Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 9

 

    ఇంతలో-
    మళ్ళీ సోలిపోయింది సృష్టి.
    ఆమెని పల్లకిలో ఎక్కించి, తను, పక్కన నడుస్తూ , వూరి వేపు వెళ్ళాడు రాజు.
    ఊళ్లోకి వెళ్ళగానే ఎట్లాంటి దృశ్యం కనబడుతుందో అతనికి తెలుసు.
    అది తలుచుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అతనికి.
    అనుకున్నంతా అయింది!
    ఊళ్ళోకి వెళ్ళగానే , రాజు తండ్రి పరమేశ్వర్ కనబడ్డాడు. అయన పక్కనే తల్లి సంయుక్త.
    ఇందాక ఈ వందిమాగధులు జయజయ ధ్వానాలు చేసిన , "రాజాదిరాజ , రాజపరమేశ్వర ప్రచండ భైరవుడు " తన తండ్రి !
    అట్లాంటి పేరు ఈ రోజుల్లో వింతగా వినబడుతుంది కాబట్టి తన 'బిరుదావళి' లో ఒకటైన 'రాజపరమేశ్వర' లో నుంచి 'పరమేశ్వర' అనేది తన పేరుగా పెట్టుకున్నాడు అయన.
    రాజాధిరాజ, రాజ పరమేశ్వర , మూరు రాయారగండ లాంటివి ఏ చక్రవర్తులో తగించుకోవలసిన బిరుదులు.
    చిన్న చిన్న సంస్థానాదీశులకి అవి తగవు.
    బిరుదలకేం!
    చుట్టూ చేరే వందిమాగధులూ ఉంటే ఎన్నయినా తగిలించుకోవచ్చును.
    తన తండ్రి, రాజాధిరాజ, రాజ పరమేశ్వర ప్రచండ భైరవుడు.
    తన తల్లి 'రాణీ' సంయుక్త.
    తన సొంత పేరేమో కుమార రాజా ఉత్తేజ విశ్వజిత్!
    'యువ ' అని అందరూ పిలిచే చెల్లెలి పేరు యువరాణీ వసుంధర!
    రాజ్యాలు పోయినా, రాజసం పేర్లలో మాత్రం మిగిలింది . అంతే!
    ప్రతి ఏడాదీ జరిగే జాతరకి తమ కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా రావాలి.
    అదిగో ! నాన్న ! భోషాణంలో నుంచి తీసిన పట్టు షేర్వాణీ వేసుకుని వున్నారు.
    తల మీద కుచ్చు తలపాగా! అవి అయన "పట్టాభిషేకం" టైం వి!
    అయన పక్కనే అమ్మ!
    రాణీ సంయుక్త!
    తల మీద కిరీటం ఒక్కటే తక్కువగా , అంతా రాణీలాగే ఉంది ఆమె.
    పట్టు చీరె!
    గిల్టు నగలు -
    రిమ్ లెస్ కళ్ళద్దాలు!
    భుజం చుట్టూ కాశ్మీరు శాలువా! అచ్చం సినీ జమిందారిణీ టైపులో ఉంది ఆమె.
    వాళ్ళ వెనుకగా --
    తులసీరావుగారు !
    తులసీరావుగారి కుటుంబం తరతరాలుగా తమ వంశానికి రాజపురోహితులుగా వుంటున్నారు.
    అయన పట్టేనామాలు పెట్టి, పట్టుపంచ కట్టుకుని వున్నారు.
    మరి .....
    చెల్లెలు యువ ఏదీ?
    అదే అడిగాడు రాజు.
    "యువ ఏదీ?"
    "ఏమిటీ?" అంటూ వాళ్ళు షాకయినట్లుగా చూశారు.
    "యువ ఏదీ అంటావా? మేమూ అదే అడగబోతున్నాం. యువ నీతో బాటుగా ఆ కాంపిటీషన్స్ చూడడానికి రాలేదా?"
    అర్ధం కానట్లుగా చూశాడు రాజు.
    "నందూ నన్ను, యువనీ ఎయిర్ పోర్టు కి తీసుకొచ్చాడు. నేను ప్లయిట్ ఎక్కాక వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు కదా!" అన్నాడు రాజు.
    "ఏదో జరిగింది !" అంది తల్లి సంయుక్త ఆదుర్దాగా .
    తండ్రి పరమేశ్వర్ అన్నాడు.
    "ఎయిర్ పోర్టు నుంచి నందూ ఫోన్ చేశాడు -- రాజుతో పాటు యువ కూడా వెళ్ళింది -- ముందే చెబితే మీరు వెళ్ళనివ్వరని చెప్పలేదు. ఆడపిల్లలు అట్లా తిరగడం మీ వంశ గౌరవానికి మచ్చట కదా- అందుకని చెప్పడానికి , భయపడింది -- రాజుతో కలిసి తిరిగి వచ్చేస్తుంది " అని చెప్పాడు పరమేశ్వర్ ఆందోళనగా.
    అది వినగానే మాకు యువ మీద కోపం వచ్చిన మాట నిజమే! అందుకే ఫోన్ చేసి విచారించలేదు " అంది సంయుక్త.
    "యువ నాతొ రావడం అన్నది అబద్దం!' అన్నాడు రాజు.
    "మరి ....నందూ ఎందుకట్లా చెప్పాడు !" అంది సంయుక్త.
    అందరి మొహాల్లోనూ అనుమానాలు ! ఇంతలో దూరంగా కలకలం వినబడింది అందరూ అటు చూశారు.
    ఆ పల్లెని అనుకునే అడవి వుంది.
    అడవిలో నుంచి వస్తున్నారు కొందరు మనుషులు.
    వాళ్ళు ఎవర్నో మోసుకు వస్తున్నారు.
    కొద్ది నిమిషాల తర్వాత ఆ గుంపు దగ్గరయింది.
    ,మోసుకొస్తున్న మనిషిని కింద పడుకోబెట్టారు వాళ్ళు.
    అతను రాజు ఫ్రెండ్ నందూ-
    అతని వంటి నిండా గాయాలు !
    "నందూ ! నందూ! ఏమయింది !" అన్నాడు రాజు.
    నందూ ప్రయత్న పూర్వకంగా కళ్ళు తెరిచాడు.  
    పెదిమలు తడి చేసుకుని అతి కష్టం మీద ఒక్కొక్క అక్షరం విడివిడిగా పలుకుతూ చెప్పాడు.
    "మీతో .......ఒకసారి .....అబద్దం చెప్పాను..... రెండోసారి ......నిజం చెప్పినా ......మీరు నమ్మరు ........నమ్మలేరు కూడా.........."
    "ఏమయింది?" అన్నాడు రాజు.
    "యువని ఒక రాక్షసుడు ......ఎత్తుకెళ్ళాడు..." అన్నాడు నందూ హీనస్వరంతో.
    "వ్వాట్?"
    "నిజంగానే .......నన్ను నమ్మండి! యువని .........రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు"
    "యువని రాక్షసుడేత్తుకెళ్ళాడా? ఇదేమన్నా జానపద సినిమా కధా?" అన్నాడు కోపంగా.
    "నేను చెప్పలేదూ.........నిజం చెప్పినా నమ్మరు ..... నమ్మలేరు . నమ్మశక్యం కాకపోయినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా?" అన్నాడు నందూ నీరసంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS