Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 8


    అప్పుడు నాకా మానవమూర్తిలోని అలౌకికమైన అంశాలన్నీ కనిపించసాగాయి. పరిశీలించాను.
    నైరంజరా నదీ తటాన సాలవృక్షాల నీడలో శయనించి లేచిన తధాగతుని మూర్తి స్ఫురించింది. శ్రీ పర్వతం మీద శబ్ద విస్తరణ వేదికమీదనుండి గంభీరంగా ఉపన్యసించే ఆచార్య నాగార్జునమూర్తి కనిపించినట్లయింది. నేను తధాగతునికి ప్రణయమిల్లి లేచిన అంగుళీమాలునివలె ఆచార్య నాగార్జున దేవుని బోధామృతాన్ని చవిగొన్న మాద్రీపుత్ర వీరపురుషదత్తువలె నన్ను భావించుకోసాగాను.
    "నాయనా! నేనెవరో గుర్తించావా?"
    "లేదు" వినయంగా బదులు చెప్పాను.
    "పెద్దియజ్జ్వను" శరీరమంతా ఒక్కసారి జల్లుమన్నట్లయింది. నఖశిఖపర్యంతమూ రోమాంచం కలిగింది. మూగవానివలె చూడసాగాను.
    "నాయన నీవు అదృష్టశాలివి. మన భారతీయ ఋషి సాంప్రదాయంలోని మహోజ్జ్వలత ఏమిటో ఇప్పుడైనా గుర్తించావా?" అన్నారు పెద్ది యజ్జ్వ, "మహాశయా! ఏమిటి ఈ విచిత్రం? నేను ఇక్కడకు ఎలా రాగలిగాను. అయిదు వందల యాభై సంవత్సరాలనాడు సన్యసించి, నగరాన్ని విడిచిపోయిన మిమ్ములను ఎలా చూడగలుగుతున్నాను" అని ప్రశ్నించాను. పెద్ది యజ్జ్వ మధురంగా నవ్వారు.
    "నీవు యోగ శాస్త్రాన్ని నిర్వచించే ఇరవై రెండు ఉపనిషత్తులు అధ్యయనం చేశావా? అవన్నీ యధార్దాలని నిరూపించే ఒక ఉదాహరణ మాత్రమే నీవు చూచే యీ నేను అనేది" అంటూ ఆయన చాలా గహనమైన విషయం నిర్వచించారు.
    ఇంతకూ ఆయన మూర్తి పాంచ భౌతికమైనది కాకపోవచ్చునన్న ధ్వని కూడా ఉన్నది. అది పాంచ భౌతికమూర్తి కానప్పుడు కాల నియమం దానికి లేదు. ఎన్ని శతాబ్ధాలైతేనేమిటి? పాంచ భౌతిక మైనది కాకపోతే మరేమిటి? ఏమో! అదేమో ఆయన చెప్పరు కదా?  
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అన్నారాయన.
    "సృష్టిలోని విచిత్రాలను గురించి" అని వివరించారు.
    "అది భౌతిక పరిధిలోని మనో విశ్లేషణకు అందేది కాదు. కాని, నీవు ఆ విషయాలను ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయవద్దు. నాతో రా!" అంటూ లేవటానికి ఉద్యుక్తులయ్యారు. నేను వారించాను.
    మహాశయా! ఒక్కక్షణం ఆగండి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎందుకొచ్చాను? ఇప్పుడు మనమెక్కడికి పోవాలి?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను.
    ఓ క్షణంపాటు ఆయన విశాలమైన నేత్రాలు ఆలోచనా మగ్నమై నిలిచాయి.
    "నాయనా! నీవు సామాన్యులైన సామాజికుల మధ్య పుట్టి పెరిగావు. కనుక నీవు కురిపించిన ప్రశ్నలు నీకు విచిత్రంగా అనిపించవు. కాని నేను వేరు. అనవరత వేదాధ్యయన తత్పరుల కుటుంబంలో పుట్టాను. రాజగురువునై జీవించాను. రాజకీయాలతో సతమతమై తల పండిపోయింది. వేమాంబా, సోమదేవుల విషాదాంత ప్రేమకథను కన్నులారా చూచి సన్యసించాను." అంటున్నప్పుడు ఆయన ముఖం రవ్వంత మ్లానమైంది. నాలో ఆసక్తి ప్రాణం పోసుకుని మొలకెత్తింది.
    "పెద్దియజ్జ్వ మహాశయా! ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితోనే నేను అనేక మారులు కొండవీడు చూచాను. కాని శాపగ్రస్తులైన మునుల్లా పడివున్న ఈ బండరాళ్ళ మధ్య చరిత్ర ఎక్కడో నిక్షిప్తమైంది. శ్రీనాథ కవిరాజు సంకల్పం కదా! సోమదేవుని వివాహం ఎందుకు విఫలమై పోయింది. అనార్యులకు అభిమన్యుని వంటివాడైన సోమదేవుడు చరిత్రలో మరుగున పడిపోయిన కారణ మేమిటి? అన్నాను.
    "అది పెద్ద పథకం ప్రకారం జరిగిందే నాయనా! ఆ విషయాలన్నీ నీవు గ్రహించాలి. అంతే కాదు. సందికంత పోతురాజు కటారి ఏమయిందో ఇప్పటికీ లోకానికి తెలియదు. ఈ రహస్యాలన్నీ యిప్పుడు నీవు చూడబోతున్నావు. మహా పండితురాలయిన సూరమాంబ అగ్నిప్రవేశం చేసేముందు ఆమెకు నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నేను లోకానికి చెప్పవలసిన విషయాలు యెన్నో నాలోనే ఉండిపోయాయి. అవన్నీ నీవు చూడబోతున్నావు. కాలాతీతమైపోతోంది. రా!" అంటూ లేచారాయన.
    "మహాశయా! మీరు అన్యధా భావించకండి. ఇక ఒకే ఒక్క ప్రశ్న. గృహరాజ సౌధ నిర్మాణం ఎందుకు పూర్తికాలేడు?" అన్నాను. చిరునవ్వుతో ముందుకు సాగారాయన. వెనువెంట నేనూ నడుస్తున్నాను.
    "బాబూ! నీవిప్పుడు చూడబోయేది అనార్యుల అభిమన్యుడయిన సోమదేవుని ప్రేమకథ. ఆ కథ నీకు విపులంగా తెలిపేందుకు నేను కొంత ప్రస్తావన చెప్పాలి. విను. కొండవీడును ఏలినది పంట రెడ్లు!" అంటూ ప్రారంభించారు. నన్ను నేను మరచిపోయి వింటూ ఆయనను వెంబడించాను. ఎక్కడకు నడిపిస్తున్నాడో!?
    "కామారెడ్డి, కొండవీటి రెడ్డి రాజులకు మూలపురుషుడు. అతని కుమారుడు వేమారెడ్డి. ఆయన నిరంతరమూ అన్నదానం చేసేవాడు. అందువలన ఆయనకు నిరతాన్నవేమన అనే పేరుండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS