Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 10


    గుళ్ళో నాగస్వరం వాయిస్తున్నారు. పడమట చంద్రుడు పూనుకున్నాడు. చల్లనిగాలి యీ మూలకివొచ్చి కావిలించు కొంటోంది. ఇట్లాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, 'దయగల దేవుడున్నాడు. తను నా బాధని పోగొట్టలేక, ఏమీ సహాయం చెయ్యడం చేతగాక, నాతో తానూ బాధపడి, 'ఎంత నలిగిపోయినావో!' అని నన్ను వోదార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు' వుంటుంది. వున్నాడా?
    ఎందు కీసమస్యలు నాకు. మృగాలవలె సుఖదుఃఖాలన్నీ కళ్ళుమూసుకుని తిరగబడకుండా అనుభవించడం చాతనైతే బావుండును. ఈ పాత జ్ఞాపకాలూ, ముందు భయాలూ, సందేహాలూ, ఇన్ని Evils  తటస్థించాయి మనుష్యులకి ఇవి చాలక యింకా యీ జ్యోతిషాలు!
    
                                               ------
    
    ప్రజామిత్రలో నా 'పాసం' విమర్శిస్తో ఒక వాఙ్మయ పీఠాధిపతి ఆ కథలు వివాహమనే సంస్థను నిర్మూలం చెయ్యాలనే వుద్దేశ్యంతో వ్రాశానన్నారు. ఆ విమర్శ చదివి మళ్ళీ ఆ పుస్తకం తిరగవేసి చూశాను. నా కంటికి ఎక్కడా అట్లాంటి ప్రయత్నం కనపళ్ళేదు. ఆ కథలలోని వాస్తవత్వాన్ని అంగీకరించే ధైర్యంలేక, ఆ నేరారోపణం కింద తప్పుకుంటున్నారా, లేక నిజంగా నాకు తెలీకుండానే అట్లాంటి ప్రయత్నం నేను చేస్తున్నానా అని ఆలోచించి మిత్రుల్ని చూడమన్నాను. వాళ్ళూ అట్లాంటిదేమీ లేదన్నారు. ఆ పీఠాధిపతి ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకుంటే బావుంటుందనుకుంటాను.
    ఈ లోపల నేను ఆత్మపరీక్ష చేసుకుంటున్నాను. నిజంగా నా ఉద్దేశ్యం, ఆ పుస్తకంలో కాకపోయినా తక్కిన కధల్లో యేమిటని?
    వివాహం విచ్చేదం అవుతుందంటే, స్త్రీపురుషులు స్వేచ్చగా ప్రేమించుకుంటారంటే, నేనందుకోసమే ప్రయత్నిస్తున్నానంటే, నాకేమీ భయపడవలసిందిగాని, సిగ్గుపడవలసిందిగాని కనిపించదు. నాకీ scandals చూస్తే భయంలేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నిజంగా నా ప్రయత్నం అదేనా అని.
    ఈనాడు స్త్రీ స్వేచ్చ పొందడానికి వున్న ఆటంకాలన్నీ తీసివేసినా, సంసారాలు వొదులుకుని వెళ్ళేవాళ్ళు యెక్కువమంది వుండరు. క్రమంగా స్వేచ్చకి అలవాటుపడి కొందరు కాలం గడిచిన కొద్దీ బైటపడవొచ్చు. స్నేహం, పిల్లలు, అలవాట్లు, సుఖం, ఒకరి కొకరు అలవాటుకావడం, సుఖదుఖాలు పంచుకోడం, యివన్నీ కాపరాల్లో మనుషుల్ని ఆకర్షించి స్వేచ్చగా బంధించి వుంచుతాయి. వివాహమనేది వున్నా లేకపోయినా, సంబంధాలు అస్తమించవుకదా? స్త్రీ పురుషులు వుత్త మోహంచేతనేగాక, పెళ్ళికానీ, కాకపోనీ కొంతకాలంకలిసి జీవితం గడపడంచాత స్థిరంగా అతుక్కుపోతారనే సంగతి మానవ స్వభావంలోనేవుంది. అది ఎవరూ మార్చలేడు.
    ఎదురు తిరిగి నేను "అవునయ్యా, వ్యభిచారాన్నే బోధిస్తున్నాను. వివాహంలో జీవించడం నీచం, రోత. ఒక్క జొన్నన్నం మాత్రమే, గడ్డిని మాత్రమే మేసే మోట బతుకు అది. అనేక ఆనందాలు వున్నాయి మీ ముందు. అనుభవించండి, నిర్భాగ్యులారా!" అంటే జవాబేలేదు; దేవుడూ, అతని ఆజ్ఞలూ, శాస్త్రాలూ, ఆదర్శాలూ తప్ప! నేను వాటిని అధికారాలుగా అంగీకరించనంటే నా అంతరాత్మే 'నామనస్సే నాకు ప్రధానమంటే - మీకోతెలీనీ మనసు లేవుగనక - మీరు శాస్త్రాలనీ, పెద్దల్ని వెతుక్కుంటున్నారంటే! కాని ప్రస్తుతం నా ప్రశ్న నేను వ్యభిచారాన్నే బోధించానా అని!
    ఎన్ని వ్యాసాలు అవరు యెంత ఆకర్షవంతంగా వ్రాయనీ, ఏ డిక్టేటరో వివాహమనేది వుండకూడదని శాసించనీ, ప్రజలు జతకావడం మానరు. భర్తలనించి లేచిపొయ్యేవాళ్ళుకూడా, ఏ మూలనో కొంచెం విశ్వాసం కలవాళ్ళతో యెవరితోనో స్థిరపడతారు. నేను వాంఛించే మార్పు యీ వివాహంలో వున్న అక్రమాలు అన్యాయాలు పోవాలని. ఈ దుర్మార్గులు వొదిలించినంతమాత్రాన అసలు చచ్చేటంత దుర్భలంకాదు వివాహం. అంతేకాకుండా వివాహం వొద్దన్నవాళ్ళకి బలవంతంగా కట్టకూడదనీ, వివాహం అయినంతమాత్రాన సర్వమూ నీతిగా తలచడమూ, కానంతమాత్రాన అవినీతి అనడమూ మూర్ఖమనీ నా వాదన! ఇట్లాంటివి బోధిస్తే యీ ప్రజలకి కోపమెందుకంటే------వాళ్ళ హృదయాలు విప్పి చూపగల యంత్రమో మంత్రమో వుంటే అర్ధమవుతుంది----పురుషులకి స్త్రీమీద తమకి చలామణి అవుతున్న హక్కులు పోతాయి అనీ, స్త్రీకి పురుషులు పెడుతోవుంటే సుఖంగా బద్దకంగా బతికేభాగ్యం వొదులుకోవలసి వస్తుందనీ భయం. అందరికీ మరీకోపం యీ నా దుష్టప్రచారానికి, కళా, ఆకర్షణా తోడ్పడి, వాళ్ళు మింగకూడదనుకున్న మాత్రల్ని, చక్కగా చప్పరించి రక్తంలో కక్కేట్టు చేస్తున్నాయని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS