వాణి స్నానంచేసి దేముడికి పూజచేసింది-తరువాత ఆ పూటకి కూరలు ఏమున్నాయో చూసి వంట అతనికి తనకి తోచినవి ఏవో చెయ్యమని పురమాయించింది- సామాను గదిలో గౌరమ్మ సాయంతో ఏం వున్నాయో చూసి తెప్పించవలసినవి గుర్తుగా రాసుకుంది. అనసూయమ్మ పాలుమాత్రం తాగుతుందని తెల్సుకుని పాలుపట్టుకుని పైకి వెళ్ళింది వాణి, అప్పటికి సీతమ్మ అనసూయమ్మకి స్నానం చేయించింది-"పాలు తెచ్చావా నీవు-సీతమ్మ తెచ్చేదిగా" అందావిడ.
"మరి నే నెందుకోసం వచ్చినట్టు" అంది వాణి. చనువుగా నవ్వి. మళ్ళా తనే అంది.
"మీరేం అనుకోకపోతే ఒక్కమాట- యింట్లో వుండేది మీ రొక్కరూ- మీ అబ్బాయి మూడొంతులు వుండనే వుండరు. మరి వంటలవీ యిన్నేసి రకాలు ఎందుకు? ఎవరు తినడానికి! మీ యిద్దరికీ యింత యిల్లు అవసరమా?"
అనసూయమ్మ అదోలా నవ్వింది.
"యిప్పుడు కట్టిన యిల్లా యిది? యీనాడంటే యిలా కళావిహీనంగా, ఖాళీగా, బూజులు పట్టి వుందికాని- మామగారున్న కాలంలో నేను కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో ఈ యిల్లు.....ఈ వైభవం ఎలావుండేదో తెలుసా- యిన్ని గదులూ నిండి వుండేవి-పూటకి యాభైమంది భోజనం చేసేవారు- యీ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీరివే- ఆ రైతులూ, కరణాలు, మున్సబులు, కౌలుదార్లు- ఎవరు ఏ వ్యవహారంమీద వచ్చినా భోంచేసి వెళ్ళాల్సిందే- ఎంత మంది పనివాళ్ళున్నా చేతినిండా పని- రాత్రి అయ్యేసరికి గ్యాసులైట్లతో పెళ్ళివారి యిల్లులా కళకళలాడి పోయేది. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మామగారి చేతిమీద జరగాల్సిందే- ఏ మంచయినా చెడయినా ఆయన విచారణ జరపాల్సిందే- చుట్టుపక్కల గ్రామాలన్నింటికి మకుటంలేని మహారాజులా వుండేవారు ఏం చెప్పమంటావు ఆ వైభవం - ఏమయిందో ఆ వైభవం-అయిపోయాయి ఆ రోజులు-మామగారితోనే చెల్లిపోయాయి ఆ రోజులు" ఎప్పటిరోజులో తలుచుకుని ఆవేదనగా అంది అనసూయమ్మ. వాణి చకితురాలై వింటూ వుండిపోయింది.
...."మరి..... మరి ఆ భూములూ అవీ యిప్పుడూ వున్నాయా" అంత ఆస్థి అంటే నమ్మలేనట్టు అడిగింది వాణి.
"హు...చెప్పాగా....ఆ వైభవం మామగారితోనేసరి అని....యిప్పుడు...యింత తిండి గింజలు వచ్చే భూములు మాత్రం మిగిల్చారు ఆ తండ్రి యీ కొడుక్కి..." ఆవిడ విరక్తిగా అంది. వాణి ఆశ్చర్యంగా చూసింది.
వాణి ఏం మాట్లాడలేదు. కొత్తగావచ్చి పెళ్ళయినా కాకముందే అంతకంటే వివరాలు తఃరిచి అడగడం ఉచితం అనిపించలేదు. అనసూయమ్మ చెప్పిన అన్ని విషయాలమధ్య పద్మావతి వెళ్ళిపోయింది అన్నమాట వాణిమీద బాగా పనిచేసింది.
* * * *
తరువాత రెండుమూడు రోజులు యిల్లంతా ఓ కొలిక్కి తీసుకురావడానికి నా నా తంటాలు పడింది వాణి పనిమనిషీ, బంట్రోతులని యిద్దరినీ దగ్గిర పెట్టుకుని అన్ని గదులు తుడిపించి. విరిగిపోయిన కుర్చీలు, సోఫాలు అన్నీ ఓ మూల గదిలో పారేయించి, ప్రతీ గది తలుపులు, కిటికీలు తీయించి తుడిపించి. తివాచీలన్నీ ఎండలోపడేసి దుమ్ము దులిపించి ఒక్కోవస్తువు, ఒక్క గది సర్దుతూ వచ్చింది. పరదాలన్నీ ఉతికించి, యిత్తడి పూలకుండీలు తోమించి పూలు అమర్చి, గాజు బీరువాలో వస్తువులు అన్నీ తుడిచి సర్దింది.
మూడురోజులు పనివాళ్ళతో కూర్చుని చేయించి ఓ రూపానికి తేగలిగింది. పని లేకుండా, యజమానులు అన్న వాళ్ళు లేకుండా బద్ధకం బలిసివున్న వాళ్ళందరికి యిలా వాణి వల్ల వళ్ళు వంచాల్సి రావడం యిష్టం లేకపోయినా యిల్లు శుభ్రపడి కళకళ లాడ్డం చూశాక వాణి శ్రద్దాసక్తులపట్ల గౌరవమే కల్గింది.
ఇన్నాళ్ళు అడిగేవారు- అదుపులో పెట్టేవారు లేక స్వేచ్చగా బతకడం అలవాటయిన వాళ్ళందరికీ తనరాక యిబ్బందిగా వుందని వాణి గ్రహించింది-వాళ్ళంతా దారిలోకి రావడానికి కొన్నాళ్ళు పడ్తుందని గ్రహించింది.
సీతమ్మద్వారా వాణి యింటిని ఎలా బాగుచేసిందో విని అనసూయమ్మ మెచ్చుకోలుగా...."యింక నాకు నిశ్చింత, నీలాంటి కోడలు కోసమే యిన్నాళ్ళు చూశాను నా కోరిక యిప్పటికి తీరింది." అంది అభినందిస్తున్నట్టు- వాణి సిగ్గుగా నవ్వి వూరుకుంది.
వాణి ఓసారి గదిలోకి వస్తుంటే "యింటిని చక్కదిద్దినట్లు యింటి యజమానినికూడా సరిదిద్దుకోగలిగిందంటే యింక నిశ్చింతగా చచ్చిపోతాను సీతమ్మా- రాజా వాణి రాకతోనైనా బాగుపడితే నాకింక ఏమి అక్కరలేదు- మొదట్లో లేనింటి పిల్ల అని సందేహించాను కాని వాణిని చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఇన్నాళ్ళకి రాజా చేసిన మంచి పని యిది ఒక్కటే..." ఆవిడ సంతృప్తిగా అంది.
"అవునండమ్మగారూ-అమ్మాయిగారు చిన్నపిల్లయినా ఎన్నేళ్ళో కాపురం చేసిన యిల్లాలు మాదిరి యిల్లు చక్కపెట్టింది- పద్మావతమ్మగారు ఒక్కనాడూ యింటి విషయం పట్టించుకునేవారు కారు- ఎంతయినా మరి జమీందారు బిడ్డ" సీతమ్మ అంది.
"ఆ....జమీందారీలు పోయినా పాడు గొప్పలు మిగిలిపోయాయి- జమీందారిణిఅయితే యిల్లు సంసారం చూసుకోకూడదటనా" విరక్తిగా అంది ఆవిడ.
పెరట్లో మొక్కలకి గొప్పులు తవ్వుతున్న మాలి గౌరవమ్మతో "అంత అందంగుండే పద్మావతమ్మగోరినే తిన్నగా ఏలుకోనేదు బాబు, యీ అమ్మతో కాపురం తిన్నగా సేస్తాడా-బాబుకెలా నచ్చిందంట యీ అమ్మ-యీ అమ్మతో ఎన్నాళ్ళు కాపురంచేస్తాడో బాబు" అంటున్నాడు హేళనగా.
