Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 8


    పెద్ద పాతకాలపు పందిరి మంచంలో- పచ్చగా వడలిపోయిన తమలపాకులావున్న వృద్ధురాలు కాబోయే అత్తగారు అని ఎవరూ చెప్పకుండానే పోల్చింది వాణి-చటుక్కున చేతులు జోడించి నమస్కరించింది. అనసూయమ్మ వాణిని ఒక్క చూపుతోనే ఆపాదమస్తకం పరీక్షించేసింది-ఆదరపూర్వకంగా "రా అమ్మా, రా ఏం యింతాలశ్యం అయింది-యింక యీ రోజుకి రావనుకున్నాను. రా యిలా కూర్చో" మంచంపక్కన కుర్చీచూపుతూ ఆధారంగా ఆహ్వానించింది.
    "తోవలో బస్సు పాడయిందండీ-బండిలో వచ్చాణు, అందుకే యింతాలశ్యం అయింది" వాణి అణుకువగా అంది కుర్చీలో కూర్చుని.
    "అలాగా-పోనీ బండన్నా దొరికింది-లేకపోతే నా నా అవస్థపడేదానివి. ఏదో క్షేమంగా చేరావు అంతేచాలు, సీతమ్మా-అమ్మాయిగారిని తీసుకెళ్ళి గది చూపించు స్నానానికి అన్ని ఏర్పాటు చెయ్యి- వెళ్ళమ్మా- నీ పేరు వాణి కాదూ- తరువాత మాట్లాడుదాం ముందు స్నానంచేసి భోంచెయ్యి-మొహమాట పడకు."
    సీతమ్మ వెంట వాణితన గదిలోకి వెళ్ళింది. "పక్కనే స్నానాల గది వుంది అమ్మగారూ-మీకేం కావల్సినా నన్ను పిలవండి. పెద్దమ్మగారి గదిలోనే వుంటాను-స్నానం చేసిరండి భోంచేద్దురుగాని" అంది సీతమ్మ-వాణి తల ఊపింది.
    ఇల్లు పురాతన ఫక్కీలో వున్నా ఆధునిక సదుపాయాలు అన్నీ వున్నాయి. రాజారావు తన హయామురాగానే యింటికి కరెంటు పెట్టించి ఫ్లేన్లు అవి పెట్టించాడు. పడక గదులకి ఎటాచ్ బాత్ రూములు అవీ ఏర్పాటుచేశాడు.
    వాణి గదిలో నిలువెత్తు గాజుకిటికీలు-కిటికీలనించి వ్రేలాడే పరదాలు, చక్కని మంచంమీద ఫోం పరుపు- ఓ ప్రక్కన డ్రెస్సింగ్ టేబిల్, గాడ్రెజ్ బీరువా, వార్ డ్రోబ్.....అన్నింటిని వింతగా చూసింది- బ్యాగ్ తెరచి చీర తువాలు తీసుకుంటూంటే ఆ యింటికి, ఆ యింట్లో వస్తువుల ముందు తను తన చీర వెల వెల బోతున్నట్టు అన్పించి సిగ్గనిపించింది. ఆ యిల్లు-యింట్లో వస్తువులు మరో నెల రోజులలో తన స్వంతం అనుకుంటుంటే ఆనందమో - గర్వమో - భయమో ఏదో తనకే తెలియని భావానికి లోనయింది. బాత్ రూము తలుపు తెరిచింది.
    చల్లటి నీళ్ళు శరీరంమీద పడగానే కాస్త గుండె అదురు తగ్గింది- ప్రయాణ బడలిక తగ్గి సేదతీరినట్లనిపించింది. తెల్ల చీర కట్టుకుని-పౌడరద్దుకుని బొట్టు పెట్టుకుంటూంటే సీతమ్మ లోపలికి వచ్చింది. "అయిందా అమ్మా-పదండి భోం చేద్దురుగాని చాలా రాత్రయింది." అంది.
    భోజన హాలు పాతిక ముఫ్ఫై మందికి సరిపోయేటంత పెద్ద హాలు-పన్నెండుమంది కూర్చోడానికి వీలుగా పెద్ద టేబిలు- పాతకాలపు నగిషీలు చెక్కిన కుర్చీలు, ఓ పక్క ఫ్రిజ్.
    "పంతులుబాబూ- చినమ్మగారికి వడ్డించు" అంటూ వంటాయనికి చెప్పి ఓ కుర్చీలాగి "కూర్చోండమ్మా" అంది సీతమ్మ- వంటఅతను వాణిని ఓ సారి కుతూహలంగా చూసి వడ్డనకి ఉపక్రమించాడు. వెండి పళ్ళెంలో వేడి అన్నం-పొగలుకక్కుతున్న సాంబారు, ఏవో రెండు కూరలు, పచ్చడి..... చూసేసరికి వాణి ఆకలి విజృంభించింది. ఉదయం ఎప్పుడో  తిన్న భోజనం- మొహమాటాన్ని వెనక్కి నెట్టి తినసాగింది- భోంచేస్తూ సీతమ్మ కుతూహలంగా అడిగిన ప్రశ్నలకి తమ యింటి వివరాలు జవాబులు చెప్పింది- అన్నీ విన్నాక సీతమ్మ - వంటాయన మొహాలు చూసుకోవడం, వాణి గమనించలేకపోలేదు.
    "పెద్దమ్మగారు భోంచేశారుగా" అంది వాణి మధ్యలో.
    "ఆ... ఎప్పుడో తిన్నారు- రాత్రిళ్ళు అట్టే తినరు అమ్మగారు, రెండు రొట్టెలు గ్లాసుడు పాలు తాగుతారు-అందులో యీ రోగం వచ్చాక యింకా తగ్గించేశారు." సీతమ్మ జవాబిచ్చింది.
    "మరి.... మరి- ఎవరికోసం యింత వంట-అయ్యగారూ లేరుగా" అంది వాణి చటుక్కున - సీతమ్మ అదోలా నవ్వింది. "ఎవరుండడం ఏం, మేం అంతా వున్నాంగా అయినా మీరొస్తున్నారని" అంటూ సర్దుకుంది మాట మార్చి.
    ఇంతంత వండి, పనివాళ్ళకోసం కూడా యిన్నిన్ని రకాలు వండడం..... యిదంతా వారి దర్జా, అలవాటు గాబోలు- వాణి యింకేం అనకుండా లేచి చేయికడుక్కుంది.
    వాణి గదిలోకి వెళ్ళేసరికి అనసూయమ్మ నిద్ర ఆపుకో లేనిదానిలా ఆవులిస్తూ "భోంచేశావా మొహమాటపడకుండా తిన్నావా-అలిసిపోయావు వెళ్ళిపడుకో, నాకూ నిద్ర వస్తూంది. వెళ్ళమ్మా - పడుకో - యీ రాత్రి యింక చేసేదేం వుంది. నీకు ఏం కావల్సినా సీతమ్మ యిక్కడే పడుకుంటుంది వచ్చి పిలు. తలుపు లోపల వేసుకో" అంది పడుకోడానికి ఉపక్రమిస్తూ అనసూయమ్మ.
    వాణి తన గదిలోకి వచ్చింది, తలుపు గడియవేసుకోబోతూ గదిలో మంచినీళ్ళకోసం చూసింది-ఎక్కడా కనపడలేదు సీతమ్మని ఓ గ్లాసుతోనో చెంబుతోనో పెట్టమనాలని మళ్ళీ అనసూయమ్మ గదివైపు నడిచింది - గుమ్మం దగ్గిరికి రాగానే "కాస్త ఛాయ తక్కువైతేనేం కళగా వుందమ్మగోరూ మొగం-నెమ్మదైన అమ్మాయిలాగే కనిపిస్తున్నారు."
    "ఆ అందం, పాడు ఎవరికి గావాలే-యిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటే అంతే చాలు- యీసారైనా వాడి బుద్ధి కుదిరి కుదురుగావుంటే చాలు- లేనింటిపిల్ల, పద్మావతిలా కాక కాస్త అణుకువగా వుంటుందేమో-ఇంతకీ నా బంగారం మంచిదయితేగా యింకోరిని అనడానికి, ఆ-లైటార్పు ... ఎంత బాధపడినా నా చేతిలో ఏం వుంది" అనసూయమ్మ మరోసారి ఆవలించి భారంగా అంది.
    వాణి గుమ్మం ముందే ఆగిపోయింది ఆ మాటలు విని-అప్రయత్నంగా అడుగు వెనక్కివేసి చప్పుడు చేయకుండా గబగబ తన గదిలోకి వెళ్ళిపోయింది. అనసూయమ్మ మాటలకి అర్ధంబోధపడీపడనట్టు అయింది-ఈ సారైనా బుద్ది కుదురుగా వుంటే..... మన బంగారం మంచిదైతే....ఆవిడమాటలు అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే వాణి గుండెలు గబగబ కొట్టుకున్నాయి. పక్కమీద నీర్సంగా వాలి పోయింది.
    
                                       *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS