Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 10

 

    "నీ చేత నిజం ఎట్లా కక్కించాలో నాకు తెలుసు " అన్నాడు రాజు ఆగ్రహంగా.
    అంతలోనే కొనతమంది పనివాళ్ళు పరిగెత్తుకు వచ్చారు.
    వాళ్ళ మొహంలో పట్టలేనంత ఆశ్చర్యం.
    "ఏమయింది ?" అన్నాడు తులసీరావు.
    "సామీ ......సామీ ....సామీ ......"
    అంటున్నారు వాళ్ళు, ఊపిరందనట్లుగా.
    'ఏమయిందర్రా?" అన్నాడు తులసీరావు మళ్ళీ.
    "గుడిగోడ మొన్న పడిపోయిందా - పక్కగా కట్టించే ప్రయత్నం మీరు చేస్తున్నారు గదా! పునాది త్రావ్వ్తుంటే...."
    "లంకె బిందెలు బయటపడ్డాయా?" అన్నాడు తులసీరావు ఉద్విగ్నంగా.
    "లంకెబిందెలు కావు సామీ ......సమాధి ఒకటి బయటపడింది. అందులో ......
    "అందులో ?"
    "తొమ్మిది అడుగుల పొడుగున్న అస్థిపంజరం ...... కాళ్ళు ఈత బోదేల్లాగా వుండి వుండాలి- కడుపు బానలాగా వుండి వుండాలి -- ఒక్క తలకాయే గుమ్మడి పండు సైజులో వుండి వుండాల సావీ ...... రాచ్చసుడే. మనిషి కాడు!"
    ఒక్కసారిగా మాట పడిపోయినట్లుగా అయిపొయింది అందరికీ -- నిశ్శబ్దం ఆవరించింది. రాజు తప్ప మిగతా వాళ్ళ మొహాల్లో భయాందోళనలు అలుముకున్నాయి.
    "బాబోయ్ ! ఇక్కడ రాక్షసులున్నారని నేను చెబితే నమ్మట్లేదు. రాక్షసుని బారిన పడి బయటపడ్డాను నేను. యువని రాక్షసుడ ఎత్తుకెళ్ళాడు. రాక్షసులున్నారానడానికి నిదర్శనంగా ఇక్కడీ జెయింట్ స్కేలేటిన్ బయటపడింది -- ఇక్కడికి కొద్ది దూరంలోనే రాకాసి కోన అనే ప్రాంతం ఉంది. నేనిక్కడ ఉండను బాబోయ్ ..... నన్ను సిటీకి పంపెయ్యండి దేవుడోయ్!" అని గీ పెట్టినట్లుగా అరుస్తున్నాడు నందూ.
    నందు పూర్తిగా స్పృహలోనూ లేడు', అలాగని పూర్తిగా స్పృహతప్పి కూడా లేడు.
    చావుకి ముందర సంధి ప్రేలాపన లాగా ఉన్నాయి అతని మాటలు.
    మాట్లాడుతూ మాట్లాడుతూనే కోమాలోకి వెళ్ళిపోయాడు నందూ.
    అతన్ని నాయనో భయానో అడిగి విషయాలు తెలుసుకునే వీలు లేకుండా పోయినందుకు తీవ్రమైన అశాభాగం కలిగింది రాజుకి.
    నందూని పోలీసులకి అప్పగించి, అతన్ని హాస్పిటల్ కి పంపే ఏర్పాట్లు చేయమని రిక్వెస్టు చేసి, రామాలయం దగ్గరికి నడిచాడు రాజు.
    కోటలో ఉన్న రామాలయం దగ్గరికి రాగానే అందరి దృష్టినీ ముందుగా ఆకర్షించాయి అక్కడ అసంఖ్యాకంగా వున్న కోతులు! వానర మూక కాదు. వానర సైన్యమే!!
    ఆ కోతుల కిచకిచల నేపధ్యంలో - సమాధి బయట పడ్డ చోటుకి వెళ్ళాడు రాజు.
    పడిపోయిన గోడని పక్కగా కట్టడానికి గానూ పునాది తీస్తుంటే బయటపడిన సమాధి.
    జాగ్రత్తగా తొంగి చూశాడు రాజు.
    నిజమే!
    ఆ చనిపోయిన మనిషి ఎవరో గానీ, ఖచ్చితంగా తొమ్మిది అడుగుల పైనే ఉండి ఉంటాడు.
    ఆ మహాకాయుడి ఆయుధాలు అతని పక్కనే ఉన్నాయి.
    అరచేతి మందాన, అర అడుగు వెడల్పు , అయిదడుగుల పొడుగూ ఉన్న కత్తి ముళ్ళ గద లాంటి ఇంకో ఆయుధం.
    ఆ పక్కనే -
    చాలా గిన్నెలు ఉన్నాయి. కొన్నిటికి మూతలు ఉన్నాయి. కొన్నిటికి మూతలు లేవు.
    అప్పట్లో వండిన వంటకాలు ఏవో దాదాపు , శిలా రూపంలోకి మారి, గిన్నెల్లో కనబడుతున్నాయి.
    బహుశా అంత్యక్రియల్లో భాగంగా , అతనికి ఇష్టమైన పదార్ధాలు వండి, పాత్రలలో పెట్టి వుంటారు.
    రాజుకి ఒక విషయం గుర్తు వచ్చింది. కొంతకాలం క్రితం -- హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో వున్న సెంట్రల్ యూనివర్సిటీ లో ఇట్లాంటిదే ఒక మహాకయుడి అస్థిపంజరం బయట పడింది.
    ఎప్పుడో రెండువేలా ఒకటో సంవత్సరం మొదట్లో -- జరిగిన విశేషం అది .
    అక్కడ భూమిలో పాతి పెట్టబడిన ఒక మెన్ హీర్ వుండేది.
    మెన్ హీర్ అంటే , స్థూపాకారంలో ఉన్న ఒక పెద్ద రాయి అన్నమాట.
    ఆ మెన్ హీర్ చుట్టూ ఇంకొన్ని చిన్న చిన్న రాళ్ళు.
    అంటే, అక్కడ ఏదో సమాధి ఉండి ఉండాలని ఊహించారు శాస్త్రజ్ఞులు .
    కానీ --
    త్రవ్వకాలు సాగించడానికి బడ్జెట్ కరువు !
    ఈ దేశంలో నడుస్తున్న చరిత్రని గబ్బు పట్టిస్తున్న కొందరు రౌడీ నాయకుల ప్రాణాలు కాపాడడానికీ , వాళ్ళ సెక్యూరిటీ కీ అయినా సరే డబ్బులుంటాయేమో గానీ, గడిచిపోయిన చరిత్ర తాలుకూ అవశేషాలనీ , విశేషాలనీ కాపాడుకోవడానికి మాత్రం చిల్లిగవ్వ వుండదు !
    పాపం ఎట్లాగొట్లా నిధులు సమకూర్చుకుని , ఆర్కియాలజీ దిపార్టు మెంటు వాళ్ళు ఆ మెన్ హర్ దగ్గర త్రవ్వకం చేశారు.
    అక్కడ బయట పడింది -- ఏడడుగుల పై చిలికు ఉన్న ఒక భారీ మనిషి శరీరం.
    అతను ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం జీవించి ఉండాలి.
    అతను ఒక మహా వీరుడో , లేదా ఒక రాజో అయి ఉండాలని దొరికిన ఆధారాల ప్రకారం ఊహించారు.    
    అతనితో బాటుగా అతని అయుదాలయిన ఒక కత్తీ, ఒక త్రిశూలం కూడా పక్కన పెట్టబడి వున్నాయి.
    కాలమానం ప్రకారం చూస్తె ఆ అస్థిపంజరం కొత్త రాతియుగం తాలుకుది అయి ఉండాలి.
    కానీ -
    అతని పక్కన ఉన్న ఆయుధాలు లోహంతో చేసినవి. ఇంకా మెరుపు తగ్గలేదు. రాతియుగంలో లోహపు ఆయుధాలు ఎలా సాధ్యం?
    అంటే మనకు తెలిసిన చరిత్ర తప్పా? లేదా మనం మనకు తెలిసిన చరిత్ర ని తప్పుగ అర్ధం చేసుకుంటున్నామా?
    లేక మనకి తెలిసింది తక్కువా -- తెలియవలసింది ఎక్కువనా ?
    గచ్చి బౌలిలోనే కాదు -- హైదరాబాద్ లో ఇంకొన్ని చోట్ల కూడా పురాతనకాలపు సమాధులు ఉన్నాయి గానీ రాజకీయవేత్తల, ప్రభుత్వదికార్ల అండతో భూ బకాసురుల చేతుల్లో కమర్షియల్ గా కబ్జా అయిపోయాయి.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS