Previous Page Next Page 
తృప్తి పేజి 9


    "ఏయ్" అంటూ కొట్టడానికన్నట్లు చెయ్యెత్తాడు. తప్పించుకుంటూ గలగలా నవ్వింది.
    "బీ సీరియస్, ముందు నేనడిగిందానికి జవాబు చెప్పు. ఎన్నాళ్ళీ బ్రహ్మచర్యం నాకు? పెళ్ళికి ఎందుకీ వాయిదాలు?" ధీనంగా అడిగాడు.
    "నాకు వాయిదాల పద్ధతంటే చాలా ఇష్టం. వాయిదాల పద్ధతిమీదే ఇంట్లోకి అన్నీ కొంటుంటాను. చివరికి ఇప్పుడు కట్టుకున్న ఈ చీర కూడా వాయిదాల పద్ధతిలోనే కొన్నాను. అలాగే వాయిదాల పద్ధతిలో నిన్ను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను"
    ఆమె మాటకడ్దొస్తూ "అంటే ఈ సంవత్సరం స్నాతకం, వచ్చే సంవత్సరం పెళ్ళి, ఆపై సంవత్సరం అదీ అన్నమాట" అంటూ కన్నుకొట్టాడు.
    మూతి బిగించి కళ్ళతో, ముక్కుతో నవ్వింది యమున. "పోనీ ఆ లాస్ట్ ఇన్ స్టాల్ మెంట్ ఫస్ట్ కట్టేసెయ్యరాదా?" ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నెమ్మదిగా అడిగాడు.
    కెవ్వుమంది. కొంతమంది గిరుక్కున తలలు తిప్పి వీళ్ళవైపు చూశారు.
    "ఎందుకలా అరుస్తావు? మెత్తగా అడిగితే కాదనవనుకున్నాను" కొంటెగా చూశాడు.
    "ఇదిగో ఇలా మాట్లాడ్తే ఇంకెప్పుడూ నీతో రాను" చూపుడు వేలితో బెదిరించింది.
    "మరేం మాట్లాడమంటావు?"
    "ఏమైనా నాకిష్టమైన సంగతులు మాట్లాడొచ్చుగా" అంది టాంక్ బండ్ మీదనుంచి నీళ్ళమధ్య నిశ్చలంగా వున్న బుద్ధుణ్ణి చూస్తూ.
    "మీ అమ్మగారు అనంతుడి వ్రతం చేసినప్పుడు సొజ్జప్పాలు చేస్తారా?"
    "వ్వాట్" అంది ఆశ్చర్యంగా.
    "మీ నాన్నగారు చుట్ట తాగుతూ వాలుకుర్చీలో పడుకునుంటే చాలా అందంగా వుంటారు"
    "నీకేమయిందసలు" ఇంకా ఆశ్చర్యంగా అడిగింది.
    "మీ తమ్ముడికి చెగోడీలు చేసేటప్పుడు ఆ పిండితో పామూ, తేలూ లాంటివి చేసి వేయించు సరదాపడ్తాడు"
    "నీకు నిజంగా పిచ్చెక్కింది" నుదురుకొట్టుకుంది.
    "మీ అక్కయ్య కడుపుతోటుంటే చెప్పు, ఇప్పటినుండే పైసలు కూడేసి మొలతాడు చేయిస్తాను. బుజ్జిగాడు ముద్దొస్తాడు"
    "నే వెళ్తాను" కోపంగా లేచి నిలబడింది.
    "మీ ఎదురింటి బామ్మగార్నడిగానని చెప్పు. వడియాలవీ డాబామీదెండపెట్టినప్పుడు వూరికే ప్రయాసపడక అక్కడ ఓ నల్లగుడ్డ పెట్టమని చెప్పు కాకులవీ రావు"
    అతనివైపు చూడకుండా విసవిసా నాలుగడుగులేసింది. వెనుకనుంచి అతను మాట్లాడ్తూనే వున్నాడు. "మీ పక్కింటావిడెప్పుడూ తెల్లచీరలో నీలం లంగా వేసుకుంటుందెందుకు?"
    గిరుక్కున వెనక్కి తిరిగి చేతులు జోడించి "నన్నొదిలిపెట్టు" అంది.
    "అయితే మరి నాకిష్టమైన సంగతులు మాట్లాడనిస్తావా?" చిన్నపిల్లాడిలా మారాం చేశాడు.
    "నీకిష్టమైన సంగతల్లా ఒకటేగా పెళ్ళి..." అంది నవ్వాపుకుంటూ.
    "కాదు. ముందు యమున, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు" చెప్పాడు ఆమె జడ చేతికి చుట్ట చుట్టుకుంటూ.
    "చాలా ఆలశ్యమైపోయింది. ఇంక బయల్దేరదాం" జడ అతని చేతి నుండి విడిపించుకుంటూ అంది.
    "అప్పుడేనా?"
    "శేఖర్! నీ జీవితంలోంచి నేనెప్పుడెళ్ళిపోతున్నా నువ్విదే ప్రశ్న వెయ్యాలి. అదే నా కోరిక" ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
    "యమునా" అతను చలించిపోయాడనటానికి నిదర్శనంగా అతని చేతిలో యమున భుజం బిగుసుకుంది. "ఎప్పుడూ మనం బయల్దేరేటప్పుడిలా మాట్లాడకు. మళ్ళీ నిన్ను చూసేదాకా నాకు మనసు మనసులో వుండదు" సీరియస్ గా చెప్పాడు.
    "నువ్విలా నా గురించి బెంగపడ్తుంటే ఎంత బావుందో తెలుసా?" నవ్వింది యమున.
    నెత్తిమీద మొట్టికాయేసి భుజం వదిలిపెట్టాడు. "నన్నేడిపిస్తున్నదానికంతా వడ్డీతోసహా తీర్చుకుంటాను" మోటార్ సైకిల్ స్టార్టు చేసి చెప్పాడు. "ఎక్కు. బస్ స్టాప్ లో దింపుతాను"
    "మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది యమున. బస్ స్టాప్ త్వరగా రాకపోతే బావుణ్ణనుకుంది కానీ వచ్చేసింది. దిగాకకూడా ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. ఎప్పుడూ ఇంతే. వెళ్ళిపోయేటప్పుడు చాలా దిగులుగా వుంటుంది. యమున బస్ ఎక్కి చెయ్యూపుతుంటే, బస్ అనే రాక్షసుడు తన రాజకుమార్తెని ఎత్తుకుపోతున్నట్లుగా వుంటుంది శేఖర్ కి.
    ఆ రాత్రి యమునకి శేఖర్ తో పెళ్ళయినట్లూ, తామిద్దరూ ఎక్కడెక్కడో సినిమాలోలా చేతిలో చెయ్యేసుకుని తిరిగేస్తున్నట్లూ కలొచ్చింది. మెలకువ రాగానే చాలా కోపమొచ్చింది. "ఛీ, అలా ఆ కల కంటిన్యూ అయిపోతే ఎంత బావుణ్ణు?" అనుకుంది. శేఖర్ మనసంతా నిండిపోయాడు. అతనివైపునుంచేమీ అడ్డులేదు. చాలా తొందరపడ్తున్నాడు. కానీ తనే ఆపుతోంది. అవును! చూస్తూ చూస్తూ పెళ్ళి చేసుకుని ఎలా వెళ్ళిపోతుంది? తమ్ముడీ సంవత్సరమే డిగ్రీలో చేరాడు. టైపూ, షార్టుహ్యాండూ నేర్చుకుంటున్నాడు. మూడేళ్ళల్లో ఎక్కడో అక్కడ ఓ వుద్యోగం దొరక్కపోదు. తండ్రి రిటైరయిపోయాడు. తల్లికెప్పుడూ ఒంట్లో బావుండదు. ఈ పరిస్థితుల్లో తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లెలా గడుస్తుంది? టెన్త్ పాసవగానే మెరిట్ ని బట్టి 'టెలిఫోన్స్'లో వుద్యోగమొచ్చింది. "చదువాపేస్తావుటే" అని అందరూ అంటున్నా వినకుండా ఉద్యోగంలో చేరి, ఆపైన ప్రైవేట్ గా చదువుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ఆ ఉద్యోగమే ఇప్పుడిల్లు నడపడానికాధారమైంది. నాన్నగారికొచ్చే పెన్షన్ ఆయన స్వంత ఖర్చులకీ, అమ్మ మందులకీ కటాకటీ సరిపోతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS