"ఆ... అంతా యిక్కడే భోంచేస్తారు- యీడనే వుంటారు- మాలి, గౌరమ్మ మొగుడుపెళ్ళాలు వెనకాల వుంటారు- రాఘవులు, డ్రైవరు, వంటాయన కింద గదుల్లో వుంటారు. నేను పెద్దమ్మగారి గదిలోపడుకుంటాను" వాణి యీసారి మరింత ఆశ్చర్యపడింది. యింట్లో-వుండేది యిద్దరు మనుష్యులు-అందులో రాజారావు యింటి పట్టునే వుండడు-ముసలావిడ ఒక్కర్తే తినే ఆవిడ- యింటి మనుష్యులకంటే పనివాళ్ళు తినేది ఎక్కువై పోయిందన్న మాట.
మేడమీద గదుల్లోకూడ రాజారావు గది. అనసూయమ్మగారి గది, వాణి వున్నగది, మధ్య హాలు తప్ప తక్కిన వన్నీ తాళాలు పెట్టి వున్నాయి-సీతమ్మ ఒక్క గది తెరచి చూపింది- రాజారావు గదికి ఆనుకుని అటువున్న గదిమాత్రం తెరవలేదు.
"ఈ గదిలో ఏముంది?" వాణి కుతూహలంగా అడిగింది.
"అది పద్మావతమ్మగారి గది- ఆరున్నప్పుడు వాడుకునేవారు. యిప్పుడు తెరవనీయరు అయ్యగారు" అంది సీతమ్మ ఉదాసీనంగా.
"ఏం...."కుతూహలంగా చూసింది వాణి- "ఏమో-మాకేం తెలుస్తాయి పెద్దోరి గొడవలు- ఆ అమ్మ వెళ్ళిపోయి నకాడ నించి..." అనేసి నాలిక కొరుక్కుని ఆగిపోయింది సీతమ్మ. వాణి తెల్లబోతూ "వెళ్ళిపోయారా?....అదేమిటి? చనిపోలేదా? అలా అనుకున్నానే- ఎక్కడికి వెళ్ళిపోయారూ?" అంది ఆశ్చర్యంగా- సీతమ్మ గాభరాగా....."అదేనండి అమ్మగారూ, చనిపోయినకాడనించి అనబోయి పరధ్యానంగా అలా అనేశాను..." అంది సర్దుకుంటూ-సీతమ్మ మొహంలో గాభరా చూసిన వాణి ఆ మాట నమ్మలేక పోయింది.
