దగ్గరికి వచ్చారు.
ఒక్కొక్క మృతదేహం దగ్గరికి వెళ్ళారు.
ఆ డేడ్ బాడీస్ మీద విలువైన వస్తువులు ఏవైనా వుంటే తీసి భుజం మీద వున్న టవల్స్ లో గబగబా మూటకట్టడం మొదలెట్టారు.
శవాల చెవులకి ఉన్న కమ్మలూ, అవీ తీయడానికి రాకపోతే, కొడవళ్ళతో ఏకంగా చేవులనే కోసి మూటలో వేసుకుంటున్నారు.
ఆ అమానుషం చూసి ఒళ్ళు భగభగమండుతోంది రాజుకి.
కానీ కాలు కదపలేని నిస్సహాయస్థితి!
వాళ్ళు నెమ్మదిగా సృష్టి దగ్గరికి వచ్చారు.
ఆమె వంటి మీద వాళ్ళకు కనబడింది మెరుస్తున్న బంగారం కాదు.
ఆమె వంటి మెరుపు !
అందం, యవ్వనం కాంబినేషన్. బంగారూ వజ్రాల కలయికని మించింది కదా!
వాళ్ళలో ఒకడు వంగి సృష్టి వక్షం వైపు ఆకతాయితనంగా చెయ్యి జాపాడు.
ఒక్కసారిగా వంట్లోకి వెయ్యి ఏనుగుల శక్తి వాచ్చినట్లయింది రాజుకి.
"ర్రేయ్!" అని ఒక్క ఉదుటున లేచి, వాళ్ళ వేపు ఉరికాడు.
"వామ్మో!' అని వాళ్ళిద్దరూ కూడా, దయ్యాన్ని చూసిన వాళ్ళలా పరుగందుకున్నారు.
ఆ గడబిడకి సృష్టి'కి స్పృహ వచ్చింది.
ఆమె లేచి కూర్చుని, తన ఒంటి వైపు చూసుకోగానే -- తన షర్టు విప్పి ఆమెకి అందించాడు రాజు.
షర్టు వేసుకున్న తర్వాత స్థిమిత పడింది ఆమె. తర్వాత , కలలో లాగా లేచి అక్కడంతా తిరిగి చూసి,
"ఒక్కళ్ళూ బతకలేదు -- మనమిద్దరం తప్ప!" అంది హీనస్వరంతో .
అవునన్నట్లు తలపంకించాడు రాజు.
అంతలోనే పెద్దగా కోలాహలం !
కనుచూపు మేరలో ఒక పల్లె వుంది.
అక్కణ్ణుంచి జనం గుంపుగా ఇటువైపు పరిగెత్తుకు రావడం కనబడింది.
గుంపు క్రమంగా దగ్గరవుతుంది.
అప్పుడు కనబడ్డాయి -- వాళ్ళ చేతుల్లో వున్న కత్తులూ, కటార్లూ , శూలాలు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళూ , బాణాలూను !
"ట్రబుల్!" అన్నాడు రాజు నిలబడి ......
ఇందాక పారిపోయిన ఇద్దరూ , వెళ్ళి తమ వాళ్ళని వెంట బెట్టుకు వస్తున్నారా? అయి ఉండవచ్చును.
ఏం చెయ్యాలి ఇప్పుడు?
జనం గోలగోలగా అరుస్తున్నారు.
ఏమంటున్నాడో అర్ధం కావటం లేదు . ఊరికే 'ఓ ఓ ఓ ' అన్నట్లు హోరు వినబడుతుంది.
గుంపు బాగా దగ్గరయ్యాక మాటలు అర్ధమయ్యాయి.
"యువరాజావారికీ .......జై!"
నొసలు చిట్లించి చూస్తూ ఉండిపోయాడు రాజు.
గుంపు దగ్గరవుతోంది. వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు లేత ఎండ వెలుగులో మెరుస్తున్నాయి.
"రాజాధిరాజ , రాజపరమేశ్వర ప్రచండ భైరవుడికి ....... జై "
"త్రిభువన మల్ల ప్రచండ భైరవుడికీ ......జై"
"పల్లె ప్రజల గుంపు రాజుని చుట్టేసింది.
సంకోచంతో రాజు వెనకే నిలబడింది సృష్టి.
పొలోమని ఒకళ్ళ తర్వాత ఒకళ్లుగా జనం రాజు కాళ్ళ మీద పడడం మొదలుపెట్టారు.
ఎంతో ఇబ్బందిగా ఫీలవుతూ, అయిష్టంగా మొహం పెట్టి , వాళ్ళని వారిస్తున్నాడు రాజు.
కానీ వాళ్ళు వినడం లేదు. వీరభక్తి ప్రపత్తులు ప్రకటిస్తూ రాజుకి పాదాభివందనాలు చేస్తున్నారు.
"ఏమిటిది ?" అన్నట్లుగా అతని వేపు చూసింది సృష్టి.
నిస్సహాయంగా భుజాలు ఎగరేసి, ఆ మనుషులకు అర్ధం కాకుండా ఉండడానికి ఇంగ్లీషులో చెప్పడం మొదలు పెట్టాడు రాజు.
"చాదస్తాలు ....... ఒకప్పుడు ఇక్కడొక చిన్న సంస్థానం ఉండేది. దాన్ని మా పూర్వికులు పాలించేవాళ్ళు. ఇప్పుడు రాజులు లేరు. రాజ్యాలు లేవు. కానీ , కొన్ని కుటుంబాలలో ఆ పాతకాలపు పద్దతులు పోవడం లేదు. ఉదాహరణకు మా నాన్నే వున్నారు. తనింకా ఒక రాజుననే భావన ఆయనమనసులో వుంది. అయన తాలుకూ ఆ భేషజాన్ని పెంచి పోషించే వందిమాగధులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ లోకాలిటీని నేను గుర్తుపట్టాను.
ఇది రామాపురం! తూర్పుకి తిరిగి కొంత దూరం నడిస్తే మా సిక్కా లో కోట వస్తుంది."
"నిజం కోటనా? యూ మీన్ ఫోర్ట్?" అంది సృష్టి ఎగ్జయిటెడ్ గా.
"నిజం కోటే! కానీ, శిధిలావస్థలో ఉంది. అక్కడ పూర్తిగా పాడైపోకుండా నిలబడి వున్నది ఒక్క రామాలయం మాత్రమే. ఆలయంలో ఇంకా పూజలు జరుగుతున్నాయి. కనీసం మొన్నమొన్నటి దాక జరిగేవి. ఇప్పుడు ప్రభుత్వం తాలుకూ దేవాదాయధర్మాదాయశాఖ వారి అజమాయిషీ కిందికి వెళ్ళాక ఎట్లా ఉందో తెలీదు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక జాతర లాగా కూడా జరుగుతుంది. మావాళ్ళంతా తప్పనిసరిగా వస్తారు. రావాలి కూడా -- అది ఆచారం !' అన్నాడు రాజు.
వెంటనే --
ఆకాశం పగుళ్ళు పెట్టేటట్లుగా , భేరీనాదాలు వినబడ్డాయి.
"అదిగో మొదలు !" అన్నాడు రాజు.
తాము మోసుకు వచ్చిన పల్లకీలో రాజునీ, సృష్టినీ కూర్చోమన్నారు పల్లె ప్రజలు.
వద్దని దృడంగా చెప్పాడు రాజు.
చుట్టూ పడి ఉన్న శవాల వైపూ , శకలాల వైపూ ఆర్తిగా చూసి "మర్యాదలు కాదు -- ముందు వీళ్ళ సంగతి చూడండి. ఎవరైనా కొనప్రానంతో నైనా వున్నారా? ఈలోగా నేను వెళ్ళి పోలీసులకి కబురు పెడతాను ' అన్నాడు.
'అమ్మమ్మ! ప్రభువులు శ్రమ పడకూడదు -- అపచారం! అపచారం! మేము వెళ్ళి పోలీసులకు చెప్పి వస్తాం -- తమరు పల్లకీలో ఆశీనులు కండి ." అన్నాడు వాళ్ళలో పెద్దగా కనబడుతున్న ఒకాయన, పాతకాలపు నాటక ఫక్కీలో.
వెర్రి కోపం వచ్చింది రాజుకి.
"ముందు మనుషుల సంగతి చూడండి ! అది నా అజ్ఞ! " అన్నాడు అదే వూపులో.
అందరూ కిక్కురుమనకుండా నిశ్శబ్దంగా అయిపోయారు.
ఆ తర్వాత వాళ్ళలో కొంతమంది శవాల మధ్యకు వెళ్ళి , ప్రాణాలతో మిగిలి వున్న వాళ్ళెవరన్నా వున్నారేమో అని పరిశీలించడం మొదలెట్టారు.
