శ్రీశ్రీ
నాగభైరవ కోటేశ్వరరావు
ఆకాశపుదారులంట అడావుడిగా వెళిపోయే
జగన్నాథ రథచక్రాల్ జగతికి దించిన వాడా!
మార్క్స్ మహర్షి దృక్పథాన్ని మన కవితకు తెచ్చి యిచ్చి
మరో ప్రపంచం కోరిన మహాకవీ! మరో రవీ!
ఈ శతాబ్ది నీదేనని లేశమైన అనుమానం
లేనే లేదన్నావు- కలేజాగల మొనగాడవు
నీ యనంతరపు కవులకు నీ విచ్చిన వారసత్వ
మేది? మహాప్రస్థానము అది మా అందరి వేదము
ఎవరి చుట్టు వెలుగులు ప్రసరించగలవొ అతడే రవి
ఎవరివెంట కవులు గుంపులవుతారో అతడే కవి
నీ చూపిన దారులందు నిలిచి సాగినారు కవులు
దారిని నిర్దేశించిన దార్శనికత గొప్పది కద
జగతిలోన తెలుగు కవిత జేగంటలు మ్రోయువరకు
శ్రీశ్రీ-నీపేరు చిరంజీవిగ రూపొందగలదు
('ఆంధ్రజ్యోతి' వారపత్రిక, 20-06-1984)
బాలలే విజ్ఞాన కేతువులు / నేడు రేపులమధ్య సేతువులు
చంద్ర బంధుర సుధా శీతువులు /
మానవత్వ వికాస హేతువులు
(బాలల వత్సరం ..'వాణి' పక్షపత్రిక, 7-7-1979)
