Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 10


    ఆ స్థితిలో నాకెలాగ అవుపించిందంటే, ఆ మణిశిలా ఫలకం అనంతంగా పెరిగిపోతూ అండపిండ బ్రహ్మాండాలన్నీ అదే వ్యాపించినట్లయింది. ఎటుచూచినా మరేదీ కనిపించలేదు. దాని వెనుక ఏమున్నదో చూడాలనే కుతూహలం కలిగింది. వెంటనే అది రవ్వంత బీటవారి దాని వెనుకనున్న దృశ్యం అవుపించసాగింది.
    అది దక్షిణాధీశు ముత్యాలశాల. చినకోమటి వేముడు సమున్నత రత్న సింహాసనంపై ఆశీనుడై వున్నాడు. మామిడి సింగన్న మహామంత్రి గంభీరముద్రతో ఆశీనుడై వున్నాడు.
    చినకోమటి వేమునికి దక్షిణ పార్శ్వాన మణిశిలా వేదికపై పులిచర్మము పరుచుకుని దానిపై రాజగురువు పెద్దియజ్జ్వ పద్మాసనా విష్ణులై వున్నారు.
    వేమునికి ఎదురుగా నాలుగు ధనస్సుల దూరాన సమున్నత వేదికపై సరస్వతీ పీఠం ముందుంచుకొని శ్రీనాథుడు కూర్చుని వున్నాడు. సరస్వతీ పీఠంలో వ్యాసభారతం తాళపత్ర ప్రతి వున్నది. తాళపత్రాలు కుడివేపు నుండి లేచి వామపక్షానికి కాలిపోతున్నాయి. పురాణ శ్రవణం సాగుతోంది. ద్వారం వద్ద తురగా రామయ్య ఆశీనుడయ్యాడు. అతని చూపులు చంచలంగా వున్నాయి. అతడు పురాణం వింటున్న లక్షణాలేవీ లేవు. ఏదో వార్త కొరకు ఎదురుచూస్తున్నట్లుగా వుంది. రాజుగారి వెనుక తెరగా దించిన రవసెల్లా వెనుకనుండి రత్నమంజీరాల మణికంకణాల నిక్వణాలు కావ్య మధురంగా వినిపిస్తున్నాయి. శ్రీనాథుడు సకల సద్గుణ నికురయి శారదాంబ అని సరస్వతీదేవిని ప్రస్తావించినట్లే మహారాణి సూరమాంబను భూరి సద్గుణ నికురంబ సూరమాంబ అని ప్రస్తుతించేవాడు. ఆమె పండితురాలు.
    శ్రీనాథుడు తన గంభీర మధురమైన కంఠంతో ద్రోణపర్వంలో ప్రధమాశ్వాస పఠిస్తున్నాడు. సంశప్తకులు అర్జునుణ్ని దూరంగా లాగివేస్తున్నారు. మాయా మోహితుడైన జీవుడి లాలన అతడిని ఎక్కడికో లాగుతున్నది. లేకపోతే అభిమన్యుడు మరణించేవాడా? విధి ఆగదు కదా!
    తల్లి ప్రక్కన ఆశీనురాలై పురాణంశ్రవణం చేస్తున్న వేమాంబ చిన్నారి హృదయం కథలో ముందుముందుకు వెళ్ళిపోతున్నది. ఆమె అప్పుడే మొగ్గరాన్ని భేదిస్తున్న అభిమన్యుడి రూపాన్ని వూహిస్తోంది.
    ఆ మొగ్గరంలో, ఆ ఊహలో అవక్ర పరాక్రమ విక్రముడై విజృంభించినవాడు అభిమన్యుడు కాదు. సోమదేవుడు. అతడి నుదుట వీరతిలకం. ఉక్కు శిరస్త్రాణం మెడమీద. ఆమె ఊహలతో అల్లిన ఉక్కు వల. శరీరమంతా శత్రువుల రక్తంతో తడిసి, ఎర్రగా మెరిసే కవచం. ఆమె ఊహలు అలా సాగిపోతున్నాయి.
    అంతలో ముత్యాలశాలముందు అయిదారు గుర్రాలు పరుగెత్తి వస్తున్న డెక్కల చప్పుడు వినిపించటంతో పురాణ పఠనం ఆగిపోయింది. పురాణానికి అంతరాయం కలగటంతో చినకోమటి వేముని భృకుటి ముడిపడింది. మామిడి సింగన్న మహామంత్రి తక్షణం లేచాడు. త్వరగా రామయ్య ఎప్పుడో బయటకు పరుగుతీశాడు. వారందరిలో రానున్న విషయాన్ని గ్రహించటానికి సన్నద్ధుడై ప్రశాంత చిత్తంతో కూర్చునివున్నవాడు ఒక్క పెద్దియజ్జ్వ మాత్రమే.
    త్వరగా రామయ్య యుద్ధ వార్తలు తెచ్చిన చారులను లోన ప్రవేశపెట్టాడు. రాజాజ్ఞ లేకుండా ఈ పనిచేసిన రామయ్యపై శ్రీనాధునికి ఒళ్ళు మండింది.
    "రామయ్యగారూ! ఏమిటో వేగిరపాటు?" అంటూ శూలం దించాడు శ్రీనాథుడు. రామయ్య మాటకారి.
    "యుద్ధరంగం నుండి వార్తలు వచ్చాయి. కురుక్షేత్రం నుండి కాదు శ్రీనాధయ్యా! మోటుపల్లి నుండి" మేము పురాణ యుద్ధాలు నిర్వచించి నిర్వచించి పొట్టపోసుకునేవారు కామనీ, యదార్థ యుద్ధాలతో ప్రత్యక్ష సంబంధం కలవారమనీ రామయ్య ఎత్తిపొడిచాడని శ్రీనాథయ్య గ్రహించాడు. సమయం కాదని మిన్నకున్నాడు.
    చారులు రాజుకు ప్రణమిల్లి లేచారు. చినకోమటి వేముడు తలపంకించి యుద్ధవార్తలు చెప్పమన్నట్లుగా ముఖముద్రను మార్చారు. శ్రీనాధయ్య అంతటివానిని త్వరగా రామయ్య వంటి సామాన్య ఉద్యోగి ఎత్తిపొడవటం ఆయన పట్టించుకోలేదు.
    రవశెల్లాల వెనుక రత్నమంజీర ధ్వనులు దూరమై ఆగిపోయాయి. రాజు ముఖంలోని అభిప్రాయాలను చదువుతున్న మహామంత్రి మామిడి సింగన్న చారులు తెచ్చిన వార్తలేమిటని రామయ్యను ప్రశ్నించాడు. రామయ్య చారులవంక అర్థవంతంగా చూడటంతో చారులు చెప్పటం ప్రారంభించారు. పెద్దియజ్జ్వ శ్రద్ధాళువై ఆలకిస్తున్నారు.
    కొండవీటి మహా సామ్రాజ్యానికి మహా మణిమకుట ధారులై చరుమూల సమస్త పెక్కు దేశాధీశులయిన శ్రీ శ్రీ శ్రీ చినకోమటి వేమారెడ్డి మహాప్రభువులకు ప్రణామాలు. మోటుపల్లి వద్ద నరపతి సైన్యాలు దురాక్రమణ సాగిస్తున్నాయి. వారికి విజయనగర రాజుల మద్దతు కూడా వున్నట్లు విశదమైంది. కుటుంబ కలహాల వల్ల కల్మషమయిన హృదయాలతో కందుకూరిరెడ్లు వారికే మద్దతులిస్తున్నారు అని విన్నవించారు. వేముని ముఖం వివర్ణమైంది. కాటయవేముని తలకొట్టినా అల్లాడరెడ్డి రాజమండ్రిలో అల్లర్లు లేవదీస్తున్నాడు. దక్షిణ సరిహద్దులలో శాంతి భద్రతలు కాపాడలేకపోతే కొండవీటి సామ్రాజ్యానికి సుస్థిరత లేదని అందరెరిగిన విషయమే! అందరూ ఆలోచనమగ్నులై ఉన్నారు. చినకోమటివేముడు సభ చాలించి పెద్దియజ్జ్వతో కలసి విశ్రాంతి మందిరం చేరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS