Previous Page Next Page 
నయనతార పేజి 8

 

    "ఒకసారి అదృష్టవశాత్తు ఓ అవకాశం తోసుకు వచ్చింది. ఆరోజు ఓ సినిమాలో హీరోయిన్ కాలేజీ స్నేహితురాలిగా ఓ డైలాగు చెప్పాల్సిన వేషం వేయాల్సిన ఎక్ స్ట్రా ఆరోజు జ్వరం వచ్చి రాలేదు. రాణి ఆ అమ్మాయి కోసం విసుక్కున్నారు. సెట్ సిద్దం, హీరో హీరోయిన్ రెడీగా వున్నారు. చిన్న ఎక్ స్ట్రా రానందుకు షూటింగ్ ఆగదు గదా! ఆ వున్న గుంపులో ఎవరినో ఒకరిని గబగబ వేషం వేయించమన్నారు. అందరిని సంతలో పశువుల మాదిరి నిలబెట్టి అసిస్టెంట్ శల్య పరీక్ష చేశారు.
    "నా అదృష్టం బాగుండబట్టి అతని దృష్టి నామీద నిల్చింది. మేకప్ చేశారు. కాలేజీ అమ్మాయిని గనక మంచి చీర అది గట్టి ఫేషనబుల్ గా తయారుచేశారు. నేను చెప్పాల్సిన డైలాగు రెండు మూడు సార్లు చెప్పించారు. ఈ లైటింగులు, కెమెరాలు అన్నీ అలవాటయినవే గనక జంకు బొంకు లేకుండా ధైర్యంగా ఏక్ట్ చేశాను. డైలాగు బాగాబే చెప్పాను. చిత్రంలో నా పోర్షన్ చూస్తుంటే నేనేనా అని ఆశ్చర్యపోయాను.
    "అంత అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి నేనా అన్నట్టు డైరెక్టరు హీరో దగ్గర నించి అందరూ ఆశ్చర్యంగా చూశారు. మంచి ఫోటో జేనిక్ ఫేస్ అంటూ కెమెరా మెన్ మెచ్చు కున్నాడు. ఉచ్చారణ గొంతు అన్నీ చాలా బాగున్నాయి అని అంతా పొగిడారు పొంగిపోయాను. నా దశ తిరగడానికి అదే నాంది!
    అ పిక్చరు తరువాత పిక్చరు కి అదే తారని బుక్ చేసిన ప్రొడ్యుసర్ -- ఆ సినిమాలో ఆ తార కాల్ షీట్లు అవి సరిగా యీయకుండా నానా ఇబ్బంది పెడ్తుంటే విసిగిపోయాడు. చెంపలు వేసుకుని కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు. తరువాత చిత్రానికి ఎవరన్నా క్రొత్తవారిని తీసుకోవాలనుకుంటుంటే కెమెరామాన్ నా పేరు సూచించాడట. చాలా బాగుంది, ఆ అమ్మాయిని తీసుకుని క్రొత్త తారగా ఇంటడ్యూస్ చేస్తే లాభానికి లాభం, ఓ క్రొత్తతారని పైకి తెచ్చిన పేరు వస్తుందని అసిస్టెంట్ డైరక్టరు అందరూ చెప్పారట. ఇంకేం నాకు వరుసపెట్టి స్క్రీన్ టెస్టులు, వాయిస్ టెస్టు, ఏక్టింగ్ టెస్టు అన్నీ చేయించారు. అద్భుతం అన్నారంత. ప్రొడ్యుసరు రొట్టె విరిగి నేతిలో పడింది. నన్ను చాలా తక్కువకి బుక్ చేసి ఆ చిత్రంలో నాయికగా వేయించాడు.
    "నా మొదటి సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. నా అందం అంతా కళ్ళలోనే వుందన్నారు. నా ఎక్స్ ప్రేషన్స్ అంతా కళ్ళే అన్నారు. 'నయనతార' అని పేరు మార్చారు. నటించలేదు జీవించిందన్నారు. ఆ పాత్ర కోసమే పుట్టిందన్నారు. బోరన్ ఏక్ ట్రేస్ అన్నారు. అందాల తార అన్నారు. ఓహ్..... ఆనాటి నా అనందం ఏం చెప్పగలను! ఆ సినిమా చూస్తుంటే నాలో అంత టాలంట్ దాగి వుందని నాకే తెలియలేదు. అటు ఆర్ధికంగా ప్రోడ్యుసరుకి యిటు పేరు ప్రఖ్యాతలు నాకు తెచ్చి పెట్టింది ఆ పిక్చరు.
    "తరువాత -- తరువాత ఇంకేం వుంది ! ఓవర్ నైట్ తారాపధాన్ని అందుకున్నాను; బిజీ నటి నయ్యాను. కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్ లు! రేటు పెరిగిపోయింది. అప్పటి నించి ఇప్పటివరకు ఏకబిగిన మూడు కాల్ షీట్స్ పని చేస్తున్నాను. అదృష్టవశాత్తు ఇప్పటివరకు నా పిక్చర్ ఏదీ ఫీలవలేదు. రూపాయి డబ్బుల కోసం మొహం వాచిపోయిన నాకు, ఇప్పుడు ప్రయత్నం లేకుండానే లక్షలు వచ్చి పడుతున్నాయి." తార నవ్వుతూ ముగించింది.
    "అందుకే అదృష్టవంతులని పాడుచేసే వారెవరు అన్నారు. ఐ కాంగ్రాట్యూలేట్ యూ సుందరీ" అన్నాడు సారధి మనస్పూర్తిగా లేచి నిల్చుంటూ.
    "వెళ్ళిపోతావా ! ----- " అంది తార.
    "వెళ్ళద్దూ--- పదకొండు దాటింది, నీకూ షూటింగ్ అదీ వుండదూ మళ్ళీ ప్రొద్దుటే ----"
    తార బద్దకంగా అవలించింది - "అవును ప్రొద్దుటే ఆరుగంటల కల్లా లేచి వెళ్ళాలి ------ ఈ పూట హీరోకి వంట్లో బాగుండలేదని కాన్సిల్ అయింది షూటింగ్. అంచేతే అలా సినిమా చూద్దామని వచ్చాను. లేకపోతే సినిమా చూసే సమయం ఎక్కడుంది నాకు. నేను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ళ కామెంట్సు వింటూ చూడ్డం సరదా నాకు. ఎప్పుడో గాని వెళ్ళడం కుదరదు. వెడితే ఎవరో ఒకరు గుర్తుపట్టి అల్లరి చేసి చుట్టూ మూగుతారు. ఇదివరకులాగ ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రీగా వెళ్ళడం కుదరదు---------- ముందులో అయితే ఇంతమంది అభిమానులు నాకున్నారని ఆనందంగా గర్వంగా వుండేది ---- యిప్పుడయితే గుంపుని చూస్తె చిరాకు ----- సరే పద, నిన్ను దిగాబెడ్తాను."  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS