"డ్రైవర్ లేడూ ---- ఇంత రాత్రి నీవెండుకూ రావడం , నెవెడతా, ఏ టాక్సీనో చూసుకుంటాలే---"
"ఇక్కడెక్కడా టాక్సీలు దొరకవు. రెండు మూడు ఫర్లాగులు నడిస్తే తప్ప. ఇంత రాత్రి తీసుకొచ్చి నడిపించి పంపించనా ----- పరవాలేదు రా-------"
"అప్పుడప్పుడు వస్తుండు -- ఎందుకో నిన్ను చూశాక ఎవరో ఆప్తుడు కనపడినట్టు ప్రాణం లేచి వచ్చింది -" కారులో అంది తార ఆర్ద్రంగా.
"నీలాంటి బిజీ తార దర్శనం నాలాంటి వాళ్ళకి దొరుకుతుందా , మీ ఘూర్కా గెంటేస్తాడేమో నేను వస్తే -----" హాస్యంగా అన్నాడు సారధి.
"ఛా --- అలా ఎందుకు చేస్తాడు ----- నేను చెపుతా వాడితో -------- నీ వెప్పుడు వచ్చినా సరాసరి పైకి తీసుకురమ్మని , వచ్చేముందు ఫోను చేసి వస్తుండు, నేనింటో వున్నదీ లేనిదీ అడిగి, నా నెంబర్ నోటు చేసుకో. నీ ఆఫీసు నెంబరు రాసియ్యి. వీలున్నప్పుడు నేను చెప్తా."
"తప్పకుండా వస్తాను సుందరీ. ఇంత గొప్పదానివయినా యీ పాత మిత్రుడిని ఇంత ఆదరంగా రమ్మని ఆహ్వానిస్తే రాకుండా ఎలా వుంటాను?"
"అదిగో నీవూ అలాగే అనుకుంటున్నా వన్న మాట. సినీతార అయినంత మాత్రాన మాకూ మనసులు , సెంటిమెంట్స్ అవీ ఉండని బండరాళ్ళ మనుకుంటున్నావా?....."
"అందుకు కాదు .... నీవు నోరు తెరచి ఆపదలో సహాయం కోరినా ఏం చెయ్యలేకపోయాను ఆనాడు, యీ రోజు ఏం మొహం పెట్టుకుని నీ దగ్గరికి రావాలీ ." బిడియంగా అన్నాడు సారధి.
"అదా, పరవాలేదు నీవు మాత్రం ఏం చేస్తావు. అంత హటాత్తుగా వచ్చి అడిగితె నీవే మరొకరి ఆధారం మీద వున్నవాడివి నన్నేం ఆదుకుంటావు. ఆ విషయంలో నేనేం అనుకోలేదు. ఫర్ గెట్ ఇట్. అదేం మనసులో నాకు లేదు." అంది తార.
"థాంక్స్ . అదిగో ఆ గల్లీలోకి తిప్పు.... ఇక్కడే ఆపెయ్యి కాదు. ముందుకి ఇంత పెద్ద కారు వెళ్ళడు. అదిగో ఆ కనిపిస్తున్న పచ్చ మేడ లేదూ , ఆ మేడ మీద గదే నాది. వుంటా సుందరీ. మెనీ, మెనీ థాంక్స్ ఫర్ యువర్."
"దేనికీ థాంక్స్. చాల్లే మాటలు నేర్చావు. అచ్చా. బై .... గుడ్ నైట్ ఫోన్ చేస్తా ...." అంటూనే తార కారుని వెనక్కి తిప్పింది.
సుందరి .....తారతో ఇంతసేపు గడిపినా ఇంకా నమ్మశక్యం కాని విషయం లాగే ఆశ్చర్యంగా ఆలోచిస్తూ పడుకున్నాడు సారధి పాత సంగతులతో పాటు ----- యీ రోజు సంఘటన గురించీ!
రోజూ ప్రక్క మీద వాలగానే అలసటతో ఆదమరచి నిద్రపోయే తారకి ఆరోజు ఎంతసేపటికీ నిద్రపట్టక దొర్లింది.
* * *
"హల్లో ......హల్లో సారధి . మంచివాడివే . ఇదేనా రావడం, పదిహీనురోజుల నుంచి వస్తావేమోనని రోజూ చూస్తున్నాను.... నన్నప్పుడే మరిచిపోయినట్లున్నావు గదూ." నిష్టూరంగా అంది తార.
"సారీ .......వెరీ సారీ .....యీ మధ్య ఆఫీసులో పనెక్కువగా వుంటోంది. ఇంటికొచ్చేసరికి ఆలశ్యం అయిపోతుంది. ఆమధ్య రెండు సార్లు ఫోను చేశాను. నీవు లేవన్నారు."
"సరే పోనీ గానీ, యీ రోజు సాయంత్రం రాకూడదూ. నాకు షూటింగ్ లేదు. ఫ్రీగా వున్నాను..... కాసేపు కూర్చోవచ్చు..."
"ఇవాళా......ఆఫీసులో పని.......ఏమాత్రం వీలున్నా వస్తా."
"వెయిట్ చెస్తుంటాను. తప్పక రావాలి. ఆలశ్యం అయినా ఫరవాలేదు ." తార అర్దింపుగా అంది.
పోను పెట్టేశాక సారధి మనసు పనిలో లగ్నం కాలేకపోయింది. సుందరి .... సుందరికి తన మీద ఎందుకంత ఇంటరెస్ట్! ఇంత పెద్ద నటి అయి ఇంత సిరిసంపదలున్న సుందరికి తనలాంటి ఒక సామాన్యుడి సహవాసం ఎందుకు? కేవలం పాత పరిచయం పురస్కరించుకుని పిలుస్తుందా! అలా అనుకోదానికన్నా తనకీ సుందరికీ వున్న పరిచయం మాత్రం ఎంత! ఎదురింట్లో వుండేవారు , ఆమె తండ్రికి ఎప్పుడన్నా డబ్బవసరం వున్నప్పుడు అప్పిచ్చేవాడు. దానికి బదులు అప్పుడప్పుడు భోజనానికి రమ్మనేవారు. సుందరితో తను ఎదుటపడి మాట్లాడడం కూడా ఎప్పుడూ లేదు. సుందరి కేమో గానీ సుందరి మీద తనకెలాంటి అభిప్రాయమూ లేదు అప్పుడు.
