కేవలం అప్పుడప్పుడు ఆ అమ్మాయి అనాకారి తనాన్ని చూసి ఈ పిల్లకి పెళ్లి ఎలా అవుతుంది తండ్రి ఎలా చేస్తాడు డబ్బు కూడా లేదు అనుకుని జాలి పడేవాడు. ఆ అమ్మాయి తనని ఆకర్షించడానికి పడే ఆరాటం చూసి పిచ్చి మొద్దు అని నవ్వుకునేవాడు. తార యీనాడు తనతో పెద్ద పరించయస్తురాలిలా ఎందుకు వ్యవహరిస్తుంది. ఆమెకి కావాలంటే తనమాత్రం పరిచయం వున్నవాళ్ళు లక్షల మంది దొరుకుతారు. మేటి నటీనటులు, మిత్రులు ఎంతో మంది మధ్య తనని గుర్తుంచుకొని ఫోను చేసి మరీ పిలిచినా సుందరి సహృదయతని మెచ్చుకోకుండా వుండలేకపోయినా, ఆమె ముందు యినాడు తగ్గినిలబడ్డానికి సారధి కెందుకో చిన్నతనంగా వుంది. ఆనాడు తిరస్కరించిన తన తిరస్కారాన్నీ మరచి మళ్ళీ స్నేహంగా ఆమె వుండగలిగినా సారధి గిల్టీగా ఫీలవుతున్నాడు. అస్తమానం వెడితే ఈనాడు తను పనికొచ్చింది గాబోలు అని ఎక్కడనుకుంటుండోనని కూడా మనసులో జంకాడు. కానీ ....సుందరి.... సహృదయంతో నిష్కపటంగా ఆహ్వానిస్తూంది. రమ్మంటుంది. వెళ్ళకుండా ఎలా ఉండగలడు!
సారధి సాయంత్రం తార ఇంటికి వెళ్ళేసరికి ఏడు గంటలవుతుంది. హాలులో సుందరి తండ్రి సారధిని చూసి పలకరించాడు. " నీవా బాబు , ఎవరో అనుకుని పలకరించలేదు ఆరోజు..... అరెల్లయింది చూసి పెద్దతనం మరుపు వచ్చేసింది, అయినా బాగా మారిపోయావు. వళ్ళు చేశావు బాగా. కులాసాగా వున్నావా? ....... అమ్మాయి చెప్పింది నీవని ..... మా సుందు కోసం వచ్చావా , వెళ్ళు పైన వుంది " అంటూ పల్కరించాడు . మర్యాద మాటలు , యోగక్షేమాలు అడిగి సారధి పైకి వెళ్ళాడు.
తార ఎవరికో ఫోన్ చేస్తుంది..... ఫోన్ చేస్తూనే సారధిని చూసి కూర్చోమని సైగ చేసింది ..... "యు సిల్లీ .....ఏమిటా మాటలు " ఎవరితోనో నవ్వుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ...... "చాల్లే ఇంక , ఫోను పెట్టేస్తున్నాను. మా ఫ్రెండు ఒకరు వచ్చారు.........ఎవరో నీకు తెలియదు. అబ్బా! ఏవిటా ఇంటరెస్టు --- ఎవరయితే నీకెందుకు, ఊహు... కిరణ్ కాదు..... అనంత అసలే కాదు ....నేను చెప్పను........ ఏమిటి అంత అసూయ....ఉడుక్కోకు , నా ఫ్రెండు చిన్నప్పటి ఫ్రెండులే. షటప్ . నీవనుకునేదెం కాదు, అచ్చా. బైబై . తరువాత మళ్ళీ మాట్లాడుకుందాం." ఫోను పెట్టేసి తార సారధిని చూసి నవ్వింది ఆ సంభాషణ , ఆమె నవ్వు , ఏమిటలా అన్పించింది సారధికి. అక్వర్డుగా కూర్చున్నాడు.
"బొత్తిగా నల్లపూసవయిపోయావు , మళ్ళీ రానే లేదు" పలకరించింది.
"చెప్పాగా , ఆఫీసుపని అని, బిజీగా ఉంటావు నీవేప్పుడూ . నిన్ను డిస్ట్రబ్ చేయడం ఎందుకని."
"నా బిజీ ఎప్పుడూ వుండేదే. నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కాస్త రొటీన్ నించి రిలీఫ్ దొరికినట్టుంది. లేకపోతే ఎప్పుడూ ఏముంది, రంగేసుకుని అలా చమటలు కార్చుకుంటూ గంటలకి గంటలు ఆ రేకుల షెడ్డులో కూర్చోడమేగా మా బ్రతుకు."
"అయితే అంత కష్టపడడం ఎందుకు! అన్నేసి పిక్చర్లు ఒకసారి వప్పుకోవడం ఎందుకు? అంత విశ్రాంతి లేకుండా పని ఎవరు చేయమన్నారు?"
"నీకు తెలీదు. ఈ డబ్బున్నది సంపాదించడం ఆరంభించాక ఈ దాహం తీరడం అన్నది వుండదు. ఈ సినీ జీవితంలో ఎవరేన్నాళ్ళు వెలుగుతారో తెలియదు. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు చేర్చుకోవాలన్న ఆరాటం వుంటుంది. ఖర్మకాలి ఒకటి రెండు పిక్చర్లు ఫేలయ్యాయనుకో మన మొహం చూడరు. అంచేత దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న తాపత్రయం వుంటుంది. కొందరిని కాదనలేక, కొందరితో మొహమాటాలూ, మరికొందరితో కృతజ్ఞత, ఏదో విధంగా కాదనలేని పరిస్థితి . ఏం చెయ్యమంటావు."
"బాగుంది. ఆరోగ్యం సంగతటుంచి బొత్తిగా బయట ప్రపంచంతో సంబంధం వుండదు గదా. ఏ సరదాలకి టైముండదనుకుంటాను."
"చెపుతున్నానుగా. ఏ లైఫ్ లేదు మాకు. ఒక సినిమా చూద్దామంటే కుదరదు. ఏ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలన్నా వీలవదు, ఓ షికారు లేదు, పుస్తకం చదవడానికన్నా అవదు. ఆ స్టూడియోలో వున్నంతసేపూ మేకప్ తో పాటు నవ్వు ముఖానికి పులుముకొని తోటి నటులతో యేవో పిచ్చి మాటలు మాట్లాడటం ----- అందులో అభిమానాలు, ఆప్యాయత లుండవు . ఆ సినిమాలో నటిస్తున్నంత సేపూ ఆ ప్రొడ్యూసర్లు , తోటి నటులు అంతా పలకరిస్తున్నా అంతా బిజినెస్ లైఫ్ గ వుంటుంది. అందుకే నీలాంటి వాళ్ళు కనపడగానే ఏదో రోలీఫ్ దొరికినట్లుంది."
"ఇందాక నేను వచ్చేసరికి ఎవరితోనో అంత చక్కగా మాట్లాడుతున్నావు ,ఫ్రెండ్స్ లేకపోవడం ఏమిటి?-" అవకాశం వచ్చేసరికి మనసులో ఇందాకటి నుంచి దొలుస్తున్న ప్రశ్న అడగకుండా వుండలేకపోయాడు సారధి. తార నిర్లక్ష్యంగా నవ్వింది.
'అతనా! హీరో శ్యాం."
"నీకు ఫ్రెండా?"
"నా మొహం ఏదో మా మాటలు అందరితో అలాగే వుంటాయిలే. సినిమాలోనే గాదూ , నిజజీవితంలోనూ నటన అలవాటయిపోయింది. నటిని గదా!" తార అదోలా నవ్వుతూ అంది.
