Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 9


    సృష్టి దయతలచి అతనిమీద మగతను కప్పింది. తన ప్రాణానికి వొచ్చిన అపాయంగాని బాధనుగాని యెరక్క పడివున్నాడు. స్వేచ్చగా, తిరుగుతో, ఆడుతో, నేర్చుకొంటో వుండవలసిన వయసులో, ఇన్నేళ్ళు అట్లా బాధపడడం ఎందుకు? ఆ ఆత్మకు ఏమి లాభం? ఎదో పూర్వపుకర్మ కసి తీర్చుకోడమా? కర్మకి కసి లేదా! గుడ్డిదా! దేవుడు గుడ్డివాడేనా? ఈ కర్మలకి యీ శిక్షలు అని నిర్ణయంచేసి దేవుడు నిద్రపోయినాడా? చచ్చిపోయినాడా? ఏమిటి యీ వేదనకి అర్ధం? ఒక్క మతమూ సరైన జవాబు చెప్పదు ఏదో అర్ధంకాని ముసిలి వాగుడుతప్ప గొప్ప శ్లోకాలూ, సూత్రాలూ వొప్పచెప్పడం ఏమీ తెలియని ఆ దేవుడనే దాని మీద యీ భారమంతా నెట్టడం. ఇన్ని శాస్త్రాలు, పురాణాలు తగలేసినన్ని వున్నాయి లోకమంతా నిండి, పుచ్చి పురుగులుపట్టి అవిచదివేవారు, వ్యాఖ్యానాలు తీసేవారూ, వాటివిషయమై తగూలాడేవారూ, గుళ్ళూ, గోపురాలూ, మఠాలూ-యీ చిన్ని ప్రశ్నకు జవాబు చెప్పలేరు. ఎందుకు ఆ ప్రగల్భాలూ, ఆ పెద్దజీతాలూ, ఆ దుస్తులూ, ఆ బోడిగుళ్ళూ! ఏం తెలీదనీ, తెలీడానికి వీలులేదనీ వొప్పుకోరాదూ?
    వేదాంతులు సులభంగా "ఇట్లాంటి దురదృష్టం నీకు వొక్కడికేనా? లోకంలో అందరికీ సామాన్యమేకదా?" అనేస్తారు; అదేదో వోదార్పులాగు! గొప్ప మతవక్తలు యీ విధంగా పూర్వకాలంలో ప్రజల్ని వోదార్చిన కధలు చెపుతారు. బుద్దుడూ తులసీదాసూ మొదలైనవారి జీవితాలనించి ఆ సలహా యిచ్చినవారా, ఆ సలహాలతో తృప్తిపడ్డవారా ఎవరు యెక్కువ బుద్దిహీనులు అనుకుంటాను. ఆ కాస్త ముక్కతో ఉపకమించిన దుఖం, యితరులుకూడా మనతో యేడుస్తున్నారు కదా అని సంతుష్టిపడే విచారం యెంత అల్పమో, నీచమో, స్వార్ధమో! లేక ఆ మాటలు గాక ఆ మహాత్ముల ఆత్మఔన్నత్యం యేమన్నా సహాయం చేసిందేమో! కాని యీ కాలంలోకూడా యిరుగుపొరుగువారు యిట్లాంటి ఓదార్చులు ఇస్తోనేవున్నారుగా?
    మత గ్రంధాల్లో కనపడితే చాలు ఏదన్నా సంగతి! దాన్ని గురించి మంచిచెడ్డలు విచారించేశక్తి ప్రజలకి పూర్తిగా నశిస్తుంది. అదంతా సత్యమేననీ ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు దుర్మార్గులనీ, అవును యిట్లాంటి బాధలు సర్వసామాన్యమే నాకేకాక యిట్లాంటి బాధ అందరికీ వుందే అని విచారంవల్ల నా విచారం ఎక్కువ కావాలి గాని, తృప్తిపడాలా? ఇతరులుకూడా ఇట్లాంటి బాధలతో ఇంతకన్న తీవ్రమైన వ్యధలతో, నశిస్తున్నారని గంతువేసి సంతోషించాలా నా కెన్నడూ యిట్లాంటి బాధ కలగకపోయినా, యితరులకు కలిగినప్పుడు నాకు సృష్టిమీద ఆగ్రహం కలగకపోతే వాళ్ళ దురదృష్టానికి నా దిగులు ఎక్కువకాకపోతే........యెందుకు మనిషినై పుట్టి? పురాణనీతులూ, ఆదర్శాలూ యిట్లానే వుంటాయి. ఇతరులకికూడా ఆపదలు తప్పవుకదా అని ఓదార్పుపొందే బదులు, మనకీ, వాళ్ళకీ, ఎవరికీ, బాధలు లేకుండా, వుండే మార్గాలు చాతనై నంతవరకు ప్రయత్నిదాము అనుకోవాలి.
    ఈ రుషులూ, బైరాగులూ, వేదాంతులంత అప్రయోజకులూ, మూఢులూలేరు. ఈ మతపాంసకులవల్లనే యీ లోకమింత మోసంలో పడ్డది. ఎట్లా యీలోకంలోకి వొచ్చామో తెలీదు. ఈ బాధలెందుకో అర్ధంకాదు "ఎట్లాగో వొచ్చాం, బాధలు వొస్తే అనుభవిద్దాము నోరుమూసుకుని. చాతనైనంతవరకు ఒకరికొకరం సహాయం చేసుకుందాం. వీలైనంతవరకు విచారాలు తగ్గించుకుందాం. కారణాలు నిర్మూలిద్దాం." అంటే యెంత బావుంటుంది? దానికి బదులు పెదిమలు చప్పరించి, మంత్రాలు వుచ్చరించి, గుడ్లుతేలేసి, "ఈశ్వరేచ్చ' 'కర్మ పరిపాకం' అనుభవించు. ఎవరికోసం! ఇదంతా నీ మంచికోసమే. ఏమో, ఏ వున్నతోద్దేశ్యంతో నిన్నిట్లా కాలుస్తున్నాడో యీశ్వరుడు?" అంటారు; తాము చూసి వొచ్చినట్లు ఈశ్వరుడు స్వయంగా ఆ రహస్యాలను వాళ్ళతో చెప్పి, తక్కిన పాపాత్ములకు వెల్లడించ వొద్దన్నట్టు.
    ఒక దేవుడేవుండి యీ పిల్లల్ని ప్రేమించమని మనకిచ్చి గాఢంగా మమకారం కలిగింతరవాత యిట్లా ఆపిల్లల్ని చంపుకున్నాడనుకో. ఈ చంపడాన్ని యీ క్రూరత్వాన్ని సమర్ధించడానికి ఎన్ని తుక్కుకథలు, ఇతిహాసాలు! కొడుకుప్రేమలో దేవుణ్ణి మరిచాడని, కొడుకుని తీసుకుపోతాట్ట ఆ దేవుడు? ఆ దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం వుంచుకోవాలో! వ్రత మెక్కువో, కొడు కెక్కువో పరీక్షించడానికి కొడుకుని చంపుకున్నారు ముగ్గురు మహాభక్తులు. ఇట్లాంటి దొంగ కధలు అబద్దపు ఆదర్శాలు బోధించి తికమకలు పెట్టారు ప్రజల మనసుల్ని! కొడుకుల్ని ప్రేమించడం భార్యలతో సుఖంగా కాపరంచెయ్యడం, నవ్వడం, ఆనందించడం అన్నీ పాప కార్యాలు; బూడిదలూ, మురికీ, రుద్రాక్షలూ, ఏడుపులూ, చావు మొహాలూ, ద్వేషాలూ, నీతిపేరిట క్రూరత్వాలూ, మతంపేరిట కలహాలూ, సుఖాలూ వొదులుకోడాలు, ఉపవాసాలూ, సన్యాసాలూ-ఇవీ పుణ్యకార్యాలు. ప్రతిదాంటో వేదాంతాన్ని వైరాగ్యాన్ని కలిపి బతుకునే అసహ్యం చేసిపెట్టారు. దేశ వీర్యాన్ని పీల్చి పిప్పిచేసి, ప్రజల్ని శుద్ధ అప్రయోజకుల్నిగా చేసిపెట్టారు.
    ఈ బాధల్ని సృజించినదేవుడు ఎంత ప్రార్దించనీ, యాడవనీ కనికరంలేని రాయి, మొద్దు. మళ్ళీ పూర్వకాలం మంత్రాలకీ, మందులకీ, యజ్ఞాలకీ, పూజలకీ కట్టుపడేవాట్ట. దర్శనాలిచ్చేవాట్ట ఇప్పటికీ కలల్లో, కాలవల్లో దర్శనాలు యిస్తున్నాడుగాని మూఢుల్నీ మోసగాళ్ళనీ యెక్కువగా ప్రేమిస్తున్నట్టు తోస్తుంది. "ఆ దేవుడు నీ ప్రార్ధనలని యెందుకు వినాలి?" అంటారు. వినకపోతే యెందుకు అక్కడ వుండి? వూరికే బాధలు కల్పించడానికేనా?
    నువ్వే కల్పించుకున్నావు యీ బాధ అంటారు. నాకు తెలీదు ఎట్లానో పోనీ అన్నీ నేనే కల్పించుకున్నాను. ఇంక ఆ దేవుడు చేసే పనేమిటి? పైగా యీ పూజలూ, వ్రతాలు, స్తోత్రాలూ యెందుకు? పోయిన జన్మలో చేసిన పాపానికి శిక్షా? ఏం పాపం? చెప్పకుండానే శిక్షా! Trial లేకుండా శిక్షిస్తే అన్యాయమంటారే, దీనికెవరూ నోరెత్తరు.
    
                                           *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS