శ్రీశ్రీ కథ
దివికుమార్
శ్రీశ్రీ కథ యిది శ్రీ...శ్రీకథా!
తెలుగుజాతి విప్లవ చైతన్య సుధ...
శ్రీశ్రీ కథ యిది శ్రీ..శ్రీ కథా
కాళ్ళు చేతులకు మనసు మెదళ్ళకు
భావావేశపు కవి సమయానికి
నాగబంధమౌ ఛందో పద్యపు
గ్రాంథికాల వృత్తాంతం చూడగ
చండచండముగ తీవ్రతీవ్రముగ
ఖండఖండముల దండెత్తించిన
...శ్రీశ్రీ కథ యిది
మరో ప్రపంచం సాధించంగా
మహాయాత్రయై మహోధృతంగా
దారి పొడవునా గుండె నెత్తురులు
అర్పణ తర్పణ అనివార్యంబని
పేటలన్నింటికి బాటలు చూపిన
దోపిడి కోటల ధ్వంసం కోరిన...ప్రజాకవి
...శ్రీశ్రీ కథ యిది
కష్టజీవులే కర్మవీరులని
నవధర్మానికి తొలి తెరతీసిన
దేశం జాతి వ్యక్తి పీడనలు
లేశం లేని సంఘం కోసం
ధనుంజయునిలా సాగిరమ్మనీ
పద్మవ్యూహం ఛేదించమనే...సమరకవి
...శ్రీశ్రీ కథ యిది
యువతనందరిని నవతకోసమని
మహోజ్జ్వలంగా ప్రభంజనమ్మై
కణకణమండుతు జలజల పొంగుతు
పెళ పెళ పెళ పెళ విరుచుకుపడమని
కవిత రూపమై ఆవేశించిన
నెత్తుటి కలమై ఆదేశించిన...మహాకవి
...శ్రీశ్రీ కథ యిది
ఆశయమంటె సామ్యవాదమె
ఆయుధమంటె ప్రజావిప్లవమె
ఆశయాలు ఘర్షించే వేళల
ఆయుధంబు అనివార్యంబవునని
కష్టజీవుల కన్నీళులతో
నిప్పుల ఉప్పెన గుప్పించిన ఘన...
శ్రామిక విప్లవకవి
...శ్రీశ్రీ కథ యిది
శ్రీశ్రీ కథ యిది శ్రీ...శ్రీకథా!
తెలుగుజాతి విప్లవ చైతన్య సుధ...
శ్రీశ్రీ కథ యిది శ్రీ..శ్రీ కథా
(రచన : జనవరి 2010, శ్రీశ్రీ 'హరికథ'కు ప్రారంభ గేయం )
భూమికోసం, భుక్తి కోసం
సాగే రైతుల పోరాటం
అనంత జీవిత సంగ్రామం
అంతం కాదిది ఆరంభం
(అంతంకాదిది ఆరంభం..'సృజన' మాసపత్రిక, 1973)
