Previous Page Next Page 
శ్రీశ్రీ మన సంగీతం పేజి 8


                                      స్ఫూర్తిదాత శ్రీశ్రీ

                                                కాటంరాజు    

    కణకణ మండే సూర్యుడే శ్రీశ్రీ
    చిరునవ్వులు చిందే చంద్రుడే శ్రీశ్రీ

    చీకటిపై, ఆకలిపై సంధించిన శరమై
    దోపిడిపై, రాపిడిపై ధ్వజమెత్తిన హరుడై                                                  || కణకణ ||

    అన్నార్తుల ఆపన్నుల అసహాయుల ఊతమై
    అహరహం తపియించిన మరోజగతి దూతయై
    దగాపడిన దీనజనుల చైతన్యపు గీతమై
    దోపిడి దుర్గం కూల్చే మరఫిరంగి మ్రోతయై                                               || కణకణ ||

    ఆకాశహంసయై విహరించెడి కావ్యకథను
    భూమార్గం పట్టించి, భుగభుగలు పుట్టించి
    ఈ యుగమే నాదంటూ, జగమే మా వెంటంటూ
    నినదించిన కవి సింహం నిప్పులు గ్రక్కిన శౌర్యం                                          || కణకణ ||

    కాలమనే కత్తుల వంతెన దాటిన సారథి
    కదన కుతూహలం రేపు కవన కవాతు మహారథి
    కార్మిక కర్షక వర్గపు కల్యాణ మనోరథి
    కలకాలం నిలిచి వెలిగే కవితా శిఖి శ్రీశ్రీ                                                       || కణకణ ||

    సమభావం సమన్యాయం సమసమాజ ధ్యేయంగా
    సాగిన బ్రతుకంతా బాధల సుడిగుండమైన
    సడలిపోని ధైర్యానికి సాక్ష్యమైన జీవితం
    శ్రీరంగం శ్రీనివాసరావు- కీర్తి మనకు స్ఫూర్తి !                                                 || కణకణ ||


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS