Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 8


    దీర్ఘమయ్యే నీడలూ, మెల్లిగా దిగులుగా death knells లాగు కొట్టే తాలూకా ఆఫీసు గంటలూ, మందు తాగించడానికివొచ్చే కాంపౌండరూ-ఇంతే నా ప్రపంచం. యెవరన్నా వొక్కమనిషి నాతో వుంటే నాకో నిమిషం ఆకాశాన్ని చెట్లని చూసేందుకు వ్యవధినిస్తే!
    అప్పుడు తట్టింది యీ ప్రపంచంలో నా యేకాకితనం! నాకు యెవర్నైనా బంధువుల్ని, స్నేహితులని సహాయం అడగడమే కొత్త అయిపోయింది. అడిగినా నాకు ఆశలేదు. పెళ్ళిళ్ళకి, చావులకి, పేరంటాలకి, చిలిపి పోట్లాటలకి సంఘంతో కులంతో కలియాలి, సంబంధాలు పెట్టుకోవాలి. లేకపోతే సహాయానికి రారు. వాటిని వొదులుకున్నవాడు ప్రపంచాన్ని ఎంత ప్రేమించినా ప్రపంచం కనికరం చూపదు. ఇంకా చిన్నపిల్లల స్థితిలోవున్నారు మనుష్యులు. పిల్లలు తమకి అన్నం పెట్టేవారికన్నా మిఠాయి కొనిపెట్టి తమతో ఆడుకునేవారిమీద యెక్కువ ప్రేమ చూపుతారు. పాఠాలు చెప్పే వారిమీదకన్న కథలు చెప్పేవారిమీద అట్లానే, సంఘాన్ని వొదిలి నిలిస్తే, సంఘమూ నిన్ను వొదిలి నిలుస్తుంది. వాళ్ళ తప్పా!
    ఇక స్కూలులో రెండుమూడేళ్ళు కలిసి పనిచేస్తామా? మొదట నా కీర్తి ముందుగానే విని తప్పుకుంటారు. తరవాత భయాలుపోయి దగ్గిరగా జరుగుతారు. నేనూ ప్రయత్నిస్తాను. కాని ఏం లాభం? ప్రతివిషయంలో ప్రతి అంగుళం అభిప్రాయభేదమే-ఆచరణలో విరోధమే; అభిప్రాయభేదాల్ని సహిస్తారు. ఆచరణని వోర్చుకోలేరు. తెలుసుకున్నకొద్దీ ఘోరాలు బయలుపడి మెల్లిగా దూరంగా పోతారు. చివరికి మేము ప్రచారంచేసే విద్య విషయంలో కూడా పెద్ద అగాధం వాళ్ళ అభిప్రాయాలకీ, నా వాటికీ!
    మాకో బ్రాహ్మణేతర హెడ్మాస్ట రుండేవాడు. ఆయన బ్రాహ్మల్నీ వాళ్ళ ఆచారాన్నీ వొకటే వాళ్ళ మొహానే వెక్కిరించేవాడు. తాబేదార్లు ఎట్లా ఎదురు చెపుతారు? బాగా యేడి పించేవాడు. వాటిని వొదలమని బోధించేవాడు. నే నెప్పుడూ వాళ్ళనేమీ అనకపోయినా......నా స్వంత అనాచారాల్ని చూస్తే వాళ్ళకి ఆయన వెక్కిరింపులకన్న కోపం. నా శాంతమయిన తిరగబాటు వాళ్ళకి  కోపాల్ని కలిగించేది. వెక్కిరించటంలో ఆయన వాళ్ళ plane లోనే వాళ్ళతో బాంధవ్యం కలుపుకున్నాడు- కనక మిత్రుడే. వాళ్ళమోస్తరు అల్పత్వం, అసహనం కలవాడు కనకనే వాళ్ళ ఆచారాల్ని ద్వేషించాడు.
    మతాన్నీ, కులాన్నీ వొదొలినా ఇవన్నీ ఉత్త బాహ్యవిషయాలనిపిస్తుంది. ఈ మతకుల కలాపం. వాటిని వొదిలిపెట్టడం వొక మహత్కార్యం కాదు. కాని వొదిలిపెట్టలేకపోవడం అల్పత్వం, భీరుత్వం, అంధత్వం. వీటి అన్నిటికన్నా గొప్పది అసలు మనిషి charaoter. వితంతువివాహం చేసేవాళ్ళకి స్త్రీమీద యెక్కువ అభిమానం అనుకుంటామా-----వాళ్ళకంటే చాలామంది పూర్వాచారపరులకే స్త్రీల మీద యెక్కువ గౌరవం వుండడం చూశాను. రోజు భార్యల్ని కొట్టేవాళ్ళని చూసి మండిపడ్డాను. కాని సమయం వొచ్చేసరికి వాళ్ళలో చాలామంది ఆ భార్యలకోసమే అధ్బుతమైన త్యాగాలు చేస్తారు. కులభేదాలు సర్వమానవసౌభాతృత్వానికి అడ్డనుకుంటామా! యిరుగు పొరుగువారి ప్రేమనుబట్టి చూస్తే యీ కులభేదం పాటించే వాళ్ళకే చాలామందికి నిజమైన ప్రేమవుంది. ఈ కుల మత భేదాలన్నీ తాత్కాలిక ఆచారాలు మన బత్తా బొట్టూవలె. అందువల్లనే కార్యాల్నిబట్టి మనుష్యులని judge చేయకూడదని ఎంత మొరబెట్టినా, ఎన్ని కధలువ్రాసినా, లాభం వుండదు. కార్యాలవల్ల నే గాని, అంతకన్న deep గా ఆలోచించే సాహసం గాని, జ్ఞానం గాని వ్యవధిగాని చాలామందికి లేనట్టుంది.
    గాంధిగారి కొడుకు మహమ్మదీయుడు అయినాడా! తాగుడికి జుల్మానాపడ్డదా? అతని రక్తం, అతని tendencies, instinots చిన్నప్పటి శిక్షణా, heridity అన్నీ లోకమంతా పూజించే గాంధీగారినీ, ఆయన భార్యనీ. మరి యిట్లా ఎందుకైనాడు? ఎదో ఆత్మా కర్మా యిట్లాంటి Nonsense కట్టిపెట్టి Scientific గా ఆలోచిస్తే ఏం జవాబు చెపుతాం? మహాత్ములు కావడానికీ, దుర్మార్గులు కావడానికీ అవసరమైన stuff లో, Calibre లో దీంటో తేడా లేదు. ఒక చిన్న Discipline, ఒక inhibition, ఒక్క గుణంలో ఇటూ, అటూ, వ్యత్యాసం యీ చివరినించి ఆ చివరికి తీసికెడుతుంది. గాంధీగారినీ కొడుకునీ దగ్గిరగా study చేస్తే యిద్దరికీ చిన్న చిన్న mannerisms నించి గొప్ప emotions దాకా, చాలా పోలికలు వుండకతప్పదు. కాని యే వొక్క చిన్న మనోభేదమో ప్రపంచం యెదట యింత వ్యత్యాసాన్ని ప్రదర్శించింది. ఇట్లా వాదిస్తే ఈ ప్రకారం యోచించమంటే ప్రజలు వొప్పుకోరు. యెందుకంటే వాళ్ళ virtuous pride గాయపడుతుంది, వాళ్ళ basic moral values నేల కూలతాయి. అందుకునే psycho-analysis ని అట్లా తిడతారు. కాని యెవరెంత యేడిస్తేనేం? ఏ యిద్దరి తల్లితండ్రుల అన్నదమ్ముల చరిత్రలు తీసిచూసినా ఈ సూత్రం వ్యక్తమవుతుంది. గాంధీగారిదీ, కొడుకుదీ, జీవితంలోని motives ప్రకారం, amotions ప్రకారం జాగ్రత్తగా పరిశీలించి జీవితాల్ని study చేస్తే, ఈ తాగుడిమీది ప్రేమా, దేశంమీది ప్రేమా, ఒకటే source నించి వొచ్చి వుండవొచ్చు. పైగా సౌరీస్ అంటోందికదా 'ఈ గాంధీగారు కొడుకుని తిడతారు. తననే అతనిలో చూసుకోలేక; అతను తన వికృతమైన ప్రతిబింబమేనని అంగీకరించక' అంటోంది. మరీ చెడ్డపేరు తెచ్చుకున్న పిల్లల్నిచూస్తే మర్యాదగల తల్లితండ్రులకి యెందుకంత కోపమంటే తమ అసలు గుణాలు ఎవరికీ తెలీకుండా తమకే తెలీకుండా తమలోదాచుకున్న గుణాలు తమ పిల్లలముందే ఆ పిల్లలమూలంగానే లోకంలో బయట పడ్డాయే అనే కోపంవల్ల.
    ఇంత చిన్నవాడికి ఇంత ప్రేమగలవాడికి ర------కి యింత బాధ ఏమిటి? ఎంత క్రూరత్వం వుండాలి దేవుడి హృదయంలో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS