Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 9


    ఆయన అన్నదానం ప్రారంభించటానికి ముందు చాలా పెద్ద కథ జరిగింది. అదే రెడ్డిరాజులు నిండా నూరు సంవత్సరాలు పరిపాలించలేకపోవటానికి కారణం కూడ అయింది.
    రాయలసీమలో అప్పటికే చాలాకాలం నుండి రెడ్లుగా పిలువబడుతున్న రాష్ట్ర కూటుల ముఖ్య వృత్తి వ్యవసాయం. అలాగే కామారెడ్డి వ్యవసాయం చేసుకు జీవిస్తున్న పేద రైతు. సామాన్య కుటుంబీకుడు.
    ఒకరోజున వేమన్న అనే పేరుగల సన్యాసి అతని ఆశ్రయం కోరి వచ్చాడు. కామారెడ్డి కాదనలేదు. తన యింటిలోనే ఆశ్రయం చూపాడు. ఆ సన్యాసి విరివిగా ఖర్చు చేసేవాడు. ఎప్పుడూ గంజాయి దమ్ములో తేలిపోతూ ఉండేవాడు. అంత డబ్బు అతనికి ఎలా వచ్చిందో గ్రామస్థులకు అర్థం కాలేదు.
    అతనివద్ద పరశువేది ఉన్నదనే పుకారు బయలుదేరింది. వాస్తవానికి సాంఖ్యయోగ శాస్త్రం చెప్పినట్లుగా సృష్టిలో తొంభైరెండు మూలకాలే ఉన్నాయి. మరే యితర ద్రవ్యరాశిని మూలకంగా మార్చే వీలుండదు. కాని ఆ విద్యావంతులయిన ఆ పల్లెటూరి పేదరైతులు పసరు కట్టుతో బంగారం చేయవచ్చునని నమ్మేవారు. కామారెడ్డి కూడ అలానే నమ్మాడు.
    సన్యాసి వేముడు అట్టహాసంగా, విలాసంగా డబ్బు ఖర్చుచేస్తూ జీవించటం అతనిలో దురాశను రేపింది. ఓరోజు సన్యాసి యెక్కడికో వెళ్ళి వచ్చేసరికి కామారెడ్డి కొంపా గోడూ తగలబడిపోయి వున్నాయి. సన్యాసి భద్రంగా దాచుకున్న ఒక పాత్ర కూడా భస్మీపటలమయిపోయిందని చెప్పారు.
    సన్యాసి వేముడు ఆ బూడిద యావత్తూ గాలించినా అతనికేమీ దొరకలేదు. అతడు భద్రంగా దాచుకున్న ఆ పాత్రలో బంగారమో, వజ్రలో ఉండి ఉండాలి. అవి కాస్తా కామారెడ్డి పరమైపోయాయని గ్రహించాడు సన్యాసి. అతడు గోడుగోడున విలపిస్తూ కామారెడ్డిని శపించాడు. తర్వాత ఆ గ్రామంలోనే ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడు. చనిపోయేముందు కామారెడ్డిని పిలిచి కొన్ని సంగతులు చెప్పాడు. అవన్నీ కామారెడ్డి ఆచరించాలి.
    "కామారెడ్డీ! నేను ఆత్మాహుతి చేసుకుని ఈ బంధాల నుండి విముక్తి పొందుతున్నాను. నేను యదార్దాలకి సన్యాసిని. నాకు డబ్బుమీద వ్యామోహం ఉండకూడదు. కనుక నీవు మంచిపనే చేశావనుకుంటున్నాను. ఇందులో నీ తప్పు రవ్వంతే! నా కన్నులు తెరిపించావు. నేను నీకు కృతజ్ఞుడినే! కాని, నా చావుకి కారణమయినందువల్ల నీ వంశం త్వరలో సర్వనాశనం కాబోతున్నది. నా నుండి దొంగిలించిన సంపదతో నీవు రాజ్యాన్ని స్థాపించు. నందికంత గ్రామంలో వున్న పోతురాజు కఠారిని నీ రాజ్యానికి రక్షగా పూజించు. దానికి అపకారం జరిగినప్పుడు నీ వంశం నశిస్తుంది. నీ వంశీకులు యెల్లప్పుడూ అన్నదానం చేస్తూ వుండాలి సుమా!" అని చెప్పి అతని చితిలో ప్రవేశించాడు. ఆ కథ అంతటితో ముగిసింది.
    తరువాత వారి వంశీకులే సన్యాసి వేముని పేరుమీద విస్తరించి రాజులయ్యారు. అనవేముడు అతనికి ముందు వాడయిన ప్రోలయ వేముడు, తరువాత కాటయవేముడు, పెదకోమటి వేముడు, చినకోమటి వేముడు, రాచరికానికి కడపటి వాడైన రాచవేముడు వీరంతా సన్యాసి వేముడి పేరు ధరించినవారే!" అంటూ రెడ్డి రాజ్యస్థాపనకు పూర్వ చరిత్రను ముగించారు పెద్దియజ్జ్వ.
    నేను పరిసరాలను పరికించాను.
    చుట్టూ కీచురాళ్ళ రొద. మేము వొక పెద్ద గుహ ముందు నిలచి ఉన్నాము. లోపల ఏమీ కనిపించటం లేదు. పెద్దియజ్జ్వ అన్నారు.
    నాయనా! నాతో ఈ చీకటిలో ప్రవేశించు. మహిమాన్వితమయిన ఈ గుహ నాకు అయిదు వందల యాభై సంవత్సరాల నుంచి విడిది. నా తపోసాధన యావత్తూ ఈ గుహలోనే కొనసాగింది. నాతో రా!" అంటూ లోపలకు అడుగుపెట్టారాయన.
    యదార్థానికి నాకు గుహలో ప్రవేశించాక యేమీ కనిపించలేదు. కాని, యెవరో నాకు దారిచూపుతున్నట్లే ఉంది. పెద్దియజ్జ్వ ముందు నడుస్తున్నారు. ఆయన తపోదండమూ పులి చర్మమూ చంకలో ఉన్నాయి. కమండలమును అడుగులకు అనుగుణంగా ముందుకూ వెనుకకూ ఊపుతూ నడుస్తున్నారు. బాగా అలవాటు పడిన గృహాంతర్భాగంలో గుడ్డివాడు నడిచినంత సులువుగా నేను నడుస్తున్నాను. కొంతదూరం పోయాక ఆయన ఆగి వెనుతిరిగారు. నేనూ నిలిచిపోయాను. ఆయన నన్ను కూర్చోమని ఆదేశించారు. కూర్చున్నాను. క్రింద పులి చర్మమో దర్భాసనమో రవంత మెత్తగా తగిలింది.
    "పద్మాసనం వేసుకో" అన్నారు ఆయన. వేశాను.  
    "నీవిప్పుడు పూర్వాభిముఖంగా ఉన్నావు. లోక బాంధవుడయిన సూర్యదేవుని భృకుటిలోని అజ్ఞా చక్రం మీదికి ఆవహింప చేసుకో" అన్నారు. ప్రయత్నించాను. అలాగే దృష్టిని భృకుటిలో నిలిపి సూర్యుని వెలుగును తనివితీరా సందర్శించు. చూశావా? అదుగో అరుణబింబం దగ్గరౌతున్నది కదూ? ఇంకా దగ్గరగా వచ్చింది. తెల్లని వెలుగు కదూ? అదుగో వెలుగు వెల్లువ. ఆ వెలుగు వెల్లువలో నీవుకూడా కలిసిపో...పో...పో" అంటూ ఆదేశిస్తున్నారు పెద్దియజ్జ్వ. నేను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాను.
    నాకు యదార్ధంగానే ముందు రవి అరుణబింబ దర్శనమైంది. తరవాత ఆ బింబం దగ్గరగా వస్తూ తెల్లగా మారుతోంది. నేను పరిశీలిస్తున్నాను. ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ వెలుగు వుక్కిలింతలయ్యే వెల్లువగా మారింది. ఆ వెల్లువలో నేనూ కొట్టుకు పోతున్నాను. కలిసిపోతున్నాను. అలా కొంతదూరం పోయాక నాకొక మణిశిలా ఫలకం లాంటిది కనిపించింది. అది మొదట్లో చాలా చిన్నది. కందిబద్దకన్నా చిన్నది. అది దగ్గిరయ్యేకొద్దీ పెరిగిపోసాగింది. పెరిగి, పెరిగి వామనుడి వలె అనంతంగా పెరిగింది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS